ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు

ఆత్మాశ్రయ సామాజికుడు, ఏకాంత కోలాహలుడు

September 09, 2013


ఫార్ములాకు లొంగని ప్రత్యేకతలను అర్థం చేసుకునే ఉద్దేశ్యం కానీ, శక్తి కానీ లేకపోవడం వల్ల అనేక ప్రాంతీయ, స్థానిక, సామాజిక సాహిత్యాలు ‘ప్రధాన స్రవంతి’కి వెలుపల మిగిలిపోయాయి. అస్తిత్వ చైతన్యాలు వేసిన ప్రశ్నలు, గత చరిత్రను తిరిగి అవలోకించడానికి, పక్కన ఉండిపోయిన వాటి గుణగణాలను అన్వేషించడానికి దోహదం చేశాయి. ఈ అన్వేషణలో సకల అస్తిత్వాలు కనుగొన్న విస్మ­ృత రత్నాలు అనేకం. పొట్లపల్లి కూడా అటువంటి ఆవిష్కరణే.

అభ్యుదయవాది, కవి, కథకుడు, ప్రపంచ పరిణామాలను నిత్యం ఆసక్తిగా విమర్శనాత్మకంగా గమనించిన ఉత్సుకుడు, ఆలోచనలను నిత్యం ప్రపంచంతో పంచుకోవాలనుకునే వివేకి, ప్రజాకార్యకర్త, వ్యక్తిగా ఉదాత్తుడు, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు, మితభాషి, ఏకాంతంతో కూడా సమ్మర్దాన్ని గ్రహించగలిగేవాడు.. ఇట్లా ఇన్ని విశేషణాలకు, వర్ణనలకు తగిన అపురూపుడు పొట్లపల్లి రామారావు.

ఇంగ్లీషు పలుకుబడి ‘వైట్ ఎలిఫెంట్’ను తెలుగులో ‘ఐరావతం’ అంటున్నాము. అలంకార ప్రాయమైన ఆడంబరం కోసం చేసే అనవసరపు ఖర్చు- అని ఆ పలుకుబడికి అర్థం. రాజసాలూ వైభవాలూ అణగారి పోయినా, అహంకారం దౌర్జన్యం మాత్రమే మిగుల్చుకున్న రాజాల కాలంలో, పాలకుల పెరట్లో ‘ఏనుగు’ ఉన్నదంటే, అది సామాన్య ప్రజల నెత్తిన గుదిబండే. ఒక సంస్థానంలో రాజుగారి ఏనుగు పేరిట రైతుల నుంచి వసూలు చేసే పన్ను ‘ఏనుగ చొప్ప’. ఆ ఏనుగు చచ్చి పోయినా, రాజుగారి దగ్గర ఏనుగు కాదు కదా కుంటి గుర్రం కూడా మిగలకపోయినా జనం మాత్రం ‘ఏనుగ చొప్ప’ పన్ను కట్టవ లసిందే.

పొ
ట్లపల్లి రామారావు కథల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది ‘ఏనుగ చొప్ప’. తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య దౌర్జన్యాల గురించి పొట్లపల్లి రామారావుకు చాలానే అవగాహన, పరిజ్ఞానం ఉన్నది కానీ, సంస్థానాల గురించి ఆయనకు ప్రత్యక్ష పరిచయం లేదు. వరంగల్లుజిల్లా వాడయిన పొట్లపల్లికి మహబూబ్‌నగర్‌జిల్లాలో అధికంగా ఉన్న సంస్థానాలతో పరిచయం ఆంధ్రమహాసభ ఉద్యమం ద్వారానే ఏర్పడింది. ఆంధ్రమహాసభ ఆదేశం మీద పొట్లపల్లి రామారావు, తన మిత్రుడు, రచయిత అయిన వట్టికోట ఆళ్వారుస్వామితో కలసి గద్వాల మొదలయిన సంస్థానాలలో అధిక పన్నుల గురించి, రైతాంగంమీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి నిజనిర్ధారణ పర్యటన చేశారు. ఆ పర్యటనలో తాము పరిశీలించిన అంశాల గురించి ఒక విపులమయిన నివేదిక కూడా రాశారు. ఆ నివేదిక చదివితే, సాహిత్య పోషకులుగా, అవధానపండితులను ఆదరించినవారిగా ప్రఖ్యాతులైన సంస్థానాధీశులు, ఆ పనులు చేయడానికి రైతాంగాన్ని ఎంతగా పీడించి పన్నులు వసూలుచేశారో స్ఫురించి బాధ కలుగుతుంది. బహుశా, ఆ ప్రత్యక్ష పరిశీలన ఆధారంగానే ఆయన ‘ఏనుగ చొప్ప’ కథ రాసి ఉండాలి. చిన్న స్కెచ్‌లాగా ఉండే ఆ కథ, పొట్లపల్లి రామారావు ప్రజానుకూల దృష్టికి, సాహిత్య సృజనలో ఆయన వినియోగించుకునే వనరులకు ఒక ఉదాహరణగా నిలబడుతుంది.

ఉద్యమాల తక్షణ అవసరాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని, తమ స్పందనలను, సృజనలకు ఆ తీరులో వ్యక్తం చేసేవారిని ఉద్యమరచయితలని అనుకుంటే, పొట్లపల్లిని కేవలం ఉద్యమరచయితగా మాత్రమే చెప్పడం అర్థసత్యం అవుతుంది. ఆయన కాళోజీ వంటివారు కాదు, ఆళ్వారుస్వామి వంటివారూ కాదు. ఆ మాటకు వస్తే, కాళోజీ, ఆళ్వారూ ఇద్దరూ కూడా అటువంటి అర్థంలో ఉద్యమరచయితలు మాత్రమే కారు. వీరంతా కూడా తమ చుట్టూ ఉన్న సమాజంతో బాధ్యతాయుతమైన నిబద్ధత కలిగి ఉన్నవారే, స్థిరమైన మార్గం ఒకటి ఏర్పడని రోజుల్లో తామే స్వయంగా బాటలు వేసినవారే, అంతే కాదు, తమలో తామొక ఏకాంత సౌందర్యం రచించుకున్న భావుకులు కూడా. అంతేకాదు, వీరు తమదైన తాత్విక ఆత్మాశ్రయత ఉన్నవారు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో స్థిరపరచిన యుగవిభజన లేదా ఉద్యమక్రమణిక కారణంగా, తెలంగాణలోని తొలి, మలి తరం సృజనశీలురు, ఆలోచనాపరులు చరిత్రలో ప్రసిద్ధికెక్కలేదు. ఈ రకం విస్మరణ ఇతర ప్రాంతాలలోని కవులూ రచయితలూ కూడా కొందరు ఎదుర్కొన్నారు. భావ, నవ్య, అభ్యుదయ కవిత్వాల పరంపరను ఏకైక క్రమంగా చెప్పడం వల్ల కూడా, మహాకవి జాషువా ఆధునిక సాహిత్యచరిత్రలో ఎడంగా ఉండిపోయారు. ఫార్ములాకు లొంగని ప్రత్యేకతలను అర్థం చేసుకునే ఉద్దేశ్యం కానీ, శక్తి కానీ లేకపోవడం వల్ల అనేక ప్రాంతీయ, స్థానిక, సామాజిక సాహిత్యాలు ‘ప్రధాన స్రవంతి’కి వెలుపల మిగిలిపోయాయి. అస్తిత్వ చైతన్యాలు వేసిన ప్రశ్నలు, గత చరిత్రను తిరిగి అవలోకించడానికి, పక్కన ఉండిపోయిన వాటి గుణగణాలను అన్వేషించడానికి దోహదం చేశాయి. ఈ అన్వేషణలో సకల అస్తిత్వాలు కనుగొన్న విస్మ­ృత రత్నాలు అనేకం. పొట్లపల్లి కూడా అటువంటి ఆవిష్కరణే. ‘విత్తనాలు/ మొలక/లెత్తబోకండి/ నదులార! మీరింక/ కదిలేరు సుమ్మి/ సాగరా! నీవింక/ స్తంభించి పొమ్ము/ గాలిదేవ! నీవు/ కదిలేవు తండ్రి/ ….. చూదాము: ఈ ప్రభువులేమేలుతారొ!/ చూదాము: ఏ ప్రజలు పన్నులిస్తారొ! – అని డెబ్భయ్యేళ్ల కిందటే రాసిన కవి తెలుగుసాహిత్యపీఠాలకు అపరిచితంగా ఉండడం ఒక ఆశ్చర్యమే. ‘మాదిగ వాళ్లు వెట్టిచేయడానికే పుట్టినట్లు, తెల్లవారక ముందే వెట్టివాణ్ని కూతలు వేయడం ఆరంభించాడు జవాను’ అని కథ (న్యాయం) ప్రారంభించగలిగిన రచయిత 1945లోనే ఉన్నాడని తెలియకపోవడం మన జ్ఞానానికి లోటే.

పొట్లపల్లి రామారావు రచనలను, అందుబాటులో ఉన్నవాటినీ, అముద్రితాలను- అన్నిటినీ, రెండు సంపుటాలుగా క్రోడీకరించి, వాటన్నిటినీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించే పరిశోధనా గ్రంథంతో కలిపి భూపాల్ ప్రచురించారు. కవిగా, కథకుడిగా, బాలసాహిత్యకారుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన భూపాల్, పొట్లపల్లి రామారావు రచనలను, ఆయన జీవిత సాహిత్యవిశేషాలను నేటి తరం సాహిత్యవిద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. కేవలం చదవడానికే కాదు, రేపటి పరిశోధకులు మరింతగా తవ్వితీయడానికి వీలయిన ముడిసరుకుగా కూడా పొట్లపల్లి సాహిత్యం మన ముందుకు వచ్చింది. భూపాల్ పరిశోధన (పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం- సాహిత్యం) పొట్లపల్లి రామారావు సాహిత్యాన్ని స్థానికత నుంచి, సామాజికత నుంచి నాటి చారిత్రక సందర్భంలో నుంచి అర్థం చేసుకోవడానికి అపారమైన పరిశోధనావకాశాలను ఆవిష్కరించింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి తెలంగాణ పత్రిక ‘హితబోధిని’ని ప్రారంభించి, అనేక వ్యాసరూప, కథారూప రచనలు చేసిన బడారు శ్రీనివాసరావు వలె, వరంగల్లు జిల్లాలో మారుమూల గ్రామంలో ఉంటూ వైజ్ఞానికాసక్తిని, పఠనాసక్తిని పెంపొందించుకుని, పత్రికను నిర్వహించి, విస్త ృతంగా రచనలు చేసిన ఒద్దిరాజు సోదరుల వలె, అదే జిల్లాలోని తాటికాయల గ్రామంలో జీవితాంతం స్థిరనివాసం ఉండి, అద్భుతమైన ఆలోచనలను, భావుకతను ప్రకటించిన పొట్లపల్లి రామారావు కూడా ఒక ద్వీపం వంటివారు. సమాజం నుంచి వారు గ్రహించినదేమీ లేదని కాదు, సమాజంతో వారు సంభాషించలేదనీ కాదు. కానీ, పెద్దగా విద్యావాతావరణం, పఠన వాతావరణం, చర్చలతో విమర్శలతో దోహదం చేయగలిగిన సాటివారు తోటివారు లేని స్థితి- వీటి మధ్యనే వీరు తమ వ్యక్తిత్వాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుకోగలిగారు. ఒక ఉద్యమం అందరినీ తీర్చిదిద్దగలిగే స్థితికి రాకముందే, విడి విడి వ్యక్తులుగా వికసించి ఉద్యమంగా సమీకృతులైనవారు వారు. వారి ఒంటరి తలపోతలను, లోతైన సామాజిక ఆలోచనలను, తాము తమదిగా భావించిన సమాజం పురోభివృద్ధి కోసం చేసిన కృషిని- ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉన్నది.

‘ప్రపంచ వాసనలతో వేరు చేయబడి, అక్కడే ఆ జైలు గోడల మధ్యనే మట్టిపాలయ్యే ఈ దురదృష్ట జీవుల మధ్య తిరుగుతున్నప్పుడు, వాళ్లు చేసిన, ప్రపంచాన్ని అంతగా బాధించిన ఆ మహా నేరమేదో’ తెలుసుకునే ఆసక్తితో పొట్లపల్లి రామారావు తన నిర్బంధకాలంలో తోటి ఖైదీలను పరిశీలించాడు. ఆళ్వారుస్వామి ‘జైలులోపల’ కథలు కూడా అటువంటి పరిశీలన నుంచి వచ్చినవే. నేరం, శిక్ష అన్న ద్వంద్వాన్ని వ్యవస్థను ప్రశ్నించే దృక్పథం నుంచి చూడడం వల్లనే, ఈ ఇద్దరి కథల్లోనూ వ్యవస్థే నేరపూరితమన్న నిర్ధారణ కనిపిస్తుంది. జైలు నుంచి రామారావు పరిశీలన అన్ని నిర్బంధాల మీదకు మళ్లింది. బడి కూడా జైలే అని ఒక కథలో పొట్లపల్లి చర్చిస్తాడు. సొంత అనుభవానికి పరుల అనుభవాలపై సహానుభూతిని జోడించి, ఆ జ్ఞానం నుంచి తాత్వికతలోకి పొట్లపల్లి తరచు ప్రయత్నిస్తారు. పొట్లపల్లిలోని ఆ తాత్విక ధోరణి- నైసర్గిక తాత్వికత అని వేణుగోపాల్ అన్నారు, దార్శనికత అని వరవరరావు అన్నారు- కవిత్వంలో కంటె వచనంలో, ముఖ్యంగా కవిత్వ వచనం ‘చుక్కలు’లో అధికంగా కనిపిస్తుంది. పూర్తి కవిత్వమే అయిన కాలిబాట మాత్రం ఇందుకు మినహాయింపు. సెంటర్, పెరిఫెరీ, మార్జిన్, మెయిన్‌స్ట్రీమ్- వంటి భావనలు ప్రచారంలోకి రాని రోజుల్లోనే రహదారిపై కాలిబాట ప్రాథమ్యాన్ని పొట్లపల్లి ప్రకటించారు.

పొట్లపల్లి కవిత్వ వచనం ‘చుక్కలు’ను భూపాల్ కవిత్వ విభాగంలోనే ప్రచురించారు. నిస్సందేహంగా అనేక ‘చుక్కలు’ గొప్ప కవిత్వపాదాలే. కానీ, కవిత్వానికీ వచనానికీ మధ్యన ఉండే ఒక క్షితిజరేఖ మీదనే పొట్లపల్లి సంచారం. ఆయన వాటిని పూర్తి కవిత్వంగా భావించి ఉంటే, లిమరిక్కులో షట్పదులో మరేదో సూక్ష్మకవితారూపాన్నో ఆశ్రయించి ఉండేవారు, లేదా సృష్టించి ఉండేవారు. చుక్కలు ఒక్కోసారి సూక్తుల వలె, మరో సారి ప్రవచనాల వలె, ఇంకొకసారి అద్భుత భావుక వచనాల వలె కనిపిస్తాయి. కాళోజీ కవిత్వరూపాన్ని, పద్ధతిని అర్థం చేసుకోవాలంటే, నానక్, తుకారామ్, కబీర్‌ల కవిత్వధోర ణిని గుర్తు తెచ్చుకోవలసి ఉంటుందని పి.వి. నరసింహారావు ఒకసారి వ్యాఖ్యానించారు. పొట్లపల్లి అనుసరించిన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి కూడా అటువంటిదేదో దేశీయమూలాన్ని అన్వేషించాలేమో? ‘నా గొడవ’ లాగా, ‘ఆత్మనివేదన’ కూడా ఆత్మాశ్రయమైనది. కాళోజీ, పొట్లపల్లి సమస్త సృజనరూపాలలోనూ ఆ ఆత్మాశ్రయత వ్యక్తమవుతుంది. చుక్కలు ఆ స్వభావానికి సంబంధించిన వ్యక్తీకరణ రూపం.

గ్రంథాలయోద్యమం, తరువాతి ఆంధ్రమహాసభ ఉద్య మం, సమాంతరంగా సాగిన తెలంగాణ ఆధునిక సాహిత్య ప్రస్థానం- వీటి నేపథ్యంలో పొట్లపల్లిని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం భూపాల్‌రెడ్డి పరిశీలనలో పరిమితంగానే సాగింది. తులనాత్మకంగా కాక, పొట్లపల్లి సాహిత్య కృషిని, వ్యక్తిత్వాన్ని నిరపేక్షంగా భూపాల్ చూశారు. అది ఒక లోపమే అయినప్పటికీ, పొట్లపల్లిని సాహిత్య రంగస్థలవేదికమీద ప్రముఖంగా ప్రతిష్ఠించడమే పెద్ద దోహదం అయినప్పుడు, తరువాతి తరం పరిశోధకులకు ఆ బాధ్యతను అప్పగించవచ్చు. అభ్యుదయవాది, కవి, కథకుడు, ప్రపంచ పరిణామాలను నిత్యం ఆసక్తిగా విమర్శనాత్మకంగా గమనించిన ఉత్సుకుడు, ఆలోచనలను నిత్యం ప్రపంచంతో పంచుకోవాలనుకునే వివేకి, ప్రజాకార్యకర్త, వ్యక్తిగా ఉదాత్తుడు, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు, మితభాషి, ఏకాంతంతో కూడా సమ్మర్దాన్ని గ్రహించగలిగేవాడు.. ఇట్లా ఇన్ని విశేషణాలకు, వర్ణనలకు తగిన అపురూపుడు పొట్లపల్లి రామారావు.
పొట్లపల్లి రామారావు సాహిత్యం (కవిత్వం)
పేజీలు: 388 వెల: 250/-
పొట్లపల్లి రామారావు సాహిత్యం (వచనం)
పేజీలు: 374 వెల: 250/-
పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం-సాహిత్యం
రచయిత: భూపాల్
పేజీలు: 380 వెల: 300/-
పొట్లపల్లి ప్రచురణలు
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 040 24652387

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.