జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’అని బాధ పడుతున్న ఐ.యెన్ మూర్తి

జ్ఞాపకాలు : ‘నన్నెందుకో మర్పిపోయింది చిత్రసీమ’

September 15, 2013

– కంపల్లె రవిచంద్రన్

నేటి తెలుగు చిత్రపరిశ్రమ మరచిపోయిన ఒకనాటి తెరవెనుక మనిషతడు.ప్రేక్షకులకు కూడా ఆయనకంటే ఆయన సినిమాలే గుర్తున్నాయి. అసిస్టెంట్ డైరెక్టరుగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఎన్టిఆర్ దగ్గర’సీతారామకల్యాణం’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ప్రమోటై, 60 – 70 దశకాల మధ్య వచ్చిన ఇరుగు పొరుగు, శభాష్ సూరి, సుఖదుఃఖాలు, జగత్ కిలాడీలు, కిలాడి సింగన్న, ఆడజన్మ, జగమేమాయ లాంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. రావు గోపాలరావు, శోభన్‌బాబు, గిరిబాబు, మురళీమోహన్, రమాప్రభ, కె.విజయ, శ్రీవిద్య వంటి అనేకమంది నటీనటులను, మరెందరో సాంకేతిక నిపుణుల్ని వెండితెరకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. పేరు ఐ.ఎన్.మూర్తి. వారి ఆరు పదుల సినిమా జ్ఞాపకాలు ఇవి –

నా పూర్తి పేరు ఐనాపురపు నారాయణమూర్తి. మా స్వస్థలం విజయవాడ. జానకి రామయ్య, సుభద్రమ్మల నలుగురు సంతానంలో మూడవ వాణ్ణి. నాన్న పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో అసిస్టెంటు ఇంజనీరుగా పనిచేసేవాడు. ఆయన బదిలీల కారణంగా నా చదువు పలుచోట్ల సాగింది. బళ్లారి హైస్కూల్‌లో ఒక నాటకం వేసినప్పుడు బళ్లారి రాఘవగారు హాజరై, పాత్రధారులను ఆశీర్వదించడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలింది. గుంటూరు ఏ.సి. కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరే సమయానికి స్వాతంత్య్రోదమం ముమ్మరంగా ఉంది. యువరక్తం కదా, ఆ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఫలితంగా డీబార్ అయ్యాను. అప్పటికే నాటకాల రుచి మరగడం వల్లనేమో ఎలాగైనా సినిమా దర్శకుడిని కావాలనే తపన నిలువెల్లా ఉండేది. చదువు వంకతో మద్రాసు చేరి, సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. రామపాదసాగర్ ప్రాజెక్టులో ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం చేసుకుంటూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను.

చిత్రసీమలో నా అరంగేట్రం

ఒక శుభ ముహూర్తాన తమిళనాడు టాకీసు అధినేత, ప్రముఖ నిర్మాత ఎస్.సౌందరరాజన్ దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకుని నా కోరిక వెల్లడించాను. ఆయనప్పుడు ‘అదృష్టదీపుడు’ అనే తెలుగు సినిమా నిర్మిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం ఆఖరు దశలో అసిస్టెంటు డైరెక్టరుగా అవకాశం కల్పించారు. తర్వాత ఆయనే ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రం తీస్తూ నెలకు వంద రూపాయల జీతం మీద నన్ను తీసుకున్నారు. గుమ్మడి, కృష్ణకుమారిగార్లకు అది తొలిసినిమా. ఆ తర్వాత సౌందరరాజన్‌గారే నాగయ్యగారికి నన్ను పరిచయం చేసి, ‘నా యిల్లు’ ద్విభాషా చిత్రానికి రికమండ్ చేశారు. అందులో నటించిన టి.ఆర్. రాజకుమారికి తెలుగు భాష నేర్పించడం కోసం తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడిని. అలా చిత్తూరు నాగయ్యగారి అవరిండియా కంపెనీలో మూడేళ్లు పనిచేశాను.

వారి ఆత్మీయత మరవలేను

లీలతో నా వివాహం (1952) జరిగినప్పుడు నాగయ్య, టి.ఆర్. రాజకుమారి గార్లు స్వయంగా బాపట్ల వచ్చి ఆశీర్వదించారు. రాజకుమారి నా భార్య మెడలో ఒక బంగారు గొలుసు కూడా వేసింది. ఒక అసిస్టెంటు పెళ్లికి అంత పెద్దవారు రావడం గొప్పగా చెప్పుకునేవారు. ‘నా యిల్లు’ టైంలో అందులో నటించిన విద్యావతితో పాటు ఆమె సోదరి సంధ్యతో కూడా నాకు పరిచయం ఏర్పడింది. నా పెళ్లయిన కొత్తలో సంధ్య స్వయంగా మా ఇంటికి వచ్చి మా దంపతులను విందుకు ఆహ్వానించి, నూతన వస్త్రాల్ని బహూకరించడం మరచిపోలేని అనుభవం. ఆ సంధ్యగారి కూతురే ఇప్పటి మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితగారని చెప్పక్కర్లేదనుకుంటాను. అప్పటికే తారాస్థాయిలో ఉన్న వీళ్లందరి అభిమానం చూరగొనడం నా అదృష్టం.
తమిళ దిగ్గజాలు నటించిన ఏకైక చిత్రం

ఆ తర్వాత టి.ఆర్. రాజకుమారి తన సోదరుడు టి.ఆర్. రామన్నతో కలిసి ‘క్కూండుక్కిలి’ చిత్రం తీస్తూ ఆ సంస్థలో నాకు అవకాశం ఇచ్చారు. ‘క్కూండుక్కిలి’లో తమిళ దిగ్గజాలు ఎం.జి.ఆర్, శివాజీగణేషన్‌లు కలిసి నటించడం విశేషం. మన తెలుగులో అక్కినేని, ఎన్.టి.ఆర్.లు కలిసి దాదాపు 14 సినిమాల్లో నటించారు కానీ, వాళ్లిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘క్కూండుక్కిలి’ ఒక్కటే. టి.ఆర్. రాజకుమారిపై వాళ్లిద్దరికీ ఉన్న గౌరవం వల్లనే కలిసి నటించారు. ఆ సమయంలో ఆ హీరోలతో పెరిగిన స్నేహం వలన నాకు వారి చెరి ఐదు చిత్రాల్లో అసిస్టెంట్ డైరెక్టరుగా చేసే అవకాశం వచ్చింది.

టి.ఆర్. రామన్నగారు నన్ను ఎంతో అభిమానంతో చూసుకునేవారు. ఆయన చలువ వల్లనే ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాను. ఆయన తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన కార్తవరాయని కథ (1958) సమయంలో ఎన్.టి.రామారావుగారితో పరిచయ భాగ్యం కలిగింది. ఆ తర్వాత నందమూరి త్రివిక్రమరావు, విజయా అధినేత బి.నాగిరెడ్డి కలిసి రేచుక్క పగటి చుక్క (1959) చిత్రం నిర్మించారు. ఆ సినిమా ఒడంబడిక లాంటి ఒడంబడికను నేను ఎక్కడా చూడలేదు. లాభాలు వస్తే విజయా, ఎన్.ఏ.టి. రెండూ పంచుకోవాలని, నష్టం వస్తే ఎన్.ఏ.టి. మాత్రమే భరించాలని. ఆ సినిమా అంతగా ఆడలేదనుకోండి! ఒక రకంగా చెప్పాలంటే ‘కార్తవరాయని కథ’ తెలుగు వెర్షన్ మొత్తం నేనే డైరెక్టు చేశాను. ఇది గుర్తించిన ఎన్.టి.రామారావుగారు తమ ‘సీతారామకల్యాణం’ (1961) చిత్రానికి నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకున్నారు. ఈ చిత్రానికి పని చేయడం నా అదృష్టం. డైరెక్టరు ఎన్.టి.ఆర్.గారే అయినా, తెరమీద ఆయన పేరు కనపడదు. సంయుక్త దర్శకుడిగా టైటిల్స్‌లో నా పేరు మాత్రమే కనిపిస్తుంది. ఇది అదృష్టం కాక మరేమిటి?

దర్శకుడిని చేసిన ‘ఇరుగు పొరుగు’

ఆ తర్వాత నటి నిర్మలమ్మ భర్త జి.వి. కృష్ణారావు ప్రోత్సాహంతో తొలిసారిగా దర్శకుడినయ్యాను. ఆయనే బందరు నుండి నిర్మాతలను తీసుకొచ్చారు. అదే ‘ఇరుగు పొరుగు’ చిత్రం. ఎన్.టి.రామారావుతో పాటు ఎందరో ప్రఖ్యాత నటులు అందులో ఉన్నారు. శోభన్‌బాబు నటించిన మొదటి చిత్రం కూడా అదే. విదేశాలనుండి తిరిగి వచ్చిన సర్జనుగా నటించారాయన. ప్రముఖ నటి వాణిశ్రీ కూడా చిన్న రోల్ వేసింది. ‘మల్లీశ్వరి’ చిత్ర నిర్మాణ సమయం నుండి ఛాయాగ్రాహకుడు ఆది యమ్. ఇరానీ నాకు పరిచయం. అంచేత ఈ చిత్రానికి ఆయన కుమారుడు మల్లీ ఇరానీని కెమెరామాన్‌గా పరిచయం చేశాను. ఆ తర్వాత మలయాళంలో చాలా పాపులర్ కెమెరామెన్‌గా పేరు తెచ్చుకున్నారాయన. విషాదం ఏమంటే ఇన్ని హంగులతో తీసిన ‘ఇరుగు పొరుగు’ సక్సెస్ కాకపోవడం. సరిగ్గా అదే సమయానికి కె.వి.రెడ్డిగారి ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ రిలీజైంది. మా చిత్ర పరాజయానికి అదీ ఒక కారణం.

‘సుఖ దుఃఖాలు’ బ్రేక్ ఇచ్చింది

దర్శకుడిగా మొదటి చిత్రం పరాజయం పాలవడంతో కాస్త నిర్వేదంలో పడ్డాను. అప్పుడు టి.ఆర్. రామన్న తమ్ముడు చక్రవర్తి తమిళంలో వచ్చిన ‘పెరియ ఇడత్తుపెణ్’కు రీమేక్ చిత్రంగా ‘శభాష్ సూరి’ తీయమని ప్రోత్సహించి నన్ను నిలబెట్టారు. ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి నాయికా నాయకులు. ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ప్రముఖ హాస్య నటి రమాప్రభ మొట్టమొదటి చిత్రం ఇది. దర్శకుడిగా నాకు బ్రేక్ ఇచ్చిన చిత్రం ‘సుఖదుఃఖాలు’ (1967). తమిళంలో హిట్ అయిన కె.బాలచందర్‌గారి ‘మేజర్ చంద్రకాంత్’ దీని మాతృక. తెలుగులో వాణిశ్రీ వేసిన పాత్రని తమిళంలో జయలలిత వేశారు. ఆమెకు బదులుగా వాణిశ్రీని తీసుకున్నామని తెలిసి ‘నా వేషం నేనే వేస్తాన’ని అన్నారు జయలలిత.

కాదనలేక హీరో రామకృష్ణ సరసన జయలలితకు మరో పాత్ర ఇవ్వడం జరిగింది. అప్పటి వరకూ చిన్నచిన్న హాస్య పాత్రలు ధరిస్తూ వచ్చిన వాణిశ్రీ ఈ చిత్రంతో తారాపథానికి వెళ్లింది. ఈ సినిమా రషెస్ చూసే డూండీ వాణిశ్రీని ‘మరపురాని కథ’ చిత్రంలో తీసుకున్నాడు. అయితే మా చిత్రం కంటే ముందే ఆ చిత్రం విడుదలైంది. విశేషం ఏమంటే, సుఖదుఃఖాలులో ఎస్వీ రంగారావు, జయలలితలు 40 వేల పారితోషికం తీసుకుంటే, వాణిశ్రీ కేవలం నాలుగు వేలు తీసుకోవడం. తమిళంలో నగేష్ ధరించిన పాత్రను తెలుగులో చంద్రమోహన్ చేశాడు. ఈ సినిమాకి పాలగుమ్మి పద్మరాజుగారితో మూడు నెలల చర్చలు జరిపి స్క్రిప్ట్ తయారుచేశాం. దేవులపల్లిగారంటే నాకు మొదటినుండీ అభిమానం. ‘మల్లీశ్వరి’కి ఆయన పాటలు రాస్తుంటే స్వయంగా చూసినవాణ్ణి. నేను అడగ్గానే ‘ఇది మల్లెల వేళయనీ’, ‘మేడంటే మేడా కాదు’ లాంటి మంచి పాటలు ఇచ్చారు. ‘మేడంటే మేడా కాదు’ పాట బాలు గారికి ఎంత పేరు తెచ్చిందో మీకు తెలిసిందే.

రావుగోపాలరావుకి డబ్బింగ్ చెప్పించాం

‘జగత్ కిలాడీలు’ చిత్రం డిస్కషన్స్‌కి పాలగుమ్మి పద్మరాజుతో కలిసి దాసరి నారాయణరావు మా కార్యాలయానికి వచ్చేవారు. అప్పటికే కృష్ణ ‘గూఢచారి 116’ విడుదలై విజయం కావడంతో ఆయన్నే హీరోగా ఎన్నుకున్నాం. ఈ చిత్రంతోనే రావు గోపాలరావు విలన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత రోజుల్లో డైలాగ్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయనకి ఆ సినిమాలో మాత్రం నెల్లూరుకు చెందిన దశరథరామిరెడ్డి చేత డబ్బింగ్ చెప్పించడం గమనార్హం. ‘జగత్ కిలాడీలు’ చిత్రంలో దేవులపల్లి రాసిన ‘ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా’, ‘వేళ చూస్తే సందె వేళ’ పాటలు (కోదండపాణిగారి సంగీతంలో) ఎంతో పాపులర్ అయ్యాయి.

తర్వాత ‘ఆడజన్మ’ చిత్రానికి దర్శకత్వం వహించాను. అప్పటికే హిట్ పెయిర్‌గా ఇండస్ట్రీలో టాక్ ఉండే జమున, హరనాథ్‌లు ఇందులో హీరో హీరోయిన్లు. ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోవడమే కాక, మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి. ఆ చిత్రాన్ని చూసి మా యూనిట్ సభ్యులను ఎంతో అభినందించారు. ఈ టైంలో హరనాథ్‌తో నాకు బాగా స్నేహం కుదిరింది. వ్యక్తిగత వ్యసనాలు ఎలా ఉన్నా ఇతరులతో హరనాథ్ చాలా సఖ్యంగా ఉండడం నాకు బాగా నచ్చేది.

అట్లూరి పూర్ణచంద్రరావు అందరూ కొత్త తారలతో నా దర్శకత్వంలోనే ‘జగమేమాయ’ చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ప్రారంభంలో ఎస్.డి. లాల్ తాను తీసిన ఒక డాక్యుమెంటరీలో నటించిన ఇద్దరు కుర్రాళ్లను వెంట తీసుకొచ్చి ‘మూర్తిగారూ, వీళ్లిదర్దితో ఒక డాక్యుమెంటరీ తీశాను. నచ్చితే మీ చిత్రంలో కూడా అవకాశం ఇవ్వండి’ అన్నారు. ఆ ఇద్దరూ ఎవరో కాదు, నేటి మురళీమోహన్, గిరిబాబులే. వీళ్లు ఆ తర్వాత ఎంత పెద్ద పేరు గడించారో మీకు తెలిసిందే. ప్రముఖ నటి కె.విజయ, కెమెరామాన్ మణి కూడా ఈ చిత్రం ద్వారానే తెరకు పరచయం అయ్యారు.

‘దోగజ్ జమీన్ సే నీచే’ అనే హిందీ సినిమా ఆధారంగా తీసిన ఈ సినిమా రికార్డు విజయం సాధించింది. తర్వాత ‘శ్రీరామబంటు’ ద్వారా దేవిక మరిది విజయ్‌ను కెమెరామాన్‌గా పరిచయం చేశాను. సంగీత విద్వాంసురాలు ఎం.ఎల్.వసంతకుమారి కుమార్తె శ్రీవిద్యకు తొలిసారిగా ‘ఢిల్లీ టు మద్రాస్’ అనే చిత్రంలో అవకాశం ఇచ్చాను. ఆమె ఏ సభలో మాట్లాడినా ‘నా మొదటి దర్శకులు ఐ.ఎన్.మూర్తిగారు’ అని ఎంతో వినమత్రతో చెప్పేది. తెలుగులోనే కాక, తమిళంలోనూ సంతృప్తికరమైన చిత్రాలే తీశాను. ఎంతోమంది నిర్మాతల్ని, సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని తెరకు తొలిసారిగా పరిచయం చేసే భాగ్యం కలిగింది.

నాకు ముగ్గురు కొడుకులు. అందరూ స్థిరపడ్డారు. మనవళ్లు, మనవరాళ్లతో ప్రశాంతంగా ఉన్నాను. నా భార్య ఇప్పుడు లేదు. అదొక్కటే లోటు నాకు. ఎందరో ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్సును ఇండస్ట్రీకి అందించిన నన్ను తెలుగు చిత్రపరిశ్రమ పూర్తిగా మరిచిపోయిందనేది గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సుకు ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.

– 98487 20478

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.