కాదంబరి ప్రేమలో రవీంద్రుడు

 

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యుక్తవయస్సులో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి కాదంబరి. సొంత వదిన అయినా, తన కన్నా వయస్సులో రెండేళ్లు పెద్దదయినా ఆమెతో ఠాగూర్‌కు ఎలాంటి అనుబం«ధం ఉందనే విషయంపై అనేక కథనాలు వెలువడ్డాయి. తాజాగా ప్రముఖ మానసిక విశ్లేషకుడు సుధీర్ కాకర్ రాసిన ‘యంగ్ ఠాగూర్’లో ఈ అనుబంధానికి సంబంధించిన విశ్లేషణ ఉంది. ఆ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు..

“ఠాగూర్ యుక్త వయస్సులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన వారిలో ఆయన వదిన కాదంబరీ దేవి ఒకరు. ఠాగూర్ రచయితగా, కవిగా ఎదగటంలో ఆమె ఒక పాత్ర చాలా ఉంది. సోదరుడు జ్యోతీంద్రనాథ్‌తో కాదంబరికి వివాహమయినప్పుడు ఠాగూర్ తొలిసారి ఆమెను చూశాడు. అప్పటికి ఆమెకు పదేళ్లు. ఠాగూర్‌కు ఎనిమిదేళ్లు. ఠాగూర్ ఇంట్లో ఆడవాళ్లకు ప్రత్యేకమైన గదులు ఉండేవి. వాటిలో ఎవరికీ ప్రవేశం ఉండేది కాదు. అందువల్ల కాదంబరి, ఠాగూర్ కలుసుకొనే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కాదంబరి పెద్దగా చదువుకోలేదు కానీ జీవితాన్ని అనుభవించాలనే కోరికతో ఉండేది. సంప్రదాయ బెంగాలీ కుటుంబాలలో మహిళలు బయటకు రావటం చాలా తక్కువ. కానీ కాదంబరి గుర్రపు స్వారీ నేర్చుకొని ప్రతి ఉదయం మైదానానికి వెళ్తూ ఉండేది. ఆమె భర్త జ్యోతీంద్రనాథ్ ఎక్కువ సమయాన్ని సంగీతం, నృత్యం, నాటకాలు వంటి వినోదకాలక్షేపాలలో గడిపేవాడు. చాలా సార్లు ఉదయమే లేచి తాను దర్శకత్వం వహించే నాటకాలకు సంగీత రూపకల్పన చేసుకునేవాడు. ఆ సమయంలో ఠాగూర్ అతనితో పాటే ఉండేవాడు.

మధ్యాహ్నం జ్యోతీంద్రనాథ్ ఎస్టేట్ పనులు చూసుకోవటానికి వెళ్లినప్పుడు- కాదంబరికి ఠాగూర్ రకరకాల గ్రంథాలను చదివి వినిపించేవాడు. ఆ సమయంలో బంకించంద్రచటర్జీ రాసిన బి(వి)షవృక్ష అనే సీరియల్ బంగ్లాదర్శన్ అనే పత్రికలో వస్తూ ఉండేది. దీనిని కూడా చదివి వినిపించేవాడు. ఇలాంటి దృశ్యాన్ని- కాదంబరి, ఠాగూర్‌ల మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తీసిన సత్యజిత్ రే చారులత చిత్రంలో కూడా మనం చూడవచ్చు. కేవలం ఇతరులు రాసినవే కాకుండా తాను రాసిన కవిత్వాన్ని కూడా ఠాగూర్ ఆమెకు వినిపిస్తూ ఉండేవాడు. కాదంబరి అభిప్రాయాలను తెలుసుకొనేవాడు. ఠాగూర్ తాను 13 నుంచి 18 ఏళ్ల దాకా రాసిన కవితల సంకలనం శిశుశబోసంగీత్ (చిన్ననాటి గీతాలు)ను కాదంబరికే అంకితమిచ్చాడు. కేవలం ఠాగూర్ కవిత్వాన్ని వినటమే కాదు. అతని అవసరాలన్నింటినీ కాదంబరి చూసేది. ఠాగూర్‌కు ఇష్టమైన ఆహారపదార్థాలు వండిపెట్టి ప్రేమగా వడ్డించేది. మేడపైన ఉన్న గార్డెన్‌లో కాదంబరి, జ్యోతీంద్రనాథ్‌లతో కలిసి ఠాగూర్ సాయంత్రాలను ఆస్వాదించేవాడు. ఆ సాయంత్రాల గురించి ఠాగూర్- “సాయంత్రమయ్యే సరికి మేడపైన పరుపులు, దిండ్లు వేసేవారు.

అందమైన వెండి గిన్నెలో మల్లెపూలను ఉంచేవారు. చల్లటి మంచి నీళ్లను ఒక చెంబులోను, సువాసనభరితమైన తమలపాకులను ఒక ప్లేటులోను సిద్ధంగా పెట్టేవారు. అప్పుడే స్నానం చేసి, తలను అందంగా దువ్వుకొని కాదంబరి వచ్చి తన స్థానంలో కూర్చునేది. శాలువా కప్పుకొని జ్యోతీంద్రదా వచ్చేవాడు. నేను పాడటం మొదలుపెట్టేవాడిని. అతను తన వయలిన్ తీసుకొని వాయించటం మొదలుపెట్టేవాడు. నా గొంతు దూరానికి కూడా వినిపించేది. నెమ్మదిగా చీకటి పడేది..” అని వర్ణించాడు. కాదంబరి, ఠాగూర్‌ల మధ్య చిలిపి తగాదాలు కూడా ఉండేవి. కాదంబరికి ఆధునికంగా ఉన్న సిల్క్ బట్టలు వేసుకోవటమంటే ఇష్టం. ఠాగూర్‌కు ఆ బట్టలు ఇష్టం ఉండేవి కావు. ఆమె సంప్రదాయబద్ధమైన తెల్లటి చీరలు కట్టుకోవాలనుకొనేవాడు. ఈ విషయంపై ఇద్దరికీ తగవులు జరిగేవి. ‘నీ వయస్సుకు తగ్గట్టు ప్రవర్తించు. మామయ్యలా ప్రవర్తించకు…’ అని ఆమె కసురుకొనేది. నేను ఆమెతో వాదించి ఎప్పుడూ గెలవలేకపోయేవాడిని. చదరంగంలో కూడా ఆమె ఎప్పుడూ నాపై గెలిచేది” అనే మాటలు ఠాగూర్‌కు ఆమెతో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తాయి. ఆ తర్వాతి కాలంలో తనకు, కాదంబరికి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వర్ణిస్తూ ఠాగూర్ అనేక కవితలు రాశాడు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సులోపులో ఠాగూర్ రాసిన కవితలన్నింటిలోను శృంగార భావనలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.

1878, సెప్టెంబర్ 20వ తేదీన ఠాగూర్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఇంగ్లాండ్‌కు వెళ్లే నౌకలో ఉన్న పరిస్థితుల గురించి, అక్కడ ఉన్న అమ్మాయిల గురించి కాదంబరికి మూడు ఉత్తరాలు రాశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ ఉత్తరాలలో మనకు కనిపిస్తుంది. వారంటే తనకు ఇష్టం లేదని కూడా వీటిలో ఠాగూర్ పేర్కొంటాడు. 1880లో ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చేసిన ఠాగూర్ మళ్లీ జ్యోతీంద్రనాథ్, కాదంబరిలతో సమయం గడపటం మొదలుపెట్టాడు. జ్యోతీంద్రనాథ్, కాదంబరిలు చందర్‌నాగూర్‌లో కొంత సమయం గడపటానికి వెళ్తే ఠాగూర్ కూడా వారితో పాటు అక్కడికి వెళ్లాడు. వారిద్దరి మధ్య ఈ సమయంలో విపరీతమైన సాన్నిహిత్యం ఏర్పడింది. ఠాగూర్ నదిలో ఈత కొడుతుంటే కాదంబరి ఒడ్డున కూర్చుని చూసేది. ఇద్దరూ కలిసి నేరేడు పళ్లను ఏరడానికి దట్టమైన అడవిలోకి వెళ్లేవారు. తాము గడిపిన సమయాన్ని- “ఒక అద్భుతమైన వజ్రం సిల్కు బట్టలో చుట్టిపెట్టినట్లుంది..” అని ఠాగూర్ వర్ణిస్తాడు.

1884లో ఠాగూర్‌కు పెళ్లయింది. అప్పుడు ఆయనకు 23 ఏళ్లు. ఆయన భార్యకు 11 ఏళ్లు. ఠాగూర్‌కు పెళ్లయిన నాలుగు నెలలకు కాదంబరి నల్లమందు ఎక్కువ మోతాదులో తీసుకుని స్పృహ కోల్పోయింది. రెండు రోజుల పాటు వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. కాదంబరి మరణం పెద్ద దుమారం రేపుతుందని భావించిన ఠాగూర్ తండ్రి దేబేంద్రనాథ్ ఆమె రాసిన చివర ఉత్తరం, డాక్టర్ రిపోర్టు, ఇతర ఉత్తరాలన్నింటినీ తగలపెట్టించాడు. ఠాగూర్ కుటుంబానికి సంబంధించిన అకౌంట్ పుస్తకాలలో కాదంబరి మరణం తర్వాత- “ఈ వార్త ప్రెస్‌కు పొక్కకుండా చూడటానికి పెట్టిన ఖర్చు 52 రూపాయలు” అని ఉంది. పదహారేళ్ల తర్వాత ఠాగూర్ ముగ్గురి వ్యక్తుల మధ్య ప్రేమను ఇతివృత్తంగా తీసుకుని నష్‌తానిర్ (చిధ్రమైన ఇల్లు) అనే నాటకం రాశారు. ఇది ఆ నాటి ఠాగూర్ జీవితానికి నాటకరూపమని విశ్లేషకులు భావిస్తారు.
యంగ్ ఠాగూర్
రచయిత:
సుధీర్ కాకర్
ప్రచురణ: పెంగ్విన్
ధర: రూ. 499
పేజీలు: 238
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభిస్తుంది

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.