పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్

పెద్దలు వెళ్లిపోతున్నారు -బొగ్గుల శ్రీనివాస్

“లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ వించాను కాబట్టి ఇవి లేని సమాజం కోరుకుంటాను.”

” పిల్లలు చిరకాలం వ ర్ధిల్లాలి
తల్లులూ,తండ్రులూ చిరకాలం వర్ధిల్లాలి
మనుషులు చిరకాలం వర్ధిల్లాలి
గాయపడిన ఈ గ్రహం చిరకాలం వర్ధిల్లాలి
గాలిలోని శ్రేష్ఠమైన పాలు చిరకాలం వర్ధిల్లాలి
ప్రవహిస్తున్న నదులూ, తల్లిలాంటి సముద్రాలూ చిరకాలం వర్ధిల్లాలి

గడ్డిపరక మధుర రసం చిరకాలం వర్ధిల్లాలి
గ్లోబులోని పచ్చదనమంతా చిరకాలం వర్ధిల్లాలి
బతికున్న జంతువులన్నీ చిరకాలం వర్ధిల్లాలి
మనందరి ఆలోచనలకన్నా లోతైన ఈ భూమి చిరకాలం వర్ధిల్లాలి
…………………”
‘కవిత్వం కావాలి కవిత ్వం’ అని కవిత్వం కోసం పలవరించి, కలవరించి వెళ్లిపోయినస్వాప్నికుడు త్రిపురనేని శ్రీనివాస్ అనువదించిన కవిత ఇది. బ్రిటన్‌కు చెందిన అడ్రియన్ మిచెల్ రాసిన కవితను ‘ఆఖరి మాట’ అని అలా అనువదించాడు.
రావూరి భరద్వాజ మాటలు చదివినపుడు ఈ కవిత గుర్తుకొచ్చింది. ఆయనకు ‘భీమన్న సాహితీ నిధి’ పురస్కారం ఇచ్చినపుడు ఆ సంస్థ అధ్యక్షురాలు హైమవతి భీమన్న ఆయన మాటలను గుర్తు చేసారు. ఇంతకూ ఆ పెద్దాయన మాటలేమిటంటే…నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు. మోక్షంతో పనిలేదు. దుఃఖ బాధితుల కష్టాలన్నీ తొలిగిపోవాలి. సర్వ ప్రాణాలు సుఖపడాలి.
భిన్న నేపథ్యాలున్న ఈ ఇద్దరూ ‘అందరూ బాగుండాల’ని కోరుకున్నారు. ఈ గ్లోబునుద్దేశించి తమ భావాలు ప్రకటించారు.

అక్టోబరు 18 ఉదయం ‘అస్వస్థతతో భరద్వాజ’ అని పత్రికలో ఒక మారుమూల ఉన్న చిన్నవార్తను చదివాను. ఉరుకుల పరుగుల రోజువారీ జీవితంలో ఆఫీసు పనికి వెళ్లి తిరిగి వచ్చి సిస్టం ముందు కూర్చున్నాను. ఈనెల 25న జరపాలనుకుంటున్న ‘కలేకూరి మళ్లీ పుట్టినరోజు’కు సంబంధించిన కరపత్రాన్ని నా బాధ్యతలో భాగంగా మిత్రులకు ‘పోసు’్ట చేస్తున్నాను. 9గంటల రాత్రి. పక్కనే ఉన్న సెల్‌ఫోన్‌కు లెక్కకు మించి ఎస్ఎమ్మెస్‌లు వస్తున్నాయి. ఒక్కొక్కటీ చదువుకుంటూ పోయాను. దిమ్మ తిరుగుతోంది. అన్నిటిలోనూ విషయం ఒకటే-రావూరి భరద్వాజ ఇకలేరు..రావూరి భరద్వాజ అమర్ రహే. మబ్బు పట్టినట్టయింది. తేరుకుని ఒక్కొక్కరికీ ‘అమర్ రహే..అమర్ రహే’ అని తిరుగు ఎస్ఎమ్మెస్‌లు ఇచ్చాను కోరస్‌లాగా.

ఫేస్‌బుక్‌లో కరపత్రాలు పోస్టు చేసే పని వదిలిపెట్టి నా ‘టైమ్‌లైన్’లో ఇలా టైప్ చేసాను-“పెద్దాయన రావూరి మరణం ఆయనకు జ్ఞానపీఠ ఇచ్చినవారి ఔదార్యాన్ని కాదు-నిర్లక్షాన్ని, జాప్యాన్ని తెలిపింది. బడుగు రచయితలకు అన్యాయాన్ని తెలిపింది. సృజన వర్ధిల్లాలి”
మళ్లీ ఈ వాక్యాన్ని చదువుకున్నాను. ఏదో లోపం ఉన్నట్లనిపించింది. దానిని ఇలా తిరగరాస్తున్నాను-“ఇంకా ఎక్కడో భూమ్మీద మనుషులనే వాళ్లు ఉండబట్టి, ధర్మం ఒక్క పాదంమీదనైనా అక్కడక్కడా డేకుతుండ బట్టి, రుతుచక్రం తప్పించి అయినా వానలు పడుతుండడాన్ని బట్టి ఈ వయసులో ఐనా ఆ బడుగు పెద్దాయనకు జ్ఞానపీఠ వచ్చింది”

ఆ అత్యున్నత పురస్కారం ఆయనకు ప్రకటించినపుడు ఇదే ‘వివిధ’కు ఇంటర్వ్యూ చేస్తూ ఇదే మాటే అడిగాను-“సార్! ఈ వయసులో ఇంత ఆలస్యంగా మీకు ఇచ్చిన పురస్కారం గురించి ఏమనుకుంటున్నార ”ని. “ఇదీ ఇవ్వకపోతే నా తరఫున అడిగేవాళ్లెవరున్నారు?”అని ఆయన వేసిన ఎదురుప్రశ్నకు మౌనమే నా సమాధానమైంది. ఒక వెబ్‌సైట్ వార్షికోత్సవంలో దాసరి నారాయణరావు ఆయనను సన్మానించినపుడు కూడా వేదిక నుంచి ఈ ప్రశ్నే ఆయన వేసారు.
ఏది ఏమైనా, ఢిల్లీలో పదిరోజుల ముందు సెలైన్ బాటిల్ పట్టుకుని ఆయన పురస్కారం అందుకున్న దృశ్యాన్ని మరువలేము. ఈ జుగుప్సాకర స్థితిని తలుచుకుని ఈసడించక ఉండలేము.

ఇపుడు పెద్దలే కరువయ్యారు. ‘పుటుక నాది,చావు నాది బ్రతుకంతా దేశానిది’ అని నినదించే కాళోజీలు లేరు. అడ్డదిడ్డంగా దిక్కుదరీ లేకుండా పతనమవుతున్న దేశానికి హితవు చెప్పి మేల్కొలిపే పెద్దలు లేరు. విద్వేషాలు మాని మానవత్వంతో మెలగండని చెప్పేవారు లేరు. కన్నీళ్లు దిగమింగుతూ తన దారిన తాను అక్షరాలను వెలిగించిన 87 ఏళ్ల రావూరి భరద్వాజా లేరు. పెద్దలు వెళ్లిపోతున్నారు.

అవార్డు రాకముందు ఆయనను పట్టించుకున్నవారు లేరు. కనీసం పది సంవత్సరాల వెనక వరకు ఆయన ఉన్నారా లేరా అని కూడా పట్టించుకున్న వారు లేరు. ఎన్నో అవార్డులు, గౌరవ డాక్టరేట్లు, పురస్కారాలు ఆయనకు వచ్చి వుండవచ్చు. ఇది అంతా చాలా కాలం కిందటి మాట. ‘రావూరి భరద్వాజా..ఇంకా బతికున్నారా’ అన్నవాళ్లూ లేకపోలేదు. రుంజ(విశ్వ కర్మ రచయితలు కళాకారుల వేదిక) ఏర్పడిన కొద్దికాలానికి ఆయనను పుస్తకావిష్కరణకు ఆహ్వానించాము. జ్ఞానపీఠకు ముందు, తరువాత రెండుసార్లు పుస్తకావిష్కరణలు చేసారు. మంచి మాటలు నాలుగుచెప్పారు. ఆ నిరాడంబర జీవి ఇంత సాహిత్యం రాసారని మాకెవరికీ అప్పటికి తెలీదు.

వ్యవసాయకూలీగా పనిచేసారు. పశువుల కాపరిగా, హోటల్ వర్కర్‌గా, పేపర్‌బాయ్‌గా చేసారు. దుర్భర దారిద్య్రంలో ఉంటూ 180 పైగా పుస్తకాలు రాసిన రచయిత ఎవరూ తెలుగులో లేరు. అయినా ఆయనకు అవార్డు వచ్చినందుకు అసూయపడిన విశ్వవిద్యాలయాలు, పండితులు ఉన్నారంటే, మనం ఎలాంటి దేశంలో ఉన్నామా అని వేదన కలిగింది.

ఆరునెలలక్రితం ఆయన చెప్పిన మాటలతోనే ముగిస్తాను.
“లోకోద్ధరణకోసం రాస్తున్నామనే వాళ్ళను పట్టించుకోను. మాకు ఇష్టం లేనివైనా పొట్టకూటికోసమే రాస్తున్నామని తెగువతో చెప్పగల నిజాయితీ గల రచయితల పాదాలకు నమస్కరిస్తాను….నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను. అలాంటపుడు మరొకరికి ‘ఇలా రాయండి’ అని ఎలా చెప్పగలను. …నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు,అవమానం తెలుసు! వాటిని పుష్కళంగా అనుభ వించాను కాబట్టి ఇవి లేని సమాజం కోరుకుంటాను.”
జోహారు రావూరి భరద్వాజకు. జోహారు ఆ పెద్దాయనకు.
-యింద్రవెల్లి రమేష్
facebook.com / indravelliramesh

పి.ఎస్-
“రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ ఇచ్చి, తనను తానే గౌరవించుకుంది ఆ జ్ఞానపీఠ”
రావూరి శవపేటిక ముందు అందెశ్రీ అలా అన్నారు.

“ఆయన అన్ని రచనలు చేసినా వేటిలోనూ దారి తప్పలేదు. కన్నీళ్లు, కష్టాల గురించే రాసారు. ఎడిటోరియల్ బోర్డు మెంబరుగా దాదాపు ఆయన రచనలన్నీ చదివిన నాకు ఉన్న అభిప్రాయమిది” అన్నారు ఎస్వీ సత్యనారాయణ.
సినీ ‘మాయా సరస్సు’లో అడుగేస్తే ‘కాలు జారే’ ‘పాకుడురాళ’్లపై మారుమూల మంగమ్మను ‘మహానటి మంజరి’గా మార్చి మార్లిన్ మన్రోతో మాట్లాడించిన ‘మహావ్యక్తిత్వ వికాస నిపుణుడు’
-రావూరి రచనల మీద అమితాసక్తి కలిగిన

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.