దక్షిణాది ఉద్యమాలూ, జాతీయ పార్టీలూ (ఇండియా గేట్) – ఎ.కృష్ణారావు
September 11, 2013
దక్షిణాదిలో ఉద్యమాలకు, ప్రజల మనోభావాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యేకమైన సానుభూతి ఉండే అవకాశాలు లేవు… ప్రజలను అభద్రతకు గురిచేయడం ద్వారా తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం, వారి జీవితాలతో చెలగాటమాడడం రాజకీయ పార్టీలకు కొత్త కాదు. చరిత్ర నిర్మాతలు ప్రజలు కానంతవరకూ ప్రభుత్వాలు, పార్టీలు ఉద్యమాలను అపహాస్యం చేస్తుంటాయి.
వర్తమానంలో జరిగే అన్ని ఘటనలూ చరిత్రను నిర్దేశించలేవు. ఏ రోజుకారోజు ఘటనలను చూసి నిర్ణయాలు తీసుకునేవారు, అభిప్రాయాలు ఏర్పర్చుకునేవారు జరిగిన చరిత్రనూ, జరగబోయే చరిత్రనూ అర్థం చేసుకోనట్లే లెక్క. చరిత్రలో ఎన్నో ఉద్యమాలూ, భావోద్వేగ సంఘటనలూ, అల్లర్లూ, హింసాకాండలూ కాలగతిలో కలిసిపోయాయి. చరిత్రలో అవి కేవలం ఘటనలే కానీ, చారిత్రక క్రమాన్ని నిర్దేశించినవి కావు. ఇవాళ గాలి స్తంభించినంత మాత్రాన రేపు చల్లగాలి వీయదని అంచనా వేయలేము.
1980వ దశకంలో బీజేపీ సీనియర్ నేత అడ్వానీ రథ యాత్ర సందర్భంగా దేశంలో రేగిన మతపరమైన భావోద్వేగాల ఆధారంగా భారత దేశం హిందూ రాజ్యంగా ఏర్పడుతుందని ఎవరైనా భావించి ఉంటే తమది చారిత్రకంగా తప్పుడు అంచనా అని తర్వాతి కాలంలో గ్రహించే ఉంటారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో చెలరేగిన అస్తిత్వ, కుల పోరాటాలు దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చి ఉండవచ్చు కానీ ఈ పోరాటాల స్వభావం కూడా పూర్తిగా పలచనైపోయి, దేశ రాజకీయ వ్యవస్థతో సర్దుబాటుచేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని జరిగిన పరిణామాలను బట్టి గ్రహించవచ్చు.
1950వ దశకంలో తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) బలమైన ప్రాంతీయ, కుల ప్రాతిపదికపైనే కాక, వేర్పాటు భావాల ఆధారంగా ఏర్పడింది. ఒక చరిత్రకారుడి అంచనా ప్రకారం అది స్వాతంత్య్ర పూర్వం జరిగిన రెండు ఉద్యమాల కలయిక. ఒకటి- బ్రాహ్మణేతర ఉద్యమంగా ఉద్భవించి, తర్వాతి కాలంలో బ్రిటిష్ అనుకూల జస్టిస్ పార్టీగా ఏర్పడింది.
రెండవది, ఇ.వి. రామస్వామి నాయకర్ నాయకత్వంలోని బలమైన కుల వ్యతిరేక, మత వ్యతిరేక సంస్కరణ వాద ఉద్యమం. మొదట్లో బ్రాహ్మణ వ్యతిరేక, ఉత్తరాది వ్యతిరేక, హిందీ వ్యతిరేక పార్టీగా ఉన్న డీఎంకే స్వభావం తర్వాతి కాలంలో ఈ స్వభావాలను క్రమంగా వదుల్చుకుంటూ వచ్చింది. 1954లో బ్రాహ్మణేతరుడైన కామరాజ్, చక్రవర్తి రాజగోపాలాచారి స్థానంలో ప్రాబల్యం సంపాదించి ముఖ్యమంత్రిగా మారిన తర్వాత డీఎంకేలో కాంగ్రెస్ వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక స్వభావమూ సడలింది. హిందీ వ్యతిరేకత, తమిళ భాషా సంస్కృతుల పట్ల గౌరవానికే ఆ పార్టీ పరిమితమైంది. ఇక పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత డీఎంకే వేర్పాటు వాద స్వభావాన్నీ పోగొట్టుకుంది. భారత- చైనా యుద్ధంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించింది. 1962లో 16వ రాజ్యాంగ సవ రణలో వేర్పాటు వాదాన్ని నేరమని నిర్దేశించారు. పార్లమెంట్‌కు పోటీ చేసే ప్రతి అభ్యర్థీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, దేశ సర్వ సమగ్రతను, సార్వభౌమికతను కాపాడతానని ప్రమాణం చేయడాన్ని తప్పనిసరి చేశారు. దీనితో డీఎంకే వెంటనే తన పార్టీ రాజ్యాంగాన్ని మార్చి వేర్పాటు డిమాండ్‌ను తొలగించింది.
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, మరింత స్వతంత్ర ప్రతిపత్తి, మరిన్ని ఆర్థిక వనరుల కేటాయింపు వంటి డిమాండ్లకు పరిమితమైంది. ఏ ఒక్క వర్గానికో కాక, అది తమిళులందరి పార్టీగా మారిపోయింది. 1969లో డీఎంకే తరఫున ముఖ్యమంత్రి అయిన కరుణానిధి మద్దతునీయబట్టే సిండికేట్‌ను ఎదిరించి ఇందిరాగాంధీ తన మైనారిటీ సర్కార్‌ను నిలబెట్టుకోగలిగారు. తర్వాతి కాలంలో డీఎంకేలో చీలిక ఏర్పడి అన్నాడీఎంకే ఏర్పడింది. ఈ రెండు పార్టీలు తమ పునాదులను మరిచిపోయి రకరకాల జాతీయ పార్టీలతో పొత్తులు ఏర్పర్చుకున్నాయి. 1965లో ఉధృతంగా సాగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో వందమందికి పైగా మరణించారు. దాదాపు మూడు నెలల పాటు విధ్వంసకాండ, లూటీలు, పోలీసు కాల్పులు జరిగాయి.
వేలాది ప్రజలు అరెస్టయ్యారు. విద్యార్థుల ఉద్యమం పెల్లుబుకింది. కానీ హిందీ వ్యతిరేకతకు సంబంధించి తమిళనాడులో ఇదే చివరి ఉద్యమం అయింది. ‘మీరు కోరుకున్నంతవరకూ ఇంగ్లీషే అధికార భాషగా ఉంటుంది’ అని నాటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చి ఉద్యమాన్ని చల్చార్చారు కానీ ఉత్తరాది ఆధిపత్యం ఏ మాత్రం తగ్గలేదు. ఏ ఉద్యమానికైనా కొంత కాలం తర్వాత అలసట అనేది ఉంటుంది. ఈ ఉద్యమ అలసట తమిళనాడులో 1965 తర్వాత పూర్తిగా ఆవరించింది. శ్రీలంకలో తమిళుల ఊచకోత తీవ్రస్థాయిలో జరిగిన తర్వాత, భారత ప్రభుత్వం ఈ ఊచకోతకు పూర్తిగా అండగా నిలిచిన తర్వాత కూడా తమిళనాడులో జాతీయ విధానాల పట్ల ప్రజలు ఉవ్వెత్తున నిరసన తెలపకుండా రెండు పార్టీలు నిరోధక శక్తుల్లా ఆ తీవ్రతను తమలో ఇముడ్చుకున్నాయి. రాజీవ్ గాంధీ హత్యకు డీఎంకేను నిందించిన కాంగ్రెస్ పార్టీ తర్వాత ఆ పార్టీని ఆలింగనం చేసుకోవడం కేవలం రాజకీయ అవసరం కానే కాదు.. తమిళనాడులో ఏ పార్టీని జాతీయ పార్టీలు వాటి మానాన వాటిని వదిలివేయకపోవడం తమ పట్టును వాటిపై సడలించడం తమ ఉనికికే ప్రమాదమని గ్రహించడం కూడా.
ఇక రాష్ట్రానికి సంబంధించి మూడు సార్లు ప్రత్యేక ఉద్యమాలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వేర్వేరుగా స్పందించింది. 1969లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగినప్పటికీ, నెలల తరబడి ప్రజా జీవనం స్తంభించినప్పటికీ కాంగ్రెస్ చెక్కు చెదరకుండా వ్యవహరించింది. ఇందుకు కారణం అప్పటివరకూ రాష్ట్రంలోనూ, ఢిల్లీలోనూ కాంగ్రెస్‌కు తిరుగులేకుండా ఉండడం, తిరుగుబాటు చేసిన శక్తులు కూడా ఢిల్లీకి దాసోహం కావడం. ఉద్యమం ఉవ్వెత్తున పైకి లేచి పడిపోతుంటే కేంద్రం చోద్యం చూస్తున్నట్లు చూసింది. కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే జాతీయ పార్టీల వైఖరి మారింది. మొదట కేంద్రం అప్రజాస్వామికంగా తెలుగుదేశం సర్కార్‌ను కాలరాయాలని ప్రయత్నించి అందుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పెల్లుబుకడంతో దిగివచ్చి తన వైఖరిని మార్చుకుంది. తెలుగుదేశంను దెబ్బతీసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడం కాంగ్రెస్‌కు సానుకూల పరిణామమే. అందుకే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలం పుంజుకోవడంలో కాంగ్రెస్ హస్తం ఉంది, సహకారం ఉంది, ప్రయోజనం కూడా ఉందని ఎవరైనా విశ్లేషిస్తే పూర్తిగా కాదని చెప్పలేం.
జగన్ సారథ్యంలో మరో పార్టీ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఆలోచనాధోరణి మరింత మారిపోయిందని, ఎలాగూ ఒక ప్రాంతం విభజన కోరుతున్నందువల్ల విభజించి పాలించడం ద్వారా ప్రయోజనం ఉన్నదని కాంగ్రెస్ అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాడు ఇందిర, ఉద్యమాలు ఎంత తీవ్రంగా నడిచినా విస్మరించారని, నేడు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని అత్తాకోడళ్ల విధానాల వ్యత్యాసాలను ఎత్తిచూపడం శాస్త్రీయ విమర్శ కాదు. ఇది ఇందిరాగాంధీ హయాంలో బ్యాంకుల జాతీయాకరణ చేసినందువల్ల ఇప్పుడు సోనియాగాంధీ కూడా అవే విధానాలను ఆమోదించాలన్నట్లే ఉంటుంది. తన ప్రయోజనం దెబ్బతిననంతవరకూ కేంద్రం రాష్ట్రాల్లో ప్రజలు ఎన్ని నెలలు వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేసినా పట్టించుకోదు. అది గూర్ఖాలాండ్ ప్రజల పోరాటంలా అరణ్య రోదనగానే మిగిలిపోతుంది.
తన హయాంలో గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయని బీజేపీ తన పార్టీ ఎంపీ జస్వంత్ సింగ్‌ను గెలిపించేందుకు అక్కడి ఉద్యమాన్ని ఉపయోగించుకుంది. తన తండ్రి నెహ్రూ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాకచక్యంగా పావులు కదిపిన ఇందిరాగాంధీ కానీ, రాష్ట్ర విభజనకు సంబంధించి ఇందిర చర్యలకు భిన్నంగా విభజనకు ఆమోద ముద్ర వేసిన సోనియాగాంధీ కానీ రాజకీయ ప్రయోజనాలకు భిన్నంగా ఆలోచించలేరు. పైగా ఇప్పుడు సంకీర్ణప్రభుత్వాల యుగంలో ఈ రాజకీయ ప్రయోజనాలు మరింత సంకుచితంగా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా దక్షిణాదిలో ఉద్యమాలకు, ప్రజల మనోభావాలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ప్రత్యేకమైన సానుభూతి ఉండే అవకాశాలు లేవు. ఈ ఉద్యమాలకు సంబంధించి జాతీయ పార్టీల కొలమానాలు వేరు. తమ కాళ్ల క్రిందకు నీరు రానంతవరకూ, స్థానిక నేతలు తమ చుట్టూ తిరుగుతున్నంతవరకూ ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో జరిగినా, ఎన్ని రోజులు జరిగినా ఈ పార్టీలు పెద్దగా పట్టించుకోవు. అది తమిళనాడు అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా వారికొక్కటే. తెలంగాణలో నేతల ఘెరావోలు జరుగుతున్నా, మానవహారాలు, సమ్మెలు జరుగుతున్నా, ఢిల్లీకి ఆ ప్రాంత నేతలు క్యూలు కట్టినా కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరించి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తన నిర్ణయాన్ని పట్టించుకుంది. ముఖ్యమంత్రితో సహా నేతలు ఎంత చెప్పినా సీమాంధ్రలో తమకు పెద్దగా సీట్లు రావని భావించడం ఇందుకు ప్రధాన కారణం. సీమాంధ్రలో ప్రజల భావోద్వేగాలను పంచుకునేందుకు స్థానిక పార్టీలు పెద్ద ఎత్తున సమాయత్తం కావడానికి కాంగ్రెస్ నిర్ణయం దోహదం చేసింది. ఈ బరిలో నేరుగా ప్రవేశించే ధైర్యం లేకపోయినా ప్రచ్ఛన్న రూపంలో ప్రవేశించే అవకాశాలు కాంగ్రెస్ వదులుకుంటుందని అనుకోలేం.
అన్నిటికన్నా ముఖ్యంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సర్కార్‌పై ఉన్న అవినీతి ఆరోపణలు, కుంభకోణాలూ, రూపాయి విలువ పడిపోవడం, ధరలు పెరగడం ప్రభావం చూపకుండా ఉద్యమాలు దోహదం చేయడం ఆ పార్టీకి సంతోషించే పరిణామమే. ‘మాకు ప్రతి రాష్ట్రానికో వ్యూహం ఉంది.. యూపీఏ ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, క్షేత్ర స్థాయిలో వాటి ప్రభావం లేకుండా చూసుకోగలం..’ అని ఒక కాంగ్రెస్ నేత కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలను ఉటంకిస్తూ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను అభద్రతకు గురిచేయడం ద్వారా తమ పబ్బం గడుపుకోవడం, వారి జీవితాలతో చెలగాటమాడడం పార్టీలకు కొత్త కాదు. చరిత్ర నిర్మాతలు ప్రజలు కానంతవరకూ ప్రభుత్వాలు, పార్టీలు ఉద్యమాలను అపహాస్యం చేస్తుంటాయి.
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)