అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు -బొగ్గుల శ్రీనివాస్

అక్షరంలో.. ఆచరణలో..ఆజానుబాహువు

1948వ సంవత్సరం.. ‘రేరాణి’ పత్రికలో ‘అలవాటయిన ప్రాణం’ అనే కథలో పరిధికి మించిన శృంగారం రాశాడని ఒక 21 ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 500 రూపాయల జరిమాన కట్టకపోతే ఆరు నెలల జైలుశిక్ష అనుభవించవలసి ఉంటుందని జడ్జి తీర్పునిచ్చాడు. ‘రేరాణి’ పత్రికాధిపతి ఆలపాటి రవీంద్రనాథ్ జరిమానా కట్టి ఆ యువకుడిని రక్షించారు. కొసమెరుపు ఏమిటంటే ‘ఆ రేరాణి పత్రికను నాకోసారి ఇస్తారా? ఇంకోమాటు ఆ కథను చదువుకుంటాను’ అని ఆ జడ్జిగారే ఆ యువకుడి వద్దకు వచ్చి అడిగితీసుకున్నాడు. మరో 65 ఏళ్ల తర్వాత ఆ యువకుడే తన 86 ఏళ్ల వయస్సులో తన సమగ్ర సాహిత్యానికిగాను ఇండియన్ నోబెల్‌గా అభివర్ణించే జ్ఞానపీఠం ఎక్కాడు. అవును, అతడే రావూరి భరద్వాజ.

కేవలం 7వ తరగతి వరకే చదివిన భరద్వాజ 1943లో తన 17వ యేటనే ‘వీరగాధ’ అనే గ్రాంధిక నవల ద్వారా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించారు. స్వతహాగా కథకుడైన తన తండ్రి కోటయ్య, అమ్మమ్మ మొగులూరి సుబ్బమ్మల ప్రభావంతో జన్మతః కథలపై మక్కువ ఏర్పరచుకున్నారు. సుప్రసిద్ధ కథకుడు జీవన్ ప్రభాత్ (ప్రపంచ స్థాయి రచన ‘అస్థిపంజరాల తిరుగుబాటు’ రచయిత) పొగాకు కంపెనీలో ఉద్యోగ నిమిత్తం భరద్వాజ స్వస్థలం తాడికొండకు రావటం భరద్వాజకు వరమైంది. జీవన్ ప్రభాత్ ప్రోత్సాహంతో చలం సాహిత్యం మొత్తం చదివేశారు. 1946 ఆగస్టు 4న ‘ప్రజామిత్ర’ వారపత్రికలో భరద్వాజ తొలి రచన ‘విమల’ అచ్చయింది.

భరద్వాజ రాసిన ‘రాగిణి’ కథాసంపుటికి చలం పీఠిక రాస్తూ- ‘చలం పుస్తకాలు వారసత్వం కావనేదే కాకుండా, ఏ భాషకన్నా తలవంపులు అం టారు ప్రాజ్ఞులు. అలాంటి దుష్టసంప్రదాయం చలంతోనే ఆఖరు కాక భరద్వాజ వంటి రచయిత ద్వారా పెర్‌పెట్యుయేట్ కాబోతుందంటే చాలా నిరాశ పడుతుంది ఈ దేశపు భావి నిర్ణయ సారస్వత ప్రభువులకు’అని వక్కాణించారు. ‘హెరాల్డ్ ట్రిబ్యూన్’- న్యూయార్క్ పత్రిక 1952లో ప్రపం చ కథల పోటీని నిర్వహించినపుడు భరద్వాజ వ్రాసిన ‘పరిస్థితుల వారసులు’ అనే కథను కూడా ఎంట్రీకి స్వీకరించారు. అయితే పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’కు బహుమతి వచ్చింది. అయితే ఆ కథకు ఏమాత్రం తీసిపోని కథలుగా విశ్వసించి అప్పటి ‘భారతి’ పత్రిక వారు ప్రచురించిన నాలుగు కథలలో ‘పరిస్థితుల వారసులు’ కూడా ఉంది. ఆ రోజుల్లో కథకు ఎక్కువ ప్రతిఫలం తీసుకున్న నలుగురైదుగురు రచయితలలో భరద్వాజ ఒకరు.

1952లోనే భరద్వాజ ‘చిత్రగ్రహ’ నవలికను రాశారు. (అప్పటికింకా చంద్రునిపై మానవుడు కాలుమోపనేలేదు.) ఒక అమెరికా దేశీయుడు, ఒక వంగ దేశీయుడు, ఒక తెలుగువాడు చంద్రమండలం బయలుదేరి మార్గమధ్యంలో ‘శశూన్’ అనే ఇంకో గ్రహంలో అడుగుపెట్టడాన్ని రాశారు. అందులో ‘కామినీ కాంచనాల కోసం ఒకరి నొకరు దారుణంగా నరుక్కు చచ్చే ఈ భూమండలాన్ని చూసి సిగ్గుపడుతున్నాను’ అంటారు రచయిత ఒకచోట.

‘నా ఊహలకే అందని కవి భరద్వాజ ఒక్కరే’ అంటారు విశ్వనాథ సత్యనారాయణ. ‘తెలుగు జాతి గర్వించదగ్గ కొద్దిమంది రచయితల్లో భరద్వాజ ఒకరు’ అని త్రిపురనేని గోపీచంద్ అంటారు. ‘ఒక విషయం ఆధారంగా కథ చెప్పడం సులువు. కానీ కెమెరాతో చిత్రీకరించినట్లు డాక్యుమెంటరీలా రాయడం చాలాకష్టం. చార్లెస్ డికెన్స్ ఆ పనీ చేశారు. నాకు తెలిసినంతవరకూ తెలుగులో 1830లో ‘కాశీయాత్రా చరిత్ర’ అనే రచనలో యేనుగుల వీరస్వామయ్య తను చూసినవి చూసినట్టు డాక్యుమెంటరీలా అక్షరబద్ధం చేశారు. అలాంటి క్రియేటివ్ రైటింగ్ స్థాయి భరద్వాజలోనే ఉంది. చెకోవ్‌లా కేవలం జీవిత శకలాలే ఫోటోగ్రఫీ చేసినట్టు, వీడియోలో బంధించినట్టు చూపే సామర్థ్యం భరద్వాజ సొంతం’ అని శ్రీశ్రీ కొనియాడారు. ‘సామాన్యులను అర్థం చేసుకున్న అసామాన్యుడు, మనుష్యులను తెలుసుకున్న మహామనీషి’ అని కితాబునిచ్చారు దాశరథి. కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలోని ఆలిండియా రేడియోలో 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా చిన్న ఉద్యోగిగా ఉద్యోగ విరమణ చేసిన భరద్వాజను అదే కేంద్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో వెలువడే ‘యోజన’ పత్రికలో, (కేవలం రాష్ట్రపతి, ప్రధాని లాంటి వారి ముఖచిత్రాలకు మాత్రమే అనుమతి ఉన్నా) ‘ఈ శతాబ్దపు గొప్ప రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ’ అంటూ పట్నాల సుధాకర్ సంపాదకత్వంలో సుదీర్ఘ వ్యాసం రావటం అప్పట్లో సంచలనం. ‘ఉత్తమ సాహిత్యానికి జ్ఞానపీఠ్, నోబెల్ బహుమతి లాంటి అవార్డులే కొలబద్దలయితే ఆ అవార్డులను అందుకునేందుకు అర్హతలను మించిన ఉత్తమ సాహిత్యాన్ని భరద్వాజ మనకందించారు’ అంటూ ఆ వ్యాసం ముగించారు.

చాలామంది కవులు తమ రచనలలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తారు. కానీ వ్యక్తిగత జీవితంలో మరుగుజ్జుగా కనిపిస్తారు. కానీ అందుకు అపవాదుగా నిలుస్తారు భరద్వాజ. ‘రాత కూతల కన్నా, చేత ముఖ్యం’ అంటారు. ఇంకొకరికి సుభాషితాలు చెప్పటం కన్నా మనం ఏదైనా సత్కార్యం చెయ్యటం మంచిది. మనం మంచి చేసినా అందులో ఏదో స్వార్థం ఉంటుందని వెతికేవారు, విమర్శించేవారు ఎపుడూ ఉంటారు. వంద నీతి వాక్యాల కన్నా, ఒక చిన్న సత్కార్యం ఎంతో గొప్పది అంటారు.

1977లో దివిసీమ మీద తుఫాను విరుచుకుపడినపుడు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫున భరద్వాజ పర్యటించి వందలాది బాధామయ గాధలలో కొన్నింటిని మాత్రమే ధ్వనిబద్ధం చేసి రేడియోలో ప్రసారం చేసినప్పటికీ.. ఇంకా మిగిలిపోయిన ఎన్నో కుటుంబాల విధ్వంస కథలను అక్షరబద్ధం చేసి ‘ఈనాడు’ పత్రికలో ప్రకటించగా రాష్ట్రం నలుమూలల నుండి అందిన విరాళాల ద్వారా రామకృష్ణమఠం నిర్వాహకుల ద్వారా అక్కడ సహాయ చర్యలు చేపట్టారు. తుఫానులో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ‘పాలకాయతిప్ప’ అనే మొత్తం గ్రామం తిరిగి పునర్నిర్మించబడిందంటే దానికి ముఖ్యకారణం ‘అనుభవాలకే తప్ప అక్షరాలకు అందని’ గాధలను అక్షరబద్ధం చేసిన రావూరి భరద్వాజయే! 1978లో ఈనాడులో ‘జీవన సమరం’ శీర్షికన హైదరాబాద్ నగరంలో రోడ్డు పక్కన పిడకలు చేసి బతుకు సాగించే పోశమ్మ అనే ముసలమ్మ దీనగాధను అక్షరబద్ధం చేశారు. ‘దేవుడు సచ్చినోడు ఆకలి ఎందుకు పెట్టాడో తెలియదు- పాడు ముండాకొడుకు.. సంద్రాలు నిండుతున్నాయి గానీ ఈ జానెడు పొట్ట నిండడం లేదు బిడ్డా!’ అంటుంది పోశమ్మ.

ఈమె గాథకు చలించిన ఓ కాలేజీ విద్యార్థి ఆ పత్రికా కార్యాలయానికి ఉత్తరం ద్వారా 10 రూపాయలు పంపించి పోశమ్మకు అందజేయమని తెలియజేశాడు. ఆ పది రూపాయలు పోశమ్మకు ఇవ్వాలని ఆమె ఉండే రోడ్డుకు వెళ్లి భరద్వాజ వాకబు చేయగా పోశమ్మ చచ్చిపోయిందని అక్కడివాళ్లు చెప్పగా నోటును, ఉత్తరాన్ని గుండెను కదిలించే జ్ఞాపికలుగా చివరి వరకూ భరద్వాజ దాచుకున్నారు.
కేవలం ‘పాకుడురాళ్లు’ నవలకే జ్ఞానపీఠ పురస్కారం లభించిందని సర్వత్రా వినిపిస్తుంది. ఇది నిజం కాదు. 1970లో విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షా’నికీ, 1988లో డా.సి.నారాయణరెడ్డికి ‘విశ్వంభర’కూ పురస్కారం లభించినపుడు జ్ఞానపీఠ్ కమిటీ నిబంధనల ప్రకారం ఒక్క పుస్తకానికే పురస్కారం ఇచ్చేవారు. కానీ నేడు ఏదేని ఒక గుర్తింపు పొందిన భాషలో ఒక రచయిత చేసిన మొత్తం రచనలకు పురస్కారం ఇస్తున్నారు. కేవలం పాకుడురాళ్లు నవలకే పురస్కారం వచ్చింది అనే ప్రచారం వల్ల భరద్వాజ రాసిన అద్భుత సాహిత్యం వెలుగులోకి వచ్చే అవకాశమే లేదు. జ్ఞానపీఠ కమిటీ వెలువరించిన పత్రికా ప్రకటనలో భరద్వాజ రచించిన ఉత్కృష్ట రచనలుగా ఉదహరించిన కొన్ని రచనలలో ‘పాకుడురాళ్ళు’ పేరు ఉంది. ‘పాకుడురాళ్లు’ ప్రచురించిన ప్రచురణ సంస్థ కూడా తమ నవలకే జ్ఞానపీఠం వచ్చింది అని ముఖచిత్రంపై పేర్కొన్నది.

ప్రస్తుతం భరద్వాజ రచనలు ‘స్మృతి సాహిత్యం, జీవన సమరం, పాకుడురాళ్లే’ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చలం తన ‘మైదానం’కు సరితూగ గల రచన ‘శిథిల సంధ్య’ (1951)యే అన్నారు. మరి ఆ శిథిల సంధ్య ఎంతమందికి తెలుసూ? కాబట్టి భరద్వాజ రచనలన్నింటినీ పునర్ముద్రింపజేసి భావితరాలకు అందజేయాలి.
-బొగ్గుల శ్రీనివాస్
92465 51144

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.