సారే మా ‘శ్రీహరి’ 24-10-2013 andhrajyothi

సారే మా ‘శ్రీహరి’

రియల్‌స్టార్ శ్రీహరి- భాస్కర్‌ల బంధం గురించి మాట్లాడటం అంటే ఓ మహానది పిల్లకాలువపై పెంచుకున్న ప్రేమను, సముద్రమే నది కోసం ఎదురుచూస్తున్న సందర్భాన్ని వర్ణించినట్టుగా ఉంటుంది. ఈ భాస్కర్ సినిమా పరిశ్రమలో తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ శ్రీహరి జీవన ప్రయాణంలో ఇతనిదీ సగం జీవితం. ఆ ‘హీరో’ నవ్వితే ఈ ‘మేకప్‌మేనూ’ నవ్వాడు. ఆయన పనిచేస్తే ఈయనా పనిచేశాడు. ఆయన రెస్ట్ తీసుకుంటే ఈయనా రెస్ట్ తీసుకున్నాడు. శ్రీహరి చివరి క్షణాల్లోనూ పక్కనే ఉన్నాడు. ఆయన బాధతో తల్లడిల్లినప్పుడు, భాస్కర్ కూడా విలవిల్లాడిపోయాడు. షూటింగ్‌లో, ప్రయాణంలో, ఆస్పత్రిలో…అన్ని చోట్లా వెన్నంటే ఉన్న భాస్కర్….శ్రీహరికి పర్సనల్ మేకప్‌మేన్ మాత్రమే. అయితేనేం? వారి జీవన ప్రయాణానికి ‘అనుబంధం’ అని పేరుపెట్టలేమా!

మొదట్లో అంటే… 1993కు ముందు భాస్కర్ అసిస్టెంట్‌గా గీతా ఆర్ట్స్ సినిమాలు చేస్తుండేవాడు. ‘లంకేశ్వరుడు’ సినిమాతో పరిచయమైన శ్రీహరికి పనిలో భాగంగా అప్పటికే కొన్నిసార్లు మేకప్ కూడా చేశాడు. ఇద్దరికీ మంచి పరిచయమే. అయితే భాస్కర్ గీతా ఆర్ట్స్ నుంచి బయటకు బయటకొచ్చాక శ్రీహరే అతన్ని పిలిపించుకుని పర్సనల్ చేయమన్నాడు. అలా 1993 ఫిబ్రవరి 27న శ్రీహరికి పర్సనల్ మేకప్‌మేన్ అయ్యాడు భాస్కర్.

రెండు దశాబ్దాలు..174 సినిమాలు
శ్రీహరి గురించి అప్పటికే భాస్కర్‌కు తెలుసు కాబట్టి వెంటనే ఒప్పుకుని మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాడు. అలా ‘సమరం’ సినిమాతో పర్సనల్ బంధం బలపడింది. అది మొదలు ఇప్పటి వరకు మొత్తం 174 సినిమాలకు పనిచేశాడు భాస్కర్. 21 సంవత్సరాల తన వృత్తి జీవితంలో ఒక్కసారి కూడా శ్రీహరి వల్ల ఇబ్బంది పడలేదు. ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు. 80 గెటప్‌లు చేసినా ఒక్క రోజు కూడా శ్రీహరిలో చిరాకు చూడలేదు. గెటప్ కుదరాలంటే ఆర్టిస్టు సహకారం బాగుండాలి. అది శ్రీహరి దగ్గర పుష్కలంగా ఉంటుందంటాడు భాస్కర్. అందుకే ‘దుర్యోధనుడు’, ‘ఘటోత్కచుడు’, ‘యమధర్మరాజు’ వంటి పౌరాణిక ఆహార్యాలు కూడా చేసి శ్రీహరిని మెప్పించాడు.
ఎప్పుడూ జాలీగా, నవ్వుతూ ఉంటూ టెక్నీషియన్స్‌ను, ఆర్టిస్టులను… అందరినీ గౌరవంగా చూసే శ్రీహరి దగ్గర పనిచేయడమంటే అందరికీ ఇష్టమే. ఇంట్లో ఉన్నా, సెట్లో ఉన్నా, అవుట్‌డోర్‌లో ఉన్నా, ఫారిన్‌లో ఉన్నా…ఒకేలా ఉండే శ్రీహరితో భాస్కర్‌ది ప్రత్యేక అనుబంధం.

ఇన్నేళ్లలో భాస్కర్‌కు ఒక్కసారి కూడా ‘నాకిది కావా’లని అడిగే అవకాశమే శ్రీహరి ఇవ్వలేదంటే నమ్మాలి. శ్రీహరి నీకేం చేశాడని భాస్కర్‌ను అడిగితే, ‘అన్నీ ఆయనే చేశాడు కదా’ అంటాడు. ‘నన్నో సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. భాస్కర్ అని పిలిచేవాడు. ఇంట్లో కూడా నన్ను ఫ్యామిలీ మెంబర్‌లాగే చూసేవాళ్లు. నిజానికి మేకప్‌మేన్‌కు అంత స్థానం ఇవ్వాల్సిన పనిలేదు. పైసల్ సరిగ్గా ఇస్తే చాలు.. ఎవరి పని వాళ్లు చక్కగా చేస్తారు. కానీ సార్ అలా కాదు. ఆత్మీయతే ఆయనకు పెద్ద ఆభరణం. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మా భాస్కర్ అని చెప్పేవాడు. నాకేం లోటు లేకుండా, రాకుండా చూసుకున్నాడు’ అంటాడు భాస్కర్.

భాస్కర్ చూసుకుంటాడులే…
రెండు దశాబ్దాల జీవన ప్రయాణంలో శ్రీహరిని భాస్కర్ చూసినంత దగ్గరగా మరెవరూ చూసి ఉండరు. ఫ్యామిలీ విషయాలు కూడా చర్చించుకునేవారిద్దరూ. ఇల్లు, పొలం పనులు ఏవైనా ‘భాస్కర్ చూసుకుంటాడులే’ అనేవాడు. ఆయన బర్త్‌డే ఫంక్షన్ కూడా భాస్కర్‌కే అప్పగించేవాడు. పరిశ్రమ నిండా ఆత్మీయుల్ని సంపాదించుకున్న శ్రీహరిలాంటి యాక్టర్ ప్రేమను పొందాలంటే భాస్కర్ ఎంత నిజాయితీగా ఉండాలో అలాగే ఉన్నాడు. వేరే కంపెనీలు, వ్యక్తులు ఎంతోమంది తోచిన విధంగా ప్రలోభ పెట్టినా ఆయన ఎక్కడా లొంగలేదు. అందుకే శ్రీహరికి భాస్కర్ అంటే ఇష్టం. అత్యాశలేని భాస్కర్‌ను, వద్దన్నా.. ప్రతి పైసకూ లెక్క చూపించే భాస్కర్‌ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కారు కొనిస్తానని బలవంతం పెట్టినా భాస్కర్ ఒప్పుకోలేదు. ఉన్న కారుని తీసుకో అని ఇబ్బంది పెట్టినా ‘వద్దు సార్’ అని సున్నితంగా తప్పుకున్నాడు. అయినా భాస్కర్ పిల్లల చదువు నుంచి ఆరోగ్యం వరకు, ఆర్థిక సమస్యల నుంచి హార్దిక విషయాల వరకు అన్నింటిని అడిగి మరీ తెలుసుకునేవాడు శ్రీహరి. ఇద్దరూ అలా బతికేశారు..ఒకరికొకరు నచ్చేటట్టు!

సెకండ్ థాటే లేదు…
చిన్నా చితకా వేషాలేసుకునే శ్రీహరి రియల్‌స్టార్‌గా ఎదిగిన తీరంతా భాస్కర్ కళ్ల ముందే జరిగింది. ఎక్కడైనా శ్రీహరి తొణికాడా? ఎక్కడైనా పొంగిపోయాడా? ఎప్పుడైనా మనుషుల్ని తక్కువగా చూశాడా? లేదు.. తన స్టాఫ్‌ను పెంచుకున్నాడు. ఇంకొంత మందికి జీవితాల్ని ఇచ్చాడు. కాదు.. కొన్ని గ్రామాల్నే దత్తత తీసుకున్న శ్రీహరి విశాల హృదయం, తన పొలాల్లో పండిన పంటను అవసరమున్న ప్రాంతాల్లో (వరదలు రావడం, కరువు ఉండటం వంటివి) పంచిన ఔదార్యం, కష్టాల్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులకూ బియ్యం, బట్టలు పంపిన ఆయన ప్రేమ, తన సినిమా పూర్తయితే స్టాఫ్ అందరికీ కొత్త బట్టలు కొనిచ్చి, కడుపు నిండా భోజనం పెట్టి పంపించే ఆత్మీయత… ఇవన్నీ శ్రీహరిని ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టాయి. ఆ స్థాయిని కళ్లారా చూసిన భాస్కర్ మా సార్ అని గర్వంగా చెప్పుకోవడం గొప్ప అయితే, మా భాస్కర్ అని శ్రీహరి అందరికీ పరిచయం చేయడం విశేషమే కదా! అలాంటి రియల్ హీరోను ఎవరైనా మిస్ అవుతారా? అందుకే ఇంకో చోట పనిచేసే అవకాశం వచ్చినా పట్టించుకోలేదు భాస్కర్. శ్రీహరితో పనిచేయడం అంటే ఒక సంతృప్తికరమైన జీవితం! సెకండ్ థాట్‌కు అవకాశమే లేదు!!

తనను ఎంతో ప్రేమించిన, తనకు ఎంతో ఆప్యాయతను పంచిన శ్రీహరికి భాస్కర్ ఏమివ్వగలడు?…తన ఇంటికి ‘శ్రీహరి శాంతి నిలయం’ అని పేరుపెట్టుకోవడం వంటి గౌరవపూర్వకమైన పనులు చేయడం తప్ప! గిఫ్ట్ పోగొట్టినా…
పెళ్లికాక ముందు శాంతి దుబాయ్ నుంచి తీసుకొచ్చి మరీ ఓ రింగ్‌ను శ్రీహరికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ‘కుంతీ పుత్రుడు’ సినిమా షూటింగ్‌లో ఓ రోజు భాస్కర్ మూలంగా ఆ రింగ్ దొంగలపాలైంది. అది కావాలని చేసింది కాకపోయినప్పటికీ అందులోని వెలకట్టలేని ‘ప్రేమ కానుక’ గురించి ఎంతో బాధపడ్డాడు భాస్కర్.

అపరాధ భావంతో తిరుగుతున్న అతన్ని ఒక్క మాట అనడం గానీ, చిరాకు గానీ, అసహనం గానీ వ్యక్తం చేయకుండా శ్రీహరే ఓదార్చాడు. రియల్‌స్టార్ వస్తువు కంటే మనుషులకే విలువిస్తాడని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? నిజమే, భాస్కర్ బాధపడితే చూడలేకపోయేవాడు శ్రీహరి. తన ప్రపంచంలో భాస్కర్‌కు అత్యున్నత స్థానం ఇచ్చేవాడు. కొన్ని విషయాల్లో ఎమోషనల్‌గా కూడా ఉండేవాడు. ‘జబర్‌దస్త్’ సినిమా సమయంలో ఉద్యోగం మానేద్దామనుకున్నాడట భాస్కర్. శ్రీహరి పిలిచి ‘నువ్వు లేకపోతే నేను రిటైర్ అవుతా భాస్కర్. కొన్నాళ్లు చెయ్యి.. ఇద్దరమూ ఒకేసారి రిటైర్ అవుదా’మని చెప్పాడు. ఏ ఆర్టిస్టు నుంచి ఏ మేకప్‌మేన్ వినని మాట ఇది. అది భాస్కర్ భాగ్యం! అంతేకాదు, శ్రీహరి గొప్పతనం కూడా!!
కానీ ‘రిటైర్మెంట్ అంటే పరిశ్రమ నుంచి అనుకున్నాగానీ, జీవితం నుంచి అనుకోలేదు సార్’ అని బాధపడే భాస్కర్ బాధకు ఏ పేరు పెడదాం!!
– మయన్న
ఫొటోలు: రామకృష్ణ

సార్ దగ్గర తప్ప మరెక్కడా పనిచేయలేను. అలాంటి మనిషి దగ్గర చేసిన నేను ఇంకోచోట ఇముడుతానో లేదో…అసలు నా మనసులో మేకప్ ఆలోచనలే లేదు. అవసరమైతే వేరే పనిచేసుకుంటాను కానీ, ఇంకొకరికి పర్సనల్ చేయలేను. మా బంధానికి ఏ పేరన్నా పెట్టుకోండి. సార్ మాత్రం అద్భుతమైన వ్యక్తి. ఎవరికి ఏది ఇవ్వాలో, తననే నమ్ముకున్న వాళ్లను ఎలా చూడాలో ఆయనకు బాగా తెలుసు. మా స్టాఫ్‌ను ఎంత ప్రేమగా చూసేవాడో! కొందరికి ఇండ్లు కూడా కట్టించాడు.

కల్లపారి భాస్కర్‌రెడ్డిది మహబూబ్‌నగర్ జిల్లాలోని పెద పోతులపాడు గ్రామం. టెన్త్ ఫెయిల్ అయిన తరువాత బెంగళూర్ పారిపోయిన ఆయన ఓ రెండు మూడు సంవత్సరాలు ఊటీ, మైసూర్ వంటి ప్రాంతాలు తిరిగి చివరికి మద్రాస్‌లో ఆగిపోయారు. అక్కడే ఓ విగ్ సెంటర్‌లో చేరి సినిమావాళ్లతో పరిచయాలు పెంచుకుని, క్రమంగా మేకప్‌మేన్ అయ్యారు. అసిస్టెంట్‌గా చేస్తూనే శ్రీహరి వల్ల పర్సనల్ మేకప్‌మేన్ అయ్యాడు.
చివరి వరకూ ఆయనకు మాత్రమే పనిచేశారు.

అన్నే మా ఆశాదీపం
అన్నతో నాకు పదేళ్లుగా పరిచయం. ఎంతమందిలో ఉన్నా శేఖర్ అని నోరారా పిలిచేవాడు. మా ఫైటర్లంటే అన్నకు చాలా ఇష్టం. అభిమానం. ఎందుకంటే యాక్షన్ కష్టాలేంటో ఆయనకు బాగా తెలుసు. ఆ స్టేజీ దాటి వచ్చినవాడు కదా. అందరు హీరోల్లాగా మమ్మల్ని నాలుగు దెబ్బలు కొట్టి వెళ్లిపోడు. ప్రేమగా మాట్లాడతాడు. నాలుగు మంచి మాటలు చెప్పేటోడు. ఫైటర్లుగా మాకేదైనా రిస్కీ షాట్లు ఉన్నప్పుడు ఆయన చాలా టెన్షన్ పడేవాడు. మా కోసం ఆరాటపడేవాడు. ఆ ప్రేమను చూసే కావచ్చు. అన్నతో పనిచేయడమంటే మేము మరింత ఉత్సాహంగా ఉండేవాళ్లం. ఒకసారి ‘కూలీ’ సినిమా కోసం ట్రెయిన్ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. హీరో కొడితే ట్రెయిన్ మీద నుంచి పడిపోయే షాట్ తీస్తున్నారు. ఆ పడిపోవడం ఎలాగో టెక్నిక్ చెప్పాడు శ్రీహరన్న. అదే నాకు ప్రాణభిక్ష పెట్టింది ఎందుకంటే అప్పటికే నేను మరోలా పడాలి అని డిసైడ్ అయిపోయి ఉన్నా…అదే జరిగితే ఇప్పుడు నేను ఉండేవాణ్ణే కాదు.

అలాగే ‘ఢీ’ సినిమాలో శ్రీహరి మీద ఎటాక్ చేసి తన చెల్లెలు జెనీలియాను విలన్లు తీసుకెళ్లే ప్రీ క్లయిమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్‌ను నేను ఎప్పటికీ మరిచిపోను. కట్స్ లేకుండా చేసిన ఫైట్ అది. ఎంతో స్టామినా ఉంటే గానీ చేయలేరు. ఆ ఫైట్‌లో నా ఫేస్ మీద పంచ్ పడాలి. అది దవడ మీద తగిలి నా రెండు దవడలు పక్కకు జరిగిపోయాయి. అన్న కంగారు పడిపోయాడు. ఆయన వెహికిల్‌లోకి తీసుకెళ్లి ఏదేదో చేసి మొత్తానికి మళ్లీ సెట్‌రైట్ చేశాడు. అన్న నాకు సాయం చేశాడని చెప్పడం కాదు..ఒక హీరో ఫైటర్స్ గురించి అలాంటి చొరవ తీసుకోవడమే విశేషం. అందుకే సినిమా ఏదైనా కానీ, స్పాట్ ఏదైనా కానీ…సెట్లో అన్న ఉన్నడంటే మాకు కాస్త ఊరటగా అనిపిస్తుంది. మమ్మల్నందరినీ పిలిచి మాతో పాటే భోజనం చేస్తాడు. ఎప్పుడూ నవ్వుతూనో, నవ్విస్తూనో ఉంటాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు. ఆయన నిజంగా వస్తాద్ లాంటివాడే. ఎలాంటి షాట్ అయినా చేస్తాడు. మాకు తెలిసి ఫలానా షాట్ చేయలేకపోయాడనేదే లేదు. ఎంతటి రిస్క్ అయినా ఢీ కొడతాడు. అంతెందుకు, ఆయనతో ఫైట్ చేసిన మేము అలిసిపోయినా అన్న మాత్రం అదే స్టామినాతో కనిపిస్తాడు మళ్లీ. నిజంగా శ్రీహరన్న ఒక టిపికిల్ మనిషి. ఏదైనా చేసేయడమే అన్నకు తెలుసు.

నేను సిన్సియర్‌గా పనిచేసేవాణ్ణి. నన్ను బాగా ప్రేమించేవాడు. పైగా నేను మార్షల్ ఆర్ట్స్. నా బాడీలాంగ్వేజ్, అరుపులు అన్నీ తేడాగా ఉంటాయి. అందుకే నాతో చాలా కామెడీ చేసేవాడు. ఏదైనా చెప్తే శ్రద్ధగా వినేవాడు. అలా మా అనుబంధం కాస్త ఎక్కువే. నాకు నంది అవార్డు వచ్చినప్పుడు కూడా అన్న చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. శభాష్‌రా అని భుజం తట్టాడు. నాకు అవకాశాల్లేని టైమ్‌లో కూడా ప్రోత్సహించాడు. కష్టాల తరువాతే ఫలితాలుంటాయని మానసిక స్థయిర్యం నింపేవాడు.
మాకే కష్టం వచ్చినా అన్న ఉన్నాడులే అనిపించేంత దగ్గరగా ఉండేవాడు మాతో…అది కేవలం శ్రీహరన్నకే సాధ్యం. ఆయనతో ఎంజాయ్ చేసిన రోజులు, కలిసి తిన్న క్షణాలు, ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు ఏవీ ఎప్పటికీ మరిచిపోలేను. మాలాంటి వాళ్లకు ఆశాదీపంగా ఉండేవాడు..ఆ వెలుగులో ఎంతోమంది సాయం పొందారు!

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.