పద్యకవిత్వంలో భావచిత్రాలు – పి. రామకృష్ణ
వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది… సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి నిల్లాలి బొట్టనంగ’ ఉందన్నాడు. ఇప్పటికీ గృహిణులు నుదుట కుంకుమద్దుకొని, కొనగోట దిద్దుకునే దృశ్యాన్ని చూస్తూనే వున్నాం. బాపు చలనచిత్రంలోనూ, చలనం లేని చిత్రంలోనూ ఆ దృశ్యాల్ని చూస్తున్నాం కూడా. అది చాలు, నాచన వర్ణన కూడా చిత్రమే అనడానికి.
పై శీర్షిక పలువురికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కారణం? కథ ప్రధానాంశంగా సాగే పద్యకవిత్వంలో భావచిత్రాలుండే అవకాశం లేదనీ, అవి ఆధునిక కవిత్వంలో (వచన కవితలో) కనిపించే కవితాంశమనీ అభిప్రాయం ఏర్పడి వుండటం అందుకు కారణం. ‘భావకవిత్వం’గా గుర్తించిన కవిత్వంలోనే భావచిత్రాలు కనిపించనప్పుడు, పద్యకవిత్వంలో వుండటం సాధ్యమా అన్న సందేహమూ రావచ్చు. బహుశా, పద్యకవిత్వంలో వుండే సూర్యోదయాస్తమయాది వర్ణనల్నీ, ఋతు వర్ణనల్నీ భావచిత్రాలుగా భావిస్తూ వుండవచ్చని, అనుకోనూవచ్చు. అటువంటి వారికి మన విశిష్టమైన, విస్తారమైన పద్యసాహిత్యం గురించి తెలీకపోవడమే కారణమనుకోక తప్పదు.
పద్య సాహిత్యంలో సూర్యోదయ, సూర్యాస్తమయ వర్ణనలూ, ఋతు వర్ణనలూ అద్భుతంగా వున్నాయి. వాటినే భావ చిత్రాలనడం లేదు. వర్ణనలు వేరు, భావచిత్రాలు వేరు. వర్ణనలు, కవి తన కల్పనా శక్తికొద్దీ చేసేవైతే, చదువరి కళ్ళముందు ఒక నిర్దిష్ట చిత్రాన్ని నిలిపి వుంచగలిగేది భావచిత్రం. స్థూలంగానూ, తేలికగానూ చెప్పాలంటే… ఒకటి చెప్పేదైతే, మరొకటి చూపించేది. శ్రవణానికంటే దృశ్యానికి ఎక్కువ ప్రభావం వుంటుందని చెప్పనక్కర్లేదు. ఆ రీత్యా, కవిత్వ సృజనలో భావచిత్రాల కల్పన వర్ణన కన్నా ఉత్తమ స్థాయికి చెందిన ఆధునిక కవితా రూపంగా అభివర్ణించవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న ఎదురయ్యే అవకాశముంది.
మరి ప్రాచీన ప్రక్రియ అయిన పద్యకవిత్వంలో ఆధునిక కవితా రూపమంటున్న భావచిత్రాల కల్పన ఎలా సాధ్యం? ‘ఆధునికత’ అన్నది ఏ కాలంలోనైనా వుంటుంది. సమకాలీనతను ఏ స్థాయిలోనైనా సరే అధిగమించి ముందుకుపోయినా, అది ఆధునికతే. ‘ఆధునికత’ అన్న నిర్ధారణలోనే ఆధునికత అంతా ఇమిడి వుండదు. అప్పటికి… ఆధునికత. అంతే! అయితే, అప్పటి ఆధునికత ఇప్పటికీ ఆధునికత కాగలుగుతుందా? సైన్స్ పరంగా ఈ సందేహానికి తేలిగ్గా సమాధానం చెప్పవచ్చు కానీ, మనం సాహిత్యపరంగానే చెప్పుకుందాం. నిజమే, పద్యసాహిత్యమంతా కథ ప్రధానాంశంగా సాగిందే. అయితే, కవిత్వ మనేది అది అనువాదమైనా, ‘కేవల కల్పనా కథ’లైనా, పురాణ కథే అయినా, ఏదైనా అది మానసిక పరిశ్రమే. అందువల్ల, కథాగమనంలో ఎక్కువగా వైవిధ్యం చూపేందుకు అవకాశం లేకపోయినా, కథకు నిమిత్తం లేని, తనకు నిమిత్తమైన అవకాశం కల్పించుకుంటాడు కవి. సూర్యోదయ, సూర్యాస్తమయ, ఋతు వర్ణనలు అలావచ్చినవే. ఊహాశక్తిమంతులైన కవులు ఆ వర్ణనలకు మించిన కల్పనలు చేశారు. అవి ఇప్పటికీ ఆధునిక కవితా రూపాలే. అవి మనం ఇప్పుడంటున్న భావచిత్రాలే. పద్యంలో అటువంటి దృశ్యాలు కనిపించడం అరుదే కావచ్చు. కానీ, ఉన్నాయని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.
కృష్ణదేవయరా ‘ఆముక్తమాల్యద’లో ఋతు వర్ణనలు అద్భుతంగా వున్నాయన్నది తెలిసిందే. అందులో వర్ణన స్థాయిని మించిన భావచిత్రాలూ ఎన్నో వున్నాయి. చూడగల కళ్ళకు కనిపిస్తూనే వున్నాయి. ఈ పద్యం చూడండి.
తడి తల డిగ్గి ముంపజడతం తుదఱెప్పల కన్నువిప్పి పు ల్పొడుచుచు నీరు ముంగరలపోలిక ముక్కునగూడ, నోట గొం తొడియుచు గూటిక సగమొత్తుచు ఱెక్కవిదుర్చుమున్ను గా వడకుటెగాక చేష్టుడిగె, వక్షము పక్షులు జానువుల్ చొరన్
వర్ష ఋతువు వచ్చింది. ‘ఓ హరి సాహరిన్ ప్రథమ మొల్కెడిధారల..’ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో ఓ చెట్టు, ఆ చెట్టు కొమ్మల్లో గూడు, ఆ గూట్లో ఓ పిట్ట. కనిపిస్తోందా? ఇంకా నిశితంగా చూడండి! వర్షాన్ని చెట్టూ ఆపలేదు, గూడూ ఆపలేదు కదా! ఆ వర్షంలో ఆ చిన్నారి పిట్ట ఎలా వుంది? తలమీదుగా జారే చినుకుల్తో తడిసి ముద్దయి, ముక్కుమీదుగా జారే బిందువులు ముత్యాల ముక్కెరలా వుండగా, గూటి పుల్లల్ని సవరించడం, ఱెక్క విదిల్చి తడి ఆరబెట్టుకోవడం వంటి కదలికలు కూడా లేకుండా, అప్పుడప్పుడూ కంటి ఱెప్పలు కొద్దిగా విప్పి చూసి, వర్షపు చుక్కలు పడితే మళ్ళీ కళ్ళు మూసుకొని, శరీరాన్ని కాళ్ళ మధ్యకు కుదించుకొని వుండిపోయింది. ఈ అద్భుతమైన కల్పననేమందాం? వర్షాన్నీ, చెట్టునీ, చెట్టుమీదున్న గూటినీ, గూట్లోని తడిసిన పిట్టనీ చూపించడాన్ని భావచిత్రం అనగూడదా? కూడదనే వాళ్ళు భావచిత్రాలంటే ఏమిటో కూడా చెప్పవలసి వుంటుంది.
రమణి మరికొంత వడిదాక రథము జూచు
తరుణి అటుపైన కేతనము జూచు
కలికి ఆపైన రథపరాగమ్ము జూచు
పడతి అంతట మరి వట్టి బయలు జూచు
కంకంటి పాపరాజు గారి ‘ఉత్తర రామాయణం’లోని ఈ చిన్న పద్యంలో, చరణానికొకటి చొప్పున నాలుగు భావచిత్రాలున్నాయి. అన్న ఆజ్ఞ ప్రకారం సీతను అడవిలో దించి వెళ్తున్నాడు లక్ష్మణుడు. విషయం తెలుసుకున్న సీత విషాదంతో, నిశ్చేష్టతో నిలిచి చూస్తోంది. తనకు గత జీవితంతో సంబంధం తెగిపోయింది. రథం నడుపుకొని వెళ్ళిపోతున్న మరిది కనిపిస్తున్న దృశ్యమే ఆఖరి అనుబంధం. అందువల్ల, కన్నీటితో ఆ దృశ్యం చెరిగిపోకుండా వుండేట్టు నిర్నిమేషంగా చూస్తోంది. నాలుగు చరణాల చివర ‘జూచు’ అన్న శబ్దాన్నే కవి వాడటం గమనించాలి. సీత చూస్తోంది… చూస్తోంది, ఆ దృశ్యం అలాగే వుంది, రథం దృశ్యమే మారుతూ వచ్చింది. ముందుగా తననక్కడ దించి వెళ్తున్న రథం కనిపించింది. ‘కొంతవడి దాక’ అంటే కొంతవేగం దాకా పూర్తిగా రథం కనిపించింది. ఆ తర్వాత కేతనం మాత్రమే కనిపించింది. ఆ తర్వాత రథ వేగానికి లేచిన దుమ్ము మాత్రమే కనిపించింది. ఆ తర్వాత దుమ్ము కూడా లేని వట్టిబయలు (శూన్యం) కనిపించింది. కెమేరాతో చూపించినట్టున్న ఈ దృశ్యాన్ని సీతతో పాటు మనమూ చూస్తాం.
ప్రక్కలు వంచు, వంచి మునిపండ్లను పండ్లనురాచు, రాచి ఱొ మ్మక్కలుజేయు, చేతి తలయల్లన కాళుల సంది సంది, లో చక్కికి నొక్కు, నొక్కియిరుచంబడ గుమ్మడి మూడగట్టి, వీ పెక్కి దువాళి చేసి చలి ఇక్కడ నక్కడ బెట్టువేకువన్
– వల్లభరాయుడు
హేమంతరాత్రి ఏ రైలో, బస్సో తప్పి నిరాశ్రయంగా చిక్కినప్పుడు, లేదా మీరు రైతులైతే ఏ పొలం కాపలాలోనో వున్నప్పుడు, ఈ పద్యం మీకు తెలీకపోవచ్చు కానీ, ఈ అనుభవం తెలిసే వుంటుంది. ముందుగా ‘ప్రక్కలు వంచు’ భుజాలు వంచుకునేట్టు చేస్తుంది, ఉహుహూ అంటూ ముందరి పండ్లను రాచుకునేట్టు చేసి, రెండు చేతుల్తో రొమ్ము అదుముకునేట్టు చేస్తుంది, తలను కిందికి దించి కాళ్ళమధ్య కుదించుకునేలా చేస్తుంది, కాళ్ళూ చేతులూ లేని ముద్దలా (మూటలా) మారిన నీ వీపెక్కి సవారీ చేస్తూ, వేకువ జామున చలి చంపేస్తుంది. చలి చేసిన ఈ ‘చిత్ర’హింసను చూసి, వణుకుతూనే నవ్వుకుంటాం.
– ‘ప్రక్కలు వంచు, వంచి మునిపండ్లను పండ్లను రాచు, రాచి ఱొమ్మక్కలు జేయు, చేసి ….’ ఈ విధంగా ఒక స్థితి నుంచీ మరో స్థితికి మారిన చలిహింసను హాస్యభరితంగా చూపించాడు కవి. – ‘గుమ్మడి మూగట్టి’ ‘వీపెక్కి దువాళి చేసి’ ఇవి అచ్చమైన తెలుగు పదాలు. – ‘చలి ఇక్కడ నక్కడ బెట్టువేకువన్’ వేకువజామున చలి వణికిస్తోంది అని ఒక్కవాక్యంలో చెప్పకుండా, ఈ విధంగా శరీర వ్యక్తీకరణ (బాడీ లాంగ్వేజ్) ద్వారా చెప్పడంతో నవ్వకుండా వుండలేం. చలిని ఒక వాతావరణ విశేషంగా కాకుండా, చలినీ, బాధితుడినీ ఇద్దర్నీ మనుషులేనన్నట్టు చెప్పడం ద్వారా కళ్ళముందు ఒక దృశ్యాన్ని నిలుపుతోంది.
సమయ వినోది మిన్ననెడి చక్కనిరంగమునందు ది గ్రమణులు చూడ గారడము రక్తినిజూప విధుండనెండు న ద్దమునొక కర్ణమందునిచి, దాపలి కర్ణము నందు హేమ చ క్రము వెడలంగ దీసెననగా, రవిదోచె ప్రభాప్రభావుడై
– చిత్ర కవి సింగరార్యుడు
కావడానికి సూర్యోదయ వర్ణనే. అయితే, ప్రత్యేకత వుంది. వెన్నెల రాత్రి గడచి వేకువ రావడంతో చంద్రుడు పాలిపోయి అద్దం బిళ్ళలాగై అస్తమిస్తూంటే, ఇటు సూర్యుడు బంగారపు చక్రంలా ఉదయించాడు. కాలమనే గారడీ మనిషి ఆకాశ రంగం మీద తన విద్యను ప్రదర్శిస్తున్నాడు, అదీ దిక్కులనే స్త్రీలు చూస్తుండగా. ప్రదర్శనలో, అవసరం తీరిన చంద్రుడిని ఒక చెవి సందున దోపుకొని, ఇంకో చెవి సందునుంచీ సూర్యుడిని బయటికి తీసినట్టుందట! గారడీ మనిషి తన ప్రదర్శనకు అవసరమైన సాధనాలను అందుబాటులో వుంచుకునేందుకు చెవి సందున దోపుకున్నాడనుకోవాలి. ఏమైనా, సూర్య చంద్రులిద్దరికీ రెండు చెవులూ సరిపోయాయి. ఈ కల్పనతో కవి ‘చిత్రకవి’ పేరును సార్థకం చేసుకున్నాడు.
సూర్యోదయాన్ని నాచన సోమనాథుడు తన ‘ఉత్తర హరివంశం’లో… ‘కుంకుమహత్తించి కొనగోట తీర్చిన పురుహూతి నిల్లాలి బొట్టనంగ’ ఉందన్నాడు. శచీదేవి బొట్టు సంగతి మనకు తెలీదుగానీ, ఇప్పటికీ గృహిణులు నుదుట కుంకుమద్దుకొని, కొనగోట దిద్దుకునే దృశ్యాన్ని చూస్తూనే వున్నాం. బాపు చలనచిత్రంలోనూ, చలనం లేని చిత్రంలోనూ ఆ దృశ్యాల్ని చూస్తున్నాం కూడా. అది చాలు, నాచన వర్ణన కూడా చిత్రమే అనడానికి.
తమి పూదీగెల తూగుటుయ్యెలల పంతా లాడుచున్ తూగు నా కొమరుం బ్రాయపు గబ్బిగుబ్బెతలయంఘ్రల్చక్కగా సాగి మిం టి మొగంబైచనుదెంచు ఠీవి కనుగొంటే దివ్యమౌనీంద్ర! నా కమృగీనేత్రల మీద కయ్యమునకున్ కాల్దాచు లాగొప్పెడిన్
– పింగళి సూరన
మణికంధరుడనే శిష్యుడితో కలసి దివి నుంచీ భువికి దిగుతున్నాడు నారదుడు. పూలతోటలో కల భాషిణి చెలికత్తెలతో కలసి ఉయ్యెలలూగుతున్న దృశ్యాన్ని చూపుతూ ఆ శిష్యుడంటాడలా. ఉయ్యాల లూగుతున్న ఆ యువతుల పాదాలు ఆకాశం వైపు దూసుకురావడం చూస్తుంటే, స్వర్గంలోని అప్సరసలతో కయ్యానికి కాల్దూచినట్టు లేదూ.. అన్నాడు. మీ అందాలు మా కాలి గోటి కి సరిరావన్నట్టు సవాల్ చేయడంలా వుంది అనడం. శిష్యుడి వర ్ణన విని ‘భళిరా! సత్కలి వౌదు’ అని మెచ్చుకుంటాడు నారదుడు. ఆ ప్రశంస మణికంధరుడికీ కావచ్చు, పింగళి సూరనకూ కావ చ్చు. అదలావుంటే, ఉయ్యెలలూగుతున్న యువతులను పైనుంచీ చూస్తున్నప్పటి అనుభూతిని కలిగించడం ఇందులోని ప్రత్యేకత.
సాయంకాలం. పక్షులు తమ ఆహారాన్వేషణను ముగించుకొని గూళ్ళకు చేరుకుంటున్నాయి. చెరొక దిక్కునా వెళ్ళిన పక్షులు జంటలను కలుసుకుంటున్నాయి, ఇ(గూ)ళ్ళకు చేరుకోవడానికి. ఒక చక్రవాకి తన జతగాడి కోసం వెతుకుతోంది. ఎదురుగా వచ్చే పక్షుల్లో వున్నాడేమో (ఉందేమో) అనుకుని పిలుస్తూ (కూస్తూ) వెళ్ళి చూసి కనిపించకపోతే, ఆకాశంలో ఇటూ ఇటూ తిరుగుతూ చూస్తోంది. ఎక్కడా కనిపించక, ఆందోళనతో అలసటతో ఎక్కడైనా నీరు తాగేందుకు ఏ నది ఒడ్డునో వున్నాడేమోని అక్కడా వెతుకుతోంది. పిలిచి పిలిచి నోరు దాహంతో ఎండిపోతోంది కనుక, నీరు తాగుదామని కొలను నీటిలో ముక్కు ముంచుతుంది. కానీ, తాగాలనిపించదు. మళ్ళీ ఎగురుతుంది, వెతుకుతుంది… ‘సంజప్రియబాసి వగనొక్క చక్రవాకి’.
‘మను చరిత్ర’లో ‘ఏ విహంగముకన్న ఎలిగించుచును సారెసారెకు సైకతమ్ముల కూడదాఱు’ అన్న పద్యంలో కనిపిస్తున్న భావచిత్రం అది. కావ్యార్థంలో వరూధిని స్థితికి సూచనగా వుందనుకున్నప్పటికీ, ఆ విహంగాన్వేషణను చూపించడం ఎంత హృదయంగమంగా, ఆర్ద్రంగా, ప్రత్యక్షంగా వుందో గమనించవచ్చు. ఇంత వ్యాఖ్యానం ఎందుకంటే, పరంపరగా కనిపించే పద్య కావ్యాలలో కూడా కవి ప్రత్యేకంగా కనిపించే సందర్భాలున్నాయనడానికే. వర్షంలో ఓ చెట్టుమీద గూట్లో తడిసిన పిట్టను ‘ఆముక్తమాల్యద’ కవి చూడగలిగితే, సాయంకాలం గూటికి చేరుకోవలసిన పక్షి రాకపోతే, జతపక్షి పడే ఆవేదనను ‘మనుచరిత్ర’ కవి చూడగలిగాడు. భావచిత్రాలనదగిన ఇటువంటి సందర్భాలు మన పద్య కవిత్వంలో, లేదా పద్య సాహిత్యంలో (రెండిటికీ అభేదం పాటించానని మనవి) ఎన్నో వున్నాయి.
ఛందోబద్ధ పద్యం ప్రస్తుత సామాజిక సమస్యల చిత్రణకు అనువైనది కాదని అంగీకరిస్తూనే, పద్య కవిత్వమంతా యతిప్రాసల ప్రయాసని, అది చదవడం అనవసరమనీ అనడాన్ని ‘అజా ్ఞనం’అనీ.. సున్నితంగా చెప్పాలంటే ‘తెలియనితనం’ అనీ అనాల్సి వుంటుంది. పద్య సాహిత్యం మన పునాది. మన జాతి సంపద.
– పి. రామకృష్ణ