పాడనా తెలుగు పాట…

పాడనా తెలుగు పాట…

September 16, 2013

తెలుగునాట సినిమా పాటల కచ్చేరీలకు ఆదరణ పెరుగుతోంది. కొత్త కొత్త యువ కళాకారులు గీత గానాలతో ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ ప్రాచుర్యం సంపాదించుకుంటున్నారు.

తెలుగు కళా రూపాలలో అన్నిటికన్నా ఎక్కువగా పాటల కచ్చేరీలు జనాదరణ పెంచుకుంటున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా గంటలు, పూటలు లెక్క చేయకుండా తెలుగు పాట కచ్చేరీలు ప్రస్తుతం తెలుగువారి సంస్కృతిలో అంతర్భాగమైపోయాయి. మన దేశంలో సినిమా మోజు జనావళిలో ఎంతగా పెనవేసుకుపోయినా పాటల విషయంలో మాత్రం తెలుగువారి ప్రీతి అనంతమైన గనిలా విస్తరించిపోయింది. చిత్ర విచిత్రమైన ఇతివృత్తాలు, గాన విన్యాసాలు తెలుగుతనాన్ని ఆవరించేశాయి. ఇంచుమించు 42,000 గీతాలు, 165 మంది కవులు, 520 మంది బాణీల రూపకర్తలను నిత్యం ఆరాధిస్తూ బుల్లితెర పైనా, వందలాది వేదికల పైనా ఇటువంటి కచ్చేరీలు అవిశ్రాంతంగా తెలుగువారిని రంజింపచేస్తున్నాయి. మూడు తరాల గాయనీ గాయకులు రకరకాల గళ విన్యాసాలతో కోట్లాదిమంది మనసుల్లో దీర్ఘకాలం మెదలడం చిన్న విషయమేమీ కాదు. రసవత్తరమైన ఆలోచనలు, గమ్మత్తైన సృజనతో వేల వేల పాటలు వీనుల విందు చేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ గీతాల ఆలపనలో రాప్ట్రంతో పాటు, విదేశాలలో కూడా గాయనీ గాయకులు వేల సంఖ్యలో విస్తరించారు.

వందేళ్ల చిత్రసీమ వేడుకలు జరుగుతున్న ఈ సమయంలో ఒకసారి ఈ రంగాన్ని సమీక్షిస్తే , తెలుగుదనం ఎంత మధురంగా విస్తరిస్తోందో అర్థమవుతుంది. 1945-50లలో విడుదలైన సినిమాలతో అందరి నోటా ఆయా పాటలు రాగాలు నలుగుతూ ఉండేవి. ఆ కాలంలో అన్ని ప్రాంతాలలో పద్య నాటకాలను టికెట్ కొని చూడటంతో పాటు, ఇళ్లల్లో తమకున్న వెసులుబాటు సమయంలో వాటిని ఆలపించడం వ్యక్తిగత వినోదంగా, ఉల్లాసంగా మారిపోయింది. హిందీ సినిమాల బాణీలలో తెలుగు సినిమాల్లో వచ్చే పాటలు, తెలుగు నాటకాల పద్యాలు తెలుగు గడ్డపై మార్మోగాయి. ‘చెల్లియో చెల్లకో’అంటూ ఒక వైపు, ‘ఓహో బస్తీ దొరసానీ…’ వంటివి కోట్లాది మంది తెలుగువారి గొంతుల్లో వినిపిస్తూనే ఉండేవి. ‘పందిట్లో పెళ్లవుతున్నాది.. కనువిందవుతున్నాది,,’, ‘వయ్యారమొలికే చిన్నది ఊరించుచున్నది రమ్మంటేను రాను పొమ్మన్నది…’, ‘రావే రాధా రాణి రావే రాధ నీవే కృష్ణుడ నేనే, రాసలీలా వేళ ఇదే..’ వంటి పాటలు, వాటి గ్రామఫోన్ రికార్డులు, రేడియో పాటలు, మరో వైపు దేశభక్తి గీతాలు చిన్నా పెద్ద ల నోళ్లల్లో నిత్యం నానుతూ ఉండేవి.

ఈ 75 ఏళ్ల తెలుగు సినీ గీతాల ఆలాపనలో చాలా చాలా విశేషాలున్నాయి. ముందుగా, అప్పటి హిట్ సినిమాల పాటల్ని భక్తి గీతాలుగా మార్చి మండపాలలో శ్రద్ధగా ప్రార్థించటం అలవాటయింది. ఆ క్రమంలోనే తెలుగువారి సంప్రదాయ కార్యక్రమాలలో మంగళ వాయిద్యాలలో వినిపించే కొన్ని ఆనవాయితీలను కూడా తమ సొంతం చేసుకున్నారు. వివాహాలలో అత్యంత ప్రధానమైన మంగళసూత్ర సమయం నుంచి క్రమంగా అన్నిటా, అన్నిచోట్లా కొన్ని సినిమా పాటలే ఆలపించే సంప్రదాయం వచ్చేసింది. ‘సీతారామ కళ్యాణం’ సినిమా లో గాలిపెంచల నరసింహారావు స్వరపరిచిన పాటలు లేకుండా తెలుగింట పెళ్లి బాజాలు మోగవన్నా అతిశయోక్తేమీ లేదు. ‘బంగారు బొమ్మ రావేమే…’ అంటూ పెళి ్లకూతురుని కళ్యాణ మండపంలోకి తేవటం అందరికీ ముచ్చటయి పోయింది. పుట్టిన రోజు వేడుకల్లో ‘భలే మంచిరోజు పసందైన రోజు’ అంటూ పాట అందుకోని సందర్భం ఉండదు.

జూ వాయిద్యాలలో పాతకాలం పద్ధతులు మారిపోయాయి. హార్మోనియం, వయొలిన్‌ల స్థానంలో కీబోర్డు పాడ్‌లు వగైరాలు పల్లెల్లో కూడా వచ్చేశాయి. వేణువు తప్ప మిగిలినవి కీబోర్డుతో పలికిస్తూ పాటల కచ్చేరీలు చేయటం పరిపాటి అయింది. రాష్ట్రం మొత్తంగా నిపుణులైన కీబోర్డు ప్లేయర్లు 25 వరకూ ఉంటారు. పారితోషాకాల్లో కూడా ఒక్క కార్యక్రమానికి 2,000 రూపాయలు కనీసంగా అడుగుతున్నారు. అన్ని హంగులూ ఉన్న వాయిద్యబృందం కావాలంటే రాజధానికి రాక తప్పడం లేదు.

చలన చిత్ర గీతాల ఆలాపనతో పాటు ఎప్పటికప్పుడు వినూత్న ఇతివృత్తాలతో హైదరాబాదులో తరచుగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి..
42000 పాటలు లెక్కకు ఉన్నా వేదికలపై అలవాటు గా పాడుతున్నవి 1000కి మించటం లేదు. సగటు కార్యక్రమాల్లో ఎంచుకునేవి 150కే పరిమితం అయ్యాయి.

1974 లో మరణించిన ఘంటసాల పాటలు చెదరని తరగని ఆదరణతో 3వ తరం గళాలలో కూడా ఇంకా వినిపిస్తున్నాయి.
ప్లాటినం డిస్క్‌లు సంబందిత రికార్డులు సృష్టించిన పాటలకన్నా హిట్ సాంగ్‌ల జాబితాలో 1975 ముందునాటి పాటలే ఇప్పటికీ ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటికీ వాటిని కోరి వినేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
టీవీ ఛానల్స్‌లో ప్రతి పూటా కనిపించే పాటల కార్యక్రమాలలో పాల్గొనడానికి బాగా ఆసక్తి కనపరుస్తున్న వారి సగటు వయసు 16. కాగా బుల్లి తెర పోటీల్లో పాల్గొనటానికి ప్రత్యేక శిక్షణ , అందుకు తగిన గురువులతో సంస్థలు కూడా వెలిశాయి.
కిన్నెర సాంస్కృతిక సంస«్థ వారు ఘంటసాల పాటల ఆలాపనను 24 గంటలపాటు నిర్వహించి రికార్డుతో పాటు భారీ కార్యక్రమాలకు స్ఫూర్తి దాయకం అయ్యారు.

ఆకాశవాణిలో చిత్రసీమ, మీరు కోరిన పాటలు, దూరదర్శన్‌లో చిత్రలహరి వంటి కార్యక్రమాలపై ఒకప్పుడు లక్షలాది మంది ఆసక్తి కనబరచేవారు. ఇప్పటికీ వందల సంఖ్యలో వాటి కోసం ఎదురు చూస్తున్నవారున్నారు.
తెలుగు సినిమా పాట ల్లో రాజేశ్వరరావు.పింగళి, ఘంటసాల త్రయం ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన పాటల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.
ఆయా సంస«్థలు, వ్యక్తులు రూపొందిస్తున్న కార్యక్రమాలు అపురూప ఆదరణతో అభిమానుల మన్ననలు పెంచుకుంటున్నాయి. యువ కళావాహిని ద్వారా గత 2 ఏళ్లుగా కవులు, స్వరకర్తలు సినిమాలు విడుదలై 60, 70 ఏళ్లు పూర్తయిన సందర్భాలలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.

జూ పాటల ఆలాపనలో రికార్డులు సృష్టించ టంతో పాటు, గంటల తరబడి శ్రోతలను ఆడిటోరియంలో కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తున్న కార్యక్రమాలు అనేకం. సత్యప్రియ, సురేఖా మూర్తి, విజయలక్ష్మి వంటి వారు ఈ విషయంలో తమ తమ తీరుల్లో రికార్డులు సృష్టించారు.
వెండితెర స్వరాల తార విజయలక్ష్మి సరిగ్గా 10 ఏళ్ల క్రితం రవీంద్ర భారతిలో వరుసగా 24 గంటలపాటు పాటల్ని పాడుతూ తెల్లవార్లూ శ్రోతల్ని కూర్చోపెట్టి చప్పట్లు మార్మోగేలా చేసిన గాయని విజయలక్ష్మి. ఆమె పాటల రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించింది. 2003 జూన్ 15న రవీంద్ర భారతిలో ‘జననీ శివకామిని’ అంటూ ప్రార్థన గీతంతో మొదలుపెట్టి, మరునాటి సాయంత్రం రాత్రంతా పాడుతూ, ఆ మరునాడు సాయంత్రం దాకా పాడుతూనే ఉండి శ్రోతల్ని అలరించడంలో విజయలక్ష్మి విజయం సాధించింది. తొట్టతొలి నేప«థ్య గాయని రావు బాల సరస్వతి, కావ్యాలవంటి గీతాలు రాసిన ఆచార్య సి.నారాయణరెడ్డిలు ఆమెతో పాటల ధారను మొదలుపెట్టించారు. ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి. సుశీల, పి. లీల, జిక్కి .ఎల్.ఆర్. ఈశ్వరి వంటి గాయకులు, పలువురు సంగీత దర్శకులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గళ విన్యాసాల్లో అలుపూ సొలుపూ లేకుండా విజయలక్ష్మి పాడుతున్న తీరు, ఇంకా ఇంకా పాడుతానని ఉత్సాహంగా ప్రకటించింది. చిన్న నాటి నుంచి పాటలపై మక్కువతో స్వరాలు, రాగాలతోనే ఆటపాటలు, చదువు సంధ్యలు సాగించిన ఆమె నిజంగా తన సంగీత మాధుర్యంతో శ్రోతలను నిర్ఘాంతపరిచింది. “రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమం నా జీవితానికి సార్థకతను తెచ్చి పెట్టింది.

ఒక రోజంతా అవిశ్రాంతంగా ప్రేక్షకులను సంగీతంతో అలరించగలగడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను నా 8వ ఏట నుంచి పాటలు పాడటం మొద లుపెట్టాను. కర్నాటక, హిందూస్థానీ సంగీతం నేర్చుకోవటం మొదలు పెట్టాను. చిన్న చిన్న వేదికల నుంచి అమెరికాతో పాటు పలు దేశాల్లో ప్రతిష్టాత్మక వేదికలపై పాటలు పాడాను. అక్కడికి 17 సార్లు బ్రిటన్‌కి, 7 పర్యాయాలు గల్ఫ్‌కి, 12 విడతలు సింగపూర్, మలేసియాలకు, 6 దఫాలు ఆఫ్రికా రష్యా దేశాలకు వెళ్లాను. తెలుగుతో పాటు, 7 భాషలలో పాటలు వినిపించి మెప్పించగలిగాను. 1995లో మా గురువు పి.వి. సాయిబాబా నేర్పించిన జానపద గీతంతో జీ టీవి వారి సరిగమ కార్యక్రమంలో రన్నర్ అప్ గా నిలిచాను. 1996లో స్టార్ ప్లస్‌లో మేరీ ఆవాజ్ సునోలో లతా మంగేష్కర్,ఆశా భోంస్లేల ముందు పాడి పైనల్ విన్నర్‌గా నిలిచాను. పర్వీణ్‌సుల్తానా, భూపేన్ హజారికా, హరిహరన్, సునీతా చౌహాన్‌లు నా పాటలు విని మెచ్చుకోవటంతో పాటు, ప్రోత్సాహం కూడా అందించారు. మన సినిమాల్లో దేవదాసు, విక్రమార్కుడు, భయ్యా, వరుడు, యమగోల, శుభప్రదం వంటి వాటిల్లో పాడే అవకాశాలు వచ్చాయి. సమయపాలన పట్ల పట్టింపు ఉన్న అమెరికాలో చాలామంది తెల్లవార్లూ నా పాటలు వింటూ ఇంకా ఇంకా పాడమని అడిగి ఆలకించిన సందర్భాలు నాకు చాలా తృప్తి ఇచ్చాయి. భవిష్యత్‌లో పాటల రంగంలో చాలా ప్రక్రియలు, ప్రయోగాలు చేయాలని ఉంది.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.