ప్రేక్షకుల్ని పుట్టించుకోవాల్సిందే!
September 06, 2013
తొలి సినిమా నుంచే తనదైన పంథాలో పయనించిన యువదర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘గ్రహణం’ సినిమాతో తొలిదర్శకుడిగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నా, ఆ తర్వాత తీసిన ‘మాయాబజార్’తో పరాజయం చవిచూశారు. విమర్శలే కాదు పలురకాల ఆత్మవిమర్శలతో రాటు తేలిన పిదప ఆయన తీసిన ‘అష్టాచమ్మా’ సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ‘గోల్కొండ హైస్కూలు’ సినిమా ఒక మోస్తరుగా నడిచినా ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు- ఆ తరువాత’ మళ్లీ విజయాన్ని కట్టబెట్టింది. దశాబ్ద కాలపు సినీ జీవితంలో మోహనకృష్ణకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఉన్నా, టీచింగ్‌లోకి వెళ్లొచ్చని పిహెచ్.డిలో చేరినా అంతిమంగా సినిమా రంగం పట్ల నాకున్న ఇష్టం నన్ను ఒక దర్శకుడిగా నిలబెట్టింది. మా నాన్న శ్రీకాంత శర్మ గారి కారణంగా ఇంట్లో ఏర్పడిన సాహిత్య వాతావర ణం, మా అమ్మ జానకీబాలగారి కారణంగా ఏర్పడిన సంగీత వాతావరణం బహుశా నేను ఈ వైపు రావడానికి ప్రధాన కారణమేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది.
1997లో నేను 50 ఏళ్ల భారత స్వాతంత్య్రం సందర్భంగా ‘మహాంధ్ర’ అన్నపేరుతో ఒక డాక్యుమెంటరీ చేశాను. దాదాపు 1870 నుంచి 1947 వరకు రాష్ట్రంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, ఇతరత్రా వచ్చిన మార్పులేమిటి? అన్న విషయం తీసుకుని ఆ డాక్యుమెంటరీ చేశాను. జెవి సోమయాజులు నిర్మాతగా వ్యవహరిస్తే పవన్‌కుమార్ మాన్వి దానికి దర్శకత్వం వహించారు. దానికి సంబంధించిన పరిశోధన, రచన నేనే చేశాను. సినిమా గురించిన ఒక అవగాహన కలిగించింది ఆయనే. అందువల్ల సినిమా లోకానికి సంబంధించినంత వరకు మాన్విగారు నా తొలిగురువు. సినిమా రచన గురించి, దర్శకత్వం గురించి ఎన్నో విషయాలు నేను అయన నుంచి నేర్చుకున్నాను. ఆయన సలహా మీదే కెనడా వెళ్లి అక్కడో యూనివర్సిటీలో ఎం. ఎఫ్.ఏ (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ) చేశాను. ఆ తరువాత పిహెచ్.డిలో జాయిన్ అయ్యి ఒక సంవత్సరం ఉండి అంటే 2001లో సినిమా చెయ్యాలని నిర్ణయించుకుని ఇండియాకు తిరిగి వచ్చేశాను.
అడుగు మోపాకే తె లిసింది
సినిమా రంగంలో అడుగిడిన నాటి నుంచే మొదలయ్యాయి నా కష్టాలు. ఎవరికైనా ప్రత్యక్షంగా ఆ రంగ ంలోకి దిగేదాకా దానికి సంబంధించిన కష్టాలేం తెలుస్తాయి! కనిపించిన ప్రతి నిర్మాతకూ కథలు వినిపించేవాడ్ని. అలా ఓ మూడేళ్లు గడిచాయి. కానీ, ఎక్కడా సానుకూల స్పందన లేదు. ఒక్కోసారి అనవసరంగా ఇండియాకు తిరిగొచ్చేశానేమో అనిపించేది. ఏమైనా ఈ రంగంలోకి ప్రవేశించడం అంటే ఏటికి ఎదురీదడమేనని నాకు అర్థమైపోయింది. ఎవరి వద్దకు వెళ్లినా ‘ సరేలేవయ్యా, విదేశాలకు వెళ్లానంటున్నావు. బాగా చదువుకున్నానంటున్నావు. కానీ, అసలు నువ్వు సినిమా తీయగలవని మాకు నమ్మకమేంటి? ఇంత వరకు నువ్వు ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. ఏం చిత్రిస్తావో మాకేం తెలుసు? ఇప్పుడు నీ మీద అంత డబ్బు ఎలా పెడతాం?” అంటూ అడి గేవాళ్లు. అదీ నిజమేననిపించింది. నువ్వేమిటో, నీ సామర్థ్యం ఏమిటో ఏమీ తెలియకుండా ఎవరైనా లక్షల్లో, కోట్లలో ఎలా ఖర్చు చేస్తారు? మన మీద మనం ఖర్చు చేసుకుని మనల్ని మనం నిలబెట్టుకోవడం తప్ప మరోమార్గం లేదనిపించింది. వెంటనే అంటే 2003లో 30 నిమిషాల నిడివితో ‘చలి’ అనే చిన్న సినిమా (ఫీచర్ ఫిల్మ్) తీశాను. నిర్మాతలు, దర్శకులు ఎవరు కనిపించినా వారికి ఒక సీడీ ఇచ్చే వాడ్ని. అది చూసి చాలా మంది బాగుందనే అన్నారు. తనికెళ్ల భరణి గారు కూడా చూశారు.
అంతకు ముందే ఆయనతో నాకు కొంత పరిచయం ఉంది. చలం గారి రచన ఆధారంగా నేను తయారు చేసుకున్న ‘గ్రహణం’ అనే స్క్రిప్ట్ నా వద్ద ఉంది, అందులోని ప్రధానపాత్రను చేయడానికి మీరు అంగీకరిస్తే సినిమా చేద్దాము అన్నాను. ‘చలం గారి కథే అయితే చేస్తా. నాకు డబ్బులేమీ అక్కర్లేదు’ అంటూ వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ మాటే అమ్మతో చెప్పాను. ‘మూడు లక్షల్లో తీయగలవా మరి?. నా ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బ్రేక్ చేసి నీకు 3 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను’ అంది. వెనకా ముందు ఆలోచించకుండా సరే అన్నాను. ఆ మాటే భరణి గారికి చెబితే నవ్వేశారు. అలా కాదు గానీ, ఎలాగోలా ఇంకొంచెం పెంచుదాం అన్నారు. మొత్తంగా చూస్తే అన్నీ కలిపి 18 లక్షల దాకా ఖర్చయ్యింది. అప్పుడు నేషనల్ అవార్డుకు పంపిస్తే, దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ తొలి దర్శకుడిగా నాకు అవార్డు వచ్చింది. అక్కడినుంచి కెరీయర్‌కు ఒక టేకాఫ్ దొరికింది.
విజయం, సమస్య కలగలిసి
గ్రహణం సినిమాతో నాకు బాగా పేరొచ్చిన మాట నిజమే కానీ, చిత్ర పరిశ్రమ నన్ను పూర్తిగా ఆర్డ్ ఫిలిం డైరెక్టర్ల జాబితాలో చేర్చివేసింది. మరో సినిమా చేసే అవకాశం నాకెవ్వరూ ఇవ్వలేదు. నేను బాగా కష్టాల్లో పడిపోయాను.. నేను ఏ సినిమా తీసినా ‘గ్రహణం’ మూసలో తీస్తాననే ముద్ర ఒకటి పరిశ్రమ వేసింది. అయినా ఆ కష్టకాలంలో ‘మిస్సమ్మ’ తీసిన వి సత్యనారాయణ ఒక సినిమా తీద్దామని నా వద్దకు వచ్చారు. ఆయనతో చేసిందే ‘మాయాబజార్.’ కానీ, అది ఆశించినంత బాగా ఆడలేదు. దానికి రకరకాల కారణాలు చెప్పారు. కథ పాత పద్దతిలో ఉందని, కుర్రకారుకు అది పట్టలేదని, ఆదర్శాల పాలు ఎక్కువైపోయిందనీ అన్నారు. వ్యక్తిగతంగా నాకు మాయాబజార్ సినిమా అంటే చాలా ఇష్టం కానీ కమర్షియల్‌గా విజయవంతం కాకపోవడంతో నేను మానసికంగా దెబ్బతిన్నాను. దాదాపు ఏడాది పాటు విపరీతమైన అంతర్మధనానికి గురయ్యాను.తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండిపోయాను. మనిషి మీద ఒక ముద్ర పడితే అది ఒక్కోసారి జీవితకాలపు ముద్ర అవుతుందని అప్పటిగ్గాని నాకు తెలిసి రాలేదు.
అది ఆయన సాహసమే
ఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతున్న సమయంలో రామ్మోహన్ అనే ఒక స్నేహితుడు నాకోసం వెతుక్కుంటూ వచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవాడు. నేను తరుచూ ఆ స్టూడియోకు వెళ్లడం, కథలు చెప్పడం చేసేవాడ్ని. అలా పరిచయం అయిన వాడే అతను. ఆయన నా వద్దకు వచ్చి, నాకో సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. ‘మాయాబజార్’ ఫెయిల్యూర్ విషయం పక్కకు పెట్టు. నాకు నీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. మనం ఓ సినిమా చే ద్దాం అన్నాడు. అప్పుడాయనకు నేను ‘అష్టాచమ్మా’ కథ చెప్పాను. ఆ సినిమా విడుదలై గొప్ప విజయం సాధించింది. ఆర్ట్ సినిమాలే కాదు ఇతను వినోదాత్మకంగా కూడా తీయగలడు అన్న భావనను పరిశ్రమలో స్థిరపరిచింది. ఈ క్రెడిట్ పూర్తిగా రామ్మోహన్‌కే దక్కుతుంది. ‘అష్టాచమ్మా’ విజయం తర్వాత అదే బ్యానర్ కింద ‘గోల్కొండ హైస్కూల్ ‘అనే సినిమా చేశాను. ఇది బ్లాక్‌బ్లస్టర్ కాకపోయినా, ఒక మేరకు సక్సెస్ సాధించింది. కాకపోతే నాకు దర్శకుడిగా విపరీతంగా పేరొచ్చింది. ఇప్పుడొచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో ఒక భిన్నత్వం ఉందని ప్రేక్షకులనుంచి ప్రశంసలొచ్చాయి.
ప్రేక్షకుల సృష్టి జరగాలి
‘అష్టాచమ్మా’ విజయం నాకు ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. పేక్షకులకు ఏం కావాలా వాటిని మనం ఊహిస్తూ కూర్చోవడం కన్నా, మనం నమ్మిన దాన్ని ఎంత పక్కాగా తీయగలిగితే అది ప్రేక్షకుల్ని అంత తొందరగా చేరుతుందని అనిపించింది. సినిమాలో వినోదం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎలాంటి వినోదం ఇవ్వాలనేది దర్శకుడు నిర్ణయించుకోవాలి. దర్శకుడు తన ప్రేక్షకుల్ని సృష్టించుకునే క్రమం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. హీనమైన వినోదం ఇస్తే ఆ స్థాయి ప్రేక్షకులే పుట్టుకొస్తారు. ఉన్నతమైన వినోదాన్ని ఇస్తే ఉన్నతమైన ప్రేక్షకులు పుడతారు.
మనం తక్కువ సంస్కారవంతమైన వినోదానికి ఎక్కువ కాలం అలవాటు పడి వేరొకరకమైన వినోదాన్ని చూసి ఆనందించగల స్థాయి వారిలో తగ్గిపోవచ్చు. అలాంటి స్థితిలో అటువంటి వినోదంతో వ చ్చే సినిమాల్ని వారు అర్థం చేసుకోలేరు. వాటిని అర్థం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి, అభినందించడానికి వారికి టైం పడుతుంది. అస్తమానం పడిపోతున్న విలువల విషయమై తిట్టుకుంటూ కూర్చోకుండా ఆ తరహా ప్రేక్షకుల్ని సృష్టించుకోవడం తప్పనిసరి అన్న సత్యం నాకు స్పష్టంగా బోధపడింది.
– బమ్మెర
ఫోటోలు: రాజ్‌కుమార్