‘నా గొడవ’కు నూరేళ్లు!

‘నా గొడవ’కు నూరేళ్లు!

September 09, 2013

  

‘ప్రభుత్వాల మోసాలను ప్రతిభ అనకు/తిరగబడిన ప్రజలపైన విరగబడకు’.. ‘శాంతి భక్షక శాసనాన్ని సౌమ్యమనకు ప్రజామతము గప్పిపుచ్చ పాటుపడకు’ -(కలం గారడీ కైతల వలలల్లకు 1969) అని సాటి కవులను హెచ్చరించినా కాళోజిలోని ప్రజాస్వామిక చైతన్యమే అందుకు కారణం. ప్రజాస్వామిక చేతన మేల్కొన్న కవి సంస్కారి, సాహసి అవటం సహజం. ప్రజాకవికి ధిక్కా రం, దానినుండి జనించిన ధీమా అలంకారాలవుతాయి.

ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం, అసలైన సారంతో సమాజాన్ని మును ముందుకు నడిపించే సమసూత్రంగా అది ఆచరణ వాస్తవం కావాలన్న తపన- ఇవే కాళోజి జీవితాన్ని, కవిత్వాన్ని కడవరకు చైతన్యవంతంగా నిలిపాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పాలకుల ప్రవర్తానారీతి, ప్రజాస్వామ్యం మనుగడకు ముప్పు తెస్తున్న ఓటర్ల చైతన్య రాహిత్యం నిరంతరం అశాంతికి గురిచేస్తుంటే నిరసిస్తూ వచ్చాడు జీవితంలోనూ, కవిత్వంలోనూ కూడా.
ప్రజాస్వామ్యం కన్నా ఉన్నతమైంది ప్రజాస్వామిక చైతన్యం. ప్రజాస్వామ్యం ఒక నిర్మాణమైతే ప్రజాస్వామిక చైతన్యం ఒక విలువ. జీవితాన్నంతా ఆవరించి జీవిత గమనంలో భాగమై మానవ సంబంధాలను సౌందర్య భరితం చేస్తుంది. ఆ జీవన సౌందర్యం కోసమైన అన్వేషణ కాళోజి జీవితం, కవిత్వం.

ప్రజాస్వామిక దృక్పథం అంటే సమానత్వ సూత్రాన్ని ఆమోదించటం. సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, అవకాశాలలో సమానత్వం, అనుభవంలో సమానత్వం. వ్యక్తులుగా మనుషుల మధ్య ఎక్కువ తక్కువలకు తావు లేని సమానత్వం. సమానత్వం సాధించవలసిన ఆదర్శం. అందుకు ఆటంకాలు చాలా వున్నాయని కాళోజికి తెలుసు. అందువల్ల జరుగుతున్న అన్యాయాన్ని అందరూ కలిసి ఎదిరించాలంటాడు (కాళోజీ నా గొడవ, కాళోజీ కథలు, డిసెంబరు 2000, పు.13) ఎదిరించటానికే తన జీవితాన్ని, కవిత్వాన్ని అంకితం చేశాడు.

‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’ (విన్నావా? వెంగళ్రావ్, 1975) అని చెప్పగలిగాడంటే అది తన అస్తిగతమైన ప్రజాస్వామిక దృక్పథం వల్లనే.
హక్కుల ఉల్లంఘనను అత్యంత ప్రధానమైన అన్యాయంగా గుర్తించాడు కాళోజి. సమానత్వ సూత్రాన్ని సామాజిక వాస్తవంగా మార్చటానికి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు లభించినవి ఆ హక్కులు. జీవించే హక్కు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు, అభిప్రాయాలు ఏర్పరచుకొనే హక్కు, వ్యక్తీకరించే హక్కు, నమ్మిన దానికోసం పనిచేసే హక్కు అందరికీ సమానమే. హక్కుల అమలుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘనకు తరచు ఒడిగట్టటాన్ని కాళోజి గుర్తించాడు. 1940లలో నిజాం ప్రభుత్వ పాలనా కాలం నుండి స్వాతంత్య్రానంతర భారత ప్రభుత్వ పాలనలోనూ జరుగుతూ వస్తున్న హక్కుల ఉల్లంఘనను ఎప్పటికప్పుడు నిరసిస్తూ వచ్చాడు కాళోజి. ఆ విషయంలో అతడే ఒక ఉద్యమమైనాడు.

ప్రజాస్వామ్యమంటే ‘హక్కులు కాపాడు కోట’ అని 1963లో చెప్పాడు కాళోజి. ‘పౌరుల హక్కుల రక్షణ / ఏమరక చేతమనచు / ఏ వ్యక్తికి అన్యాయము / జరగకుండ జూతు మనుచు / వ్యక్తికి వ్యక్తికి నడుమ / తేడా పాటించ మనుచు / పుట్టుక పడికట్ల తోడ / తచ్చుహెచ్చు తూచమనుచు / చదువుల పదవుల తెరవులు / మూయబడవు ఎవరి కనుచు’ -జనవరి 26 నాడు అమలులోకి వచ్చిన సార్వభౌమ గణ రాజ్యపు వాగ్దానాలను 1967లో పునశ్చరణ చేశాడు. ఆ మధ్య కాలంలోనే హక్కులు దిక్కు లేకుండా పోయాయని, వాగ్దానాలు వమ్ము అయినాయని గుర్తించి నిరసించాడు.

‘నీవు, నేను, వాడు నలుబది నాలుగుకోట్లు/నీవు, నేను, వాడు
ఉంటేనే లోక్‌సభ/నీవు, నేను వాడు ఉంటేనే భరతమాత
అందరి కందరు పౌరులు అన్ని హక్కులందరినీ’ అని ప్రభుత్వానికి గుర్తుచేశాడు. పంచవర్ష ప్రణాళికలు, పాలన పాలకులకు, పాలితులకు మధ్య దూరం పెంచాయని పాలకులకు హాయిని, పాలితులకు అవస్థలను పంచాయని అభిశంసించాడు (భువనేశ్వర తీర్మానం 1964). ‘ప్రజాస్వామ్యమ్ముసుగు జారి/నిరంకుశము పడగ’ విప్పిన వాస్తవాన్ని 1966 నాటికే గుర్తించి చెప్పాడు (పరాభవ శరత్తు). అవసరాల నిర్లక్ష్యానికి, హక్కుల ఉల్లంఘనకు, అవకాశాల మూసివేతకు ప్రభుత్వం దిగినప్పుడు గౌరవంగా జీవించే పరిస్థితులు మృగ్యమైనప్పుడు ‘బ్రతుకనదగు బ్రతుకు/బ్రతక దలచినట్టి మనిషి బ్రతుకు/ తిరుగుబాటు’ (మార్చ్ఆన్ 1968) అవుతుందని ప్రకటించాడు.

‘ఓసీ ప్రభుత్వమా! / దోపిడి వర్గాల నువ్వు అదుపులో పెట్టజాలనప్పుడు/పీడిత వర్గాల నేను తిరుగబడమంటే తప్పా’ అని ధిక్కారంతో ప్రశ్నించటమే కాదు, ‘నువ్వు చేస్తున్నది/హిరణ్య కశ్యపుని అధికృత హింస’ అని ప్రభుత్వాన్ని దోషిని చేసి బోనెక్కించిన అక్షరాధికారి (తిరగబడమంటే తప్పా, 1971) కాళోజి. ‘మేటి బలగాల అధికృత హింస బాప/కోటి చేతులు ప్రతిహింస బూనవలయు’ (విప్లవ వహ్ని 1973) అని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా భాగవతంలోని ప్రహ్లాద కథను రాజకీయ వ్యాఖ్యానమిచ్చి విస్తృతంగా ప్రచారం చేశాడు. హిరణ్య కశ్యపుడి శక్తికి భయపడి మూడు లోకాలు లొంగినా ఎదురు నిలిచిన ప్రహ్లాదుడిని ఆత్మగౌరవ స్థాయికి, నిర్భయతకు, స్వాభిమానానికి, పౌరుని మూలశక్తి పాటవానికి ప్రతినిధిగా నిరూపించి ఆదర్శ నమూనాగా నిలబెట్టాడు. ‘మానవుని జన్మహక్కు మర్యాదను కాపాడగ/ప్రతిహింసను చేపట్టిన ప్రతి నరుడొక నరసింహుడు’ (జన్మహక్కు మర్యాదను కాపాడగ… 1974) అని తీర్పు ఇచ్చాడు.

‘ప్రతి వారికి వ్యక్తిత్వం ఉంటేనే పౌరత్వం
వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే వ్యక్తి బ్రతుకు
వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే జాతి బ్రతుకు’ (భువనేశ్వర తీర్మానం) అన్న విశ్వాసం కాళోజీది.
ఆలోచన నుండి అభిప్రాయాలు రూపొందుతాయి. వ్యక్తుల నేపథ్యాలు, దృక్పథాలు, అవసరాలు, ప్రయోజనాలు, విలువలు వంటివి అభిప్రాయాలలో భిన్నత్వానికి కారణమవుతాయి. అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. అభిప్రాయాలు చెప్పటానికి, అభిప్రాయాలతో విభేదించటానికి రాజ్యంలో, సామాజిక జీవితంలో సంపూర్ణ అవకాశం వుండాలి. ఆ అవకాశమియ్యని రాజ్యాన్ని, సంస్థలను కూడా కాళోజి విమర్శిస్తాడు. నిరసిస్తాడు. ‘తనతో సమ్మతి తెలుపని కాడికె/తల దీయించుటది సభ్యత, సఖుడా’ అని రాజ్యంపై ప్రశ్నను సంధించాడు (శాంతిగ మెలగుట మంచిదె కాని…). ‘ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అంటేనే ఎమర్జెన్సీ’ అని నిర్వచించి (ఇంతకన్న చావు నయం 1975) ఆ సిద్ధాంతాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ఖండిస్తూనే వున్నాడు. ‘నూరు భావాలు ఘర్షించనీ, వేయి పూలు వికసించనీ’ అన్న జీవిత పురోగమన సూత్రం ఆయనను జీవితమంతా నడిపించింది. ఆ ప్రజాస్వామిక దృక్పథం ఆయన కవిత్వానికి పరిమళమద్దింది.

కులం రీత్యా ఒకళ్ళు ఎక్కువ తక్కువగా వుండటాన్ని కూడా కాళోజి సహించలేకపోయాడు. మనిషిలోని కుళ్ళు మారు రూపాలలో ‘కులం’ ఒకటని పేర్కొన్నాడు (మారు రూపాలు 1951). స్త్రీ పురుషులు కలిసి ఆలుమగలుగా జీవించటానికి ‘మను శాస్త్రాల అనుమతెందుకు? కుల గోత్రాల ప్రసక్తెందుకు’ అని తిరస్కరించి పారేశాడు (బ్రతుకు సూత్రం). అంతకంటే ముందుగానే వర్ణ అసమానతలను, చచ్చినా వదలని వర్ణ ద్వేషాలను వస్తువుగా చేసి ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’ (1943) అనే కథ వ్రాశాడు కాళోజి. యమపాశానికి చిక్కి తీసుకుపోబడుతున్న ఇద్దరు జీవుల సంభాషణగా సాగిన ఈ కథ భూలోక స్వర్గమను భారతదేశానికి, అందులోనూ నిజాం రాష్ట్రంలోని తెలంగానాకు చెందిన, తెలుగు మాట్లాడుకొనే వారిగా ఇద్దరి మధ్య సమకూడిన స్నేహం, ఐక్యత వాళ్ల వాళ్ల కులాలు తెలియగానే ఘర్షణగా మారిన తీరును చిత్రించింది.

ఆ ఇద్దరిలో ఒకడు అస్పృశ్యుడు, ఒకడు బ్రాహ్మణుడు. హరిజన దేవాలయ ప్రవేశ ఉద్యమ సందర్భంగా భూలోకంలో ఘర్షణ పడిన రెండు వర్గాలకు ప్రతినిధులు. దేవాలయ ప్రవేశ ప్రయత్నాన్ని దౌర్జన్యంగా అడ్డుకోజూచిన సవర్ణ హిందువుల ప్రవర్తన ప్రపంచంలో దయ అనేది లేదన్న సత్యాన్ని బోధ పరిచింది అస్పృశ్యుడికి. అస్పృశ్యుల దేవాలయ ప్రవేశ ప్రయత్నం ప్రపంచంలో ధర్మం నశించిపోవటంగా తోచింది బ్రాహ్మడికి. దయలేని ప్రపంచంపైకి అస్పృశ్యుడు, ధర్మోద్ధరణకు బ్రాహ్మణుడు ఆయుధాలు పట్టి యుద్ధానికి దిగి మరణించి యమలోక ప్రయాణ మార్గంలో మాట కలుపుకొన్నారు. కులం తెలిసిన మరుక్షణం కయ్యానికి దిగారు. కష్టమన్నది తెలిసిన మరుక్షణం కయ్యానికి దిగారు. కష్టమన్నది తెలియక రోజూ మూడు పూటలూ తమను అన్యాయంగా దోచుకు తిని బలిసిన బ్రాహ్మణవర్గంపై కసి అస్పృశ్యుడిది. చట్రాలను అధిగమించి, అధికారాన్ని తిరస్కరించి మేమూ మీతో సమానమేనన్న అస్పృశ్యుడి పట్ల ద్వేషం బ్రాహ్మడిది. బ్రాహ్మడు అస్పృశ్యుడై పుట్టి జీవిస్తే తప్ప వారి ఆర్తి, ఆత్మగౌరవ ఆకాంక్ష అర్థం కావు. అందుకనే యముడు బ్రాహ్మడిని అగ్నిగుండంలో పదిరోజులు శుద్ధి కార్యక్రమం పెట్టి ఆ తరువాత కొచ్చిన్‌లోని ఒక పరయా (మాదిగ) కుటుంబంలో పడెయ్యమని భటులకు ఆదేశించాడు. అప్పుడే ధర్మం తెలుస్తుంది కూడాను అన్నాడు.

పేదలు కావటం వలన కొందరు, కులం రీత్యా కొందరు సమాజంలో తక్కువగా చూడబడుతున్న తీరు గురించిన గ్రహింపు, అవగాహన వున్నంత స్పష్టంగా స్త్రీలు కావటం వలన మరికొందరు తక్కువగా చూడబడటం గురించిన స్పృహ కాళోజిలో కనబడదు. అయినా పురుషాధికారం క్రింద స్త్రీలు అణచివేతకు గురవుతున్నారన్న భావం కాళోజి సాహిత్యంలో రెండు చోట్ల కనబడుతుంది. మొదటిది కవితా సందర్భం. ‘ద్వైత జగత్తు’ కవితలో ‘శాస్త్రకార్లు శాసనకర్తలు/జనులకు తాళీ కట్టని భర్తలు’ అంటాడు. శాస్త్రకార్లు, శాసనకర్తలు జీవితాన్ని ఒక చట్రంలో బిగించి నియంత్రించేవాళ్లు. ప్రజలకు తాళి కట్టని భర్తలు అన్న పోలికతో వాళ్ల గురించి చెప్పాడు కాళోజి. ఆడదాని మెళ్లో తాళి కట్టిన వాళ్లంతా శాసనకర్తల వంటి వారేనన్నది ఆయన అవగాహన. తాళి కట్టటం ద్వారా స్త్రీ జీవితం మీద భర్త అధికారి అవుతాడు. సామాజిక జీవితాన్ని నియంత్రించే శాసనకర్తలను తాళి కట్టని భర్తలతో పోల్చటం ద్వారా కాళోజి భార్యల అధీనతను, అసమస్థానాన్ని గుర్తించినట్లే అయింది.

రెండవది కథా సందర్భం. ఎన్నికల గురించి వ్రాసిన సశేష రచన ‘ఎన్నిక కథ’ పార్లమెంటరీ రాజకీయాల పట్ల కాళోజి ఆశాభంగాన్ని వ్యక్తీకరించేదే కావచ్చు, (వరవరరావు, కాళోజి కథలు, పు.5) కానీ అదే సమయంలో అది స్త్రీల నిర్ణయాధికారానికి వున్న పరిమితుల వైపు కూడా మన దృష్టిని మళ్లిస్తుంది. ఒక రాజు కూతురికి స్వయంవరం ఏర్పాటయింది. స్వయంవరానికి హాజరైన అభ్యర్థుల యోగ్యతలన్నీ తెలిసాయి. వారిలో తనకు నచ్చినవాడిని భర్తగా ఆమె ఎన్నుకోవాలి. ఆ సమయంలో అన్నగారు ప్రత్యక్షమై ఆమె చెవిలో ఫలానాచోట కూర్చున్న ఫలానా అభ్యర్థి మెడలో పూలమాల వేయమనీ, లేకపోతే ఆమెతో ఇక తెగతెంపులేనని చెప్పాడు- స్వయం నిర్ణయాధికారమా, అన్నగారి ఆజ్ఞా ఏ తోవన పోవాలన్న దశలో ఆమె నిలువునా స్తంభించిపోయిందంటాడు కాళోజి. స్వయంవరంలో వున్న ఎంపిక చేసుకొనే స్వేచ్ఛను స్త్రీకి కుటుంబ పెత్తనం ఎలా నిరాకరిస్తుందో ఎన్నికల సంద ర్భం నుండి తనకు తెలియకుండానే గుర్తించి చెప్పినట్లయింది.

‘పౌరసత్వాలకై నోరెత్తలేక’.. ‘అనదలౌ మానవుల అండగా’ వుండాలని కలం పట్టినా (కలం కత్తి 1951) ‘ప్రభుత్వాల మోసాలను ప్రతిభ అనకు/తిరగబడిన ప్రజలపైన విరగబడకు’.. ‘శాంతి భక్షక శాసనాన్ని సౌమ్యమనకు ప్రజామతము గప్పిపుచ్చ పాటుపడకు’ -(కలం గారడీ కైతల వలలల్లకు 1969) అని సాటి కవులను హెచ్చరించినా కాళోజిలోని ప్రజాస్వామిక చైతన్యమే అందుకు కారణం. ప్రజాస్వామిక చేతన మేల్కొన్న కవి సంస్కారి, సాహసి అవటం సహజం. ప్రజాకవికి ధిక్కా రం, దానినుండి జనించిన ధీమా అలంకారాలవుతాయి. జాతిని కాపాడుటకు (1975) అనే కవితలో ఆ రకమైన కాళోజి కళ్లకు కడతాడు. ఎమర్జెన్సీలో వెంగళరావు ఇందిరా భక్తిపై వ్యంగ్యంగా వ్రాసిన కవిత ఇది.

ఎమర్జన్సీ అణచివేతను ప్రస్తావిస్తూ ‘పట్టెయ్యి కాళోజిని/మెడకొట్టెయ్యి కాళోజీది/నా గొడవ సాగకుండా/చేసెయ్యివెంగళ్రావ్’ అని సవాల్ చేసి, కాసిం రజ్వీ నీ వలె ఎగిరిండని పోలిక చెప్పి, ఎగిరినోళ్ల పతన చరిత్రను గుర్తుచేసి ప్రజల గొడవ పట్టించుకొనేవాళ్లే చరిత్రలో నిలుస్తారని సూచించాడు.

‘నా మాటుంటది/ఈనాడు కాకున్న/నువ్వు లేని నాడు
నా మాట నిలిచి ఉంటది/బ్రతికి ఉన్న ప్రజ వింటది..’ అని ధీమా గా ప్రకటించిన కాళోజి మరణించినా శోషితుల కోసం, అనాధల కోసం అతనెత్తిన ధిక్కార స్వరం- శోషణ అంతమయ్యే వరకు, అనాధలంతా, అశాంతులంతా నూతన ప్రజాస్వామ్యాన్ని ఆవాహన చేసే పర్యంతం – తెలుగు నేలను ఆకాశాన్ని ఏకం చేస్తూ ప్రతిధ్వనిస్తూనే వుంటుంది.

– కాత్యాయని విద్మహే
(నేడు కాళోజీ 99వ జయంతి.
శత జయంతి ఉత్సవాల ప్రారంభం)

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.