అపర భగీరధీయం-1

అపర భగీరధీయం-1

తన పూర్వీకులైన సగరుల భస్మ రాశులపై దివిజ గంగను భూమి మీదకు తెప్పించి వారి ప్రేతాత్మలకు విముక్తి కలిగించి  అమరత్వాన్ని కల్పించాడు భగీరధుడు .దీనికి ఆయనకు ఎన్నో అడ్డన్కులేర్పడ్డాయి గంగను భూమి మీదకు దిమ్పాలంటే సరాసరి అది పడితే భూమి బ్రద్దలై పోతుంది అందుకని ముందుశివుని జటాజూటం లోకి అక్కడినుండి  హిమాలయ పర్వతాలపై కి చేర్చాడు,దాని మీద నుండి భూమిపైకి తెప్పించాడు మధ్యలో జాహ్న మహర్షి చెవిలో దూరితే బతిమాలి తప్పించి భూమార్గం పట్టించి సాగరుల భస్మ రాశులపై  పారించి వారికి విముక్తి కల్గించి పితృ ఋణం తీర్చుకొన్నాడు ఆయన చేసినా ఈ కఠోర శ్రమనే భగీరధ ప్రయత్నం అన్నారు .కరువు కాటకాలతో వరదలతో అల్లాడే గోదావరి ప్రాంత జనులకు దాహార్తి తీర్చి, తాగు నీటితో బాటు సాగి నీటి వసతి కల్పించి లక్షలాది ఎకరాలలో నీరు పారించి గోదావరి డెల్టాను సస్య శ్యామలం చేయటానికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి అంతటి శ్రమనూ పడ్డాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర .అందుకే ఆయన్ను ఆ ప్రాంత జనం ‘’అపర భగీరధుడు ‘’ అని ప్రశంశించి కృతజ్ఞతలు చెప్పి నిత్య గోదావరీ స్నానం లో ఆ మహానుహావుడికి సూర్యునితో పాటు అర్ఘ్య ప్రాదానం చేస్తున్నారు వాళ్ళు అలా ఆయన సేవల్ని నిత్యం స్మరిస్తూ ప్రాతస్మరణీయుడు గా భావించారు ఈ అపర భగీరధుడు చేబట్టిన ఆనకట్ట నిర్మాణాన్నే నేను ‘’అపర భగీరదం ‘’అన్నాను .ఈ వ్యాసం లో ఆ నిర్మాణ వైనాన్ని తేలియ జేయట మే నా కర్తవ్యమ్

             ఆ నాటి గోదావరితీర జన ఈతి బాధలు

దక్షిణ గంగ అయిన గోదావరి నది దక్షిణ భారతం లో అతి పెద్ద నది .పస్చిమకనుమల్లో నాసికా త్రయంబకం వద్ద జన్మించి మహా రాష్ట్ర ,మధ్యప్రదేశ్ ,గుండా ప్రవహించి తెలుగు నేలను చేరుతుంది .ప్రాణహిత ,మంజీరా ,ఇంద్రావతి ,శబరీ ,కిన్నెర సాని మొదలైన ఉపనదులను తనలో కలుపుకొని పాపి కొండల్ని చీల్చుకొని పరవళ్ళు తొక్కుతూ అరణ్యాలు అధిగమించి పోలవరం వద్ద మైదానం లోకి ప్రవహిస్తుంది .1440కిలో మీటర్ల సుదీర్ఘ ప్రయాణం లో కాళేశ్వరం ధర్మపురి.భద్రాచలం  మొదలైన పుణ్య క్షేత్రాలను చుట్టి ధవళేశ్వరం దగ్గర ‘’గౌతమి .’’వశిష్ట ‘’అనే రెండు పాయలుగా చీలి, మరి కొంత తూర్పుకు ప్రవహించి ఏడు శాఖలుగా చీలి అలసి సొలసి సాగర సంగమం చేస్తుంది  అయినా నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాలు మాత్రం దుర్భర దారిద్ర్యం లో మగ్గి పోయేవి .

19వ శతాబ్దం పూర్వ భాగం లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతాలలో ఎన్నో ప్రత్తి మిల్లులు స్తాపించి నేత పని వారికి పుష్కలం గా చేతి నిండా పని కల్పించింది .ఇక్కడ తయారైన నాణ్యమైన వస్త్రాలు ఇతర దేశాలకు ఎగు మతి చేసి ఎంతో లాభాలను కలిగించేవి .కాని ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం రావటం తో వస్త్ర పరిశ్రమలో ఆధునికత చోటు చేసుకోంది .ఆర్క్ రైట్ మొదలైన బ్రిటిష్ సంస్థలు ఏర్పడి ఇంగ్లాండ్ నుంచి మనదేశానికి వస్త్రాలను అధికం గా దిగు మతి చేయటం తో మన నేతన్నల కడుపు కొట్టారు నూలు బట్ట గిరాకీ బయటి దేశాల్లోనే కాక మనదేశం లోను తగ్గింది . 1829నాటికి బట్టల మిల్లులు పూర్తిగా మూత పడ్డాయి .తిండికి దిక్కే లేని నేతన్నలు వేరే వృత్తులు చూసుకోవాల్సి వచ్చింది .1826లో పద్నాలుగు లక్షల రూపాయల విలువ గల బట్టలు ఎగుమతి అయితే 1841కి కేవలం ఒక లక్ష రూపాయల ఎగుమతులే జరిగాయి .

1791లో వచ్చిన కరువు కాటకాలు ,అప్పటికి వందేళ్ళు సాగిన యుద్ధాలు ,సంస్థానాధీసుల అలసత్వం భోగ లాలసత్వం ప్రజా సమస్యలపై ద్రుష్టి లేమి ,వల్ల అరాచకం ,నిరక్ష రాస్యత పెరిగాయి 1831నాటి అతి వృష్టి ,ఆ తర్వాతి ఏడు వచ్చిన గాలివాన ,1833లో ఏర్పడిన క్షామం వరుసగా ఉత్తరాంధ్ర జన జీవితాన్ని అస్త వ్యస్తం చేశాయి .దీనికే ‘’నందన క్షామం ‘’అని పేరు .ప్రతి నలుగురిలో ఒకరు మరణించారు .పిల్లా పాపలతో జనం ఆవాసాలు వదిలి మద్రాస్ ప్రాంతాలకు వెళ్తూ ఆకలి దప్పులతో వేలాది మంది చని పోయారు ఎక్కడ చూసిన మృత కళేబరాలే .దుర్గంధ భూయిష్టమై పోయింది .తిండికి లేక ఆడపిల్లల్ని నిజాం బేర గాళ్ళకు అమ్ముకొన్నారు పాపం .వేలాది పశువులు మేత ,నీరు లేక చనిపోయాయి .దోపిడీలు, దొంగతనాలు విచ్చల విడి అయ్యాయి .వర్తకులు తెచ్చేధాన్యాన్ని   గ్రామస్తులు గుంపులుగా చేరి లాక్కొని  పోయేవారు .కస్టపడకుండా సహాయం చెయ్యరాదని ఆనాటి పాలకుల సిద్ధాంతం .బాగా బతికిన వారు కూలి పనులు చేయలేక పరువుతక్కువ గా భావించి చావటానికి సిద్ధపడ్డారు బావుల వద్ద మంచి నీటికోసం జలయుద్ధాలు జరిగేవి .పెద్దాపురం, పిఠాపురం, గూటాల ,కిర్లం పూడి కపిలేశ్వరపురం ,పోలవరం కొత్తపల్లి మొగల్తుర్రు మొదలైన సంస్థాన రాజులు నీటి పారుదలపై శ్రద్ధ చూపలేదు ప్రజా సంక్షేమం వారి ద్రుష్టికే రాలేదు .వదలకుండా పన్నులు మాత్రం పీడించి వసూలు చేసుకొని జల్సా చేశారు

1834-35 లలో వాతా వరణం అనుకూలించి కాస్త ఊరట కల్గించింది .కాని 1836నుండి వరుసగా మూడేళ్ళు ప్రక్రుతి వైపరేత్యాలేర్పడి పంటలు దెబ్బతిన్నాయి .1839లో కాకినాడ ప్రాంతం లో వచ్చిన బ్రహ్మాండమైన ఉప్పెన తో సముద్రం పొంగి ,కాకినాడ ,కోరంగి ప్రాంతాలుదాదాపు  జల సమాధి అయ్యాయి సముద్రం నాలుగు మైళ్ళ దూరం వరకు పడవల్ని విసిరి కొట్టింది .కాకినాడ ,రాజమండ్రి మధ్య ఉన్న ఇళ్ళు ఏ ఒకటో రెండో తప్ప అన్నీ నేల మట్టమైనాయి .జలాశయాలు ఉప్పు నీటితో నిండిపోయాయి .తాగటానికి గుక్కెడు మంచి నీళ్ళు దొరక లేదు .బావుల్లోఉప్పునీరు చేరి భరించ రానికంపు వచ్చేది .1840 లో కూడా ఇలాంటి పరిస్తితులే ఏర్పడ్డాయి జన జీవనం దుర్భరమై పోయింది గోదావరికి వరద వచ్చినప్పుడల్లా నీరు సముద్రం లోకే పోయేది .ఇలాంటి విపత్కర పరిస్తితులలో నుంచి ఒడ్డున పడ వేసే అపర భగీరధుడు కావాల్సి వచ్చాడు అప్పుడే కాటన్ దొర అక్కడ ప్రత్యక్ష మయ్యాడు .

గోదావరి పై సర్వే-ఆనకట్ట ప్రతి పాదన

గోదావరి పై ఆనకట్ట కట్టక పూర్వం గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర లను కలిపి ‘’రాజమండ్రి జిల్లా ‘’అని పిలిచే వారు .1831-40మధ్యకాలం లో అతి వృష్టి అనా వృష్టి తుఫాన్లు ఉప్పెనలు జిల్లాను పూర్తిగా కుంగ దీశాయి .1821-లో జనాభా7,38,308  ఉంటె పదేళ్ళ తర్వాతా  1842-43 లో అంతే జనాభా  పెరగలేదుకాని5,61,041కి తగ్గి పోయింది .1815-24 మధ్య ప్రభుత్వానికి శిస్తు ఆదాయం 18 ,72172 రూపాయలు అయితే ,1830–43.మధ్య ఆదాయం పదహారు లక్షలే అయింది అంతకు ముందు గోదావరి డెల్టాకు సాగు నీటి సౌకర్యాలు కల్గించాలని యాభై ఏళ్ళుగా ఎన్నో ప్రతి పాదనలను పంపినా ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదు .ఆదాయం తగ్గి పోయే సరికి వాళ్లకు చురుక్కు మని పించింది .ఇప్పుడు ద్రుష్టి పెట్టారు .తగ్గటానికి కారణాలను పరిశీలించమని నివేదికలు పంపమని పరిపాలనా విభాగం లో పని చేస్తున్న ‘’హెన్రి మౌంట్ గోమరీ ‘’ని ప్రభుత్వం ఆదేశించింది .కాని  తన జిల్లాకు వేరే అధికారిని నియమింటం రాజ మండ్రి కలెక్టర్ అవమానం గా భావించి సహాయ నిరాకరణ చేశాడు ప్రభుత్వం వెంటనే స్పందించికలెక్టర్ ను తొలగించి  మాంట్ గోమరీ నే జిల్లా ఎడ్మినిస్త్రేటర్ గాహోదా కల్పించి ,కార్య రంగం లో దిగమని సూచించింది

గోమరీ వెంటనే అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి అందులో జిల్లాలో ఇరిగేషన్ పనులను అశ్రద్ధ చేయటం ,రెవిన్యు అధికారుల లంచ గొండి తనం ,అసమర్ధత ,లోప భూయిష్ట ఎస్టేట్ ల నిర్వహణ వల్లక్షామం ఏర్పడి ఆకలి చావులతో జనాభా క్షీణించి ప్రభుత్వాదాయం తగ్గి పోయిందని తెలియ జేశాడు .దీనికి పరిష్కారం గోదావరి డెల్టాలో సాగు నీటి సౌకర్యం కల్గించటం ఒక్కటే శరణ్యం అని చెబుతూ ,దీనికి ఇప్పటికే ఈ రంగం లో తన సమర్ధతను శక్తి యుక్తులను ,వివేకాన్ని కష్ట సహిష్ణుతను రుజువు చేసుకొన్నఆర్ధర్  కాటన్ దొర ఒక్కడే సర్వ సమర్ధుడు అని ప్రభుత్వానికి నిర్ద్వంద్వం గా తెలియ జేశాడు.

 

 

 

అప్పటికే మేజర్ ఆర్ధర్ కాటన్ రెండో శతాబ్దం లో కరికాల చోళుడు కావేరి నది పై నిర్మించిన’’ గ్రాండ్ ఆనకట్ట’’ ‘’కు అడుగున తూములు ఏర్పరచి,కావేరిలో ఒండును తొలగించి లోతు చేసి నీటి నిల్వ సామర్ధ్యాన్ని30 మిలియన్ల ఘన గజాలకు బదులు నలభై మిలియన్లఘనగజాల వరకు పెంచాడు కాలరూన్ నదిపై ఆనకట్టలు కట్టి ,కొంత నీటిని కావేరికి మళ్ళించి వరదలను ఆపి ,తంజావవూర్ జిల్లాను’’ దక్షిణ దేశ దాన్యా గారం’’ చేశాడు  స్తానికం గా దొరికే వాటినే ఉపయోగించి తన ఆలోచన ను రుజువుచేసి సాటి లేని ‘’ఇరిగేషన్ ఇంజినీర్’’ గా   సుస్తిర కీర్తి పొందాడు .  .రెడ్ హిల్స్ కు రైల్ మార్గం ఏర్పరిచాడు .తర్వాతా మద్రాస్ లోపని చేసి నౌకాశ్రయ నిర్మాణం కార్య క్రమం చేబట్టి ,మిలిటరీ బారక్స్ ను తక్కువ వ్యయం తో నిర్మించి ప్రభుత్వ మన్ననలు పొందాడు ఆ తర్వాత విశాఖ లో చర్చి నిర్మించి విశాఖను సముద్ర కెరటాల నుండి రక్షించే రాతి గోడ లు కట్టాడు   ఆ రాళ్ళ మధ్య మట్టి ఇసుక పేరుకొని కట్టలు మరింత ద్రుఢతరం అయ్యాయి సహజ నౌకాశ్రయానికి విశాఖ చాలా అనువైన స్తలం అనీ ,విశాఖను జల మార్గాల ద్వారా ముఖ్య పట్నాలతోలతో కలిపి వృద్ధి చేయాలని విశాఖ పరిసరాల్లో చెరకు ,కాఫీ పండ్ల తోటలపెంపకం చాలా శ్రేష్టం అనీ ప్రభుత్వానికి ముందు చూపుతో సూచనలు చేసిన ‘’ఆధునిక విశాఖ శిల్పి’’ సర్ ఆర్ధర్ కాటన్.అప్పటికే ప్రభుత్వం కోరకుండానే గోదావరి డెల్టా భి వృద్ధికి కొన్ని సూచనలు ప్రభుత్వానికి పంపి ఉన్నాడు .ప్రత్తికి బదులు చెరుకు పండించటానికి ఏర్పాట్లు చేయాలని సూచించాడు ప్రాభుత్వం దీన్ని అంగీకరించింది కూడా . మాంట్ గోమరీ సూచన కు వెంటనే స్పందించిన ప్రభుత్వం కాటన్ ను గోదావరి డెల్టా కు నీటి పారుదల సౌకర్యాలు కల్పించటానికి నివేదిక తయారు చెయ్యమని కాటన్ ను 1844 ఆగస్ట్ అయిదున  ఆదేశించింది .

కాటన్ కార్యక్రమం

ప్రభుత్వ ఆజ్ఞతో విశాఖ నుండి రాజ మండ్ర చేరుకొన్నాడు కాటన్ .పాపి కొండల నుంచి అసముద్రంవరకు గోదావరి నదిని సర్వ్ చేసి వేర్వేరు ప్రదేశాలలో నదీ నీటి మట్టాలను ,వాలును ,ప్రవాహ వేగాన్ని లెక్కలు  కట్టటానికి ఉద్యమించాడు 20లక్షల ఎకరాల్లో సర్వే  చేయాలి. కాలువల మార్గాలని, భూ మట్టాలని నిర్ణయించాలి .ఇదిఎంతో కష్టమైన పని .సర్వే కు ఎనిమిది మంది పని చేసే సోల్జర్లను ఆరుగురు సర్వేయర్లను ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి రాశాడు .పొదుపు మంత్రం పాటించే ప్రభుత్వం అనుభవం లేని ఒక కుర్ర అధికారిని ,శిక్షణ లో ఉన్న ఐదుగురుసర్వేయర్లను మాత్రమె సాంక్షన్ చేసింది .జీపుల్లేని కాలం. ఎడ్ల బండీ లేక గుర్రాల మీదే ప్రయాణ సాధ్యం .సర్వే పరికరాలు ఆధునికమైనవికవు మొరటుగా ఉండేవి .కాని ఏమాత్రం నిస్పృహ కు లోను కాని కాటన్ ఓపిక లేక పోయినా రోజుకు కనీసం పది మైళ్ళు గుర్రం మీద తిరుగుతూ మిక్కిలి శ్రమ కోర్చి అపర భగీరదుడై కేవలం ఎనిమిది నెలల్లో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి 1845ఏప్రిల్ పది హేడు న సమర్పించాడు .

కాటన్ నివేదికలో ముఖ్య విశేషాలు

గోదావరి డెల్టాలో నేల స్వభావం వాతా వరణం ,జల వనరులు ప్రపంచం లో ఎక్కడా లేవు వరదలను తట్టుకోనేట్లు లోతట్టు ప్రాంతం లో గోదావరికి రెండు వైపులా మట్టి కట్టలు ఎత్తుగా కట్టాలి .నదికి అడ్డం గా ఆనకట్ట కట్టి ,కాలువలు త్రవ్వి నదీ జలాలను ఎత్తు గా ఉండే పంట భూములకు అందించాలి .చదును భూముల నుండి మిగులు నీటిని బయటికి పంపి పంట దిగుబడికోసం మురికి కాలవలు త్రవ్వాలి .వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కు రోడ్లు, వంతెనలు ఎక్కువగా నిర్మించాలి .వీటన్నిటికి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది .

ఇలా చేస్తే ఒన గూడే సదుపాయాలేమిటో కూడా కాటన్ వివ రించాడు .గోదావరి కృష్ణా లోయలలో సుమారు ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది .ముప్ఫై లక్షలున్న సంవత్సర ఆదాయం  రెండు కోట్ల రూపాయలకు పెరుగుతుంది .డెల్టాకు అంతటికి నౌకాయాన సదుపాయం ఏర్పడుతుంది .వేసవి లో 30 వేల ఎకరాలకు చెరుకు సాగుకు సరి పడ నీరు అందుతుంది.మారు మూల గ్రామాలకు కూడా తాగునీరు అందుతుంది .వార్షిక రెవిన్యు ఇరవై  లక్షల నుండి అరవై లక్షలకు పెరుగుతుంది  .

    ప్రత్యెక సూచనలు

ఆనకట్ట నిర్మాణం మిలిటరీ కట్టడాల నిర్మాణం అంత పటిష్టం గ ఇంజినీర్ల నిర్వహణలోనే జరగాలి. అనుభవం లేని స్తానిక రెవిన్యు అధికారులకు ఈ పని అప్పగిస్తే పైసా కూడా ఆదాయం రాదు .తన సూచనల్లో ఏదైనా సందేహాలుంటే తనకు రాత పూర్వకం గీ తెలియ జేసి సమాధానం రాయటానికి తనకు తగి నంత వ్యవదినివ్వాలి .

ఇలాంటి సూచనలు, సలహాలు ఇంత్సకు ముందు ఏ అధికారి సాదికారికం గా ప్రభుత్వానికి ఇవ్వలేదు .దీనికి ధైర్యం ఆత్మ విశ్వాసం ఉండాలి. అవి పుష్కలం గా ఉండబట్టే కాటన్ నిర్భయం గా ఈ విషయాలు తెలిపాడు వీటిని రాజ మండ్రిజిల్లా కలెక్టర్ ఫ్రేండర్ గాస్ట్  -మద్రాస్ చీఫ్ ఇంజినీర్ లెఫ్టి నేనెంట్ కల్నల్ ఏ లాయ్ కి పంపిస్తే ,  ఆయన బల పరచి రెవెన్యు బోర్డ్ కు  26-2-1846 న పంపాడు .ఇది సమర్ధించి మద్రాస్ ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం అంగీకరించి లండన్ లో డైరెక్టర్లకు పంపించింది .డైరేక్తర్ల్ కోర్టు ఆనకట్ట నిర్మాణానికి 4,75 572రూపాయలు ,అప్పటికే ఉన్న పంటకాలవల మరమ్మత్తులకు 14,000  రూపాయలు శాంక్షన్క్ చేసింది  1847లో ఆనకట్ట నిర్మాణానికి మద్రాస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గోదావరి డెల్టా ప్రజల కోరిక, కాటన్ ఆశ, ఒకే సారి నేర వేరాయి .ఇక కాటన్ కార్య రంగం లో దూకటమే మిగిలింది .ఇదీ గోదావరి డెల్టా సస్యశ్యామలమవటానికి’’ డెల్టా రూప శిల్పి కాటన్ ‘’ఆరంభించిన పనికి ఉన్న నేపధ్యం . నిర్మాణ విషయాలు తరువాత తెలుసు కొందాం .

సశేషం –మీ గబ్బిటదుర్గా ప్రసాద్ -29-10-13-ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.