ఇసుక తుఫాన్ ‘జజీరా’

ఇసుక తుఫాన్ ‘జజీరా’

ఉత్తరప్రదేశ్‌లో ఇసుకమాఫియా మీద పోరాడి సస్పెన్షన్‌కు గురైన దుర్గ్గాశక్తి నాగ్‌పాల్ గురించి దేశమంతటికీ తెలుసు. ఎందుకంటే ఆమె ఐఏఎస్ అధికారిణి కనుక. ఆమె చూపిన తెగువకు, సాహసానికీ ఏ మాత్రం తక్కువ కాకుండా.. అదే ఇసుక మాఫియాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది కేరళకు చెందిన సామాన్య ముస్లిం మహిళ ‘జజీరా’. స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట మొదలుపెట్టిన నిరసనను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి, దేశ రాజధాని వరకు తీసుకెళ్లి సంచలనం రేపుతున్న ఆ ఇసుకతుఫాన్ గురించే ఈ కథనం..

అది ఢిల్లీలోని జంతర్‌మంతర్. పొద్దున్నే వణికించే చలిలో నిరసన తెలిపేందుకు సన్నద్ధం అవుతున్నారు ఉద్యమకారులు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ డిమాండ్ వచ్చినా, దాన్ని దేశరాజధానిలో వినిపిస్తే భారతదేశమంతా వినిపిస్తుందన్నది ఉద్యమకారుల నమ్మకం. అదే కోరికతో ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని జంతర్‌మంతర్‌కు వచ్చింది ఒక తల్లి. పేరు జజీరా. ముప్పయి ఏళ్లుంటాయేమో! పిల్లల సహాయంతోనే ఒక చిన్న నీలిరంగు టెంటు కట్టుకుంది. హిందీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసున్న ఎర్రటి బ్యానరొకటి వాళ్ల వెనకవైపు కనిపిస్తోంది. అందులో ‘ఇసుక మాఫియాను అరికట్టండి’ అన్న నినాదం ఎర్రెర్రటి అక్షరాలతో నిగనిగలాడుతోంది. అక్కడ వివిధ రకాల నిరసనలు వ్యక్తం చేస్తున్న వాళ్లెవ్వరూ ఆమెను పట్టించుకోవడం లేదు. కాని జాతీయస్థాయి మీడియా పట్టించుకుంది. చేతుల్లో మైకులు, భుజాల మీద కెమెరాలు పట్టుకుని ఆమెను చుట్టుముట్టారు పాత్రికేయులు. కెమెరాలన్నీ ఆమెవైపు తిరిగాయి. ఢిల్లీవాసులు, సామాజికవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అందరూ ‘ఎవరీమె?’, ‘పిల్లల్ని తీసుకుని ఇంత దూరం ఎందుకొచ్చినట్లు?’ కనుక్కోవడం మొదలుపెట్టారు.

జీవితమే ఒక పోరాటం..
జజీరా సొంతూరు కేరళలోని కన్నూర్‌లోని మడాయి అనే గ్రామం. అదొక తీర ప్రాంతం. ఆమెది కట్టుబాట్లున్న నిరుపేద ముస్లిం కుటుంబం. తండ్రి అర్ధాంతరంగా మరణించడంతో పదోతరగతిలోపే చదువు మానేయక తప్పలేదు. ముగ్గురు సోదరుల భారాన్ని జజీరా మోయాల్సి వచ్చింది. పదహారేళ్ల వయసులో పెళ్లి చేసుకుందామె. భర్త స్త్రీలోలుడు, తాగుబోతు. కాపురాన్ని భరించలేక బంధాన్ని తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో దిక్కుతెలియని జజీరా.. పిల్లల్ని పట్టుకుని కన్నూర్ నుంచి ఎర్నాకుళం చేరుకుంది. “రెండేళ్లు కూలి పని చేశాను. బతకడం కష్టమైంది. దిక్కుతోచక మళ్లీ కొట్టాయం వెళ్లిపోయి.. అక్కడ పుస్తకాలను విక్రయించి పిల్లల్ని పోషించాను. మళ్లీ సొంతూరైన కన్నూర్‌కు రావాల్సి వచ్చింది. అక్కడే డ్రైవింగ్ నేర్చుకున్నాను. లైసెన్సు తీసుకుని ఆటోరిక్షా నడపడం మొదలుపెట్టా. అప్పటి వరకు నా కుటుంబంతో పోరాడాల్సి వచ్చింది. ఆటో తోలడం మొదలుపెట్టాక సమాజంతో పోరాడాల్సి వచ్చింది..” అంటూ చెప్పుకొచ్చింది జజీరా. ఆటోస్టాండులో అందరూ మగవాళ్లున్నారు. తనొక్కతే మహిళ. తోటి ఆటోవాలాల ఎగసెక్కాలు, కామెంట్లు ఎక్కువయ్యేవి. “ఒక్కోసారి వాళ్ల వేధింపులు భరించలేకపోయేదాన్ని. ఆటోస్టాండులోనే కాదు. ప్యాసింజర్లను తీసుకుని రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు కూడా అవే కామెంట్లు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..” అని గుర్తుచేసుకుంది.

మా తీరం మాకు కావాలి..
ఒక మదర్సాలో పాఠాలు బోధించే అబ్దుల్‌సలామ్ పరిచయం కావడంతో.. అతన్ని విశ్వసించి రెండో పెళ్లి చేసుకుంది. ఆయన ఉద్యమానికి సహకరిస్తున్నారు. “అది 2011. మూడో బిడ్డ కడుపులో ఉంది. కాన్పు కోసం మా అమ్మగారి ఊరైన కన్నూర్‌కు వెళ్లాను. మాది సముద్ర తీరప్రాంతం. ఎక్కువగా పేదవాళ్లే నివశించేవాళ్లక్కడ. కాని ఈ మధ్య పెద్ద పెద్ద భవంతులు, కట్టడాలు వచ్చేశాయి. మా సమస్య అది కాదు. తీరంలోని ఇసుకను తవ్వుకుపోతుండటం సమస్య. నదుల్లోని ఇసుకంతా అయిపోయింది. అందుకని అందరూవచ్చి సముద్రతీరం మీద పడ్డారిప్పుడు. ఇలాగే తరలించుకుపోతే తీరం మాయమైపోతుంది. దానివల్ల సముద్రపు నీళ్లు ముందుకు చొచ్చుకొస్తాయి.

ఉప్పెనలు, తపాన్లు, వరదలు వచ్చినప్పుడు ఇళ్లు మునిగిపోవడం ఖాయం. అది అందరికీ నష్టమే” అన్నది జజీరా ఆవేదన. ఆమె చెప్పినట్లు ఒకప్పుడు ఫుట్‌బాల్ మైదానాల్ని తలపించే కన్నూర్ తీరప్రాంతం ఇప్పుడు ఫుట్‌పాత్ సైజుకు చేరడం దారుణం. ఇరుగుపొరుగు, ఊర్లోని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరి దగ్గరకెళ్లి ఇసుక సమస్య గురించి చెప్పినా చైతన్యం రాలేదు. తనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. బిడ్డల్ని ఒక చంకన వేసుకుని, మరో చేత్తో కొంగును నడుముకు చుట్టుకుని ‘ఇసుక మాఫియా’ మీద పోరాటం ప్రకటించిందీమె. “ముందు నా ఇంటి నుంచే ఉద్యమం మొదలవ్వాలి. ఒకప్పుడు నేను ఎంతో అపురూపంగా చూసుకున్న నా సోదరులే ఇసుకమాఫియాకు సహకరిస్తున్నారు. వాళ్లు దినకూలీలు. అయినా సరే ఆ పని మానేసి మరో పని చేసుకొమ్మని చెప్పాను. వినలేదు. అందుకే వాళ్లుంటున్న వీధుల్లో నా తొలినిరసన చేపట్టాను” అని చెప్పిందామె. నెలల పసికందును ఎత్తుకునే ఇసుకతోడుతున్న లారీలు, ట్రక్కుల ఫోటోలు తీసి.. రెవెన్యూ ఆఫీసులకు వెళ్లి.. ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది జజీరా. అధికారులందరూ ఆమెను ఒక పిచ్చిదాన్ని చూసినట్లు చూశారు తప్ప సమస్యను ఆలకించలేదు. తెల్లకాగితంలో రాసిన వినతిపత్రాన్ని పైనుంచి కింది వరకు చూసి.. ‘వెళ్లిరండి’ అని తలూపి పక్కనపడేసేవారు. “ఈ దేశంలో అన్నిటికంటే ఘోరమైన అన్యాయం ఇసుక అక్రమరవాణా. ఇందులో పోలీసులు, బిల్డర్లు, అధికారులు, నేతలు కుమ్మక్కై ప్రకృతి వనరుల్ని దోచుకుంటున్నారు” అనే జజీరాకు శత్రువులు పెరిగిపోయారు. ఇసుకమాఫియా వాళ్లందరూ ఒక్కటై ఆమె మీద దాడి చేశారు. కొట్టారు. బూతులు తిట్టారు. తోటి మహిళా కూలీలతోనే చావబాదించారు. “ఒకసారి నా పిల్లలతో సహా ఇసుకలారీకి అడ్డంగా పడుకున్నాను. నన్ను లారీకింద తొక్కిస్తామని భయపెట్టారు. అయినా సరే జంకలేదు. నా తలను పట్టుకుని ఇసుకలో పూడ్చిపెట్టారు. నా మొండితనాన్ని భరించలేక మా ఇంటిని ధ్వంసం చేశారు. నా చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కుని పగలగొట్టారు. వీటికే వెన్నుచూపితే నేనీ ఉద్యమం చేసేదాన్నే కాదు” అందీ కేరళ మహిళ.

జిల్లా కలెక్టర్ దృష్టికి..
‘ఇసుకమాఫియాతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయ్. నీకు ముగ్గురు పిల్లలున్నారు. మనకెందుకిదంతా? ఆలోచించు’ అని బంధువులు సముదాయించినా ఊరుకోలేదు. పుతియంగడి అనే పోలీసుస్టేషన్‌కు వెళ్లి మరొక ఫిర్యాదు చేసింది జజీరా. అక్కడున్న పోలీసులు ‘వెళ్లు వెళ్లవమ్మా, నువ్వు ఒక్కతే దేశాన్ని ఉద్దరిస్తావా ఏందీ?” అని కసురుకున్నారు. వాళ్లతో వాదనకు దిగలేదామె. మౌనంగా స్టేషను గేటు వద్దకు వచ్చి, ఒక పాత గుడ్డ పరుచుకుని నిరసనకు కూర్చుంది. “వెళ్లిపోతుందనుకున్న మనిషి ఇలా భీష్మించుకు కూర్చుందేమిటి? పైఅధికారులకు తెలిస్తే ఏం సమాధానం చెప్పాలి?” అని వణికిపోయారు పోలీసులు. ఒకట్రెండు రోజులు కాదు. వారం గడిచింది. స్థానిక మలయాళ పత్రికలు జజీరా పోరాటాన్ని ప్రచురించాయి. ఆమె పట్టుదలను మెచ్చుకుంటూ పలువురు సామాజికవేత్తలు చేతులు కలిపారు. అనుకున్నట్లుగానే పైఅధికారుల నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. అది కూడా జిల్లా కలెక్టర్ నుంచి! జజీరాను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు పోలీసులు.

“ఏమిటమ్మా నీ సమస్య. పత్రికల్లో చూస్తున్నాను. ఏమిటి చెప్పు?” అని అడిగారు కలెక్టర్. “సార్, కొన్ని ముఠాల చేతుల్లోకి వెళ్లిపోయింది మా తీరప్రాంతం. ఇదెంత అన్యాయం? ఇంతమంది అధికారులు, ఇంతపెద్ద వ్యవస్థ మనకుంది. ఒక్కరు కూడా అడ్డుకోలేకపోతున్నారు. తీరంలోని ఇసుకను తవ్వుకుపోవడం వల్ల మా బతుకులు మునిగిపోతాయి. మీరైనా న్యాయం చేయండి..” అంటూ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది జజీరా. “నీ దగ్గరున్న ఆధారాలన్నీ ఇవ్వు. యాక్షన్ తీసుకుంటాను. ఆ సంగతి నాకు వదిలేసి, నువ్విక ఇంటికి వెళ్లు..” అని సర్దిచెప్పి జజీరాను ఇంటికి పంపించారు కలెక్టర్. కొన్నాళ్లు స్థానిక అధికారులు హడావిడి చేశారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. ఫలితం సున్నా. పోనీలే అని ఊరుకోలేదు జజీరా. మళ్లీ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది. “అయ్యా, నేను కలెక్టర్‌ను కలవాలి. అనుమతి ఇప్పించండి” అని అడిగితే- “ఏమిటమ్మా నీ ఇసుక సమస్య పరిష్కారం కాలేదా? ప్రతి చిన్న విషయానికీ కలెక్టర్‌ను కలవాలంటే కుదరదు. అనుమతిస్తే మా ఉద్యోగాలు పోతాయ్” అని కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు జజీరాను వెనక్కి పంపించారు. సర్కారు చేతిలో మోసపోయానన్న సంగతి తెలుసుకున్న ఆమె.. ఈసారి ఉద్యమస్థావరాన్ని మార్చాలనుకుంది. ముగ్గురు పిల్లలను తీసుకుని కేరళ రాజధాని అయిన తిరువనంతపురం వెళ్లే రైలు ఎక్కింది. ఈసారి సెక్రటేరియట్ ఎదుట నిరసన తెలపాలన్నది ఆమె ఆలోచన. “నువ్వు ఎందుకిలా తయారవుతున్నావ్. పిల్లల్ని చెడగొడుతున్నావ్. రాజధానిలో నీ అరుపులు ఎవరికి వినిపిస్తాయి? నువ్వొక మహిళవు” అని ఊళ్లో వాళ్లందరూ అడ్డుకున్నా వినలేదు.

సిఎం నుంచి పిలుపు..
తిరువనంతపురంలోని సెక్రటేరియట్. గేటుకు ఎదురుగా చిన్న గుడారం. ఒక పెద్ద బ్యానరు. ఇసుకమాఫియాను అరికట్టండి అన్న నినాదం. ఇటూఇటూ ఇద్దరు ఆడపిల్లలు, ఒళ్లో ఒక చంటిగాడు. చూసేవాళ్లకు ఆ సన్నివేశం వింతగా ఉంది. ప్రతిరోజు సెక్రటేరియట్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారు, పోతున్నారు. జజీరాది ఒక రోజుండి పోయే నిరసనేలే అనుకున్నారంతా! రోజులు గడిచినా సీను మారలేదు. విషయాన్ని ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. “సెక్రటేరియట్ గేటు ఎదురుగా కూర్చున్న ఆమెను పిలవండి. మాట్లాడాలి” అని అధికారులను ఆదేశించాడు ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ. “అయ్యా, నమస్కారం. ఇప్పటికే నా సమస్య మీ దృష్టికి వచ్చుండాలి..” అని వినయంగా చెప్పింది జజీరా. “ఏమిటమ్మా ఇది. సెక్రటేరియట్‌కు వచ్చి నిరసన తెలపడమేమిటి? మీ ఊళ్లో పోలీసులు, అధికారులు ఉన్నారు కదా! కలవలేకపోయావా?” అన్నారు సీఎం. “అయ్యా, అవన్నీ అయిపోయాకే ఇక్కడికి వచ్చాను. నాకెక్కడా పరిష్కారం దొరకలేదు” అని సమాధానం ఇచ్చింది. “సరే, నేను మీ జిల్లా అధికారులతో మాట్లాడతాను. మీ తీరంలో ఇసుకతవ్వకాలను నిలుపుదల చేయిస్తా. నువ్వు ఇంటికి వెళ్లిపో” అన్నారు సీఎం. “అయ్యా, చాలా సంతోషం. ఆ మాటేదో మీరు నోటితో కాకుండా రాతపూర్వకంగా ఇస్తే మంచిది. అప్పుడే నా నిరసనదీక్ష విరమిస్తాను” అని మెలికపెట్టింది జజీరా. అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోకపోవడంతో.. నిరసనను విరమించడానికి జజీరా కూడా ఒప్పుకోలేదు. సెక్రటేరియట్ ఎదురుగ్గానే 64 రోజులు దీక్ష చేసింది. ప్రభుత్వం మొండిదైతే అంతకంటే మొండిది జజీరా. రాష్ట్రంలో రేపిన ఇసుకతుపానును.. ఢిల్లీ వీధుల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ఢిల్లీ వీధుల్లో..
అదే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరం. “నేను ఢిల్లీకి వచ్చింది సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని కాదు. ఇసుక అక్రమ తవ్వకాలను జాతీయస్థాయి సమస్యను చేయాలన్నది నా ఉద్దేశ్యం. నాకిక్కడ ఎంతోమంది అండ దొరుకుతోంది” అంది. జజీరా ఇసుక తుపాను సంచలనం రేపడంతో.. జాతీయ మానవహక్కుల కమీషన్ స్పందించింది. “ఇసుక అక్రమ తవ్వకాల మీద మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలిపే ఒక నివేదిక ఇవ్వండి” అంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇదే సమస్య మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ జోక్యం చేసుకుంటూ.. కేరళ ముఖ్యమంత్రికి ఒక వ్యక్తిగత లేఖ రాశారు. ప్రస్తుతానికి జజీరా కథ ఇక్కడి వరకు వచ్చింది. జజీరాలాంటి ఒక్క చిన్న ఇసుక రేణువు ఈ వ్యవస్థ కళ్లలో పడినా.. కాసేపైనా బాధతో కళ్లు నులుపుకోక తప్పదు. అదే పోరాటానికున్న శక్తి.. దాన్ని మరొకసారి నిరూపించిందీ సామాన్య ముస్లిం మహిళ.
ం నవ్య డెస్క్

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.