సమగ్ర కళా వేదికగా శతరూపం

 

రాష్ట్రంలో తెలుగు భాష, సాంస్కృతిక వికాసానికి ఒక కొత్త విధానాన్ని రూపొందించాలని, యువతకు కళా రంగంలో అవకాశాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.

స్పష్టమైన సాంస్కృతిక విధానం లేని మన రాష్ట్రంలో తప్పటడుగుల శతరూప కార్యక్రమం కొత్తపుంతల్లో సాగుతోంది. ప్రతిభావంతులైన కళాకారుల సృజన, ప్రదర్శనా పాటవాలకు ప్రోత్సాహక వేదికగా ఆ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వరుసగా వంద రోజులపాటు సకల కళారూపాలకు ఆహ్వానం పలుకుతూ మెరికల్లాంటి వారికి తొలి సోపానంగా ఈ కార్యక్రమం దోహదం చేస్తోంది. రెండువేల వందమంది కళాకారుల ప్రదర్శనలు, అందుకుగాను యాభై ఐదు లక్షలకు తాకిన ప్రత్యేక వ్యయంతో శతరూప- 2013 తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టు రెండవ తేదీ నుంచి వరుసపెట్టుగా జరుగుతున్న సప్తాహ సంరంభాల్లో తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన కళా ప్రదర్శనలు అపార ఆదరణ పొందాయి. పెద్దపెద్ద సంస్థలు, అగ్రశ్రేణి కళాకారుల ప్రత్యేక కార్యక్రమాలకు దీటుగా ప్రేక్షకుల ఆదరణ పెంచుకున్న శతరూపలో బహుముఖ రూపాల గుణపాఠాలు సాంస్కృతిక రంగంలో అనుభవంలోకి వచ్చాయి.

జాతీయ స్థాయిలో పేతోపాటు నిర్వహణలో, ఆదరణలో ఆదర్శమైన రవీంద్రభారతి ప్రాంగణంలో సువిశాలమైన ఆరుబయలు వేదికపై వేసవి సాయంత్రాల ఆటవిడుపుగా తొలి దశ కార్యక్రమాలకు నాంది పలికారు. 2006లో మొదలైన మొదటి దశ శతరూపకు పర్యాటక శాఖ నిధులను సమకూర్చడంలోనూ, శిల్పారామం వంటి వేదికపై నిత్యం ప్రదర్శించే తీరును కొత్త దారిలోకి మళ్ళించడంలోనూ అప్పటి కార్యదర్శి అర్జా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. సాంస్కృతిక శాఖతోపాటు పర్యాటక రంగం, యువజన వ్యవహారాల శాఖల బాధ్యతల్ని జమిలిగా నిర్వహించడంలో ఆయన శతరూపకు తెరతీశారు. రాష్ట్రవ్యాప్తంగా గల కళారూపాల్ని గుర్తించి వాటికి సంబంధించిన వివరాలు, విశేషాల్ని ప్రచురించడంతోపాటు ఆయా కళారూపాల్లో నిష్ణాతులైన వారి జాబితాల్ని రూపొందించి గుర్తింపు కార్డులు జారీ చేయడంతో సాంస్కృతిక రంగం కొత్త ఒరవడిలోకొచ్చింది.

ఇక సుమారు 16 వేల పైచిలుకు కళాకారుల వివరాలను కంప్యూటర్ పరిజ్ఞానంతో వర్గీకరించి, క్రోడీకరించిన తర్వాత సాంస్కృతిక శాఖ ప్రదర్శనలను నిర్వహించడంలో కొత్త కొత్త పద్ధతులను అనుసరించారు. వారి వారి ప్రతిభను మదింపు వేయడంతోపాటు తదనంతర అవకాశాల కల్పనకు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సాంస్కృతిక శాఖ కార్యాలయం ప్రాంగణంలో రవీంద్రభారతి ముంగిలిలోని పచ్చికలో చల్లగాలుల మధ్య ఆ ఆహ్లాద వేదిక ఏర్పాటయింది. ఒక పూటకు రెండు మూడు కార్యక్రమాల ఒత్తిడిని తట్టుకోవడానికి సరికొత్త వేదికను రూపొందించారు. రవీంద్రభారతి నిర్మాణం, సాంస్కృతిక శాఖ ఉనికి రూపుదిద్దుకోవడానికి ముందు ప్రతిష్టాత్మక ప్రదర్శనలతో రాజధానిలో వేదికగా ఉపయోగపడిన గాంధీభవన్‌లోని ప్రకాశం హాలును కూడా వినియోగించడం సంప్రదాయంగా ఉండేది. ఆ ఆనవాయితీని పునరుద్ధరిస్తూ శతరూప గాంధీభవన్ వేదికలను జమిలిగా 2006లో తీర్చిదిద్దారు.

సరికొత్త కళారూపాలు
కాగా, శతరూప వేదికపై పలు కార్యక్రమాలు కళకళలాడటం సాంస్కృతిక శాఖ వన్నె పెంచింది. గుర్తింపు కార్డులు తీసుకుని మంత్రులు, శాసనసభ్యుల సిఫారసులతో సాంస్కృతిక శాఖ సంచాలకుడిని సంప్రదించి, అభ్యర్థించి, ఒత్తిడి తెచ్చి వేదికలపై ఎక్కటం ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక్కపెట్టున 30 నుంచి 40 లక్షల రూపాయల వరకూ నిధులు మంజూరు అవుతుండడంతో, వాటిలో ఎంతోకొంత పొందటానికి కొందరు తాపత్రయపడేవారు. కళాకారులు, అధికారుల మధ్య సంబంధాలు పంపకాలతోనే అవకాశాలు ఉండే పద్ధతికి శతరూప వేదిక కేంద్రంగా మారింది. అయితే, ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు ఈ రంగంలో సరికొత్త సంస్కరణలు మొదలయ్యాయి. సాంస్కృతిక శాఖ తీరుతెన్నులు మారాయి. పురావస్తు ప్రదర్శన శాఖ అధికారిగా పనిచేసిన కేదారేశ్వరి అటు పర్యాటక రంగమే కాక, ఇటు సాంస్కృతిక శాఖ కూడా ప్రకాశించేలాగా చేశారు. సాంస్కృతిక రంగంలోని స్వయం ప్రకటిత పెత్తందారుల పోకడల్ని సమూలంగా మార్చిన ఐఎఎస్ అధికారి బి. వెంకటేశం మరొక దిశలో సంస్కరణలు తెచ్చారు. సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన అవధాని డాక్టర్ రాళ్ళబండి ప్రసాదరాజు (కవితా ప్రసాద్) నియమితులవటంతో శతరూప వన్నె పెరిగింది. రవీంద్రభారతి ప్రధాన మందిరం, ఘంటసాల వేదికలపై కళా సంబంధ ప్రదర్శనలకు ఉచిత కేటాయింపులు, ప్రోత్సాహకాలు, సరికొత్త కసరత్తులు కలగలిసి గతకాలం పద్ధతులు, విధానాల్ని సమూలంగా మార్చాయి.

అవి రూపుదిద్దుకుని సరైన దారికి మళ్ళుతున్న సందర్భంలో మళ్ళీ బదిలీలు, తాత్కాలిక పద్ధతులు పెరిగాయి. ప్రస్తుతం వరంగల్ ప్రాంత డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం. కాంతారావు, వాణిజ్య పన్నుల శాఖలో అత్యున్నత అధికారి వి. హర్షవర్ధన్, పర్యాటక శాఖలోని సహాయ కార్యదర్శి సునీతా భగవత్‌ల సారథ్యంలో శతరూప నిర్వహణలో పెను మార్పులు వచ్చాయి. సాంస్కృతిక శాఖకు సమాంతరంగాే ముఖ్యమంత్రి నేరుగా నియమించే సాంస్కృతిక మండలి అధ్యక్షుడి అనధికార జోక్యంతో సాంస్కృతిక శాఖ ఒదిదుడుకుల పాలైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి శాశ్వతంగా మూతపడిందనిపించే భావనకు బలం పెంచుతూ సాంస్కృతిక మండలి మొత్తంగా తెరమరుగైంది. పునర్నియామకంతో, భాష, సాంస్కృతిక శాఖల అనుసంధానంతో, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో, విజయనామ సంవత్సర శతరూప సరికొత్త విజయాలను నమోదు చేసుకుంది.

మారుతున్న కళా రంగం
గత ఏడాది తిరుపతిలో 45 కోట్ల భారీ వ్యయంతో తెలుగుతనానికి వైభవం, విమర్శలు తెచ్చిపెట్టిన నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానంలో భాగంగా ఈ ఏడాది అంతా తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం అయింది. అందుకు అనుగుణమైన కార్యక్రమాలలో భాగంగా శతరూప- 2013 ప్రత్యేక వేదిక అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల ప్రత్యేక మంజూరు, పలు రాష్ట్రాల నుంచి తెలుగువారి శతరూప సాధిస్తున్న ఫలితాలపై ఆరా తీస్తున్నవారి శ్రద్ధ కొత్త వెలుగుల్ని తెచ్చిపెట్టాయి. గతంలోని అధికారులు పత్రికా ప్రకటనల ద్వారా దరఖాస్తుల్ని ఆహ్వానించడం, అందుకుగాను కొంత రుసుము కూడా వసూలు చేయడంతోపాటు 2006లో మొదలైన శతరూప 2010 నాటికి రద్దు అయింది. ఆ తరువాత రెండు సంవత్సరాలు వద్దు అనుకున్నారు. అంతకు ముందు కేవలం హైదరాబాద్‌లో జరిపి ఊర్కోవడం కన్నా ఆయా జిల్లాలు, ప్రాంతాలకు తరలించాలన్న ప్రభుత్వ పెద్దల నిర్ణయం మన కళారంగంలో సంచలనం తెచ్చింది. అవకాశాల కోసం అగ్రశ్రేణి కళాకారుల నుంచి వర్ధిష్టుల దాకా వెంపర్లాడటం, తమకు తోచిన పద్ధతుల్లో ప్రయత్నాలు ముమ్మరంగా చేయటం ఆరంభమైంది.

ఇక గతంలో ఎన్నడూ వేదికలు ఎక్కని అద్భుత సృజనా ప్రతిభ శతరూప 2013 వేదిక పైకి వచ్చాయి. కొందరు కళాకారులు తమకు తాము ప్రకటించుకున్న అగ్రాసనాలు, పెత్తందారీ పోకడల మధ్య తాజా మొగ్గల్లాంటి కళాకారులు కళాసౌరభాల్ని పరవశించేలా పంచారు. తుదిదశకు చేరుకున్న ఈ ఏడాది శతరూపతో అందరిలో సరికొత్త ఉత్తేజం వెల్లివిరుస్తోందని సంచాలకుడు కవితాప్రసాద్ తమ మదింపు ఫలితాల్ని వివరిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో సంబంధాలు పెరగడంతో తెలుగు భాషా వికాసానికి ఈ ఏడాది శతరూపను కొత్తరూపంలోకి తెచ్చామని వివరించారు. “కొంతమందికి కోపం, మరి కొంత మందికి సరదా వేదికగా మారిపోయిన శతరూప తీరుతెన్నుల్ని సమూలంగా మార్చాం. ఇటీవలి కాలంలో మన ముందు తరాల తెలుగు వెలుగుల్ని స్మరించుకోవడం దాదాపుగా లేకుండా పోయింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వారు, ప్రపంచానికి ఆదర్శంగా మేధలో, సంస్కృతిలో పేరెన్నికగన్నవారు ఈ తరం యువతకి తెలియకుండా పోతున్నారు. ఆ లోటుని గమనించి సాంస్కృతిక శాఖ తన వంతు బాధ్యతగా ఆదర్శవంతమైన వేదికను రూపొందించింది. అదే ఈ ఏటి శతరూప అయింది” అని కవితా ప్రసాద్ అన్నారు.

యువతలో శ్రద్ధాసక్తులు
“ప్రతిభావంతుల అవసరాలకు, సాధారణ విద్యకు కళారంగంలో ప్రోత్సాహకర అవకాశాలు కల్పించడం కోసం సరికొత్త సాంస్కృతిక విధానాన్ని రూపుదిద్దుకుంటోంది. మహనీయుల విశేషాలతో సాంస్కృతిక శాఖ పుస్తకాలు ప్రచురిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుదనాన్ని సగర్వంగా చాటుకునేలా యూట్యూబ్‌లో కూడా శతరూప కార్యక్రమాల్ని పెట్టిస్తున్నాం. అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వేదిక స్ఫూర్తిని అందుకున్న రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ పౌరాణిక నాటక ప్రదర్శనను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తరువాత సురభి సంస్థ వారు ప్రత్యేక ప్రదర్శనలతో ఇదే వేదిక పైకి రాబోతున్నారు. మరికొన్ని కళా సంస్థలు, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు తమకు కూడా అవకాశాలు కల్పించమని అభ్యర్థనలు పంపిస్తున్నారు. వీలైనంత త్వరలో రమారమి 600 మందికి అనువుగా వెసులుబాటుతో కళా ప్రదర్శనలు తిలకించేలా అన్ని హంగుల ఆడిటోరియం సంసిద్ధం చేయాలన్న యోచన కూడా ఉంది.

ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది” అని కవితా ప్రసాద్ వివరించారు. ఇంకా అనేక ప్రోత్సాహకాలు యువతలో కళాభిరుచిని పెంపొందించి, అందుకు తగిన రీతిలో ప్రదర్శన అవకాశాలు, తెలుగుదనంపై ప్రీతీ పెంచేలా సాంస్కృతిక శాఖకి శతరూప-2013 చాలా అంశాల విషయంలో కొత్త ఆలోచనలు రేకెత్తించింది. నూరు రోజులుగా రకరకాల కళారూపాల్ని తిలకించిన ప్రేక్షకులు మెచ్చుకోళ్ళతోపాటు నచ్చనివాటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, ప్రేక్షకులను రంజింపజేసే అంశాలపై ఇన్నేళ్ళకు స్పష్టత ఏర్పడింది. ఈ వేదికపై నమోదు చేసుకున్నవారికి తరచుగా ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు ఆహ్వానాలు, సమాచారం పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాలలో మండల స్థాయిలో ఉల్లాసకరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్న స్ఫూర్తికి ఈ శతరూప బలమైన బీజం వేసింది.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.