మూర్తిభవించిన మతత్వవాది! పటేల్ అని తొందర పడి మాట జారిన నెహ్రు -ఆంధ్ర జ్యోతి

 

న్యూఢిల్లీ, నవంబర్ 5: ‘నువ్వు మూర్తీభవించిన మతతత్వవాదివి’- ఈ మాట అన్నది భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ! ఎవరినంటారా.. తన కేబినెట్‌లో హోం మంత్రి.. అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను! పటేల్‌ను నెహ్రూ ఇంత మాట అనడానికి కారణం.. స్వాతంత్య్రం తర్వాత భారత్‌లో కలిసేందుకు ససేమిరా అన్న హైదరాబాద్ నిజాంను లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాలని పటేల్ సూచించడమే! 1947 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎంకేకే నాయర్ రాసిన ‘ది స్టోరీ ఆఫ్ యాన్ ఎరా టోల్డ్ వితవుట్ థర్డ్ విల్’ అనే పుస్తకాన్ని ఉటంకిస్తూ బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ ఈ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు తన బ్లాగ్‌లో మంగళవారం పేర్కొన్నారు. నాయర్ అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో పని చేశారు. పటేల్‌కు ఆయన సన్నిహితుడని కూడా చెబుతారు. హైదరాబాద్‌పై పోలీసు యాక్షన్‌కు ముందు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నెహ్రూ, పటేల్ మధ్య నువ్వా నేనా అన్నట్లు జరిగిన సంభాషణను ఆ పుస్తకంలో పేర్కొన్నారు. వాస్తవానికి, ఈ పుస్తకాన్ని మలయాళంలో రాశారు. ప్రస్తుతం దీనిని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తున్నారు. “నిజాం పాకిస్థాన్ పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తన తరఫున రాయబారిని పాక్‌కు పంపించాడు. పాక్ ప్రభుత్వానికి పెద్దఎత్తున డబ్బును కూడా పంపించాడు. నిజాం మద్దతుదారులైన రజాకార్లు స్థానికులపై దారుణ అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్‌లో ఉగ్రవాద పాలనకు చరమగీతం పాడాలంటే సైన్యాన్ని పంపాల్సిందే” అని పటేల్ సూచించారు. సాధారణంగా నెహ్రూ చాలా సౌమ్యంగా, శాంతంగా మాట్లాడతారు. కానీ, ఈ సమయంలో మాత్రం ఆయన అదుపు తప్పారు. మాట జారారు. “నువ్వు మూర్తీభవించిన మతతత్వ వాదివి. నీ సిఫార్సును నేను అంగీకరించనంటే అంగీకరించను” అని తేల్చి చెప్పారు. అయినా “పటేల్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నెహ్రూ మాటలకు నొచ్చుకోలేదు. తన కాగితాలను తీసుకుని మౌనంగా బయటకు వెళ్లిపోయారు” అని పుస్తకాన్ని ఉటంకిస్తూ ఆడ్వాణీ వివరించారు. నాయర్ పుస్తకం ప్రకారం.. జమ్మూ కాశ్మీరు తరహాలోనే హైదరాబాద్ అంశాన్ని కూడా నెహ్రూ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. హైదరాబాద్‌కు సైన్యాన్ని పంపాలన్న పటేల్ సూచనను నెహ్రూ తిరస్కరించడంతో అప్పటి గవర్నర్ జనరల్ రాజాజీ తెరపైకి వచ్చారు. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత విషమిస్తుండడంతో నెహ్రూ, పటేల్ ఇద్దరినీ రాజాజీ రాష్ట్రపతి భవన్‌కు పిలిపించారు. హైదరాబాద్ అంశంపై చర్చించారు. హైదరాబాద్‌లోని పరిస్థితిని రాజాజీ తనదైన శైలిలో సమావేశంలో వివరించారు. భారతదేశ పరువును కాపాడుకోవాలంటే నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. అయితే, అంతర్జాతీయంగా ఎదురయ్యే విపరిణామాలపై నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పుడు రాజాజీ తన చేతిలోని తురుఫు ముక్కను బయటకు తీశారు. అదే.. బ్రిటిష్ హై కమిషనర్ నుంచి వచ్చిన లేఖ! హైదరాబాద్‌లో 70 ఏళ్ల క్రైస్తవ సన్యాసినిని రజాకార్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేయడానికి సంబంధించిన లేఖ అది. వాస్తవానికి, నెహ్రూ, పటేల్‌లతో సమావేశానికి కొద్దిసేపటికి ముందే పటేల్‌కు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి వీపీ మీనన్ ఆ లేఖను రాజాజీకి అందజేశారు. అప్పుడు రాజాజీ దానిని నెహ్రూ, పటేల్‌లకు ఇచ్చారు. దానిని నెహ్రూ చదివారు. ఆయన ముఖం కందగడ్డలా మారిపోయింది. పట్టరాని కోపంతో ఊగిపోయారు. కుర్చీలోంచి ఒక్కసారిగా పైకి లేచారు. పిడికిలి బిగించి టేబుల్‌పై గట్టిగా కొట్టారు. “ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు. వాళ్లకు గుణపాఠం నేర్పాల్సిందే” అని గట్టిగా అరిచారు. అంతే.. రాజాజీ వెంటనే స్పందించారు. వీపీ మీనన్‌ను పిలిపించారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని కమాండర్ ఇన్ చీఫ్‌కు తెలియజేయాలని ఆదేశించారు. పటేల్ అప్పటికే సైన్యాన్ని సిద్ధం చేసేశారు. అంటే.. అటునుంచి నరుక్కొచ్చారన్నమాట!!

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

1 Response to మూర్తిభవించిన మతత్వవాది! పటేల్ అని తొందర పడి మాట జారిన నెహ్రు -ఆంధ్ర జ్యోతి

 1. ఓహోహో! ఎంతగొప్పవాడు మన చాచాజీ!
  నిజాం ప్రభుత్వమూ దాని అండతో రజాకార్లూ హైదరాబాదు రాజ్యంలోని ప్రజలమానప్రాణాలను అత్యంతపైశాచికంగా దోచుకుంటుంటే, దాన్ని నిరోధించాలన్న పటేల్‌గారిని మూర్తీభవించిన మతతత్త్వవాదిలా అర్థంచేసుకున్న మహోదారుడు చాచానెహ్రూ!

  నెహ్రూజీకి ఎప్పుడూ తన కీర్తిబావుటా రెపరెపలమీదే ఆసక్తి. మన భారతదేశం పట్లా మన ప్రజలపట్లా కానే కాదు! అక్షరాలా కాదు!

  అందుచేత దేశీయులలో హిందువుల మానప్రాణాలభద్రత ఆయనకు తృణప్రాయాలుగా కనిపించాయి. వాటిని గూర్చి ప్రస్తావించిన పటేల్ మతతత్త్వవాది ఐపోయాడు.

  అదే మహానుభావుడికి ఒక క్రైస్తవసన్యాసినికి జరిగిన అవమానం సహించరానిదై తోచింది. ఈ‌లాంటి ఘటనలు తన కీర్తిబావుటాపై మచ్చలుగా మారే ప్రమాదం మహానుభావుడు శాంతిదూత చాచాజీకి అత్యంత ప్రమాదకరంగా అనిపించింది.

  ఇంకా ఈ‌ నెహ్రూ అనబడే నియో నెహ్రూ-గాంధీ సామ్రాజ్యస్థాపకుడిపైన భ్రమలు కలవాళ్ళు ఇప్పటికైనా కళ్ళుతెరవాలి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.