అపర భగీరధం -3
గోదారి కంఠాభరణం ఆనకట్ట పూర్తి
గోదావరి వరదలోచ్చినా ,రాళ్ళు పగల కొట్టటం ,సున్నం కాల్చేపని ,ఇటుక తయారీ నిర్విఘ్నం గా జరుగుతూనే ఉన్నాయి .రెండో రైల్ మార్గం పనులూ అయిపోయాయి .ఆరున్నర మైళ్ళ పొడవు గల రైల్వే లైన్ కు కావాల్సిన కర్ర పట్టాలు అమర్చారు .పట్టాల పై భాగాన్ని సమతలం గా చెక్కి వాటిపై రెండు అంగుళాల వెడల్పు ఇనుప రేకులమర్చి దానిపై కొయ్య చక్రాలవాగన్లు తేలిగ్గా తీసుకు పోయే ఏర్పాట్లూ జరిగి పోయాయి .1847అక్టోబర్ నుంచి వరదలు తగ్గాక మళ్ళీ పనులు మొదలైనాయి .25వేల ఘనపు అడుగుల చెక్కిన రాయి సిద్ధమై ఉంది .రోజుకు అయిదు వందల అడుగుల రాయి ఫంటూలపై ఆనకట్ట ప్రదేశానికి చేరుతోంది .
వేసవి అయినా ఏ శీతల ప్రదేశాల్లో హాయిగా గడపటానికి వీలుగా ఉన్నా, కాటన్ ఎక్కడికీ కదలకుండా నెత్తిన టోపీ పెట్టుకొని ,పర్యవేక్షిస్తూ పని తీరును గమనించాడు .ఎక్కడికైనా కాంప్ మార్చాల్సి వస్తే అతి తక్కువ సామాను తో కుటుంబం తో కదిలే వాడు .ఆర్భాటం ఉండేదికాదు .అవసర సౌకర్యాలు లేక బాధ పడే వాడు .1848జూన్ కు ఆనకట్ట తొమ్మిది అడుగుల ఎత్తువరకు నిర్మించారు .ఇంకొక మూడడుగులు ఎత్తుపెంచాలి .లాకుల పని పూర్తయింది .తలుపులు బిగించాలి .అడుగు తూములు అంటే అండర్ స్లూయిస్ చెక్కుడు రాయి పని కూలీలు దొరక్క నెమ్మదిగా నడిచింది .ప్రధాన తూము అంటే హెడ్ స్లూయిస్ ఆర్చీల మట్టాలకు పూర్తీ అయింది .ర్యాలీ పాయలో కూడా పని మందకొడిగా జరుగుతోంది .లాకు పని అయిపోయి ,కాలువ పని ఉంది .మద్దూరు పాయలో పనులు వేగం గా జరుగుతోంది .వింగ్ వాల్స్ పై భాగం తప్ప అంతా పూర్తీ అయింది .విజ్జేశ్వరం పాయలో ప్రధాన ,అడుగు తూముల పనులు బాగా జరిగాయి .వరద లోచ్చే సరికి దాదాపు అంతా పూర్తీ అయింది .లాకుల పై పని అనుకొన్నంత వరకు బానే జరిగింది .తలుపుల పని మిగిలింది .రెక్క గోడలపై వరద లోచ్చినా పని చేయ వచ్చు .
కాని రెండు వారాల ముందే జూన్ లో వరద లోచ్చాయి . రాతి కట్టడం ఏమై పోతుందో అని భయ పడ్డాడు కాటన్ .దీనికి తోడు ఆయన ఆరోగ్య పరిస్తితి కూడా బాగాలేదు వడ దెబ్బ తగిలి తీవ్ర జ్వరం వచ్చి బాధ పడుతున్నాడు కాని ఆనకట్ట మీద ద్రుష్టి మాత్రం మర్చి పోలేదు .సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోమని భార్య ఒత్తిడి పెట్టింది .మిగిలిన అధికారులు కూడా అలానే చేయమని కోరారు .క్లిష్ట సమయం లోసెలవు పెట్టటం ఇష్టం లేక పోయినా ఆరోగ్యం దృష్ట్యా సెలవు పెట్టి,ప్రభుత్వ ఆదేశం పై బాధ్యతను కెప్టెన్ చార్లెస్ అలేక్సాండర్ ఆర్ కు అప్పగించి, కాటన్ కుటుంబం తో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు .మనసు ఇక్కడా శరీరం అక్కడ గా ఉంది ఆయన పరిస్తితి .సెలవు పై వెళ్ళ టానికి ముందే ఉన్న డబ్బు అంతా ఖర్చు అయినందువల్లా ,మరొక లక్షా ముప్ఫై తొమ్మిది వేల రూపాయలు కావాలని ప్రభుత్వానికి రాశాడు
దీనికి ప్రభుత్వం నుండి వ్యతిరేకం గా శ్రీముఖం వచ్చింది .మితి మీరిన వ్యయం చేస్తున్నాడని పనుల భద్రత, ,నాణ్యత పట్టించుకోకుండా త్వరగాపని చేస్తున్నాడని విమర్శించింది .ఒకరిద్దరు అనుభవమున్న ఇంజినీర్లను పంపి సమీక్షించి ,నివేదిక ఇమ్మని కోరింది .విచారణ సంఘం లో ఇంజినీర్ యి.బకుల్ ,జే.హెచ్.బెల్.,కెప్టెన్ అలేక్సాండర్ ఆర్ ,రాజ మండ్రి సబ్ కలెక్టర్ హెన్రి ఫోర్ట్స్ సభ్యులు . 1848 నవంబర్ లో విచరణ సంఘం ఆనకట్టపనులు పర్య వేక్షించి జనవరి లో ప్రభుత్వానికి నివేదిక పంపింది .అందులో వివరాలు ‘’గోదావరి ఆనకట్ట నిర్మాణం లో మేజర్ కాటన్ ప్రదర్శించిన అపూర్వ శాస్త్ర విజ్ఞాన ప్రతిభను ,అనుభవ పూర్వక సామర్ధ్యాన్ని ,నిర్విరామ కృషిని ఈ కమిటీఎంతో ప్రశంసించింది .అయన మేధా శక్తికి ,ఆత్మనిష్ట కు ,ఒక అమోఘ ఈ నవీన జలదుర్గం ఒక ఉదాహరణ.అనుకో కుండా వచ్చిన వరదల వల్ల ఆనకట్టకు కొంత నష్టం జరిగి అంచనా వ్యయం పెరిగిందే తప్ప కాటన్ తొందర పాటు కాదు అని మేం పూర్తిగా విశ్వ సిస్తున్నాం .ఇప్పటికే రాజమండ్రి జిల్లా ఈ ఆనకట్ట వల్ల ఎంతో ప్రయోజనం పొందింది .కనుక మేజర్ కాటన్ ప్రతి పాడించిన అదనపు డబ్బుతో బాటు ,కెప్టెన్ ఆర్ కోరిన మరో మూడు లక్షల యాభై వేల రూపాయలు అత్యవసరం గా మంజూరు చేయమని గట్టిగా సిఫార్సు చేస్తున్నాం ‘’అని కాటన్ దొర పని తనానికి, నిజాయితి కి ,నిర్భీకతకు కీర్తి కిరీటం పెట్టింది ఆ సంఘం.ప్రభుత్వం వెంటనే ఆ డబ్బును సాంక్షన్ చేసి పంపించింది .
రెండేళ్ళు ఆస్ట్రేలియా లో విశ్రాంతి తీసుకొని 1850 సెప్టెంబర్ లో తిరిగి వచ్చి బాధ్యతలు చేబట్టాడు .అనుకున్నట్లు గా పనులన్నీ పూర్తిగా సంతృప్తికరం గా జరిగిపోయాయి కాటన్ అక్కడ లేక పోయినా . .కెప్టెన్ సారధ్యం లో పనులు బాగా జరిగి నందుకు అతన్ని కాటన్ మనసారా అభి నందించాడు .నదిలో పడవలను వేగం గా లాగటానికి స్టీం లాంచ్ అవసర మని ప్రభుత్వానికి రాసినా అనుమతివ్వలేదు .కలకత్తా నుంచి లాంచిని తెప్పించి పని అతి వేగం గా జరిపించాడు .లాంచి వల్ల ఎంత ప్రయోజనం జరిగిందో ప్రభుత్వానికి రాశాడు. సంతృప్తి చెందిన ప్రభుత్వం కలకత్తా లాంచి రావటానికి ,నిర్వహణకు అయిన డబ్బంతా ఇచ్చేసింది నిజాయితీ ఉన్న ఆఫీసర్ కు దక్కిన గౌరవం ఇది .నిబద్ధతకు నిలువెత్తు గా కాటన్ నిలిచాడు .ఆయన దగ్గర పని చేసిన ఇంజినీర్లు కూడా పని మీద అత్యంత శ్రద్ధ ఉన్నవారే అవటం ఆయనకు ఎంతో కలిసి వచ్చింది .కెప్టెన్ అలేక్సాండర్ ,కెప్టెన్ హచిన్సన్ ,లెఫ్టి నెంట్ హేగ్ ,లెఫ్టి నెంట్ రున్దాల్ ,ఒవర్సీర్ వేణంవీరన్న ఆనకట్ట నిర్మాణం లో చిరస్మరణీయ సేవ లందించారు .ఏమాత్రం భేదాలు లేకుండా శాయ శక్తులా కాటన్ కు సహాయ సహకారాలందించి అభిమాన పాత్రులయ్యారు .వేణం వీరన్న ను గూర్చి ‘’వీరన్న గారు లేక పోయి ఉంటె వేలాది కూలీల సమీకరణ జరిగేది కాదు .ఆన కట్ట పని సకాలం లో జరగటానికి వీరన్న సేవలు నిరుపమానం ‘’అని మెచ్చుకొన్నాడు కాటన్. వీరన్నకు ఇంజినీర్ గా ప్రొమోషన్ ఇవ్వటమే కాకుండా ‘’రాయ్ బహదూర్ ‘’బిరుదాన్ని కూడా ప్రభుత్వం చేత ఇప్పించిన పని పక్ష పాతి కాటన్ .
కాటన్ మార్గ దర్శకత్వం ,ఉత్సాహ వంతులైన ఇంజినీర్లకర్తవ్య నిస్ట ,వేలాది కార్మికుల అవిరళ కృషి, ,ప్రజా సహకారం వల్లనాలుగు కిలో మీటర్ల పొడవైన ఆనకట్టలు కేవలం అయిదేళ్ళలోఅంటే 1852లో పూర్తీ చేయగలిగాడు అపర భాగీరదుడు,డెల్టా శిల్పి అయిన మేజర్ ఆర్ధర్ కాటన్ దొర .రెండు వేల మైళ్ళ పొడవున్న డిస్త్రి బ్యూటర్లు ,మురుగు కాలవలు ,రోడ్లు ,వంతెనలు ,వరద కట్టలు నిర్మించి మాహాద్భుతాన్ని ప్రపంచం లోనే అరుదైన గోదావరి నాదీమ తల్లికి దివ్య భవ్య కంఠా భరణంఅయిన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాన్ని సమర్ధ వంతం గా పూర్తీ చేశాడు .గోదావరి డెల్టాకు ఏడు లక్షల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలిగింది . 1889లో ఆనకట్ట ఎత్తు మరో రెండు అడుగులు పెంచారు . 1936లో మరో మూడు అడుగులు ఎత్తుపెంచి ఆయకట్టు విస్తీర్ణం పది లక్షల ఎకరాలకు పెంచారు .
1970 లో ధవళేశ్వరం ఆనకట్ట శిధిలా వస్తకు చేరింది దాని స్స్థానం లో బ్యారేజి నిర్మించి కాటన్ గౌరవ సూచకం గా ‘’సర్ ఆర్ధర్ కాటన్ బారేజి ‘’అని పేరు పెట్టి గౌరవించారు .పది లక్షల ఎకరాలకు రెండు పంటలు పండించే సాగు నీరు లభ్యమై గోదావరి డెల్టా ‘’ఆంద్ర దేశపు దాన్యా గారం ‘’గా రూపొందింది .ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తీ అయ్యే సరికి కాటన్ దొర రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ గా ప్రమోషన్ పొంది మిగిలిన పని చేయటానికి తన తమ్ముడు ‘’ఫ్రెడ్ కాటన్ ‘’కు అప్పగించి కల్నల్ కాటన్ మద్రాస్ కు వెళ్ళాడు
వాస్తవం గా జరిగిన ఆశ్చర్య కర సంఘటన
1852 లో గోదావరి ఆనకట్ట ల నిర్మాణం పూర్తీ అయింది కాల్వలలోకి నీరు గలగలా ప్రవైస్తున్నాయి రమ్య జల నాదం విని పిస్తోంది .రైతుల ముఖాలలో ఆనందం తంతాండ విస్తోంది .సంతృప్తి జీవితం లో చోటు చేసుకోంది. వెలుగు జీవితాలలో ప్రవేశించింది .ఒక వేదం పండితుడు గోదావరి కాలవలో పవిత్ర స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించి ‘
‘’నిత్య గోదావరీ స్నాన పుణ్యతోయో మహా మతిహ్ –స్మరామ్యమ్ ఆంగ్లేయ దేశీయం ,కాటనుం తం భగీరధం ‘’
అని శ్లోకం చెబుతూ మూడు సార్లు కాటన్ దొరకు అర్ఘ్యం సమర్పిస్తున్డటం ఆ ఒడ్డునే నడుస్తూ వెళ్ళిన ఒక తెల్ల దొర ,అతని దుబాసీ లకు కనీ పిస్తూ, విని పించింది .ఇందులో ‘’కాటన్ ‘’అనే మాట వారిని ఆకర్షించింది ఠక్కున ఆగి పోయారు .ఆ శ్లోకానికి అర్ధం ఏమిటో కనుక్కోమని తెల్ల దొర దుబాసీ కి చెప్పాడు అతడు వినయం గా ఒడ్డు దగ్గరకు చేరి నమస్కరించి ఆ శ్లోకం అర్ధం ఏమిటో వివరించమని ఆ ‘’వేద పండు’’ ను ప్రార్ధించాడు అప్పుడు ఆయన ‘’పవిత్ర గోదావరీ జలాలతో అను నిత్యం స్నాన పానాదులు చేయటానికి పుణ్య ఫలాన్ని మాకు ప్రసాదించిన మహాను భావుడు భగీరద సమానుడు ఆంగ్లేయుడు అయిన కాటన్ దొరను సంస్మరిస్తున్నాను ‘’అని అర్ధం చెప్పి పరవశం చెందాడు. ;అప్పుడు ఆ దొర ‘’అయన తన విద్యుక్త ధర్మం గా ఈ ఆనకట్ట కట్టించాడు. అంత మాత్రాన ఆయన్ని దేవుడిగా ఆరాదిన్చాలా? “’అన్నాడు అందుకా పండితుడు ‘’దొరగారూ !విధ్యుక్త ధర్మ నిర్వహణమే దైవ లక్షణం ;క్షామ పీడితం గా ఉన్న ఈ గౌతమీ మండలాన్ని గోదావరీ జలాలతో సస్య శ్యామలం చేసి, మా బతుకుల్లో వెలుగులు నింపిన మహాను భావుడు కాటన్ దొర .కనుక ఆయనే మాకు ప్రత్యక్ష దైవం .అందుకే ఆయన్ను నిత్యం మేము మనసారా స్మరించి అర్ఘ్య ప్రదానం చేసి కృతజ్ఞత తెలుపు కొంటున్నాం ‘’అన్నాడు
అప్పుడు దుబాసీ ‘’మీరు ఆరాధిస్తున్న కాటన్ దొరగారు వీరే ‘’అని చెప్పి ఆ పండితునికి కాటన్ దొరను పరిచయం చేశాడు .అంతకు ముందెప్పుడూ కాటన్ దొర ను చూడని ఆ పండితుడు ఒక్క సారిగా తన ముందు కాటన్ ప్రత్యక్ష మయ్యేసరికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు .రెండు చేతులు జోడించి ‘’కాటన్ దొర గారూ !మీ దర్శన భాగ్యం వల్లనా జన్మ తరించింది .నేనెంతో ధన్యుడిని ‘’అంటూ ఆనంద పారవశ్యం తో కాటన్ దొర పాదాలపై ఆ వేద పండితుడు వాలి పోయాడు .ఇంతకు మించిన క్రుతజ్నత ఇంకేముంది ?కాటన్ దొరకు ఈ సన్నివేశం ఆశ్చర్యం కలిగి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారా పాతం గా కారి పోయాయి. ఏ భారతీయుడు ఏ తెలుగు వాడూ చేయని మహోప కారాన్ని తెలుగు దేశానికి చేసిన మహనీయుడు కాటన్ దొర .ఆంధ్రుల పాలిటి జీవన దాత .తెలుగు వారికి ప్రాతస్మరణీ యుడు .
కాటన్ మహోన్నత వ్యక్తిత్వాన్ని ,పుట్టుకా జీవిత విశేషాలను ఈ సారి తెలుసు కొందాం .
సశేషం
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ -30-10-13-ఉయ్యూరు
మాస్టారు,
సర్ ఆర్ధర్ కాటన్ గురించి అందరికి పరిచయం చేసినందుకు మీకు కృతఙ్ఞతలు. గొదావరి, కృష్ణ డెల్టా ప్రాంతానికి ఆయన చేసిన కృషిని అక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటారని అనుకొంటున్నాను.