అపర భగీరదీయం -5(చివరి భాగం ) ఆధునిక ద్రష్ట కాటన్ వ్యక్తిత్వం

               అపర భగీరదీయం -5(చివరి భాగం )

                         ఆధునిక ద్రష్ట  కాటన్ వ్యక్తిత్వం

            సర్వ సమర్ధుడైన మిలిటరీ ఇంజినీర్ మాత్రమే కాదు  ఉదాత్త వ్యక్తిత్వం మూర్తీభవించిన వాడు సర్ ఆర్ధర్ కాటన్ దొర  కేవలం ఒక్క ఏడాది మాత్రమె బర్మా యుద్ధం లో సైన్య విభాగానికి అది పత్యం వహించి రంగూన్ పట్టణవిముక్తి కోసం ధైర్య సాహసాలు  చూపి మేర్గి ,తవాయ్ దుర్గాల ను మర ఫిరంగులతో వశపరచుకోవటం లో ముఖ్య పాత్ర పోషించాడు  .అక్కడ ఒక సారి పై అధికారితో పేకాట ఆడి చిత్తుగా ఉన్నదంతా పోగొట్టు కొన్నాడు .అప్పుడు ఇక జీవితం లో పేకాట ఆడనని శపథం చేసి జీవితాంతం నిల బెట్టుకొన్నాడు .మిగితా జీవితమంతా ప్రజోపకార సేవలోనే గడిపాడు ఇంగ్లాండ్ లో జన్మించిన కాటన్ కు  అక్కడ నీటి పారుదల సౌకర్యాలేమీ లేవు. వాటిపై అవగాహనా లేదు అయినా గోదావరి ,కృష్ణా నదులపై ఆనకట్టలు కట్టి ఆ డెల్టాల్తాలను అన్నపూర్ణ గా మార్చిన అపర భగీరధుడు ఆయన .అయినా ఆయన యే మాత్రం గర్వం పొందలేదు. రెండో శతాబ్ది లో కరి కాల చోడుడు కావేరి పై నిర్మించిన ‘’గ్రాండ్ ఆనకట్ట ‘’ను చూసి స్పూర్తి పొంది  ఆ నాటి నిర్మాణ చాతుర్యాన్ని పొగిడి ఆ స్పూర్తితో తాను ఇరిగేషన్ పనులన్నీ చేబట్టానని వినయం గా చెప్పుకొన్నాడు .

             ఈ ఆనకట్టలు ఆక్వి డేక్ట్ లు కాటన్ మేధో జనితాలే ,మౌలిక ఆలోచనలా ఫలితాలే ఇండియా లో అంతకు ముందెన్నడూ లేని వాటిని తన మస్తిష్కం లో మెదలిన భావాలకు అనుగుణం గా నిర్మించినవే .సంప్రదించ టానికి ఇలాంటి వాటి తో అనుభవ మున్న వారే లేరు .ఎక్కడా చూసి తెలుసుకొనటానికి అసలలాంటివి లేనే లేవు .తానొక్కడే ఆలోచించుకొని ,స మస్యలోస్తే పరిష్కరించుకొని గుండె నిబ్బరం తో చే బట్టిన బృహత్ నిర్మాణాలే ఇవన్నీ .ఆధునిక యంత్ర సామగ్రి లేనే లేదు, సిమెంట్ లేదు, సాంకేతికనైపుణ్యమూ  హుళక్కి గా ఉన్న కాలం లో చేసిన జల దుర్గాలివి తక్కువ కాలం లో తక్కువ ఖర్చు తో అధిక ప్రయోజనాలు కల్గించే భారీ నీటి వనరులివి. ఆయనకు ఆయనే సాటి అని పించుకోన్నవి . ఇంజిన్ ను కానీ పెట్టి నూట యాభై మీటర్లు నడిపించాడు

           కాటన్ నిర్మోహ మాటి తప్పు ఎక్కడున్నా ఖండించే వ్యక్తిత్వం ఆయనది .తాను పని చేస్తున్నది బ్రిటిష్ ప్రభుత్వో ద్యోగిగా .అయినా ఆంగ్ల ప్రభుత్వం విధించిన ‘’ఉప్పు పన్ను ‘’ను తీవ్రం గా విమర్శించాడు.అంటే గాంధీ గారికికంటే యాభై ఏళ్ళకు పూర్వమే నిరసన వ్యక్తం చేసి గాంధి ఉప్పు సత్యాగ్రహానికి ‘’ఉప్పు అందించాడు ‘’అన్నమాట . ఇండియా కు నల్ల మందు ను దిగుమతి చేసి ,ప్రజల ఆరోగ్యం పై దుష్ప్రభావం కలిగిస్తున్న ప్రభుత్వాన్ని మందలించాడు .అది హేయమైన చర్య అన్నాడు .కాటన్ నిరంతర పరిశీలన ఉన్న వాడు అనారోగ్యం తో ఆస్ట్రేలియా కు వెళ్లి నప్పుడు తీరిక గా కూర్చో కుండా స్వంత ఆలోచనల తో ‘’రోటరీ ఇంజిన్ ‘’నిర్మించాడు అయితే ఇంజిన్ కమర్చిన బాయిలర్ బ్రద్దలై కళ్ళకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి .అయినా లెక్క చేయకుండా ఇంజన్ చక్రం నిమిషానికి నూట యాభై చుట్లు తిరిగేట్లు చేసిన సమర్ధుడు .70ఏళ్ళ వయస్సు లో ‘’త్రి చక్ర వాహనాన్ని ‘’రూపొందించాడు .దాన్ని బ్రేకుల్ని పరిశీలించటానికి ఎక్కి కింద పది గాయాల పాలయ్యాడు .ఉపరితల నీరు లేని చోట్ల భూ గర్భ జలాన్ని వెలికి తీయటానికి వాయు శక్తి ‘’(విండ్ పవర్)ఉపయోగించ వచ్చనిమొదటి సారిగా ప్రతిపాదించిన ఇంజినీర్ కాటన్ .

    కరాచీ నుండి కాన్పూర్ కలకత్తా ,కటక్ ,భట్కర్ ,మద్రాస్ ,బెంగుళూర్ నగరాలకు వర్తక సదుపాయాలకోసం నౌకాయానానికి అనువుగా నలుగు వేల మైళ్ళ పొడవైన కాలువలను ముప్ఫై కోట్ల తో నిర్మించే ప్రణాళిక సిద్ధం చేశాడు .గంగా కావేరి అనుసంఫ్దానానికి మొదట బీజం వేసింది ఆయనే ఈహార్ లో సొన్నది నుండి సేద్యానికి నౌకాయానానికి బీహార్ ప్రాజెక్ట్ నిర్మించే సూచనలు చేశాడు .గంగను కాల్వల ద్వారా సట్లేజ్ నదితో కలపాలని చెప్పాడు గంగ పై బారేజి అవసరం అని చెప్పాడు ఇదే తర్వాత ‘’ఫరక్కా బారేజి ‘’గా రూపొందింది .

                84ఏళ్ళ వయసు లో కూడా అలుపు సొలుపు లేక ఇంగ్లాండ్ లో తన వ్యవసాయ క్షేత్రం లో వ్యవసాయం పై పరిశోధనలు చేశాడు .నేలను లోతుగా దున్నితే గాలి లోపలి బాగా వెళ్లి అక్కడి నత్రజని ని మొక్కలకు ఎక్కువ గా అంది  పంట దిగుబడి పెరుగుతుందని ప్రాక్టికల్ గా చేసి చూపించాడు .తన పొరుగు ఇంటి యజమాని మద్యానికి బానిస అయి దుర్మరణం చెందటం చూసి తాను  ఎప్పుడూ మద్యం ముట్టకూడని నిర్ణయించుకొని, నిలుపు కొన్నాడు .వైద్యుడు ఆరోగ్యం కోసం సూచించినా తాగలేని కఠోర నియమం కాటన్ ది .భాగ్య వంతులైన కాటన్ బావ మరదులు బావ గారి కోసం ఒక ఇల్లు కట్టించి ఇచ్చే వరకూ కాటన్ కు స్వంత ఇల్లే లేదు అంటే అయన నిజాయితీ ఎలాంటిదో తెలుస్తోంది .ఇన్దిఆ ను వదలి వెళ్ళినా   ఇక్కడి జల వనరుల పై సమాచారాలు తెలుసుకొంటూ పత్రికా ముఖం గా లేఖలు గా తన అభిప్రాయాలను చెప్పే వాడు .టైమ్స్ పత్రికలో ఇండియా లో క్షామానికి ,పంట నష్టానికి బ్రిటిష్ ప్రభుత్వం నీటికి బదులు ఇనుమును (రైల్ నిర్మాణం )ఇవ్వటమే అని ఆవేదన తో రాశాడు .

   భారత దేశం లో పేదరికం నిరక్షరాస్యత ,అజ్ఞానం పట్టి పీడిస్తున్నాయని దీనికోసం ఏ బ్రిటిష్ అధికారీ పట్టించుకోలేదని ప్రబుత్వానికి కావలసింది డబ్బు వసూలు చేసే బిల్ కలెక్టర్ర్లె కాని ప్రజాక్షేమం కోరే రాజ నీతిజ్నులు కాదని ఎద్దేవా చేశాడు సముద్రం లోకి వృధా గా పోతున్న అపార నదీ జలాలను ఆనకట్టలు కట్టి భూ సాగుకు మళ్ళించే సద్బుద్ధి బ్రిటిష్ ప్రభుత్వానికి కలిగించమని పరమాత్మను వేడుకొంతానని ఆవేదన వెలి బుచ్చాడు .తన క్షేత్రం లో స్వయం గా పొలం దున్నటానికి మరనాగాలి తయారు చేసుకొన్నాడు కాటన్ .

              మనకు తెలియని కాటన్ మరో పార్శ్వం  

    ఆయన ఇంగ్లాండ్ లో ఉన్న డార్కింగ్ లో’’ రై’’గడ్డిని అయిదు అడుగుల రికార్డ్ ఎత్తుకు పెంచాడు ద్రవరూప ఎరువు వాడకం వల్లనే ఇది జరిగిందని చెప్పాడు .అప్పుడు ఎక్కడా పచ్చగడ్డి కూడా మొలవని కాలం లో. అది ఎకరానికి నాలుగున్నర టన్నుల దిగుబడి నిచ్చింది .1895లోతన క్షేత్రం లో బంగాళా దుంప ను ,మధ్య లో కాబేజీ ని వేసి పండించాడు ఎకరానికి దుంప  35టన్నులు ,కాబేజీ  ఇరవైటన్నులు  పండించిన పరిశోధనా పరామేశ్వరుడు కాటన్ .కాటన్ సూచించిన ‘’లో దుక్కి ‘’పద్ధతిని ఇంగ్లాండ్ అంతా టితో బాటు ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు వ్యాపించి అధిక ఫలసాయానికి వీలు కల్పించింది .ఆస్ట్రేలియా ద్రాక్ష తోటలు ,వెస్ట్ ఇండీస్ కాఫీ తోటల్లో ఈపధ్ధతి రికార్డ్ స్తాయి పంటను పండించి రైతులకు ఎంతో మేలు చేకూర్చింది .నేలను సక్రమం గ ఉపయోగించుకొంటే దాదాపు యాభై శాతం అధిక దిగుబడి సాధించ వచ్చు నని కాటన్ ఆ నాదే ఘంటా పధం గా ఉదాహరణ పూర్వకం గా తెలియ జేశాడు .కాటన్ నిబద్ధతకు సేవకు బ్రిటిష్ ప్రభుత్వం మెచ్చి ‘’సర్ ‘’బిరుదును1861లో ఇచ్చి  సత్కరించింది .

                          ఇంత చేసిన కాటన్ కు ఏం చేశారు ?

             రిటైరై ఇంగ్లాండ్ చేరి డెబ్భై ఏళ్ళ వృద్ధాప్యం లో ఉన్నడెల్టా శిల్పి ,అపర భగీరధుడు  కాటన్ దొరపై బ్రిటిష్ ప్రభుత్వ్వదికారులు కొందరు కుత్సితం గా ఆయన ప్రతి పాదనలకు వక్ర భాష్యాలు కల్పించి ఎన్నో అభియోగాలు మోపారు .అభిశంసన తీర్మానం పెట్టారు. దీనికి బ్రిటిష్ కామన్స్ సభలో 1872లో మిలిటరీ ఖర్చులపైకాటన్ నిర్భయం గా300 ప్రశ్నలకు దీటుగా సమాధానం చెప్పి అందరి నోర్లు మూయించాడు ‘సెలెక్ట్ కమిటీ పనికి మాలిన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టిందే కాని ఆయన వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం భంగ పరచలేక నీరు కారింది .’’దట్ ఈజ్ కాటన్’’.’’.లేడీ ఆఫ్ ది లాంప్ ‘’గా పేరొందిన ఫ్లారెన్స్ నైటింగేల్ ఇండియా లో కాటన్ చేబట్టిన ప్రాజెక్టుల పట్ల ఎంతో ఆసక్తి చూపేది .అందుకని ‘’ఇండియా లో నీటి పారుదల ,రవాణా జల మార్గాలు ‘’పేరు తో ఒక మాప్ ను రూపొందించి నైటింగేల్ కు బహుమానం గా ఇచ్చాడు వీటి  అమలుకు తన కున్న పలుకు బడిని బ్రిటిష్ ప్రభుత్వం పై పెంచమని ఆమెను కోరాడు కాటన్ మహాశయుడు .

                          ఇంతకీ ఎవరీ కాటన్ ?

  సర్ ఆర్ధర్ కాటన్ క్రీ .శ .1803 మే నెల పదిహేనవతేదీన ఇంగ్లాండ్ లో మత గురువులు నివశించే ‘’కమ్బార్ మీర్ ఆబీ ‘’ అనే చోట జన్మించాడు  తండ్రి హెన్రీ కాల్వేలి కాటన్ తల్లి హెన్రీ కాల్వేలి కాటన్ ..తాత సర్ లించ్ కాటన్ .తండ్రి తాతకు పడవ కొడుకైతే తండ్రికి పదో కొడుకుగా కాటన్ పుట్టటం విశేషం .కాల్వాలి కాటన్, ఫ్రెడరిక్ కాటన్ అనే మన కాటన్ సోదరులు మద్రాస్ రాష్ట్ర నీటి పారుదల శాఖలో ఆర్ధర్ తో కలిసి పని చేసిన వాళ్ళే .కాటన్ పై తల్లి ప్రభావం ఎక్కువ .చిన్నతనం లోనే మట్టితో కాలువలు నిర్మించి వినోదించే వాడు వర్షపు  నీటి పాయల్ని చేతి కర్రతో పాయలుగా చీల్చి ఆనందించే వాడు

          పదిహేనవ ఏట ఇండియా లో సైన్యం లో చేరటానికి ప్రభుత్వం అనుమతి పొంది ..ఏడిస్ కొమ్బ్ ‘’లో మిలిటరీ శిక్షణ లో చేరాడు .ఫిరంగి దళం,ఇంజినీరింగ్ లలో పని చేసే శిక్షణ నేర్చుకొన్నాడు .సాటి బ్రిటిష్ యువత చదువు పై శ్రద్ధలేకుండా జులాయిలు గా తిరుగు తుంటే ఎంతో శ్రద్ధ తో చదువుకొన్నాడు .పదహారవ ఏట ఏ పరీక్షా రాయాల్సిన అవసరం లేకుండా ‘’రాయల్ ఇంజినీర్స్ ‘కు ఎంపికయిన మేధావి .1820 లో సెకండ్ లెఫ్టి నెంట్ గాఆర్డి నేంస్ సర్వీస్

లో చేరి బ్రిటిష్ దీవుల సర్వేమాపులను తయారు చేసిన ఘనుడు .ఒంటరిగా కాలినడకన తిరిగి తనకప్పగించిన బాధ్యతను సమర్ధ వంతం గా పూర్తీ చేశాడు .తర్వాతా ఒకటిన్నర ఏడాది ‘’చాతం ‘’అనే చోట ఉంది ,1821మే లో తన పద్దెనిమిదవ ఏట ‘’ఈస్ట్ ఇండియా కంపెని ‘’లో మిలిటరీ ఇంజినీర్ గా పని చేయటానికి నియుక్తుడై లండన్ నుంచి నాలుగు నెలలు ఓడలో ప్రయాణం చేసి మద్రాస్ చేరాడు .

                        ఇండియా లో సేవలు

  మద్రాస్ పబ్లిక్ వర్క్స్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం తో పరిచయం పొంది ,1822దక్షిణ విభాగపు తాటాక శాఖలో కెప్టెన్ పులర్తాన్ అనే ససూపరింతెంన్దేంట్ వద్ద అసిస్టంట్ గా బదిలీ అయ్యాడు  ఇండియా శ్రీ లంకలను కలిపే ‘’ఆడం వంతెన ‘’గా పిలువ బడే పాంబన్ కనుమ లోతు చేసే పనిలో చేరాడు.వానరులు త్రేతాయుగం లో ఇక్కడ వారధి కట్టటానికి సముద్రం లో విసిరినా రాళ్ళను తీసే పని లో శ్రద్ధగా పని చేసి సంతృప్తి కల్గించాడు .ప్రభుత్వం ఇచ్చిన అతి తక్కువ డబ్బు నలుగు వందల పౌండ్ల తో పాం బన్ లోతును మూడు అడుగుల లోతు చేసి నౌకలనలు సింహళాన్ని చుట్టి రాకుండా హిందూ మహా సముద్రం నుండి బంగాళా ఖాతం లో పాంబన్ కనుమ ద్వారా ప్రవేశించే వీలు కల్గించాడు కాటన్ .తర్వాతా కోయం బత్తూర్ ,మదురై ,తిరునల్వేలి ,తిరుచురా పల్లి ,తంజావూర్ జిల్లాలలో చెరువులు మరమ్మత్తులను నిర్వహణ ను పర్య వేక్షించాడు సాగు నీటిని నిలువ చేసి పంపిణీ చేసే విధానం లో అపార అనుభవం సంపాదించాడు .ఎనిమిదేళ్ళు ఇక్కడ పని చేసి కెప్టెన్ గా పదోన్నతి పొంది కావేరి నీటి పారుదల పధకానికి ప్రత్యెక అ దికారి అయ్యాడు .  మొదటి బర్మా యుద్ధం లో లో బర్మాకు వెళ్ళాడు .ఆ తర్వాతా సంగతులన్నీ ఇప్పటికే మనం తెలుసు కొన్నాం .

     1841 అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఎలిజ బెత్ లియర్ మంత్ ను కాటన్ వివాహం చేసుకొన్నాడు .వీరి మొదటి కుమార్తె ‘’బేబీ హాప్ ‘’.రెండవామ్మాయి చ్చిన్నతనం లోనే చని పోయిందని తెలుసుకొన్నాం .

                    కాటన్ మహా ప్రస్తానం

 ఇంగ్లాండ్ లోని డార్కింగ్ లో ఉన్న ‘’ఉడ్ కాట్ ‘’భవనం లో భార్య తో కాపురం ఉన్నాడు .రోజు ఉదయమే లేచి బైబుల్ చదవే వాడు చిరు నవ్వుతో ఆలోచనల్లోకి జారి పోయే వాడు  ఒక సారి కూతురు ఒచ్చి ‘’రోజూ బైబిల్ చదవటం విసుగ్గా లేదా “?”అని అడిగితే ‘’లేదమ్మా !సరస్సు ఒడ్డున అందుకొనే బాలుడిని నేను .జీవితాంతం చదువుతున్నా ఏమాత్రం బైబిల్ ను అర్ధం చేసుకోలేక పోయాను .జీవితాంతం చదివినా అందులో మర్మం అర్ధం కాదు ‘’అని అనునయం గా చెప్పాడు .ఒక రోజు ఆయనకు యేసు క్రీస్తు అవతార సమాప్తి దృశ్యం కనీ పించింది జ్వరం తో పది రోజులు బాధ పడ్డాడు .చివరగా 1899 ఏప్రిల్ ఇరవై నాలుగున 96 ఏళ్ళ వయసులో  కాటన్ ధ్రువ తార రాలిపోయింది .డార్కింగ్ శ్మశాన వాటిక లో అంత్య క్రియలు జరిగాయి .యూనియన్ జాక్ తో కప్పి గౌరవ సూచకం గా సైనిక లాంచనాలతో పూర్తీ చేశారు

          ఆర్ధర్ కాటన్ ముని మనుమడు అర్ సి.కాటన్ ఆయన భార్య నికోలేట్టే కాటన్  దంపతులు 1988లో ఇండియా వచ్చి కాటన్ బారేజి ని సందర్శించారు  .కాటన్ శత జయంతి ఉత్స వాలను 14-7-1999 న ప్రభుత్వం గౌరవ ప్రదం గా నిర్వహించింది .ఆ సందర్భం గా ఈ నాటి యువతరం యువ ఇంజినేర్లు స్పూర్తి  పొందాలనే ధ్యేయం తో హైదరాబాద్ లోని ‘’ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ‘’వారు కాటన్ జీవితం పై కృష్ణా జిల్లా పామర్రు మండలం లోని జమీ గొల్వే పల్లి గ్రామ నివాసి శ్రీ చెరుకూరి వీరయ్య ‘’గారి ‘’ఆంద్ర మాతని  అన్నపూర్ణని  చేసిన ఆంగ్లేయ జెనరల్ కాటన్ దొర ‘అనే పుస్తకాన్ని రాయించి ’  అందరికి అందుబాటులో ఉండేట్లు ప్రచురించి ఋణం తీర్చుకోంది. పామర్రు దగ్గర పుల్లేరు దగ్గర చీలిన గండి కోడు ద్వారా వీరయ్య గారి పొలాలకు నీరు రావటం తెలిసి దీన్ని నిర్మించిన వాడు కాటన్ అని అర్ధం చేసుకొని ఆరాధనా భావం తో ఈ పుస్తకాన్ని రాశారు .నేను దీన్ని ఆధారం గా చేసుకొనే ‘’అపర భగీరదీయం ‘’రాశానని సవినయం గా మనవి చేస్తున్నాను .

‘’ముందు తరముల చీకటుల –సమ్మూలముగ ఛేదిమ్పగా –విశ్వ శాంతికి ,హరిత క్రాంతికి –సస్య కాంతుల దీపికల్

నీవు పెట్టిన దీపముల –సాటేవి’’ కాటన్ మహాత్మా ‘’    (ఏ.వి అప్పా రావు )

‘’Happiness is achievement –achievement of goals –goals of helping some one –doing your self –and thinking good thoughts –happiness is doing ‘’(Anonym )

                  అపర భాగీరదీయం ‘’సర్వం సంపూర్ణం ‘’

      ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షలతో

              మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -31-10-13-ఉయ్యూరు.

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.