NON STOP జోకర్

 

గంటల తరబడి ఆపకుండా నవ్వించడం జోక్ కాదు. కాని విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావుకు మాత్రం జోక్‌తో పెట్టిన విద్య. అయన కదిలొస్తే జోక్, నడిచొస్తే జోక్, షర్టు మడతెడితే జోక్. వైవిధ్యమైన కామెడీ స్క్రిప్ట్స్, కామెడీ ప్లేలెట్స్‌లతో అదరగొట్టేస్తున్న ఈయన.. జోకులరాజ్యంలో పాతుకుపోయిన పాత రికార్డులన్నీ తుడిపేస్తున్నారు. ఈ మధ్యనే ఆపకుండా 654 జోకులు చెప్పి గిన్నిస్‌ను ఆకర్షించాడు. ఇంతకు మునుపు 35 గంటలపాటు నాన్‌స్టాప్ జోకులు వినిపించి.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను సైతం సాధించాడు. విశాఖ తీరాన ‘లాఫింగ్ ఫన్ క్లబ్’ ద్వారా అందర్నీ నవ్విస్తున్న ఆ నవ్వులడాన్ గురించే ఈ కథనం..

“హలో సార్, కోరుకొండ రంగారావు గారేనా?”
“అవునండీ. నమస్కారం. చెప్పండి మీకు నేను ఏ విధమైన సంతోషం కలిగించాలో.”
“సార్.. నాకెందుకో ఈ రోజు మనసు మనసులో లేదండీ. భార్యా పిల్లలు గుర్తుకొస్తున్నారు. దయచేసి మీరొక జోక్ చెబితే కాస్త నవ్వుకుని.. మనసును తేలిక చేసుకుంటానండీ.”
“తప్పకుండా చెబుతా! నీకు సెల్‌ఫోన్ ఉందా?”
“ఉందండి. ఇవాళ ఫోన్లు లేనోళ్లు ఎవరున్నారు చెప్పండి.”
“నీలాంటోడే ఒకాయన ఫోన్‌లో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. వెళ్లిపోయాడు. ఇక మళ్లీ రాలేదు..”
“అదెలాగండీ బాబూ”

“ఇదొక ఫోన్ జోక్. చెబుతాను విను- ‘గుండ్రాయిలా ఉండే అన్నయ్యగారు ఇంత హఠాత్తుగా ఎలా పోయారు వదినా’ అంటూ ఒకావిడ ఏడుస్తూ అడిగింది. భర్త పోయిన దుఃఖంలో ఉన్న ఆవిడ- ‘ఏమీ లేదు వదినా, మీ అన్నయ్యకు ఫోన్ రాగానే బాల్కనీలోకి వెళ్లి మాట్లాడే అలవాటుంది. మొన్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వెళుతున్నప్పుడు ఇలానే ఫోన్ వచ్చింది. ఫోన్ పట్టుకుని.. బెర్తు దిగి మాట్లాడుతూ మాట్లాడుతూ బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇక మళ్లీ రాలేదు.. అని ఏడుస్తూ చెప్పిందామె.’
“అహ్హహ్హ. థ్యాంక్యు రంగారావు గారు. మా కోసం ఇలాంటి జోకులు పేలుస్తూ ఉండండి” అని చెప్పి పెట్టేశాడు.

రంగారావుకు జోక్ చెప్పమని ఫోన్ చేసిన ఆ వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు. ఒక ఆశ్రమంలో రోజులు లెక్కపెడుతూ.. మరణశయ్య మీద పోరాటం చేస్తున్న అభాగ్యుడు. అతనే కాదు. మానసిక ఒత్తిళ్లతో నలిగిపోయే వాళ్లకు.. ఒక చిన్న చిరునవ్వుకే మొహంవాచిపోయిన ఉరుకుల పరుగుల జనులకు.. మనసు బాగోలేనపుడు ఏ బంధువులో, స్నేహితులో గుర్తుకురారు. విశాఖపట్టణంలోని కోరుకొండ రంగారావు గుర్తుకొస్తాడు. ‘సార్, మూడ్ బాగోలేదు. ఒక జోకు చెప్పండి ప్లీజ్!’ అంటే ఎంత బిజీలో ఉన్నా.. ఫోన్‌లోనే ఒక హాస్యోక్తి విసిరి.. కాసేపు నవ్వించి.. వాళ్ల గుండె మీదున్న బరువును దించే వరకు ఊరుకోడాయన. జోకులు వేసి వేసి.. ఆయనేమీ నవ్వుల పాలవ్వలేదు. కేవలం బూజుపట్టిన పాతరికార్డులను తన వాడివేడి జోకులతో ఫెళ్లున బద్దలు కొడుతూ వెళుతున్నాడంతే!

టెన్షన్‌కు మందు..
“నవ్వేవాడు హ్యాపీఫెలో. నవ్వించేవాడు జాలీఫెలో. నవ్వలేనివాడు బఫెలో. జంధ్యాలగారి ‘నవ్వు ఒక భోగం’ ఇలా మార్చేశానండీ. ఆయనగారి సూక్తిని ఎంతకాలం చెబుతామండీ. కాస్త మోడ్రన్‌గా ఉంటుందని ఇలా అనేస్తుంటాను. ఈతరం వాళ్లకు ఇది బాగా నచ్చింది” అంటూ ఉత్తరాంధ్రయాసలో గబగబా మాట్లాడే రంగారావు.. దేని గురించి ఎంత సీరియస్‌గా చెబుతున్నా సరదా చేస్తున్నట్లే అనిపిస్తుంది. “ఇవాళ ప్రజలకు అన్నీ ఉన్నాయండీ. పాపం నవ్వుకోవడానికి సమయమూ సందర్భమే చిక్కడం లేదు. అందరూ రామజపంలా జపిస్తున్న ఏకైకపదం ‘టెన్షన్ టెన్షన్’. చిన్నదానికీ పెద్దదానికీ కోపతాపాలైతే ఎలాగండి? ఈ ఉద్వేగాలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ వాటన్నిటినీ చల్లబరిచే గుణం హాస్యానికి మాత్రమే ఉంది. రోడ్డు మీద వెళుతున్నప్పుడు అవతలివాడికి చిన్న డాష్ ఇచ్చామనుకోండి. తప్పు మీదే అయినా ఒక చిరునవ్వు నవ్వి, సారీ చెప్పండి. అవతలి వ్యక్తి ఎంత కోపిష్టివాడైనా అర్థం చేసుకుంటాడు. అలా కాకుండా మీరే ముందుగా మీదికి వెళితే మాత్రం.. అటువైపు కోపం రెట్టింపు అవుతుంది. గొడవలకు దారి తీస్తుంది. హాస్యస్ఫోరకంగా ఉంటే పోయేదేమీలేదు’ అన్నారు రంగారావు.

విశాఖ స్టీల్ ప్లాంటులో ఫోర్‌మ్యాన్‌గా చేస్తున్న ఇతనికి మొదట్నించి పదిమందిని పోగేసుకుని నవ్వించడం అలవాటు. ఉత్తరాంధ్ర జీవనశైలిలో సహజంగా ఉట్టిపడే హాస్యాన్ని పట్టుకోవడం వల్ల.. రంగారావు పాత జోకులు చెప్పినా.. కొత్తగా వింటున్నట్లే ఉంటుంది. “జోకులు అందరూ చెబుతారు. కానీ దాన్ని చెప్పే విధానం, చాతుర్యం, శరీరభాష.. ప్రాముఖ్యం వహిస్తాయి” అంటున్న ఆయనకు అవేవీ ఊరికే అబ్బలేదు. వైజాగ్‌లోని ‘విశాఖ హ్యూమర్ క్లబ్’, ‘క్రియేటివ్ కామెడీ క్లబ్’, ‘బాబాయ్ లాఫింగ్ క్లబ్’లలో కొన్నేళ్లపాటు చురుకైన పాత్ర పోషించాడు. అక్కడికొచ్చి జోకులు చెప్పే రకరకాల వ్యక్తులను గమనించడం, సినిమాలు, నాటకాలు, నేతల ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు, పుస్తకాల్లోని హాస్య సన్నివేశాలను కాలానుగుణంగా మార్చుకుని.. క్లబ్‌లలో ప్రదర్శించడం.. మిత్ర బృందాలను నవ్వించడం చేసేవారు.

‘మాకు మేమే సొంతంగా కామెడీ స్క్రిప్ట్‌లు, కామెడీ- ప్లేలెట్స్ రాసుకునేవాళ్లం. అవన్నీ లాఫింగ్ క్లబ్స్‌లోనే కాదు. టీవీలు, రేడియోలలో ప్రదర్శితమయ్యాయి. నాకొక గుర్తింపు వచ్చాక.. వేముల భాస్కరాచారి, జీవీ త్రినాథ్, పీకే దుర్గాప్రసాద్, డాక్టర్ ఎన్ఎస్ఆర్ కృష్ణారావు అనే మిత్రులు తోడయ్యారు. వీరిలో రచయితలు, నటులు ఉన్నారు. మేమంతా కలిసి.. ‘లాఫర్స్ ఫన్ క్లబ్’ పెట్టాము” అని చెప్పుకొచ్చారు. ఈ క్లబ్ విశాఖలోనే కాదు రాష్ట్రమంతా నవ్విస్తోందిప్పుడు. నటులకు దినభత్యం, రవాణా ఖర్చుల నిమిత్తం ఒక్కోసారి స్వల్ప మొత్తంలో టికెట్లు వసూలు చేస్తున్నారు. చాలామటుకు ఉచిత ప్రదర్శనలే! ఇప్పటి వరకు రంగారావు బృందం 2,800 కార్యక్రమాలు నిర్వహించింది. పొట్టి హాస్య కథలు, సన్నివేశాలు, మిమిక్రీ, మేజిక్‌షోలతో ఒక ప్రత్యేక ప్రేక్షకవర్గాన్ని సంపాదించుకుంది. ప్రతి నెలా నాలుగో ఆదివారం నాడు స్టీల్‌ప్లాంట్‌లోని ఆడిటోరియంలో ఒక హాస్య ప్రదర్శన తప్పక ఉంటుంది.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోకుల్ని తయారు చేసుకోవడమంటే మాటలు కాదు. దీనికి ఎలాంటి కసరత్తు చేస్తారని రంగారావును అడిగితే – “ఎవరైనా ఒక పది ఫ్రెష్‌జోక్స్ చెబుతామంటే.. అన్నంనీళ్లు ముట్టకుండా బండేసుకుని బుర్రున వెళ్లిపోతాను. ఆ జోక్స్‌ను తెచ్చుకుని ముందు మా బృందానికి వినిపిస్తాను. వాళ్లు నవ్వితే సరి. లేకపోతే మూలనపడేస్తాను. ఒక్కోసారి వాటినే ముందుకు వెనక్కు మార్చి, డబుల్ మసాల దట్టించి, పోపు పెట్టి ప్రేక్షకులకు అందిస్తుంటాను. మరొక మార్గం.. జోకుల పుస్తకాలను సేకరించడం. ఇంకొందరు ఈ మెయిల్స్ ద్వారా నాకు పంపిస్తుంటారు. ఇక మిత్రుడు కాశీవిశ్వనాథ్‌గారు ఉండనే ఉన్నారు. ఆయన అలవోకగా స్క్రిప్టులు రాసేయగలరు. కొన్ని కార్యక్రమాలకు సినీనటుడు కళ్లు చిదంబరం కూడా సహాయపడుతుంటారు. మా దగ్గర వేలాది జోకుల బ్యాంకు ఉందిప్పుడు..” అన్నారాయన.

అన్నీ మనమీదే..
లాఫింగ్‌ఫన్‌క్లబ్ పెట్టిన తర్వాత.. చాలా రికార్డులు నెలకొల్పాడాయన. ఒక గంటలో ప్రపంచంలోనే అత్యధిక జోకులు చెప్పిన ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ లెహ్‌మన్ రికార్డును ఈ మధ్యనే తుడిపేశాడు. విశాఖవాసుల్ని హాస్యజల్లులతో ముంచెత్తి గిన్నిస్‌రికార్డును నెలకొల్పడం పెద్ద సంచలనం. “పన్నెండు మంది న్యాయనిర్ణేతల ముందు గంటసేపు ఆపకుండా.. 654 జోకుల్ని చెప్పాను. ఒక నిమిషానికి పది జోకుల చొప్పున నవ్వించగలిగాను. ఇదొక వరల్డ్ రికార్డు” అన్నారు. ఆయన చెప్పే జోకుల్లో ఆధునిక జీవితాలను ప్రతిబింబించేవే అధికం. భార్యభర్తలు, ఇరుగుపొరుగు, పోలీసులు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, యాక్టర్లు, యాచకులు, ప్రేమికులు, డ్రైవర్లు, జడ్జిలు.. ఒక్కరేమిటి..? సమస్తవర్గాలు హాస్యాయుధాలే! స్టీల్‌ప్లాంట్‌లో ఉత్తమ హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. ఒక ఎఫ్ఎం రేడియో నిర్వహించిన పోటీలో ‘నవ్వులడాన్’ కిరీటాన్ని సొంతం చేసుకున్నాడీయన. నవ్వుల దినోత్సవం రోజున ఏకబిగిన 35 గంటలపాటు జోకులు పేల్చి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డుల్లోకీ ఎక్కాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో కూడా ఇతని పేరు నమోదైంది. “స్టీలు ప్లాంట్ ప్రోత్సాహం మరువలేనిది. లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు’ ప్రదర్శన కోసం మా కంపెనీ రెండు లక్షలు స్పాన్సర్ చేసింది” అన్నారు.

హాస్యమూ ఒక ఔషధం..
“మనోవ్యాధికి మందు లేదు అంటారు. కానీ అందరికీ తెలిసిన మందొకటి ఉంది. అదే హాస్య ఔషధం. దీన్ని వైద్యులే «ద్రువీకరించారు. మనస్ఫూర్తిగా నవ్వితే మెదడులో గామా ఇంటల్‌పెరా అనే హర్మోన్ విడుదల అవుతుంది. దీనివల్ల శరీరంలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది” అంటున్న రంగారావు సామాన్యప్రేక్షకులను నవ్వించడం వరకే పరిమితం కాలేదు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు, ఖైదీలు, అనా«థలు, వృద్ధుల సమూహాలు ఉన్న చోటికి వెళ్లి నవ్వులు పంచి.. కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నారు. “కలెక్టర్ ఆఫీసు దగ్గర ప్రతి మంగళవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అక్కడికి రెండొందల మంది ఎయిడ్స్ పేషెంట్లు వస్తారు. నేనొకసారి వెళ్లి వాళ్లను కలిశాను. చాలా బాధ కలిగింది.

ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు లేదు. నన్ను వేదిక మీదికి పిలిచి నవ్వించమన్నారు వైద్యులు. నేను ఆపకుండా జోకుల మీదు జోకులు వేస్తుంటే.. ఒక్కసారిగా బాధితుల ముఖాలన్నీ వెలిగిపోయాయి. ఆ గంటసేపు వాళ్లకున్న జబ్బును మరిచిపోయి నవ్వుల్లో మునిగిపోయారు. ‘మా వైద్యం పనిచేయని చోట మీలాంటి వాళ్ల వైద్యం పనిచేస్తుంది..’ అంటూ డాక్టర్లు నన్ను అభినందించడం మరిచిపోలేను. మీకెప్పుడు బాధ కలిగితే అప్పుడు ఫోన్ చేయండి. జోక్ చెబుతాను అంటూ.. ఎయిడ్స్ బాధితులందరికీ నా విజిటింగు కార్డులు ఇచ్చొచ్చాను. ఇప్పటికీ వాళ్లు నాకు ఫోన్ చేసి జోకులు చెప్పించుకుంటుంటారు” అన్నారు ఈ విశాఖ హాస్యరాజు.

సీతమ్మధార, మహారాణిపేటలలోని వృద్ధాశ్రమాలకు సైతం వెళ్లి.. హాస్య కార్యక్రమాలు చేస్తుంటారీయన. త్వరలోనే అడవివరం సెంట్రల్ జైలుకు వెళ్లి.. ఖైదీలను నవ్వించేందుకు.. అనుమతి కోసం ఎదురుచూస్తున్నారట. ఆఖర్న ఒక మాటన్నాడు రంగారావు.. “నాకు నవ్వించే గుణమే కనక లేకపోతే ఏనాడో ఆత్మహత్య చేసుకుని చనిపోయుండేవాణ్ణి – అన్నాడు గాంధీ మహాత్ముడు. హాస్యం ఆయన జీవితాన్ని ఎంత ఉన్నతంగా నడిపించిందో ఆ మాటను బట్టే తెలుస్తుంది” అంటూ ముగించారు.

కోరుకొండ రంగారావు ఫోన్ : 98854 98444

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.