వెయ్యి కథల నానమ్మ పప్పు జయా వేణుగోపాల్-ఆంద్ర జ్యోతి -19-9-13

వెయ్యి కథల నానమ్మ

September 19, 2013

మన దేశాన్ని భరతుడు పరిపాలించాడు కనుక భరతవర్షమంటారని తెలుసు. మరి అంతకు ముందు మన దేశాన్ని ఏమని పిలిచేవారు?
రాముడి పిల్లలు ఎవరెవరు? బ్రహ్మదేవుడికి ఆలయం లేదెందుకు?
ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవరు చెప్పగలరు?
పూర్వమైతే ఇంట్లో ఉండే నానమ్మలో, అమ్మమ్మలో చెప్పేవారు.
“ఇప్పుడు నేను చెబుతాను. అదికూడా అందరికీ నచ్చే అత్యాధునిక పద్ధతుల్లో… వినడం మీవంతు…” అంటున్నారు డాక్టర్ పప్పు జయావేణుగోపాల్. కిందటేడు ఆమె ప్రారంభించిన
‘నానమ్మ డాట్ కో’ అనే వెబ్‌సైట్‌ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడున్నర లక్షల మంది చూశారు!

ఇప్పుడు నానమ్మలూ, అమ్మమ్మలతో పిల్లలు కలిసి ఉండటం లేదు. తల్లిదండ్రులకు వాళ్ల పనులు వాళ్లు చేసుకోవడానికే సరిపోతోంది తప్ప పిల్లలకు కథలు చెప్పేంత తీరిక ఉండదు. ఉన్న కాస్త సమయమూ టీవీ ముందు కూర్చోవడానికే సరిపోతోంది. ఈ పరిస్థితుల్లో మన సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలకు సంబంధించిన కథలు పిల్లలకు ఎవరు చెబుతారు? వాళ్లకు అవి ఎలా తెలుస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు జయావేణుగోపాల్. “మాకిద్దరు అబ్బాయిలు. ఒకరు అమెరికాలో, మరొకరు హాంగ్‌కాంగ్‌లో ఉన్నారు. మేం అటూఇటూ తరచూ వెళ్లొస్తూనే ఉంటాం. అలా వెళ్లినప్పుడు నేను సమయమంతా మా మనవలకు కథలు చెబుతూనే గడుపుతాను. ఒకరోజు అలాగే చెబుతుంటే “నానమ్మా, నువ్వు మాకు కథలు చెబుతున్నావు. ఒకవేళ మేం పెద్దయ్యేసరికి మాకివన్నీ గుర్తుండకపోతే? అప్పుడు మా మనవలకేం చెబుతాం? నువ్వు ఇవన్నీ రాసి మాకివ్వొచ్చు కదా” అని అడిగారు వాళ్లు. దాంతో నేను ఆలోచనలో పడ్డాను.

పైగా మన పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణ భారతాలు, భాగవతాల నుంచి చిన్న కథలు తెలిసినవాళ్లు రానురాను తగ్గిపోతున్నారు. దాంతో కాలక్రమంలో ఇవన్నీ మరిచిపోయే ప్రమాదముంది. తరతరాలుగా మనం చెప్పుకొంటూ వస్తున్న ఈ కథలు ఇకముందు పుట్టే పిల్లలకు తెలియకపోతే ఎలా అనిపించింది” అని చెప్పారామె.

అనారోగ్యం ఆపగలదా?
ముందు తనకు వచ్చిన కథలన్నిటినీ ఇంగ్లీషులో రాసేశారు జయ. వాటిని మనవలకు పంపిస్తే చాలనుకున్నారు మొదట్లో. కాని తర్వాత ఆలోచిస్తే, అవి అందరికీ అందుబాటులో ఉండాలనిపించింది ఆమెకు. దాంతో ‘నానమ్మ డాట్ కో’ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా జయకు వెన్నునొప్పి సమస్య తీవ్రమైంది. కాలు బైటకు పెట్టలేకపోయారు. అలాంటి సమయంలో సైతం ఆమె ఆలోచన ఆగలేదు. చదవగలిగే పిల్లలైతే తాను రాసిన కథలు చదువుకుంటారు. మరి చదవడం రానివాళ్లు? అలాంటి పిల్లల కోసం ఆమె స్వయంగా కూర్చుని వాటిని చెబుతూ వీడియోలుగా మలచారు. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 365 వీడియోలు! మొత్తం 1008 కథల పీడీఎఫ్‌లు, 365 వీడియోలతో ఆమె వెబ్‌సైట్ సర్వాంగసుందరంగా తయారయింది. అంటే రోజుకో కథ చొప్పున ఏడాదంతా జయావేణుగోపాల్ చెప్పిన కథలు వినొచ్చు. రోజుకో కథ చొప్పున చదివితే మూడేళ్ల పాటు చదవచ్చు.

అందరికీ ఉచితమే
‘నానమ్మ డాట్ కో’ వెబ్‌సైట్‌లో కథలను ఆధ్యాత్మికం, చరిత్ర, సంస్కృతి అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఆధ్యాత్మికంలో మన దేవుళ్లకు సంబంధించిన కథలుంటాయి. చరిత్రలో మన దేశాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాలు మొదలుకొని నిన్నామొన్నటి దాకా జరిగిన విషయాల మీద కథలుంటాయి. ఇక సంస్కృతి విభాగంలో మన పండగలు, దర్శనీయ స్థలాలు, నదులు, గురువులు, పూజలు – వ్రతాలు, పాటించాల్సిన విలువల గురించిన కథలు పెట్టారు. వీటిలో మళ్లీ చాలా ఉపవిభాగాలున్నాయి. ఉదాహరణకు చరిత్రలో – మాన్యుమెంట్స్ విభాగంలో దాదాపు 60 చారిత్రక ప్రదేశాల గురించిన వివరణ లభిస్తుంది. అలాగే ‘నాయకులు’ విభాగానికెళితే జాతీయ, అంతర్జాతీయ నాయకులతో పాటు, శాస్త్రవిజ్ఞాన రంగాలను ముందంజ వేయించిన మహామహుల గురించి కూడా వివరంగా ఉంటుంది. ఏ కథైనా సరే, పుక్కిటి పురాణాలుగా తెలిసినవి కాకుండా సరైన ఆధారాలున్నవాటినే తీసుకున్నారు.

ఈ వెబ్‌సైట్‌ను కిందటేడు జూన్ 30న ప్రముఖ నాట్యకళాకారిణి పద్మాసుబ్రమణ్యం ప్రారంభించారు. అప్పటినుంచి నేటికి ప్రపంచవ్యాప్తంగా 73 దేశాల్లోని 535 నగరాల నుంచి 7,50,000 క్లిక్కులు లభించాయి నానమ్మకు. టీవీ కార్టూన్లు, హ్యారీపాటర్లు విజృంభిస్తున్న నేటి కాలంలో పిల్లలను ఆకట్టుకోవడానికి ఉన్న సమయం తక్కువ. ముప్పయ్యేళ్లకు పైగా విద్యారంగంలో పనిచేసిన జయకు ఈ సూత్రం బాగానే తెలుసు. అందుకని తాను రూపొందించిన కథల వీడియోలు పది నిమిషాల నిడివి మించకుండా జాగ్రత్త పడ్డారామె. పిల్లలకని ప్రారంభించినా, ఇందులోని కథలను పెద్దవాళ్లు కూడా చదువుతున్నారని, వింటున్నారని చెప్పారు జయ. ‘మాకు తెలిసిన కొందరు నాట్య కళాకారులు ఈ కథలను తమ ప్రదర్శనల్లో ఉపయోగించుకుంటున్నారు. బడిపిల్లలేమో వ్యాసరచనకు, నాటకాలకు, ఇతర సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు… అందరూ వాడుకోవాలన్న నా ఉద్దేశం నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారామె.

– అరుణ పప్పు
“మా నాన్న మిలిటరీలో పనిచేశారు. నేను కూడా మిలిటరీలో చేరుదామనే అనుకున్నాను. కానీ అప్పటికి మెడిసిన్ చదివితే తప్ప అలాంటి అవకాశం ఉండేది కాదు. ‘నువ్వు ఏ రంగాన్నెంచుకుంటే అందులోనే మిలిటరీ స్ఫూర్తితో పనిచెయ్యి’ అన్నారు మా నాన్న. దాంతో నేను విద్యారంగాన్నెంచుకున్నాను. చదువెప్పుడూ ఫ్రీగా ఉండాలి. ఫ్రీ అంటే – ఆర్థికంగా ఉచితంగా అందాలి, జ్ఞానపరమైన అర్థంలో మెదడు ఫ్రీగా ఉండాలి. ఇరుకిరుకు తరగతి గదుల్లో మగ్గిపోయే విద్యార్థులు, పుస్తకంలో ఉన్నది తప్ప మరో విషయాన్ని చెప్పలేని టీచర్లు, విద్య గురించి ఏమీ తెలియని యాజమాన్యాలు, చదువుచదువు అంటూ వేధించే తల్లిదండ్రులు – ఈ నాలుగు వర్గాలవారినీ చైతన్యపరిచే బాధ్యతను గడచిన పదిహేనేళ్లుగా నిర్వర్తిస్తున్నాను. ”
ఆకాశ వీధి బడి…
కోయంబత్తూరులోని చిన్మయ రెసిడెన్షియల్ స్కూల్ వంటి ఎన్నో ప్రముఖ విద్యాలయాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అనుభవం ఉంది జయావేణుగోపాల్‌కు. పుస్తకాలు, పరీక్షలు అక్కర్లేని కరిక్యులమ్‌ను రూపొందించి దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు పనికొచ్చే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పరిజ్ఞానంతో మొన్న జూన్‌లో ‘డాక్టర్ జయాస్ వర్చువల్ స్కూల్’ అనే మరో వెబ్‌సైట్‌కూ రూపకల్పన చేశారామె. “ప్రస్తుతం స్కూళ్లన్నీ డిజిటల్ బాట పట్టాయి. కానీ ఆ పేరుతో విద్యార్థుల మీద, తల్లిదండ్రుల మీద ఆర్థికభారం పెరుగుతోంది. పాఠాలన్నీ ఉచితంగా అందరికీ ఎందుకు అందుబాటులోకి రాకూడదు… అనుకుని ఆ పనే చేశాను. ప్రస్తుతం ఐదో తరగతి వరకూ అన్ని పాఠాలూ ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏ విద్యార్థి అయినా ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు, వీటిని చదువుకోవచ్చు. కేవలం పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకుండా, తనకు ఇష్టమైనవన్నీ నేర్చుకునే సౌలభ్యాన్ని నేనిందులో కల్పించాను. ఉదాహరణకు ఒకటి రెండు తరగతుల్లో ఓ పది జంతువుల గురించి చెబుతారు క్లాసుల్లో. ఇక తర్వాత ఏ క్లాసులోనైనా జంతువుల గురించి చెబుతారా? లేదు. అందుకే పదో తరగతి పిల్లాడైనా, వాడికి నేర్పే టీచరైనా సరే, జంతువుల పేర్లు చెప్పమంటే పదో పదిహేనో చెప్పి ఊరుకుంటారు. అదేనా లెర్నింగ్ అంటే?” అని సూటిగా ప్రశ్నించే జయ పిల్లలకు ఎన్నెన్నో విషయాలు తెలిసేలా ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. మరోవైపు తమను తాము మెరుగుపెట్టుకోవాలనుకునే టీచర్ల కోసం ‘కార్పొరేట్ స్కిల్స్’ అనే వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
www.drjayasvirtualschool.in
www.corporateskills.org

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.