కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి

కవర్‌స్టోరీ : ఓ 20 భాషలు హుష్ కాకి

– సివిఎల్ఎన్ ప్రసాద్

మన దేశంలో ఎన్ని భాషలున్నాయో తెలుసా?తెలుగు, హిందీ, తమిళం, మలయాళం.మీరు ఎంత జాగ్రత్తగా లెక్కపెట్టినా 20 నుంచి 30 భాషలే వస్తాయి.మరి మిగిలినవెన్నున్నాయి? మరో యాభై,వంద,మీ లెక్క తప్పు.మన దేశంలో 780 భాషలున్నాయి.అమ్మో! అన్ని భాషలే.అని ఆశ్చర్యపోయే ముందు మీకు ఇంకో నిజం కూడా చెప్పాలి. వీటిలో చాలా భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి.ఎక్కడి దాకానో ఎందుకు.. మన ఆంధ్రప్రదేశ్‌లో గత 50 ఏళ్లలో 20 భాషలు అంతరించిపోయాయి. అసలీ భాషలను ఎవరు లెక్కపెట్టారు? ఎలా లెక్కపెట్టారు? ఎందుకు లెక్కపెట్టారనే ప్రశ్నలు వేసుకుంటే అనేక ఆసక్తికరమైన సమాధానాలు తెలుస్తాయి.

ఒక సమూహ సంస్కృతిని ప్రజలు మాట్లాడే భాష ప్రతిబింబిస్తుంది. మనం మాట్లాడే ప్రతి పదం వెనక- మన పూర్వీకుల తాలుకు ఆనవాళ్లు ఉంటాయి. చరిత్ర ఉంటుంది. ఆ పదాలను పరిశీలిస్తే సమాజంలో బయటకు కనిపించని అనేక కోణాలు బయటపడతాయి. ఒక భాష అంతరిస్తే దానిని మాట్లాడే సమూహం అస్థిత్వం కోల్పోయినట్లే. అందుకే అందరూ తమ భాష సజీవంగా ఉండాలని కోరుకుంటారు. కాని దురదృష్టమేమిటంటే- మన దేశంలో ఎన్ని భాషలున్నాయో తెలియజేసే అధ్యయనాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. 1898లో బ్రిటిష్ వారు మనను పరిపాలిస్తున్నప్పుడు ఐర్లండ్‌కు చెందిన జార్జి అబ్రహాం గ్రియర్‌సన్- దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసుకోవటానికి ఒక అధ్యయనం చేశాడు.

మూడేళ్ల పాటు దేశమంతా పర్యటించి- భారత ఉపఖండంలో 179 భాషలు ఉన్నాయని తేల్చాడు. ఆ తర్వాత ఎవ్వరూ భాష గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయలేదు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత- భాషను జనాభాగణనలో ఒక అంశంగా చేర్చారు. 1961 జనాభా గణన ప్రకారం మన దేశంలో 1652 భాషలున్నాయి. అయితే 1971లో పాకిస్థాన్ రెండుగా చీలిపోయి, బంగ్లాదేశ్ ఏర్పడినపుడు కొత్త దేశం భాషా ప్రాతిపదికన ఏర్పడిందనే భావనతో మన ప్రభుత్వం భాష గురించి సేకరించే సమాచారంలో మార్పులు తీసుకువచ్చింది. 10 వేల కన్నా తక్కువ మంది మాట్లాడే భాషలను ‘ఇతరులు’గా వర్గీకరించటం మొదలుపెట్టింది. దీని వల్ల మన భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న 22 భాషలు, మరి కొన్నింటికి తప్ప మిగతా వాటికి విడి గుర్తింపు లేకుండా పోయింది. దీనితో అసలు మన దేశంలో ఎన్ని భాషలున్నాయనే విషయం ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది.

2005-06లో అంటే- గ్రియర్‌సన్ భారత భాషా వైవిధ్యంపై అధ్యయనం చేసిన శతాబ్దం తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ ‘ భారతీయ భాషా వికాస యోజన’ అనే అధ్యయనాన్ని చేపట్టింది. అయితే కొన్ని అవాంతరాలు ఎదురవటంతో ఈ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారు. 2007లో మరోసారి ఇలాంటి అధ్యయనాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది కానీ- అది మొదలే అవ్వలేదు. ఈ నేపథ్యంలో- 2009లో వడోదరా (బరోడా) కు చెందిన ‘లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్ సెంటర్’ -దేశంలో ఎన్ని భాషలున్నాయనే విషయాన్ని తెలుసుకోవటానికి ఒక సమగ్ర అధ్యయనాన్ని ప్రారంభించింది. ‘ది పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా'(పీఎల్ఎస్ఐ) పేరిట చేసిన ఈ అధ్యయనంలో 85 సంస్థలు భాగస్వాములయ్యాయి. 3500 మంది పరిశోధకులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ అధ్యయన ఫలితాలను గత వారం వెల్లడించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. దాని ప్రకారం- మన దేశంలో 780 భాషలున్నాయి. వీటిలో 400కి పైగా భాషలను ఆదివాసులు, డినోటిఫైడ్ తెగలు, సంచార జాతులు మాట్లాడతారు.

ఎలా చేశారు?

జనాభా లెక్కల్ని తీసుకుంటే- దేశంలో ఎంత మంది ఏ భాషను మాట్లాడుతున్నారు అనే విషయం ఒక్కటే తెలుస్తుంది. అది కూడా పదివేల మందికి పైగా ఉన్న సమూహంలో మాట్లాడే భాషను మాత్రమే దానిలో గుర్తిస్తారు. అయితే పీఎల్ఎస్ఐ అధ్యయనం దీనికి భిన్నంగా సాగింది. దీనిలో పెద్ద గ్రూపులు మాత్రమే కాకుండా చిన్న చిన్న గ్రూపులు మాట్లాడే భాషలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అధ్యయనకారులు స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి తమ ప్రశ్నావళికి సమాధానాలు తెలుసుకున్నారు.

ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని 80 మంది ఎడిటోరియల్ టీమ్ కలిసి జల్లెడ పట్టారు. 35 వేల పేజీల అధ్యయన సారాంశాన్ని తయారుచేశారు. దీనిని 68 గ్రం«థాలుగా త్వరలోనే ప్రచురించనున్నారు. “మన దేశంలో 96 శాతం భాషల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇలా మరుగున పడిపోయిన భాషల వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది మా ఉద్దేశం. వాటిని రికార్డు చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రజల సర్వే. దీనికి మేం కోటి రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాం. ఇదే అధ్యయనం ప్రభుత్వాలు చేయాలంటే వందల కోట్ల రూపాయలు అవుతాయి..” అంటారు పీఎల్ఎస్ఐ డైరక్టర్ గణేష్ దేవే.

మన రాష్ట్రంలో..

ఎక్కడ ఒక భాష అంతరించిపోయినా అది చాలా దురదృష్టకరమైన సంఘటనే. అది మన దగ్గరే జరుగుతోందంటే మరింత ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్‌లో గత 50 ఏళ్లలో 20 భాషలు అంతరించిపోయాయి. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు- తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వృద్ధతరం మాట్లాడే భాషను యువతరం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంతదాకా ఎందుకు- మన రాజ్యాంగంలో కొన్ని షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి. వాటిని మాట్లాడేవారు కాని రాసేవారు కాని రోజురోజుకు తగ్గిపోతున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక భాష అంతరించిపోయిందంటే- ఒక ప్రాంతంలో కొందరు ప్రజల దృక్కోణం అంతరించిపోయినట్లే. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని భాషలు అంతరించిపోవటానికి ఆర్థిక అభివృద్ధి పేరిట అనుసరిస్తున్న విధానాలే కారణమనేది దేవే అభిప్రాయం.

కొన్నింటికే ప్రాముఖ్యం ఎందుకు?

మానవ అభివృద్ధిలో భాషకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. ఇది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఏ భాషలకు లిపి ఉంటుందో ఆ భాషలు ఎక్కువ ప్రాచుర్యం పొందుతాయి. మన దేశంలో కూడా అదే జరిగింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న 22 భాషలు మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషలు మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషలు కావడం వల్ల వాటి అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సాయం లభించింది.అలాగే ఒక సమూహానికి ఉండే రాజకీయ, ఆర్థిక శక్తి కూడా భాష అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఉదాహరణకు నిజాం పరిపాలనా సమయంలో ఉర్దుకు ప్రాధాన్యం ఉండేది. నిజాం పతనం తర్వాత ఆయన పరిపాలనా ప్రాంతంలో ఉర్దు ప్రాభవం తగ్గిపోయింది.

ప్రపంచీకరణ తర్వాత, దేశాల సరిహద్దులు చెరిగిపోయిన తర్వాత- ఇంగ్లీషు వంటి భాషలు ప్రాముఖ్యం సంతరించుకోవటం మొదలుపెట్టాయి. దీనితో పాటు ఒక భాషకు ఉన్న ప్రాముఖ్యాన్ని కొలవటానికి రెండు కొలమానాలుంటాయి. ఒక భాషను ఎంతమంది మాట్లాడుతున్నారనేది ఒక కొలమానమైతే.. ఆ భాష వివిధ రంగాల్లో ఎంత సజీవమైన, క్రియాశీలకమైన పాత్ర పోషిస్తోందనేది రెండో కొలమానం. రెండో దానికి ఉదాహరణగా సంస్కృతాన్ని చెప్పుకోవచ్చు. మన దేశంలో సంస్కృతంలో ఎవరూ మాట్లాడరు కాని మతపరమైన ఆచారవ్యవహారాలలో సంస్కృత గ్రంథాలే ప్రముఖ పాత్ర వహిస్తాయి.

వలసలూ కారణమే..

ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిపోవటం, ఒక భాషాసమూహం చిన్నాభిన్నం అయిపోవటం వల్ల కూడా కొన్ని భాషలు అంతరించిపోతాయి. ఈ పరిణామాన్ని కోస్తా ప్రాంత సమూహాలలో ఎక్కువగా చూడవచ్చు. దీనికి కొన్ని కారణాలున్నాయి. గత 30 ఏళ్లలో మత్స్య పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. లోతైనా ప్రాంతాల్లో చేపలు పట్టడానికి వీలుగా చట్టాల్లో కూడా అనేక మార్పులు చేశారు. వీటి ప్రభావం సంప్రదాయ మత్స్యకార సమూహాలపై తీవ్రంగా పడింది. వీటితో పాటు అనేక కార్పొరేట్ కంపెనీలు మత్స్యపరిశ్రమలో ప్రవేశించి తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అత్యాధునికమైన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి. ఈ మార్పులు చిన్న సమూహాలను చిన్నాభిన్నం చేశాయి. వారికి ఉపాధి లేకుండా చేశాయి. దీనితో వారు వేరే వృత్తులను వెతుక్కుంటూ పరాయి భాషా ప్రాంతాలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు. దీని వల్ల వారి మాతృభాష అంతరించిపోవటం మొదలుపెట్టింది.

కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు- దేశంలోని కోస్తా ప్రాంతాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉందని అధ్యయనంలో తేలింది. డినోటిఫైడ్ అండ్ నామాడిక్ కమ్యూనిటీస్ (డీఎన్‌టీ)లలో కూడా ఈ తరహా పరిస్థితిని మనం చూడవచ్చు. బ్రిటిష్ వారి పాలన ఈ తెగల ప్రజలను నేరగాళ్లగా పరిగణించేవారు. వీరి కోసం బ్రిటిష్ ప్రభుత్వం- 1871, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్‌ను కూడా చేసింది. ఈ చట్టం వల్ల ఈ తెగలలో ప్రజలు అనేక కష్టాలకు గురయ్యారు. మన దేశంలో ఇలాంటి తెగలు 190దాకా ఉన్నాయి. వారి జనాభా ఆరు కోట్లకు పైగా ఉంటుంది. వీరిలో ప్రతి తెగకు ఒక్కో భాష ఉంటుంది. అయితే తమ భాషను మాట్లాడినా, సంప్రదాయాలను ఆచరించినా-తమను ఇతరులు గుర్తు పడతారనే భావనతో వీరిలో చాలా మంది తమ స్వంత భాషను, సంప్రదాయాలను వదలుకున్నారు. దీనితో అవన్నీ మరుగున పడుతూ వచ్చాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెగల భాషలు చరిత్రకు బలి అయిపోయాయి. ఈ రెండింటితో పోలిస్తే ఆదివాసీ తెగల భాషల పరిస్థితి మెరుగ్గా ఉందనే చెప్పాలి. వారు ఒక ప్రాంతంలోనే నివసిస్తూ ఉండటం వల్ల అవి అంతరించిపోలేదు. వాస్తవానికి భిల్లి, గొండి, సంతాలీ, ముండారీ వంటి భాషలు మాట్లాడే వారి సంఖ్య పెరిగింది కూడా. అయితే అన్ని భాషల పరిస్థితి ఆ విధంగా లేదు. తమిళనాడు, కేరళలలో ఆదివాసీ తెగలు మాట్లాడే భాషలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి.

ఇంకా తేలిన అంశాలు..

ఈ అధ్యయనంలో మనకు ఇప్పటి దాకా తెలియని అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఉదాహరణకు మన దేశంలో ఎక్కువ భాషలు మాట్లాడే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఆ రాష్ట్రంలో 90 భాషలు మాట్లాడతారు. గోవాలో కేవలం మూడు భాషలు మాత్రమే మాట్లాడతారు. పంజాబ్, హర్యానాలలో ప్రజలు ఏడు భాషలను మాట్లాడితే- ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో 50 భాషలకు పైగానే మాట్లాడతారు. దీనితో పాటు ఇప్పటి దాకా రికార్డుల్లో లేని కొన్ని భాషలు కూడా వెలుగులోకి వచ్చాయి. దాదర్ నగర్ హవేలీలో మాట్లాడే గోర్పా అనే భాష గురించి ఇప్పటి దాకా ఎక్కడా రికార్డు లేదు. ఆ ప్రాంతంలోని మత్స్యకారులు మాత్రమే మాట్లాడే ఈ భాష దాదాపుగా అంతరించిపోయింది. దాని స్థానంలో అందరూ గుజరాతీని మాట్లాడటం మొదలుపెట్టారు.

ఇదే విధంగా సిక్కింలో 15 భాషలు ఉన్నాయని, వాటిలో ఫూజిల్, మాజ్హి, థాని అనే (అంటే అంతకు పూర్వం తమకు తెలియనివి) భాషలున్నట్లు కొత్త అధ్యయనకారులు కనుగొన్నారు. ఈ మూడు భాషలకు లిపి లేదు. కాశ్మీర్‌లో బూరుశస్కి అనే భాషను 300 మంది మాత్రమే మాట్లాడతారట. ఈ భాషను మాట్లాడేవారంతా పాకిస్థాన్‌లోని గిల్‌గిట్ బాల్టిస్థాన్ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారట. ఇదే విధంగా మహారాష్ట్రలో మెహలీ అనే భాషను కేవలం 130 మంది మాత్రమే మాట్లాడుతున్నారు. దీనిని బుల్‌ధానా జిల్లాలోనే మాట్లాడతారు. కొన్ని సంచార జాతులలోనైతే భాష- కేవలం పాటలు, నాటకాల రూపంలో మాత్రమే సజీవంగా ఉంది. ఉదాహరణకు సిద్ధి అనే భాషను ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. కానీ ఆ భాషకు సంబంధించిన పాటలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి.

ఏం చేయాలి?

ప్రస్తుతం తాము గుర్తించిన భాషలన్నింటికీ నిఘంటువులను, వ్యాకరణాన్ని తయారుచేయాల్సిన అవసరముందని దేవే పేర్కొంటున్నారు. ఈ భాషలన్నీ బతకాలంటే ముందు వాటిని గ్రంథస్తం చేయటం అత్యవసరమని అభిప్రాయపడుతున్నారు. ప్రజల సంస్కృతిలో భాష కూడా ఒక భాగం కాబట్టి- మన దేశంలోని వివిధ తెగలకు సంబంధించిన యాంత్రపొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 800 మోనోగ్రాఫ్స్‌ను తయారుచేయాలని, ఎకో-కల్చరల్ (పర్యావరణ, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన) అధ్యయనాన్ని చేయాలని పీఎస్ఎల్ఐ సంకల్పించింది. దీని వల్ల మన దేశం గురించి మనకు మరింత బాగా తెలుస్తుందంటారు దేవే.

భావోద్వేగాలతో ఈ సమస్యను చూస్తే పరిష్కారమార్గాలు దొరకవని.. దీర్ఘకాలిక వ్యూహాలను అనుసరించాల్సిన అవసరముందంటారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో బోధన మాధ్యమాన్ని వారి మాతృభాషలో బోధించాలనే నిర్ణయం తీసుకోవటం చాలా మంది చర్య అనేది దేవే అభిప్రాయం. మన సంస్కృతికి ఆయువుపట్టులాంటి భాషల పరిరక్షణకు పీఎస్ఎల్ఐ ఆ పనిని దిగ్విజయంగా చేయాలని కోరుకుందాం.

ఆంధ్ర కొంత మెరుగే!

ఆంధ్రప్రదేశ్‌లో గుటాబా గడాబా, మండా, ఎరుకల, కుపియా, మన్నడోనా, గోర్మతి వంటి భాషలు అంతరార్థమయిపోయాయని.. మరి కొన్ని అంతరించటానికి చివర దశలో ఉన్నాయని పీఎల్ఎస్ఐ డైరక్టర్ గణేష్ దేవే ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో చెప్పారు. దానిలోని ముఖ్యాంశాలు..

ప్రశ్న:
వివిధ తెగలను జనజీవన స్రవంతిలోకి తేవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. దీని ప్రభావం భాషలపై ఎలా ఉంది?
జవాబు :
సమ్మిళిత అభివృద్ధిలో సమ్మిళిత సంస్కృతి కూడా ఒక భాగం కావాలి. అభివృద్ధిని కేవలం ఆర్థిక కోణం నుంచి చూడటం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. ప్రజలను జనజీవన స్రవంతిలోకి తేవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ విధమైనవే..

ప్రశ్న:
భాషలు అంతరించిపోవటంలో- ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య తేడాలేమైనా ఉన్నాయా?
జవాబు :
ఎంత వేగంగా అంతరించిపోతున్నాయనే విషయంలో తేడా ఉంది తప్ప- ఇతర విషయాల్లో రెండూ సమానంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే- హర్యానా, పంజాబ్‌లలో ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కోస్తా ప్రాంతాల మత్స్యకారులు, సంచార తెగల భాషలు కొన్ని పూర్తిగా అంతరించిపోయాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్- ఇలా వివిధ ప్రాంతాల్లో నివసించే బంజారాలు గోర్మతి అనే భాషను మాట్లాడతారు. ప్రస్తుతం ఈ భాష కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను పూర్తిగా అంతరించిపోయే స్థితిలో ఉంది.

ప్రశ్న:
భాషలు అంతరించిపోవటానికి ఇంగ్లీషు కూడా ఒక కారణమనే విమర్శ ఉంది..
జవాబు :
ఇది సరికాదని నా అభిప్రాయం. ప్రతి భాష ఇతర భాషల నుంచి అనేక భావాలను, పదాలను తనలో కలుపుకుంటుంది. ఉదాహరణకు తెలుగు భాష తనకు అవసరమైన ఇంగ్లీషు పదాలను కలుపుకుంటోందనుకుందాం. దాని వల్ల ప్రమాదం లేదు. ఎందుకంటే గతంలో తెలుగు భాషలోకి సం స్కృతం, తమిళం, అరబిక్, పర్షియన్ పదాలు వచ్చి చేరాయి. అవి తెలుగు భాషను అభివృద్ధి చేశాయి. తెలుగును పూర్తిగా వదిలేసి ఇం గ్లీషు మాట్లాడటం మొదలుపెడితే మాత్రం సమస్య ఏర్పడుతుంది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.