సమంత నన్ను మార్చేసింది-కంచర్ల రమేష్ -ఆంధ్ర జ్యోతి

 

పసిపిల్లలంటే అందరికీ ప్రాణమే. కానీ, ఆ ప్రాణాల్ని కాపాడుకోవాలంటే, అత్యంత ఆధునికమైన వనరులెన్నో కావాలి. ఆ వనరులెన్నింటినో చేర్చుకుని వెలిసిందే ‘రెయిన్‌బో’ హాస్పిటల్. దాని మూలస్తంభం పేరే డాక్టర్ రమేశ్ కంచర్ల. ఒక దశలో అప్పుల్లో కూరుకుపోయి ఇక హాస్పిటల్ నడపడం అసాధ్యమేమో అనిపించిన స్థితి నుంచి మరో మూడు కొత్త బ్రాంచీలను ప్రారంభించే స్థితికి చేరుకోవడం వెనుక రమేశ్ కంచర్ల, ఆయన బృందం అహోరాత్రులూ పడ్డ శ్రమ ఉంది. డాక్టర్‌గా, రెయిన్‌బో హాస్పిటల్ అధినేతగా ఆయనకు ఎదురైన కొన్ని సంఘటన ల సమాహారమే ఈ వారం అనుభవం.

జీవితపు విలువ గురించి, వ్యక్తిత్వపు ఔన్నత్యం గురించి తెలియచెప్పే సంఘటన లు కొన్నిసార్లు అనుకోకుండా ఎదురవుతాయి. అవి మన ల్ని సమూలంగా మార్చివేస్తాయి. అలాంటి ఓ సంఘటన నేను వైద్య వృత్తిలోకి ప్రవేశించిన తొలినాళ్లలో జరిగింది. నేనీరోజు ఈ స్థితిలో ఉండడానికి ఆ సంఘటనే ప్రధాన కారణం. మాదొక మధ్యతరగతి కుటుంబం. నెల్లూరు జిల్లాలోని చిరమన మా స్వగ్రామం. ఇంటర్ అయిపోయేదాకా నేను సగటు విద్యార్థినే. కాకపోతే మా అన్నయ్య డాక్టర్ రవీంద్రనాథ్ మెడిసిన్‌లో సీటు సంపాదించాక నన్నూ డాక్టర్‌ను చేయాలన్న కోరిక మా నాన్నగారిలో మొదలయ్యింది. ఆ మేరకు మెడిసిన్ ఎంట్రెన్స్ రాస్తే తిరుపతి మెడికల్ కాలేజ్‌లో సీటు వచ్చింది. మెడిసిన్‌ను నాన్నగారి కోరిక తీర్చడం కోసం అన్నట్లుగా చేశానే గానీ, నాకంటూ ఒక లక్ష్యమేదీ లేదు. అయితే నాకు సర్జరీ చే యడం మొదట్నించీ నచ్చేది కాదు. అందుకే చ్రిల్డన్ స్పెషాలిటీలో ఫిజీషియన్‌గా చేయాలనుకున్నాను. అలాగే మంగళూరులో చ్రిల్డన్ స్పెషాలిటీతో ఎండీ చేశాను. ఆ సమయంలో మా అన్నయ్య రవీంద్రనాథ్ పై చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లాడు. ఆ దిశగా నన్నూ ప్రోత్సహించాడు. నేను అక్కడికి వెళ్లి వర్క్ చేస్తూ రాయల్ కాలేజ్‌లో ఎంఆర్‌సిపి చేశాను. అప్పటిదాకా ఏదో గాలివాటంగా సాగిపోతున్న జీవితంలోకి ఒక్కసారిగా సుడిగాలి వీచి అది మొత్తం జీవితాన్నే మార్చేస్తుందని నేనెలా ఊహిస్తాను?

పాప నేర్పిన పాఠం
ఇంగ్లండ్‌లో నేను పనిచేస్తున్న చ్రిల్డన్ హాస్పిటల్‌లో ఒకరోజు సమంత అనే ఒక ఏడేళ్ల పాప అడ్మిట్ అయ్యింది. కేన్సర్ తీవ్రమైపోయిన ఒక దశలో వేరే హాస్పిటల్ నుంచి ఇక్కడికి మార్చారు. ప్రతిరోజూ నేను ఆ పాపను చూసేవాణ్ని. 15 రోజుల త ర్వాత ఒకసారి ఆ పాప నా వద్దకు వచ్చి ఒక చాక్లెట్ పాకెట్, ఒక కార్డు ఇచ్చింది. “ఇది నీ పుట్టిన రోజా!” అన్నాను. “లేదు డాక్టర్. నేను మిమ్మల్ని ఒక ఫంక్షన్‌కు ఆహ్వానిస్తున్నా” అంది. ఆ పాకెట్ తీసుకుని, వివరాలు ఆ కార్డులో ఉంటాయి కదా తర్వాత చూద్దాంలే అనుకుని పేషెంట్లను చూడటంలో నిమగ్నమయ్యాను. అరగంట తర్వాత ఆ కార్డు విప్పి చూస్తే ఒక్కసారి నా ఒళ్లు జలదరించింది. నా గొంతు తడారిపోయింది. నా కళ్లల్లో నీళ్లు సుడితిరిగాయి. అందులో “డాక్టర్ గారూ! దయచేసి నా అంత్యక్రియల్లో మీరు తప్పకుండా పాల్గొనండి. ఇప్పటిదాకా మీరు నా పట్ల చూపిన శ్రద్ధకు, మీరు నాకు అందించిన సేవలకు కృత జ్ఞతలు- సమంత” అని ఉంది. నా కళ్లలోంచి ధారాపాతంగా కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. నాకు అర్థం కానిదొక్కటే. బర్త్‌డేకి ఆహ్వానించినంత సంతోషంగా తన అంతిమయాత్రకు ఆహ్వానించడమేమిటి.. అదీ ఓ ఏడేళ్ల పాప. ఎంత గుండె నిబ్బరం. ఎంత పరిణతి?

నేను అక్కడున్న నర్స్‌ను అడిగితే, “ఆ పాపకు కేన్సర్‌తో తాను త్వరలోనే మరణించబోతున్న విషయం తెలుసు డాక్టర్. కౌన్సెలర్లు, సైకాలజిస్టులు, నర్స్‌లు ఆరు మాసాలుగా మరణానికి ఆమెను మానసికంగా పూర్తి స్థాయిలో సంసిద్ధం చేశారు. అందుకే ఆ పాప అంత ధైర్యంగా ఉంది. ఆమె కోరికల్లా తన అత్యంత సన్నిహితులందరూ తన అంత్యక్రియల్లో పాల్గొనాలన్నదే. అందుకే ఆ కార్డులు పంచుతోంది’ అంది. అప్పటికి అతి కష్టంగా తమాయించుకున్నాను. అయితే గంట తరువాత ఆ పాప దగ్గరకి వెళ్లినప్పుడు మళ్లీ నా కళ్లల్లోంచి నీళ్లు ఉబికి వ చ్చాయి. “డాక్టర్ గారూ కార్డు చూశారు కదూ! ఎందుకు ఏడుస్తున్నారు? వద్దు వద్దు ఏడవద్దు డాక్టర్ గారూ! అంత్యక్రియలకు రావాలన్న నా కోరికను తప్పకుండా తీరుస్తారని ఆశిస్తున్నా” అంది. ఆ తరువాత వారం రోజుల దాకా నాలో నేను లేను. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనుషులు ఇంత ధైర్యంగా ఒక సమస్యను ఎదుర్కోగలరని నాకు అప్పటిదాకా తెలియదు. ఈ స్థితికి చేరుకోవడానికి మనుషులు తమకు తాము కౌన్సెలింగ్ చేసుకోగలరని నాకు తెలియదు. ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకు ఆ పాపను ఇంటికి తీసుకువెళ్లారు. ఆ మరుసటి రోజే ఆ పాప చనిపోయింది.

మనసంతా చిక్కబట్టుకుని పాప అంత్యక్రియల్లో పాల్గొన్నాను. నేను ఆరోజు అనుకున్నదల్లా ఒక్కటే. పరిస్థితి మన చేతుల్లోంచి దాటిపోయిన తరువాత మనం ఎలాగూ ఏమీ చేయలేం. కానీ చేయడానికి ఎంతో కొంత ఇంకా మిగిలి ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా సేవలు అందించగ లిగితే అంత బెటర్ అని. నిజానికి అప్పటిదాకా డాక్టర్‌గా నేను అదో వృత్తి మాత్రమే అనుకున్నా. కానీ, ఆ సంఘటన తరువాత వైద్యం ఒక వృత్తి గా కాదు ఒక ప్రాణంగా తీసుకున్నాను. ఆ సంఘటన తర్వాత పిల్లల పట్ల నేను చూపే శ్రద్ధ పదింతలు పెరిగిపోయింది. వారానికి ఐదు రోజులే హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉన్నా వారానికి ఏడు రోజులూ వెళ్లే వాణ్ని. డాక్టర్ వృత్తి నిజంగా నాకొక అబ్సెషన్‌గా మారింది. పసిపిల్లల ప్రాణాలు కాపాడే ఏ చిన్నఅవకాశాన్నీ జారవిడుచుకోకూడదన్న భావన నాలో అణువణువునా వ్యాపించింది. అదే ఈ పిల్లల ఆసుపత్రి స్థాపనకు బీజం అయ్యింది.

అంచులదాకా వెళ్లాలి
ఇండియాలో మేము పిల్లల ఆసుపత్రి స్థాపించాలనుకున్నప్పుడు, అంటే 1999లో హైదరాబాద్‌లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉన్న ఆసుపత్రి నీలోఫర్ ఒక్కటే. ప్రైవేట్ హాస్పిటల్ ఒక్కటీ లేదు. అప్పుడే కొంతమంది మిత్రులతో కలిసి అత్యంత ఆ«ధునికమైన యంత్రపరికరాలతో ఈ రెయిన్‌బో హాస్పిటల్ ప్రారంభించాం. కాకపోతే హాస్పిటల్ నిర్వహణ మాకు అనుభవంలేని పనైపోయింది. మేము అహోరాత్రులు సేవలందించడానికి సిద్ధమైనా, ఆ విషయంఅంత తొందరగా జనంలోకి వెళ్లదు కదా! అందుకే దాదాపు మూడేళ్ల దాకా ఆశించిన స్థాయిలో పేషెంట్లు రాలేదు. కోట్లల్లో పెట్టుబడి పెట్టిన మాకు బ్యాంకు రుణం కట్టడం కష్టమైపోయింది. వ్యవధి తక్కువగా ఉండడం, వడ్డీ ఎక్కువగా ఉండడం ఇవన్నీ మమ్మల్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. బ్యాంకు వాయిదాలు కట్టలేకపోయాం. నిలదొక్కుకునేందుకు ఏదైనా సాయం అందించండి అంటూ వివిధ హోదాల్లో ఉన్న బ్యాంక్ అధికారులను అదేపనిగా కలుస్తూ ఉండేవాళ్లం. కానీ, అందరూ మేమేమీ చేయలేమని చేతులెత్తేశారు.

రోజురోజుకూ అప్పుల్లో కూరుకుపోతున్నాం. ఏదైనా అమ్మి కడదామన్నా అప్పటికే అన్నీ హరించుకుపోయాయి. అప్పుడు ‘ఎందుకైనా మంచిది. ఒకసారి ఆంధ్రాబ్యాంక్ ఛైర్మన్‌ను కలవండి’ అంటూ ఎవరో సలహా ఇచ్చారు. నేను వెళ్లి పరిస్థితినంతా ఆయనకు వినమ్రంగా కాదు కొంత ఆక్రోశంగానే వివరించాను. అంతా విని “మీ పరిస్థితి నాకు అర్థమయ్యింది. నేను ఏదో ఒక రీతిలో మీకు సాయం చేస్తాను” అన్నారు. అయినా నాలో ఏదో అసహనం. అందుకే ‘మీ మాటల్ని నమ్మొచ్చా సార్!’ అన్నాను. “ప్రాసెస్ రేపే మొదలవుతుంది” అన్నారు. అప్పటికీ నాకు నమ్మకం కలగలేదు. కానీ మరుసటి రోజు మధ్యాహ్నానికల్లా బ్యాంక్ నుంచి లెటర్స్ వచ్చాయి.

అందులో తీసుకున్న రుణానికి మేమివ్వాల్సిన వడ్డీ రేటును తగ్గిస్తూ, రుణం చెల్లించే వాయిదాల గడువును పెంచుతూ, మొత్తంగా రుణం చెల్లించాల్సిన కాల వ్యవధిని పెంచుతూ, మొదటి ఆరునెలలు అసలు వాయిదాలు కట్టాల్సిన అవసరమే లేదన్నట్లు ఉత్తరాలు వచ్చాయి. వాటితో మాకు ఎంతో వెసులుబాటు కలిగింది. ఆ పరిస్థితులే మేము తిరిగిపుంజుకోవడానికి ఎంతో తోడ్పడ్డాయి. అదే జరగకపోతే ఈ రోజు మా ఊరూ, ఉనికీ ఉండేదే కాదు. ‘ఏం సాధించాలన్నా చివరిదాకా పోరాడాలి’ అనే మాటలోని అర్థమేమిటో నాకు అప్పుడు మరింత స్పష్టంగా బోధపడింది. అప్పటిదాకా లేనిదేదో ఆ చివర్లో ఉంటుందని కాదు. ఒక్కొక్కటిగా మనకు ఎదురైన వైఫల్యాలు మనకు నేర్పిన పాఠాలతో ఆ తరువాత్తరువాత మనలో వ్యవహార దక్షత పెరుగుతుంది. అది ఎదుటివారికి మన మీద విశ్వాసం కలిగేలా చేస్తుంది. నా విషయంలో జరిగింది ఇదే.

ప్రయత్నమెందుకు ఆపడం?
ఇటీవలే నా అత్యంత సన్నిహిత మిత్రుడొకరు ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన కూడా డాక్టరే. నెల్లూరులో జరిగిన ఆ ప్రమాదంలో కారు స్టీరింగ్ పొట్ట, ఛాతీ భాగాల్లో బలంగా గుద్దుకోవడంతో కడుపులోని ఆహారం శ్వాసకోశాల్లోకి వచ్చేసింది ఆ తరువాత కొద్దిసేపట్లోనే కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలిసిన నేను మద్రాసులోని గ్లోబల్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి, సంబంధిత డాక్టర్లను నెల్లూరుకు రప్పించాను. ఆ తరువాత ఇక్కడి నుంచి అంబులెన్స్‌ను నెల్లూరుకు పంపించి నేను విమానంలో నెల్లూరుకు చేరుకున్నాను. వెళ్లిన వారు ప్రధమ చికిత్సలేవో చేశారు కానీ, అవసరమైన పరికరాలన్నీ అక్కడ అందుబాటులో లేవు. పరిస్థితి నిమిష నిమిషానికీ విషమిస్తోంది. అత న్ని వెంటనే మద్రాసుకు తరలించడం తప్ప మరో మార్గం లేదని చెప్పాను. కానీ, అక్కడున్న వాళ్లంతా తరలించే ఒత్తిడిలో వీడు దారిలోనే చనిపోతాడు కాబట్టి, ఏం చేసినా ఇక్కడే చేయండి అంటూ చెబుతున్నారు.

నాకేమో వీడు ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయమని తెలుస్తోంది. రక్తబంధమేదీ కాదు కాబట్టి నేను వాడి కుటుంబ సభ్యులమీద ఒత్తిడి తేలేను. నా ఆలోచనల్ని విరమించుకుంటే నేను వాడ్ని శాశ్వతంగా కోల్పోతాను. రెండు వైపులా ప్రాణాపాయమే ఉన్నప్పుడు చేష్టలుడిగిపోయి విఫలమైపోవడం కన్నా, ప్రాణాల్ని కాపాడే ప్రయత్నంలో విఫలమైపోవడం మేలనిపించింది. నిజంగానే వాళ్లంతా అంటున్నట్లు మార్గమధ్యంలో చనిపోయి, నాకు రాకూడని చెడ్డ పేరంతా వచ్చినా సరే! వాడిని తీసుకు వెళ్లాల్సిందే అనుకున్నాను. కుటుంబ సభ్యులకు ధైర్యం రావడానికి వాడి ప్రాణానికి నా ప్రాణం ఇస్తా అన్న అర్థం వచ్చేలా హామీ ఇచ్చాను. మొత్తానికి వాడ్ని మద్రాసుకు తరలించాను.

కొత్తగా వచ్చిన ఎక్మో అనే ఒక పరికరాన్ని, దాన్ని నిర్వహించే నిపుణులందరినీ ముంబయ్‌కు ఫోన్‌చేసి చెన్నయ్‌లోని గ్లోబల్ హాస్పిటల్‌కు తెప్పించాను. ఇది శ్వాసకోశాలను, గుండెనూ విశ్రాంత స్థితిలో ఉంచడం వల్ల అవసరమైన బైపాస్ సర్జరీలన్నీ చేయవచ్చు. ఆ సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. అతనిప్పుడు పూర్తిగా కోలుకుని డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అన్ని దశల్లోనూ విమర్శలు ఉంటాయి. అయినా అవసరమైనప్పుడు తెగించి అడుగు ముందుకు వేయకపోతే, అమూల్యమైన వాటిని శాశ్వతంగా కోల్పోతామన్న సత్యాన్ని ఈ సంఘటన నాకు చెప్పింది.

నిస్సహాయతలోంచి నిలదొక్కుకోవాలి
కొన ఊపిరిని నిలబెట్టినప్పుడు ఒక గొప్ప ఆనందాన్నే పొందుతాం. ఎంత శ్రమించినా ఒక్కోసారి ఏ ఫలితమూ ఉండదు. ఒక నిస్సహాయ పరిస్థితి నిలువునా ముంచేస్తుంది. ఆ క్షణంలో ఈ మాత్రానికి ఎందుకీ వైద్య వృత్తి అని కూడా అనిపిస్తుంది. మన నిస్సహాయతను అర్థం చేసుకోకుండా, పరుషాతిపరుషంగా నిందించే వారిని చూసినప్పుడు ఇవన్నీ భరించడానికేనా ఈ వృత్తిలోకి వచ్చిందీ అని కూడా అనిపిస్తుంది. కానీ, ఆ నిస్సహాయ స్థితిలోనూ నిబ్బరంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఒక డాక్టర్‌గా నీ శక్తిని నూటికి నూరు శాతం ఉపయోగించావా లేదా అన్నదే ముఖ్యం కానీ అధిగమించలేని పరిమితులను చూసి నీరుగారి పోవడం వల్ల ఫలితమేముంది? వాస్తవానికి నిరంతరం కొంగ్రొత్త పరిశోధనా ఫలితాలు వెలుగు చూస్తున్నాయి. ఒకప్పుడు చికిత్స అసాధ్యంగా ఉన్న ఎన్నో వ్యాధులు ఈ రోజుల్లో నయమవుతున్నాయి. ఈ రోజు అసాధ్యంగా ఉన్నవి రేపు సాధ్యమవుతాయి. నిస్సహాయత నుంచి నిలబెట్టేది, ముందుకు నడిపించేది ఎప్పటికైనా ఆశావహ దృక్పథమే. ఈ మాటే నేను నా మనసుకు పలుమార్లు చెప్పుకుంటాను. నా సహచరులందరికీ చెబుతుంటాను.

 బమ్మెర

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.