బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

బౌద్ధ సంస్కృతి పరిరక్షణే లక్ష్యం

ఒకప్పుడు సివిల్స్ సర్వీసు పరీక్షల కోసం భారతదేశ చరిత్రతోపాటు బౌద్ధమతంపై సమగ్ర అధ్యయనం చేసిన చెన్నూరు ఆంజనేయరెడ్డి బౌద్ధ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. ఆరంభంలో నాస్తికుడైన ఈయన తాను నమ్మిన బౌద్ధ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ భాషల్లో ఉన్న గ్రంథాలను తెలుగులోకి అనువదించి ప్రచురించటంతో పాటు, రాష్ట్రంలో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించి, వాటి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఇటీవల ఇండొనేషియాలోని పురాతన బౌద్ధ క్షేత్రమైన బోరోబుదూర్‌ను సందర్శించి వచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అక్కడి బౌద్ధ క్షేత్రాల గురించి, రాష్ట్రంలో బౌద్ధ సంస్కృతి పరిరక్షణ గురించి చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే….

“నేను మొదటి నుంచీ నాస్తికుడిని. అయితే, ఇరవై మూడేళ్ల వయసులో అనుకోకుండా నేను బౌద్ధ సంస్కృతి అధ్యయనం చేయడం జరిగింది. అప్పటి నుంచీ బౌద్ధ మతం మీద శ్రద్ధాసక్తులు పెరిగాయి. నా స్వభావానికి బౌద్ధమత సంస్కృతి సరిపోతుందని అనిపించి, దాన్ని స్వీకరించాను. సమాజంలోని ప్రజలందరికీ ప్రయోజనాన్నిచ్చే మంచి పనుల్ని చే యాలనేదే బుద్ధుని బోధనల సారం. నేటి సమాజంలో అన్ని సమస్యలకూ పరిష్కారం బౌద్ధంలోనే ఉందని నాకు నమ్మకం. మనిషి నీతి నియమాలు, నైతిక విలువలతో కూడిన జీవనం కొనసాగించేందుకు బుద్ధుడు చెప్పిన బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇతరులకు తోడ్పడాలనే ఉన్నత ఆశయాన్ని ఆచరణలో అమలు చేయడంతో పాటు, మన దేశ బౌద్ధ సంస్కృతిని సామాన్య ప్రజల్లోకి మరింతగా తీసుకు వెళ్లాలనే ఆకాంక్షతో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నాను.

బోరోబుదూర్‌ను సందర్శించిన వేళ…
ఇండొనేషియా దేశంలో ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ క్షేత్రమైన బోరోబుదూర్‌ను సందర్శించాలనే నా చిరకాల వాంఛ ఇటీవల ఫలించింది. జావా దీవిలో ఉన్న ఈ క్షేత్రాన్ని చూసినప్పుడు నేనెంతో సంతోషపడ్డాను. మూడు తరాలకు చెందిన శిల్పులు వందేళ్ల పాటు శ్రమించి, లావాతో ఏర్పడిన పెద్ద రాళ్లతో బోరోబుదూర్‌ను నిర్మించారు. అరవై వేలకు పైగా రాళ్లతో ఈ బుద్ధ విహారాన్ని కట్టారని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అగ్నిపర్వతం పేలినప్పుడు వచ్చిన బూడిదతో బోరోబుదూర్ క్షేత్రం కనుమరుగైందని బ్రిటిష్, డచ్ దేశాల నిపుణులు గుర్తించి దాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. వంద ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రంలో బుద్ధుని జీవితం, జాతక కథలు, బుద్ధుని శిల్పాలున్నాయి. బౌద్ధమతం బాగా వ్యాప్తి చెందిన పురాతన కాలంలో మన దేశ శిల్పులు అక్కడకు వెళ్లి ఈ క్షేత్రాన్ని నిర్మించటం వల్ల దీనిలో మన దేశ సంస్కృతి ప్రస్ఫుటంగా కనిపించింది.

అత్యంత పురాతనమైన ఈ అతిపెద్ద బౌద్ధ క్షేత్రాన్ని చూసినప్పుడు నేనెంతో గర్వంగా ఫీలయ్యాను. ఇక బాలీ, జావా దీవులు ఎత్తయిన కొండల మధ్య ఎన్నో కళాఖండాలతో రమణీయంగా కనిపించాయి. బుద్ధుని బోధనలకు జర్మనీతో పాటు, పలు యూరప్ దేశాలు, అమెరికాల్లో కూడా ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దీనికి కేంద్రమైన మన దేశంలో బుద్ధుని అనుసరించే వాళ్లు తగ్గిపోవటం నాకెంతో విచారం కలిగించింది. ఇండొనేషియా దేశం 20 వేలకు పైగా దీవుల సమాహారం. ప్రకృతి అందాలతో దీవులన్నీ కొత్త అందాలు సంతరించుకున్నాయి. బాలి, జావా దీవుల్లోని పురాతన బౌద్ధ క్షేత్రాలను నా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించాను. ఎక్కడా చెత్త ఆనవాళ్లు కూడా లేకుండా ఎంతో శుభ్రంగా ఉన్న వీధుల్లో యాచకులు సైతం కనిపించకపోవటం విశేషం. ఇండొనేషియా దేశ పర్యటన నాకెన్నో మరచిపోలేని మధుర జ్ఞాపకాలను మిగిల్చింది.

బౌద్ధ క్షేత్రాల అభివృద్ధి
రాష్ట్రంలో ఉన్న పురాతన బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి పాటుపడుతున్నాను.రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేసినప్పుడు రాష్ట్రంలోని 22 బౌద్ధ క్షేత్రాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాను. కృష్ణానదీ తీరాన ఉన్న నాగార్జున కొండ వద్ద 270 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో బౌద్ధ వనాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గౌరవ కన్సల్‌టెంట్‌గా సేవలందిస్తూ నాటి బౌద్ధమత పురాతన ప్రాభవాన్ని పరిరక్షించేందుకు పాటుపడుతున్నాను. అమరావతిలో బౌద్ధ మ్యూజియాన్ని నిర్మించటంతో పాటు, నాగార్జునసాగర్‌లో 35 ఎకరాల్లో విపాసన ఇంటర్నేషనల్ మెడిటేషన్ కేంద్రాన్ని నిర్మించాం. ఆనంద బుద్ధ విహార ట్రస్టుకు ఉపాధ్యక్షుడిగా ఉండి హైదరాబాద్‌లో ఆనంద బుద్ధ విహార్‌ను నిర్మించాం.

ధర్మదీపం ఫౌండేషన్
నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనే బోధనలతో కూడిన ధమ్మపద పుస్తకాన్ని నాకు బహుమతిగా ఇవ్వటంతో దాన్ని చదివి ఎంతో ప్రభావితుడినయ్యాను. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన యువ పోలీసు అధికారులకు ధమ్మపద పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయించి పంపిణీ చేశాను. 1992లో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బౌద్ధ మతగురువు దలైలామాను కలిసి మాట్లాడాను. దలైలామా నుంచి స్ఫూర్తి పొంది, ధర్మదీపం పేరిట ఓ ఫౌండేషన్‌ను నెలకొల్పి బుద్ధుని బోధనలపై వివిధ భాషల్లో ఉన్న 30 పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేయించి, ముద్రించాను. ధర్మపథం, జాతక కథలు, జయమంగళం, బుద్ధవచనం తదితర పుస్తకాలను పంపిణీ చేశాను. బుద్ధుని మూలగ్రంథాలైన ధర్మపీటకం, సూత్రపీటకం, వినయపీటకంలను పాలీ భాష నుంచి తెలుగులోకి అనువదింపజేసి అందించాలనే ఆకాంక్షతో తెలుగు త్రిపీటకం ప్రాజెక్టును చేపట్టాను. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర సాంస్కృతిక మండలి 50 లక్షల రూపాయలను గ్రాంటుగా ఇచ్చింది. దీనికి తోడు మా ఫౌండేషన్ నిధులతో వచ్చే పదేళ్లలో అనేక బౌద్ధ గ్రంథాలను తెలుగులోకి అనువదించే పని చేపట్టాను.

బౌద్ధ విహారాలు నిర్మిస్తాం
బౌద్ధ సంస్కృతిని పరిరక్షించటమే ప్రధాన ఆశయంగా కార్యక్రమాలు చేపడుతున్నాను. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మహాబోధి సొసైటీ సభ్యుడిగా, అమరావతిలోని ధాన్యకటక బుద్ధవిహార గౌరవ అధ్యక్షుడిగా, ధర్మదీపం ఫౌండేషన్ ఛైర్మన్‌గా బౌద్ధ సంస్కృతి వ్యాప్తికి నా వంతు సేవలందిస్తున్నాను. భవిష్యత్తులో హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ధమ్మగిరి విహారాన్ని నిర్మించేందుకు స్థలాన్ని సేకరించి, సమాయత్తమయ్యాను. విశాఖపట్టణంలో మరో విహారాన్ని నిర్మించాలనుకుంటున్నానంటూ ఆంజనేయరెడ్డి తన భవిష్యత్తు ప్రణాళిక గురించి వివరించారు.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.