మరుగున పడిన మతాలు –మతాధికారులు -6
శూన్య వాదం
ప్రజ్ఞా పారమితం ఆధారం గా ఆచార్య నాగార్జునుడు క్రీ శ175 లో శూన్య వాదాన్ని వ్యాప్తి చేశాడు .విగ్రహ వ్యావర్తిని ,మాధ్యమికా కారిక మొదలైన గ్రంధాలు రాశాడు .మొదటి దానిలో 72 కారికలు ,రెండవ దానిలో400 కారికలు ఉన్నాయి .వీటి వ్యాఖ్యానాలు కూడా ఆచార్యుడే రాశాడు ..క్రీ.శ.200-224 కాలం లో ఉన్న ఆర్య దేవుడు ‘’ చ తుహ్ శతక ‘’లో శూన్య వాదాన్ని పరమత ఖండనం తో సమర్ధించాడు .క్రీ శ.ఆరు వందల వాడైన చంద్ర కీర్తి ‘’ప్రసంన్ పద ‘’అనే టీకను శతక పై వృత్తి నీ రాశాడు .బుద్ధ పాలిత ,భావ వివేకాదులు ఈ సంప్రదాయం లో ప్రసిద్ధ ఆచార్యులు .
శూన్యత అంటే ఏమిటో నాగార్జునుడు వ్యావర్త లో వివరించాడు .’’ప్రతీత్య సముత్పాదన ‘’మే శూన్యత అన్నాడు .అదే అనేక పదార్ధాలలో ఉన్న మధ్యమ పదం అన్నాడు .భావనలు నశించి ,కొత్త భావాలలు పుట్టటమే శూన్యత .నిస్వభావత్వం వలన ప్రత్యాయా శ్రితాలై ఏర్పడే భావాలకు హేతు ప్రత్యయాపెక్షం ఉంది కనుక స్వభావం ఉండదు .అవి ఇతర ఆశ్రయాలలో ఉన్నాయి కనుక స్వభావం కాని అంతస్సారం కాని లేనివి అవుతాయి .ప్రతీత్య సముత్పాదాలైన భావాలు క్షణికాలు .’’ఉంది లేదు ,ఆ రెండు ఆ రెండూ కాదు ‘’అని ఉత్పాద స్తితి లేని వాటి గురించి చెప్పలేదు ఇవి కోటులు అన్నాడు వీటి నుంచి వినిర్ముక్తమ్ ఆయె తత్త్వం ఆస్తి నాస్తి అనే రెండు మార్గాలను వదిలేసిన మార్గం కనుక మాధ్యమిక లేక మధ్యే మార్గం అన్నారు దీనిని ..వస్తు తత్త్వం శూన్యం .అంటే భావం అభావం లేనిది .సత్ స్వభావ అనుత్పత్తి లక్షణం అని చెప్పేదే మాధ్యమిక దర్శనం .
కర్మ యొక్క నిమిత్తం వల్లనే కారకం ఉందని చెప్ప వచ్చు .కర్మ ఉంది అని కారకం యొక్క నిమిత్తం చేత చెప్ప వచ్చు . ఇంకో విధం గా సత్తా సిద్ధించే కారణం లేదు .భావాలు తమ లో నుండి పుట్టవు .అలా అయితే దేని లోంచి అయినా ఏదైనా పుట్ట వచ్చు .ఈ రెండిటి లో దోషం ఉంది కనుక వీటిని కలపటం సరికాదు .భావాలు హేతువు లేనివి అని చెప్పటానికి వీలు కూడా లేదు .కారణం లేక పోతే ఫలం అనేది ఉండదు .కనుక అన్ని భావాలు దేని నుంచైనా ఉత్పత్తి కావచ్చు .
సత్ అనేదానికి ప్రత్యయం అవసరం లేదు అన్ని వస్తువు లకు పుట్టుక నాశనం పరస్పరం ఆశ్రయింప బడి ఉంటాయి .లోకం ఉంది అని నమ్మిన వాడిని లేదు అని చెప్పటం మోసమే .ప్రపంచం అవాస్తవం అనే మాట శూన్య వాదానికి విరుద్ధం కాదు .ప్రమాణాలు అసిద్ధాలు కనుక వాటి భావాల వాస్తవికత సిద్ధం కాదు .ప్రతీత్య సముత్పాదం వల్లనే భావాలలో శుద్ధ మైనది, కానిది అనే తేడాలు ఏర్పడుతున్నాయి .అంత మాత్తరం చేత ఇవి పరమార్ధాలు కావు .అలా కాక పోవటం చేత శీలం మొదలైన వాటి వల్ల మార్చలేము .
పదార్ధ తత్త్వం మనకు తెలియక పోవటానికి కారణం ‘’సంవ్రుతి ‘’.అంటే మొహం .అన్ని పదార్ధాలలో ఆవరించి ఉన్న అజ్ఞానం అన్న మాట .ఈ సంవ్రుతి వస్తువుల స్వభావాలను చూడ టానికి కప్పు గా ,వాటి పై అసాధ్ స్వరూప ఆరోపణం చేస్తోంది .నిస్స్వభావాలు ,సత్యాభాసితం అయిన వస్తువుల స్వభావం ఉన్న వానిగా ,సత్యాలుగా కనిపింప జేసేదే సంవ్రుతి అంటే మిధ్య .లోకం దృష్టిలోనే ఇది సత్యం .అందుకే ఇది’’ లోక సంవ్రుతి సత్యం’’ అంటారు .ఇది ప్రతీత్య సముత్పన్నం ,కృత్రిమం .కనుక దీనికి వ్యతిరేకం గా పరమార్ధ సత్యం మాటలతో చెప్పటానికి వీలు లేనిది అంటే అవాచ్యం .అది జ్ఞానం తో తెలియ దగినది కూడా కాదు .ఎవరికి వారు స్వయం గా తెలుసుకో దగినది .అవిద్యా వాసనా లేని వారు అంటే జ్ఞానులు ఏ దృష్టితో వస్తువు లను చూస్తారో అదే పరమార్ధ సత్యం .దర్శనం కాని ,అంటే ‘’ఆదర్శన న్యాయం ‘’ వల్లనే చూడ టానికి వీలవుతుంది .అది నిష్ప్రపంచ జ్ఞానం .అజ్ఞానం చేత ఆవ రింప బడిన సత్యాన్ని నిస్స్వభావం గా తెలుసుకోవటం యోగులకు మాత్రమె సాధ్యం .
పరమార్హానికి ఉత్పాద ,నిరోదాలుండవు .అది అనేకార్ధాలతో ఉన్నా ‘’అనా నార్ధం’’అయినది .దీనికి రావటం పోవటం ఉండవు .అది శివం .జ్ఞాన జ్ఞేయ వ్యవహారానికి అది నివ్రుత్తమైనది .కనుక అది జాత జరా మరణాలు లేనిది .మాధ్యమికులకు స్వంత పక్షం అంటూ లేదు ప్రతిజ్ఞా కూడా లేదు .కనుక వారికి స్వతంత్ర ,అనుమాన ప్రయోగాలు అక్కర్లేదు .సత్ అసధ్ ,సదసత్ ,వీటిలో ఏ పక్షానికి వీరు చెందరు .దేన్నీ ప్రతి పాదించరు .ఇతరులు కూడా ఏ దోషాన్ని వీళ్ళకు ఆపాదించరు ..ప్రత్యక్షాదుల చేత ఏ వస్తువు ఉప లబ్ధ మైనట్లు ప్రమాణం వీరికి లేనందున మాధ్యమికులకు పక్షం అనేది లేదు .ఇతరుల ప్రతిజ్ఞాల నిషేధమే మాధ్యమికుల అనుమానాలు .వాళ్లకు స్వంత ప్రతిజ్ఞాలేవీ లేవు కనుక ఇతరులు వాళ్ళను ఖండించరు దూషించరు
అన్ని సంస్కారాలు మ్రుషాలు ,మోష ధర్మాలు .నిర్వాణం ఒక్కటే అమోష ధర్మం ,పరమ సత్యమని బుద్ధుడు చెప్పాడు .నాగార్జున మతం లో నిర్వాణం రాగాదుల లాగా ప్రహీనం కాదు .అది సంప్రాప్తం అయ్యే ఫలమూ కాదు .అశూన్య పదార్ధం లాగా నిత్యం కూడా కాదు .అది అనిరుద్ధం ,అనుత్పన్నం . నిర్వాణం ఒక భావం కాదు అయితే అభావమూ కాదు .ఈ రెండూ కాదన్నాడు ఆచార్యుడు .’’జనన మరణాలకు ఉపాదానం చేయని ఒక అప్రవ్రుట్టి నిర్వాణం ‘’అన్నాడు నాగార్జునుడు .ఇది భావం అభావం ఉభాయాత్మకం కాదు నిర్వాణం ఎవరి చేతా గ్రహింప బడదు అది ప్రకాశ మానం కూడా కాదు .అని మాధ్యమిక సిద్ధాంతం .ఒకరు బోధించటం ఒకరు విని ఆచరించటం సిద్ధమైనవికావు .బుద్ధుడు అనిర్వాణాన్నే నిర్వాణం గా చెప్పాడు .’’ఆకాశం చేత వెయ బడిన ముడి ఆకాశం చేతనే విప్ప బడాలి అనేది శూన్య వాదం .’’సరిగ్గా పట్టు బడని పాము ,దుష్ప్రసాదితం అయిన విద్య ,నాశన కారణాలు అయినట్లుగానే దుర ద్రుష్ట మైన శూన్యత మంద బుద్ధులను నాశనం చేస్తుంది ‘’అని నాగార్హునుని శూన్య వాదం లోని పరమార్ధం .పరమార్ధాన్ని తెలుసుకోవటం కష్టం అంటాడు ఆచార్యుడు
సశేషం
ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షల తో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –5-9-13- ఉయ్యూరు