సాటి లేని మేటి భువన విజయం
September 23, 2013
రాయల వారు అష్ట దిగ్గజాలతో
నిర్వహించిన ‘భువన విజయం’
రూపకం క్రమక్రమంగా
యువకులు, విద్యార్థులను
ఆకట్టుకుంటోందని ఇటీవల జరిగిన
శతరూప కార్యక్రమాల సందర్భంగా
రుజువయింది.
ఇటీవల రాష్ట్ర రాజధాని నగరంలోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకం అమోఘంగా విజయం సాధించింది. ఒకప్పుడు హేమాహేమీ సాహితీవేత్తలు నిర్వహించిన ఈ రూపకానికి ఏమాత్రం వన్నె తగ్గలేదని, ఇది యువ తరాన్ని కూడా ఆకట్టుకుంటోందని సాంస్కృతిక శాఖకు అవగాహన అయింది. ఈ రూపకాన్ని రాష్ట్రంలో మరింత విస్తృతంగా ప్రదర్శించడానికి, అవసరమైతే మెరుగు పరచడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఈ శాఖ భావిస్తోంది. ఈ రూపకానికి పెరుగుతున్న ఆదరణ పైనా, ఇతర రూపకాలు, సాంస్కృతిక అంశాలపైనా ఈ శాఖ ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తోంది.
రాష్ట్రంలో అవధాన విద్యకు ఎంతో చరిత్ర ఉంది. పూర్తిగా తెలుగువారికే పరిమితమైన ఈ విద్య తెలుగు భాషకు కొత్త అందచందాలను సమకూర్చింది. కొన్ని వందల వేదికల మీద అటువంటి అవధానాలు నిర్వహించడమే కాకుండా, తరతరాల అవధాన విద్యపై సిద్ధాంత గ్రంథంతో డాక్టరేట్ పొందిన రాళ్లబండి కవితా ప్రసాద్ ఈ తరం కవి పండితులనందరినీ సాహిత్య రూపకాలలో పాత్రధారులుగా వేదిక పైకి రప్పించిన తీరు క్రమంగా ప్రేక్షకుల సంఖ్య పెరిగేలా చేసింది. ముఖ్యంగా రాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజాలతో నిర్వహించిన ‘భువన విజయం’ రూపకాన్ని ప్రస్తుతం తెలుగునాట పలువురు కవి పండితులు ప్రదర్శిస్తున్న తీరు తెలుగు సాహిత్యాన్ని అనూహ్య స్థాయిలో పరిపుష్టం చేసిందని ఆయన చెప్పారు.
మన సాహిత్య రూపకాలకు ఘనమైన చరిత్ర ఉంది. మన మాజీ ప్రధానమంత్రి, బహు భాషావేత్త పి.వి. నరసింహారావు శ్రీకృష్ణ దేవరాయలుగా వేషం ధరించిన ‘భువన విజయం’ రూపకం సహజంగానే ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలం కన్నా ముందు రోజుల్లో మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అగ్రశ్రేణి సాహితీవేత్తలు ఆ రూపకంపై మక్కువతో వివిధ పాత్రలు పోషించేవారు. తమ ముందు తరాల కవులు తీర్చిదిద్దిన కవిత్వ రూపాలు, చమత్కారాలను వారి వేషభాషల్లోనే ప్రేక్షకులకు పరిచయం చేయటం ప్రతిష్టాత్మకంగా భావించేవారు.
క విసమ్రాట్ విశ్వనాథసత్యనారాయణ వంటివారు పాల్గొనగా గుంటూరు శేషేంద్ర శర్మ వంటి వారు ‘భువన విజయం’లోని అష్ట దిగ్గజాల్లో ఒకరుగా అభినయిస్తూ పద్య వైభవాన్ని అద్భుతంగా చూపించేవారు. ప్రభుత్వ ఆస్థాన విద్వాంసులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కవులు ‘భువన విజయం’లో పాత్రలు ధరించి కమ్మని పద్యాలు ఆలపించడం తెలుగునాట పలువురికి మరచిపోలేని అనుభవం.
నిత్య నూతనం
భువన విజయం రూపకంలో హేమాహేమీలైన అవధానులు తమ పూర్వ కవుల పద్య కవితలతోనే కాక, ఆశు పద్యాలతో, చక్కని చమత్కారాలతో లక్షలాది మంది తెలుగు భాషాభిమానుల్ని పరవశింపజేశారు. ఏకాదండయ్య పంతులు, జమ్మలమడక మాధవరాయ శర్మ వంటివారు తొలి దశలో ‘భువన విజయం’ ప్రదర్శన నమూనాను తీర్చిదిద్దారు. దాశరధిని తెనాలి రామకృషణ పాత్రలో చూసి లక్షలాది మంది మురిసిపోయారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖను ప్రతిభావంతుల నెలవుగా మలచిన దివాకర్ల వెంకటావధాని స్క్రిప్టుతో ఒక ఒరవడి వచ్చింది. ఆయనతో కలసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనే కాక, ఇతర రాష్ట్రాలలో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించిన వారు 16 శతాబ్దపు కవులుగా హావ భావాలు ప్రదర్శించి జేజేలు అందుకున్నారు. చారిత్రక నవలా చక్రవర్తిగా ప్రఖ్యాతులైన ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ఈ భువన విజయాన్ని 1100కు పైచిలుకు సంఖ్యలో వేదికలపై ప్రదర్శించారు.
అయితే, 1945లో మొదలైన ఈ రూపకం స్ఫూర్తితో గుంటూరు నుంచి సరికొత్త రూపకాలు ముందుకొచ్చాయి. ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతిగా పూజలందుకుంటున్న ప్రసాదరాయ కులపతి 1960 ప్రాంతంలో ఇంద్ర సభను రూపొందించారు. నాటి తరం కవిపండితులంతా పాత, కొత్త తరం కవుల వేషాలతో కవితలు, పద్యాలతో ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించేవారు. తిరుపతి వెంకటకవులు, బెల్లంకొండ రామదాసుల వివాదం అప్పట్లో బ్రిటిష్ వారి న్యాయస్దానానికి పరీక్ష అయింది. ఒక ప్రశ్నలో వ్యాకరణ దోషం ఉందా, లేదా అన్నది అప్పటి వ్యాజ్యం.
తెలుగురాని న్యాయమూర్తులు తలపట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. వాది, ప్రతివాదులకు అంగీకారమైన మధ్యవర్తిని నియమిస్తామని, ఎవరు కావాలో తేల్చుకుని, ఆ తీర్పును గౌరవించుకోండని చివరికి న్యాయమూర్తులు సూచించారు. అందుకు వాది, ప్రతివాదులు అంగీకరించి మధ్యవర్తిని ఎంచుకున్నారు. ఆ మధ్యవర్తి పల్లెపూర్ణ ప్రఙ్ఞాచార్యులు. అప్పటికాయన వయసు 22 ఏళ్లు మాత్రమే. వయోధిక ఉద్దండుల మధ్య నూనూగు మీసాల యువకుడి పెద్దరికం ఇది. ఆ వాదాలు, వివాదాలు సాహిత్యలోకానికి పాఠాలు. అలాంటివే సాహిత్య రూపకాలలో ముడి సరుకులు.
ఇటువంటి కవిత్వ చమత్కారాలు, సవాళ్లు, ప్రశ్నలు, పరిష్కారాలు, పొగడ్తలు, తెగడ్తలు వగైరాలతో సుమారు 35 రూపకాలను కవితా ప్రసాద్ ఓ జాబితాగా రూపొందించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ భూసురపు వెంకటేశ్వర్లు మరింత పొందికగా వాటి వివరాలను గ్రంథస్థం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు, ఆలోచనలకు తగినట్టుగా, వారం రోజుల పాటు ప్రతి సాయంత్రం ప్రసంగం, ఆ తరువాత రూపకం ఉండేలా ఆయన కార్యక్రమాలను రూపొందించారు. పాత రోజుల్లో లాగానే ఇప్పుడు కూడా తెలుగు భాషాభిమానులు ఈ కార్యక్రమాలకు తరలి వచ్చారు. నిజానికి ఈ శతరూప కార్యక్రమాలను తలపెట్టినప్పుడు ప్రేక్షకులు వస్తారా, వాళ్లను ఆకట్టుకోగలమా అన్న సందేహం కలిగిందని, కానీ యాభైౖ రోజుల శతరూపం పూర్తయిన తరువాత మదింపు వేస్తే ప్రామాణికమైన కార్యక్రమాలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదనే సంగతి నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమాలను అభినందించడంతో పాటు అనేక సూచనలు కూడా అందాయి. సాహిత్య రూపకాల వేదిక పై వివిధ రూపకాలను చూసిన వారిలో పెద్దలకన్నా నవతరం ఎక్కువ శాతం ఉన్నారు. “ఈ అమూల్యమైన సూచనలను క్రోడీకరించి ఆచరణాత్మక కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. పసలేని వాటిని ఇక ప్రోత్సహించదలచుకోలేదు. ఎటువంటి కార్యక్రమాలకు ఆదరణ ఉంటుందో ప్రేక్షకుల తీరును బట్టి అర్థమైపోయింది. ఇటువంటి కార్యక్రమాలను రాజధాని నగరంలో కూడా వేరు వేరు ప్రాంతాలలో అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని సానుకూలంగా పరిశీలిస్తున్నాం” అని ఆయన చెప్పారు.
సమూలమైన మార్పులు
ప్రేక్షకుల నుంచి లిఖితపూర్వకంగా సూచనలను, స్పందనలను తీసుకోవడమే కాక, ఆయన ప్రేక్షకుల మధ్య కూర్చుని, వారి స్పందనలను స్వయంగా గమనించారు. ఆ తరువాత ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలను సమూలంగా మార్చదలచుకున్నారు. ఉత్తమ నాటకాలు, నవలలను కూడా తీసుకుని వాటితో కార్యక్రమాలు రూపొందించి, తెలుగు భాషాభిమానులకు సాంస్కృతిక శాఖ స్ఫూర్తిదాయకం కావాలని ఈ శాఖ భావిస్తోంది. పోటీల్లో విజయం సాధించిన నాటకాలకు కనీసంగా లక్ష రూపాయల బహుమతినివ్వాలని కూడా నిర్ణయం జరిగింది. అన్ని ప్రక్రియలకూ అర్థవ ంతమైన ప్రయోజనం ఉండేలా సరికొత్త వి«ధివిధానాలు రూపొందుతున్నాయి. చిన్న చిన్న కథలను చిరు పుస్తకాలుగా వెలువరించి, విద్యాసంస్థలలో చిన్నారులకు పఠన యోగ్యంగా ఉంచాలన్న ఆదేశాలు జారీ అవుతున్నాయి.
ఆ తరువాత హైస్కూలు స్థాయిలో సాంస్కృతిక పోటీలను పెంచేలా, అవి అద్భుతంగా ఉండేలా ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. “మేము నిర్వహించిన 7 రూపకాల్లో ఒకదాన్ని పూర్తిగా చిన్నారులకు కేటాయించాం. నల్గొండ జిల్లా లోని సర్వేల్ నుంచి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల తమ పద్యధారతో పండితుల్ని కూడా మెప్పించారు. ఆ విద్యాలయం ప్రిన్సిపాల్ కె.వి.ఎన్. ఆచార్య తమ విద్యార్థి బృందాన్ని ఈ విషయంలో చక్కగా తీర్చిదిద్దారు. ప్రభుత్వానికి ఒక వినతి పత్రం సమర్పిస్తే చాలు, తగిన రీతిలో కార్యక్రమాల నిర్వహణ, అందుకు కావాల్సిన వనరులు మేం సమకూరుస్తాం” అని కవితా ప్రసాద్ వివరించారు. ప్రస్తుతం హైదరాబాదులో జరిగిన కార్యక్రమాలన్నిటినీ ఆన్‌లైన్‌లో ప్రపంచంలోని తెలుగువారందరి ముందూ ఉంచడానికి సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. యూట్యూబ్‌లో కూడా ఈ కార్యక్రమాలను చూడవచ్చు. సాంస్కృతిక శాఖకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్ ఉంది.
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో జరిగిన కవితాగోష్టిని ‘భువనవిజయం’గా చూపించే ప్రక్రియకు రాయలసీమ కళాకారులు కొత్త సొబగులు సంతరించిపెట్టారు. అసమాన మేధతో అవధాన విద్యలో మేటిగా పేరెన్నికగన్న డోన్ వాస్తవ్యుడు గండ్లూరి దత్తాత్రేయ శర్మ సమన్వయ నిర్వహణలో సరికొత్త రూపకం రసవత్తరంగా సాగింది. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన రంగస్థల కళాకారులు, కవి పండితులు కలసి ఆ రూపకాన్ని సగటు పద్య నాటకాలకన్నా మిన్నగా మనోరంజకంగా ప్రదర్శించారు.
పెద్దన కవిత్వపు జిగిబిగితో పాటు తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి, రామభద్రుడు వంటి పాత్రలు తమ కవితలతో, పద్యాలతో స్పందించిన తీరు విశేష ప్రశంసలు అందుకుంది. అన్నము -పప్పు-కూర-చారు-పదాలను శ్రీరామచంద్రునికి అన్వయిస్తూ పద్యం చెప్పమని కోరితే, సుగ్రీవుడి మైత్రీబంధాన్ని కలిపి ఆ పదాలతో పద్యాలను పూరించడం శభాష్ అనిపించుకొంది. మరో సందర్భంలో వానెమ్మ-వానెక్క-దానెమ్మ-సవతి -మాటల్ని కలిపి మంచి పద్యం చెప్పమని కోరితే, క్షణాలలో భీష్ముడికి అమ్మ గంగమ్మ అంటూ మొదలుపెట్టి, భూదేవికి సవతి శ్రీదేవిగా వరసల బాంధవ్యాన్ని చెప్పి మెప్పించారు.
వీర నారీ విజయం
సుమారు 125 నిమిషాలపాటు కమ్మని రాగాలు వికటకవి పద్యాల చమక్కులతో ఆ రూపకాన్ని రసప్లావితం చేశారు. తమ భాష పట్ల మక్కువ పెంచుకోవాలన్న ఉపన్యాసాలకన్నా ఆ ఒక్క ప్రదర్శన వెయ్యి రెట్లు ఫలితం ఇస్తుందని ప్రేక్షకులు వ్యాఖ్యానించారు. అతి త్వరలో పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన ‘శివతాండవం’లోని లయ అక్షరాలలోంచి పులకింపచేసే నాద మహత్తును ఇంకో కార్యక్రమం ద్వారా వినిపిస్తామని సంచాలకుడు ప్రకటించారు. ఆ తరువాతి రోజు అమరసీమలో ఇంద్రుడు తమ దగ్గర ఉన్న కవులను ఆహ్వానించి గోష్టిగా నిర్వహించే కార్యక్రమాన్ని రసరమ్యంగా చూపారు. నన్నయ భట్టు, తిక్కన. ఎర్రాప్రగ్గడ, శ్రీనా««థుడు, పోతన, మొల్ల, వేమన, విశ్వనాథ సత్యనారాయణ, దాశరది, జాషువా, శ్రీశ్రీలతో కవిత్వ హొయలు తెలిపేలా నిర్వహించారు.
ఆ మరుసటి రోజున అత్యున్నత విద్యావంతులైన మహిళలతో ‘వీరనారీ విజయం’ ప్రదర్శించారు. భారతమాత ధీర వనితలతో సమావేశం నిర్వహిస్తూ అనుభూతుల్ని పంచుకోవటం ఆ రూపకంలోని సారాంశం. రుద్రమ్మ, ఝూన్సీ, మాంచాల, జిజియాబాయి, సమ్మక్క, సారక్క, చానమ్మ, గౌతమి,నాగమ్మ, మెదక్ ను పాలించిన రాణి శంకరమ్మల వేషాలలో విద్వన్మణులు చక్కగా అభినయించి ప్రశంసలందుకున్నారు. ఆ తరువాతి రూపకంగా విషణ్ణ వదనంతో కనిపిస్తున్న భారత మాతతో జాతీయ ఉద్యమ నేతలు ఒకొరకరుగా మళ్లా పుట్టి, ఈ సీమను చైతన్యవంతం చేస్తామని ఊరడిస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు.
ఇందులో వివేకానందుడు, తిలక్, అరవిందుడు, రామతీర్థుడు, బంకించంద్ర, సావర్కార్, మహాత్మా గాం«ధి, సుభాస్ చంద్ర బోస్, సరోజినీ నాయుడు, నివేదిత, జాతీయకవిగా కసిరెడ్డి వెంకటరెడ్డి అభినయించారు. వారు త్యాగమూర్తుల రూపురేఖలతో చూపరులందరినీ ఉత్తేజితుల్ని చేశారు. పద్యలీల-రాగహేల పేరిట చిమ్మపూడి శ్రీరామమూర్తి 52వ సారి రసవత్తర సంగీత ప్రయోగం చేశారు. అయిదుగురు గాయకులు వాద్య సహకారంతో వారు ఆలపించిన పాటలు కీర్తనలు వంటివి. ఒక రాగం నుంచి మరో రాగానికి వెళ్లిపోతూ దీన్ని రాగావధానం తరహాలో నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు స్వరమయ ప్రపంచంలో శ్రోతలందరినీ ఓలలాడించారు.
గణపతి నిమజ్జనం రోజున నవ్వుల నైవేద్యంగా హాస్యవిజయంతో పకపక లు పండించారు. గురజాడ అప్పారావు, చిలకమర్తి, మొక్కపాటి, పానుగంటి, ముళ్లపూడి వెంకట రమణ, భానుమతి వంటివారు సమావేశమై తమ రచనలలోని హాస్యంతో శ్రోతలను ఆహ్లాదంలో ముంచెత్తారు. సప్తాహం చివరి రోజున విద్యార్థులు 16 సారి నిర్వహించిన ‘భువన విజయం’ అందరి దీవనలు అందుకొంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న పిల్లలు ధాటీగా ప్రబంధ కవుల పద్యాలను ఆలపిస్తూ, ఛందస్సుల విన్యాసాలు, చమత్కారాలతో కవిత్వపు కవ్వింపులతో మురిపించారు.
శతరూప కార్యక్రమాలు
తెలుగుతనాన్ని అసలు సిసలు పలుకుబడితో పండించే సాహితీ రూపక సప్తాహం పలురుచుల్ని అందించింది. సాంస్కృతిక శాఖ నిర్వహణ లో రాష్ట్ర రాజధానిలోని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇటీవల ఏర్పాటు చేసిన 100 రోజుల సాంస్కృతిక కదంబం శతరూప-2013 లో భాగంగా రసవత్తర సాహితీ రూపక సప్తాహం తెలుగు బిడ్డల సృజనను, తరతరాల వైభవాన్ని అందరి మనసుల్లోనూ కలకాలం మెదిలేలా చేసింది. హైదరాబాదుకు మాత్రమే ఆయా అక్షర పరిమళాలు పరిమితం కాకుండా, తెలుగువారందరికీ చేరేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తిరుపతిలో గత ఏడాది డిసెంబరులో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన తీర్మానం మేరకు ఈ ఏడాదిని ‘తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం’గా ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా, తెలుగు భాషా వికాసానికి సంబంధించి సరికొత్త కార్యకమాలు వేదికల పైకి వస్తున్నాయి.
ప్రభుత్వం మార్చి 21న తొలిసారిగా ప్రపంచ కవితాదినోత్సవాన్ని నిర్వహించింది. దీనికి 43 మంది కవులను ఆహ్వానించి, వారి కవితలను వినడానికి వచ్చిన శ్రోతలకు అల్పాహారంతో ఆతిథ్యమిచ్చింది. ఆ తరువాత జరిగిన కార్యక్రమంలో ఓ కవితా సంకలనం కూడా వెలువరించింది. పలువురు అగ్రశ్రేణి అవధానులతో వారం రోజుల పాటు రసవత్తరంగా పద్యాల విందును అందించింది. ఆయా కార్యక్రమాల సారాన్ని పుస్తకంగా అందరకి అందిస్తామని కూడా ప్రకటించింది. వాటి కొనసాగింపుగా ఉద్దండ విద్వాంసులతో సాహిత్య లహరి, రూపక సప్తాహం జరిగాయి. ఎల్లలు లేని సృజన పాటవాలకు ప్రత్యేక వేదికగా ప్రభుత్వం శతరూప- 2013ను మలచింది. కొద్ది రోజుల్లోనే ప్రాచీన సాహిత్యం, ఆధునిక కవిత్వం, నవల, కథ, శాసనాలు, నాటకం, పత్రికలు తదితర అంశాలపై వెలువ రించిన ఉపన్యాసాల పరంపర పుస్తకంగా బయటికి వస్తోంది.