జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు

జ్ఞాన – విజ్ఞాన భాస్కరుడు – గోటేటి రామచంద్రరావు

September 05, 2013

మన దేశ రాజకీయ చరిత్రలో రాధాకృష్ణన్ నిర్వహించిన పాత్ర క్షణికమైన మెరుపునిచ్చే విద్యుల్లత వంటిది. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆయనది ఒక స్థిరమైన వెలుగు. ‘కుంభగత ప్రదీప కళిక’ దేశికుడుగా ఆయన మహోన్నతుడు. ఆ మహా మహోపాధ్యాయుని జన్మదినం సెప్టెంబరు 5, ఉపాధ్యాయ దినంగా పరిగణించబడడం అత్యంత సమంజసం. అదే ఆయనకు వినమ్రంగా మనం అర్పించే నివాళి.

రాధాకృష్ణ పండితుని జీవితాన్ని తలుచుకుంటే జలదస్వన గంభీరమైన వేదగానం వలె సాగిపోయిందని అనిపిస్తుంది. ‘అలనాటి ఋషి వాటికల నుంచి పరతెంచు ఆమ్నాయపూత గంగామృతమ్ము’ యుగయుగాల పరచిన నీడలలో నుంచి ఇరవయ్యో శతాబ్దంలోనికి ప్రవహించిందేమోనన్న అనుభూతి కలుగుతుంది.

బక్కపలచని విగ్రహం, స్వచ్ఛ ధవళమైన శిరోవేష్టనం, మోకాళ్ల వరకు దిగినటువంటి సిల్కు కోటు, తెలుగుదనం ఉట్టిపడే పంచకట్టు, దీర్ఘమైన నాసిక, సులోచనాల గుండా ప్రకాశించే తీక్షణమైన చూపు, జలపాతం వలె నినదించే వాగ్ధార — ఈ దృశ్యాన్ని ఏ భారతీయుడు మరువ లేడు.
రాజర్షి అని, ప్లేటో వర్ణించిన ‘ఫిలాసఫర్ కింగ్’కు ప్రతీక అని, మార్కస్ అరీలియన్, జనక చక్రవర్తుల వలె ఐహిక, ఆముష్మిక భూమికల మధ్య సమతూకం సాధించిన సమర్థుడని, మహాతత్వవేత్త అని, దార్శనికుడని, బ్రహ్మ విద్యాభాస్కరుడని అనేక విధాలుగా ప్రపంచం ఆయనను శ్లాఘించింది. ఆయన జీవితకాలంలో ఎందరో మహనీయులు ఉద్భవించి మన చరిత్రను సుసంపన్నం చేశారు. మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా అప్పటి జాతీయ జీవన యవనిక మీద నడయాడిన వ్యక్తులు విరాణ్మూర్తులుగా సాక్షాత్కరిస్తారు. అటువంటి మహాపురుషుల పంక్తిలో ఒక విలక్షణమైన తేజస్సుతో, ప్రతిభతో భాసించిన మహామనీషి రాధాకృష్ణ పండితుడు.

1888లో మద్రాసుకు సమీపంగా ఉన్న తిరుత్తనిలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జననం. వారసత్వంగా విద్య కాని, సంపద కాని, నాకు లభించలేదు అని ఆయనే చెప్పారు. విద్యాభ్యాసమంతా తిరుపతిలోనూ, వెల్లూరులోనూ, మద్రాసులోనూ క్రైస్తవ మిషనరీ సంస్థలలో జరిగింది. ఆనాడు కొందరు క్రైస్తవ మత బోధకులు హిందూ మతం మీద చేసే వ్యంగ్యాత్మకమైన ప్రసంగాలు, విమర్శలు, అవహేళనలు అయనకు మనోవ్యధను కలిగించాయి. ‘ఈ ఫాదరీల విమర్శల మూలంగా మత ధర్మాలలోని గుణ దోషాలు తెలుసుకోవలెనన్న ఆకాంక్ష ఎక్కువైంది. వివేకానంద మహాస్వామి శంఖారావం చేత ప్రభావితుడినైనాను. స్వమతాభిమానం దెబ్బతినడం వల్ల తాత్విక జిజ్ఞాస ఉద్దీప్తమైనదని’ రాధాకృష్ణ వ్రాసుకున్నారు.

1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో నెలకు నూరు రూపాయల జీతం మీద నియమింపబడిన కొద్దికాలంలో తత్త్వ శాస్త్ర విభాగానికి ప్రధానాచార్యుడయ్యారు. మైసూరు విశ్వవిద్యాలయంలో మూడేళ్లు పనిచేసిన పిదప, అశుతోష్ ముఖర్జీ ఆయన అమోఘ ప్రతిభను గుర్తించి కలకత్తా విశ్వవిద్యాలయ మనస్తత్త్వ, నైతిక శాస్త్ర విభాగానికి 1921లో ప్రధానాచార్య పదవిని అలంకరింప చేశారు. రవీంద్రుని కవితా వైభవం మీద ఆయన రచించిన గ్రంథం ప్రప్రథమంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. 1927లో ప్రచురితమైన ‘ఇండియన్ ఫిలాసఫీ’ ఆయన కీర్తికి ఖండాంతర వ్యాప్తిని కలిగించింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ ప్రొఫెసర్‌గా నియమితులై తదుపరి ఆప్టన్ ఉపన్యాసాలు, షికాగో నగరంలో హస్కెల్ ప్రసంగాలు, గౌతమ బుద్ధునిపై ప్రసంగం ఆయన శేముషీ వైభవానికి, వాగ్విభూతికి దర్పణం పట్టాయి.

డాక్టర్ సి.ఆర్. రెడ్డి పదవీ విరమణ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా ఎన్నిక అయ్యారు. అప్పట్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక వుండేది. డా. రాధాకృష్ణన్ – అంతకు పూర్వమే మద్రాసు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా పనిచేసిన బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిపై ఎన్నికలో గెలిచి 1931 మే లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ఆ విశ్వవిద్యాలయాన్ని జాతీయ స్థాయి విశ్వవిద్యాలయంగా, అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన విశ్వవిద్యాలయాల స్థాయిలో రూపు దిద్దడంలో ఆయన ఎంతో దూరదృష్టితో, అంకితభావంతో, అవిశ్రాంతంగా నెరపిన కృషి బహుధా ప్రశంసనీయం. వివిధ విద్యా శాఖలలో దేశ, విదేశాలలో లబ్ద ప్రతిష్టులు, ప్రతిభా సంపన్నులు అయిన వారిని ఆచార్యులుగా నియమించారు. అలా ఆయన ద్వారా నియమితులయిన వారు భవిష్యత్తులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులుగా వాసికెక్కారు. ఇది ఆయన విశాల దృక్పథానికి ఒక తిరుగులేని తార్కాణం. జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాల పాత్ర పట్ల ఆయనకున్న నిశ్చిత అభిప్రాయాలను ఆచరణలో పెట్టే అవకాశం ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఉపాధ్యక్షుడుగా రాధాకృష్ణన్‌కు లభించింది.

ఆయన నియమించిన వారిలో ప్రొ. హుమయూన్ కబీర్, డా. హీరేన్ ముఖర్జీ, డా. వి.కె.ఆర్.వి. రావు, డా. యస్.సి. చావ్లా, డాక్టర్ లుడ్విగ్ ఉల్ఫ్ (జర్మన్), డా. టి.ఆర్. శేషాద్రి, డా. సూరి భగవంతం, డా. శైలేంద్ర సేన్, మామిడిపూడి వెంకటరంగయ్య, పింగళి లక్ష్మీకాంతం, అబ్బూరి రామకృష్ణారావు మొదలైన ప్రముఖులున్నారు.

సర్ సి.వి.రామన్‌ను సిండికేట్ గౌరవ సభ్యునిగా నియమించి భౌతిక, రసాయన శాస్త్రాలలో ఎమ్.ఎస్.సి., ఆనర్స్ శాఖలకు పాఠ్య ప్రణాళికలు – శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్యచే సాంకేతిక శాఖలకు పాఠ్య ప్రణాళికలు రూపుదిద్దించడం రాధాకృష్ణన్ ప్రతిభా పాటవాలకే కాక ఆయన పట్ల సమకాలీన మహనీయులకున్న గౌరవాభిమానాలను చాటి చెబుతాయి. గురుదేవ్ రవ్రీందనాథ్ ఠాగూర్, శ్రీమతి సరోజినీ నాయుడు వంటి శేముషీ దురంధరులచే ఉపన్యాసాలు ఇప్పించారు. విశ్వవిద్యాలయాల భవన నిర్మాణానికి వాల్తేరులో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి 54 ఎకరాల స్థలాన్ని సేకరించి – గ్రంథాలయం, విద్యార్థుల వసతి గృహాలు, వివిధ కళాశాలల భవనాలు – క్రికెట్ ఫీల్డ్, టెన్నిస్ కోర్ట్, ఫుట్‌బాల్ గ్రౌండ్ మొదలైన ప్రాథమిక నిర్మాణాలెన్నో చేపట్టారు. జయపూర్ మహారాజా విక్రమదేవ వర్మ గారిచే ప్రతి సంవత్సరం భూరి విరాళాలు విశ్వవిద్యాలయానికి ఇవ్వడానికి ఒప్పించారు. తిరిగి 1934లో రెండవ సారి ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ తన పదవీకాలం ముగియక ముందే 1936 మే లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో స్పాల్డింగ్ స్థాపించిన పీఠానికి ఆచార్యునిగా నియమింపబడ్డారు.

ఆ నియామకం భారత సభ్యతకు, ఆర్ష సంస్కృతికి జరిగిన గొప్ప గుర్తింపు, గౌరవంగా భారతీయులందరూ శ్లాఘించారు. ఆయన ఆక్స్‌ఫర్డ్ వెళ్లే వరకు శైశవదశలో నున్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పటుతరమైన పునాదులు ఏర్పరచి అనితర సాధ్యమైన సేవలందించారు.
తరువాత గాంధీజీ, మదనమోహన్ మాలవ్యాల ఆకాంక్షతో బెనారస్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష పదవి అలంకరించిన కాలంలో ఉన్నత విద్యపై ఆయన సమర్పించిన నివేదిక ఈనాటికీ శిరోధార్యమే. ‘యునెస్కో’ సంస్థ కార్యకలాపాలను తీర్చిదిద్దిన ఘనత రాధాకృష్ణన్‌కే లభిస్తుంది. వివిధ దేశాలలో విద్వత్ సదస్సులలోనూ, పండిత పరిషత్తులలోనూ, విశ్వవిద్యాలయ ప్రాంగణాలలోనూ ఉపన్యసిస్తూ, తాత్వికాచార్యుడుగా, ఒక మహా వక్తగా, బహు గ్రంథకర్తగా, భావాంబర వీధి విశ్రుత విహారిగా, దాదాపు ఆరు దశాబ్దాల జీవితం గడిపారు.

రాధాకృష్ణ పండితుని కీర్తి, వైభవాలకి మరొక తార్కాణం అనన్య సామాన్యమైనది. అనితర సాధ్యమైనది. యావత్ ప్రపంచంలో, ఏ విఖ్యాత శాస్త్రజ్ఞునికి, ఏ మహా మేధావికి, ఏ తాత్విక చింతనాగ్రేసరునికి దక్కని అత్యంత అరుదైన గౌరవం డా. రాధాకృష్ణన్‌కు లభించింది. ఆయనను ప్రపంచ దేశాల్లో ప్రఖాతి గాంచిన 152 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించడం ఆయన ప్రజ్ఞా ధురీణతకు, ప్రతిభా విశేషాలకు, గణతకు, జగత్ విఖ్యాతికి జాజ్వల్యమాన ప్రతీకలు.

స్వాతంత్య్ర ప్రియుడైన ఏ మేధావి మాతృదేశ దాస్య విమోచన కోసం జరుగుతున్న మహాయజ్ఞం పట్ల తటస్థ భావాన్ని వహించి వుండలేడు. బ్రిటిష్ పరిపాలకుల నిరంకుశత్వాన్ని, వారి దమననీతిని తీవ్రంగా ఖండించి, ప్రభుత్వం ప్రసాదించిన ‘సర్’ బిరుదాన్ని ఆయన త్యజించారు.
అయితే చివర వరకు రాధాకృష్ణన్ జ్ఞానయోగిగానే మనుగడ సాగించారు. ఆయన ఏ రాజకీయ పక్షాన్ని అనుసరించలేదు. అందలాల కోసం అర్రులు చాచలేదు. అయినప్పటికీ స్వాతంత్య్ర సముపార్జనానంతరం ఉన్నత పదవులు ఆయనను వెదుక్కుంటూ వచ్చాయి. భారత రాజ్యాంగసభ సభ్యునిగా 1949లో రష్యాలో భారత రాయబారిగా నియమింపబడి, ఒక అసాధారణ జ్ఞాన దూతగా ఆయన రష్యా వెళ్ళారు. ఆయనను 1952లో ఉపాధ్యక్ష పదవినీ, పదేళ్ల పిదప అధ్యక్ష పదవినీ అలంకరింప చేయడంలో జవహర్‌లాల్ నెహ్రూ తన దృక్పథం రాజకీయ పక్ష పరిధుల సంకుచిత్వాన్ని అతిక్రమించగలదని, ప్రతిభా సంపన్నతకు ప్రాధాన్యమివ్వగలదని నిరూపించుకున్నారు.

రాజ్య సభాధ్యక్షుడుగా రాధాకృష్ణన్ వ్యవహరించిన తీరు దిగ్దంతులైన రాజకీయ నాయకుల మన్ననలను అందుకొన్నది. సభా మరాద్యలకు గాని, అధ్యక్ష పీఠం గౌరవానికి గాని ఏమాత్రం భంగం వాటిల్లకుండా, గౌరవ సభ్యుల ఆవేశాలకు, కోపతాపాలకు, ఆవేశపూరిత ప్రవర్తనలకు అవకాశం కల్పించకుండా, హాస్యపు చెణుకులతో, మృదువైన మందలింపులతో సభా కార్యక్రమాలను నిర్వహించి, భూపేష్ గుప్తా వంటి ‘గడుగ్గాయిల’ ప్రశంసలు పొందడం సామాన్య విషయం కాదు.

రాష్ట్రపతిగా ఆ మహోన్నత పదవికి దేదీప్యమానమైన వెలుగును ప్రసాదించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు దేవాలయమైన పార్లమెంట్ భవనం ముందు పరమ పవిత్రమైన «ధ్వజస్తంభంగా ఆయన సాక్షాత్కరించేవారు. పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్, అసంఖ్యాకమైన ఆయన అభిభాషణలతో ప్రతిధ్వనించేది. తన ఆప్యాయతను, స్నేహ భావాన్ని వెన్నుతట్టడం ద్వారా వ్యక్తం చేసేవారు. మాస్కో నగరంలోని స్టాలిన్‌ను, తర్వాత మావో, పోప్ లను కూడా వెన్ను తట్టారు. భారతదేశాన్ని సందర్శించిన ప్రభుత్వాధినేతలను, రాజన్యులను వెన్ను తట్టారు. దేశంలోని మహానాయకులనూ వెన్ను తట్టారు. ఆయన అశరీరమూర్తి ఈనాటికీ దేశాన్ని వెన్ను తట్టుతూనే ఉన్నది.

1962లో చైనా మన దేశంపై యుద్ధం చేసిన సందర్భంలో దేశ సర్వ సైన్యాధ్యక్షునిగా రాజ్యాంగంలో నిర్దిష్టంగా విపులీకరించని అధ్యక్షుని సూచితాధికారాలను (ఐఝఞజూజ్ఛీఛీ ్కౌఠ్ఛీటట), దేశ రక్షణ కోసం ఎంతో సున్నితంగా, ఏ విమర్శలకూ తావీయకుండా, జవహర్‌లాల్ నెహ్రూను నొప్పించకుండ ఒప్పించి అప్పటి రక్షణ మంత్రిచే రాజీనామా చేయించి, అసమర్ధులైన సైనిక అధికారులను దీర్ఘ సెలవుపై పంపించి, వారి స్థానంలో సమర్ధులను నియమింప చేశారు. ఆయన తర్వాత వచ్చిన ఏ దేశాధ్యక్షుడు అటువంటి కఠినమైన చర్యలు తీసుకొన్న దాఖలాలు లేవు.
అధ్యక్ష పదవీ నిర్వహణలో అవసరమైనప్పుడు ప్రభుత్వ విధానాలను అతి నిశితంగా, తీవ్రంగా విమర్శించడానికి వెనుకాడలేదు. పేరుకుపోతున్న అవినీతిని, అసమర్థతనూ, లంచగొండితనాన్ని, జాతీయ వనరుల దుర్వినియోగాన్ని అభిశంసించడం జరిగింది. అధ్యక్ష పదవి పొడిగింపునకు ఆరాటపడలేదు. 1967లో పదవీ విరమణ చేసి ఆయన మద్రాసులో శేష జీవితాన్ని గడిపారు.

మన దేశ రాజకీయ చరిత్రలో రాధాకృష్ణన్ నిర్వహించిన పాత్ర క్షణికమైన మెరుపునిచ్చే విద్యుల్లత వంటిది. విద్యా, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో ఆయనది ఒక స్థిరమైన వెలుగు. ‘కుంభగత ప్రదీప కళిక’ దేశికుడుగా ఆయన మహోన్నతుడు. ఆ మహా మహోపాధ్యాయుని జన్మదినం సెప్టెంబరు 5, ఉపాధ్యాయ దినంగా పరిగణించబడడం అత్యంత సమంజసం. అదే ఆయనకు వినమ్రంగా మనం అర్పించే నివాళి.
ఆయన మహోజ్వల వక్తృత్వానికి ప్రపంచం జోహారులర్పించింది. ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ తన మాతృ భాషకు ఇంతటి సౌందర్యం, నాదమాధుర్యం వున్న విషయం పూర్వం గుర్తించలేదన్నాడు. రాధాకృష్ణన్ వాక్య రచన సుదీర్ఘంగా వుండక, సూక్ష్మమైన భావాలతో, చమత్కారాలతో మృదువైన హాస్యంతో మిలమిలలాడుతూ ఉంటుంది. ఆయన ప్రసంగం రసభరితమైన భావోల్బణం, మనోజ్ఞమైన అక్షర శిల్పం. శ్రవణ సుభగమైన శబ్ద విన్యాసం.

ఆయన ముఖత: ప్రతిధ్వనించినది భారత సంస్కృతి బహుముఖమైన అమూల్య సంపద. ఆయన బుద్ధి బలం బహు విశాలమైంది. ఎట్టి క్లిష్ట విషయమునైనను అవలీలగా భేదించి, అందలి సారమును హృదయంగ మంగ విశదీకరించ గల వ్యాఖ్యాత వారు. భౌతిక విజ్ఞాన, జీవశాస్త్ర, మనస్తత్వ శాస్త్రాలకు — మత ధర్మ ఆధ్యాత్మిక చింతనా సరళికి, సమన్వయ సామరస్యాల అన్వేషణ ఈనాటిది కాదు. పాశ్చాత్య తత్త్వవేత్తలైన విలియం జేమ్స్, బ్రాడ్లే, వార్డ్, రుడాల్ఫ్ యూకాన్, రాష్‌డాల్ మొదలగు వారి భావ పరంపరలను ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారో, ఎడింగ్‌టన్, సర్ జేమ్స్ — వైట్ హెడ్, లాయడ్ మోర్గాన్ ప్రభృతుల వైజ్ఞానిక రచనలు అంత సమగ్రంగా ఆయన అర్థం చేసుకున్నారు. మానవ జీవితం ఏ విధంగా అవిభాజ్యమో, అలాగే మానవ విజ్ఞానం కూడా అవిభాజ్యమని ఆయన చాటిచెప్పారు. మతతత్వాన్ని గురించి ఆయన రూపొందించిన భావాలు అద్భుతమైనవి. బాహ్య ప్రకృతిని గురించి మన జ్ఞానేంద్రియాల ద్వారా పొందే విజ్ఞానం ఎంత నిర్దుష్టమైనదో, మనోమయకోశంలో, హృదయాకాశంలో మనం పొందే ఆధ్యాత్మిక అనుభవాలకు, అపరోక్షానుభూతులకు అంతే విలువ ఉండవలెనని ఆయన ఉద్ఘాటించారు. విభిన్నమైన మత బోధనలలో, ధర్మాలలో, నిర్దుష్టమైన దివ్యానుభవం అంతర్వాహినిగా ప్రవహిస్తూ వుంటుందని ఆయన సిద్ధాంతం.

మానవ జీవితంలో మతం ఆవశ్యకతను, ఉత్కృష్టతను చాటి చెప్పారు. మతం నిర్దేశించిన ధర్మాలను, నిర్వచించిన లక్ష్యాలను విస్మరించి, బాహ్య చిహ్నాలకు, లాంఛనాలకు, శుష్కమైన కర్మకాండలకు, సంప్రదాయాలకు విలువ నిచ్చినప్పుడే మతం అనర్థదాయకం అవుతుందని, అది వ్యవస్థాత్మకమైన రూపాన్ని దాల్చినప్పుడు బలవత్తరమైన సాంఘిక, రాజకీయ ఆర్థిక శక్తిగా మారి, అక్రమాలకు, దౌర్జన్యాలకు, అసమానతలకు, బలహీన వర్గాల పీడనలకు కారణభూతమవుతుందని, మతాన్ని వైయక్తిక ఆత్మాశ్రయంశంగానే పరిగణించవలసి వుంటుందని ఆయన హెచ్చరించారు.

రాధాకృష్ణన్ జాతీయ సమస్యల మీద, అంతర్జాతీయ సమస్యల మీద అసంఖ్యాకమైన వేదికల నుంచి ప్రసంగించారు. మానవుని మనుగడ, మానవజాతి అభిన్నత్వం, అవినాశి అయిన అతడి వారసత్వం, అనంతంగా సాగిపోయేటటువంటి అతడి జీవిత ప్రస్థానం — ఈ విషయాలపై డాక్టర్ రాధాకృష్ణన్ మేధస్సు పరిభ్రమిస్తూ వుండేది. సర్వ మానవ సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం వెల్లివిరియాలని ఆయన ఆశయం. అజ్ఞాన తమస్సులలో బందీకృతమైన మనస్సు, సంకెళ్ల నుంచి విడివడవలెనని ఆయన ప్రబోధం.

ఆయన విశ్లేషణా నైశిత్యానికి, సృజనాత్మకమైన భావ విన్యాసానికి, నిండైన పరిపక్వతకు దర్పణం పట్టే గ్రంథం ‘ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’ — మన ఉపనిషత్ వాజ్ఞయంలోనూ, భగవద్గీతలోనూ నిక్షిప్తమైన భావాలను, పరమ ధర్మాలను ప్రాతిపదికగా తీసికొని, మానవ జీవిత సరళిని విశ్లేషించి, అతి బంధురమైన భావనా పరంపరను మనకందజేసే గ్రంథమిది. డాక్టర్ రాధాకృష్ణన్ తపస్సాధనలు ఎటువంటివో మనకు తెలియదు. అయితే జీవితాంతం విజ్ఞానాన్ని ఆర్జిస్తూ, ఆత్మ సంయమనాన్ని అలవడి చేసుకుంటూ, నిష్కామయోగాన్ని అనుసరించి, విశుద్ధమైన సాత్విక గుణాలతో శోభిస్తూ తప్పకుండా పరమేశ్వర సాక్షాత్కారం పొందివుంటారు.

1975 ఏప్రిల్ 17న నిశాగగనంలో నక్షత్రరాశి అస్తమించినట్టు ప్రశాంతంగా కన్ను మూశారు రాధాకృష్ణన్.
ప్రసిద్ధ గ్రీకు రాజనీతిజ్ఞుడు పెరిక్లిస్ ఏనాడో అన్నాడు – ‘పృధ్వీస్థలి మహనీయుల సుప్తాస్థికల సమాధి’ అని. నిజమే మరి!
ఈ వ్యాసం ముగించే ముందు ఆ మహనీయునితో నా పరిచయ సన్నివేశాన్ని ప్రస్తావించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. 1968 మే 2వ తేదీన నేను ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు డాక్టర్ రాధాకృష్ణన్‌ను మద్రాసులో వారి స్వగృహంలో కలిసే అదృష్టం నాకు లభించింది. ఆ మహాపురుషునితో సుమారు గంటసేపు సంభాషించే అపూర్వ అవకాశం పొందడం నా పురాకృత పుణ్య విశేషం. నా పట్ల ఆదరాభిమానాలతో రాధాకృష్ణన్ ఆంగ్లంలో అక్షర రూపంలో ఆశీస్సులందజేశారు. ఆ పత్రం సుదీర్ఘంగా సాగడం నాపట్ల ఆయన కురిపించిన ప్రేమామృత వృష్టిగా భావించి ఈనాటికీ దాన్ని అమూల్యంగా భద్రపరచుకున్నాను.
‘ఆనోభధ్రాః క్రతఓ యంతు విశ్వతః’
– గోటేటి రామచంద్రరావు
ఫోన్ : 9908157154, 040-23733908
(నేడు ఉపాధ్యాయ దినోత్సవం)

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.