జీనియస్ జివి కృష్ణరావు – ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న

 

నాటకకర్తగా, నవలా రచయితగా, కథా రచయితగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా, వ్యాసకర్తగా, అలంకారశాస్త్రాల్లోని లోతుపాతులు తెలిసిన మేధావిగా, ప్రాక్‌పశ్చిమ దేశాల తత్వశాస్త్రాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రతిభావంతుడుగా, హేతువాదిగా, మానవతావాదిగా, తెలుగుదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించారు డాక్టర్ గవిని వెంకట కృష్ణరావు.
కృష్ణరావు వ్యవసాయ కుటుంబంలో తెనాలి తాలుకా కూచిపూడి గ్రామంలో నవంబర్ 15, 1914లో జన్మించారు. వీరు తురిమెళ్ల, కొల్లూరు హైస్కూళ్లలో విద్యను అభ్యసించారు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 1937లో డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరులోనే పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యులు దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు.

కాలేజీ చదివే రోజుల్లో కృష్ణరావుకి గోపీచంద్‌తో స్నేహం ఏర్పడింది. ఆ సమయంలోనే కృష్ణరావు ఎమ్.ఎన్.రాయ్ రచనల్ని చదివి ఆకర్షితులయ్యారు. గోపీచంద్‌తో కలవడంతో ‘జీవితానికి ఒక మార్గం, రచనకు ఒక లక్ష్యం ఏర్పడ్డాయని’ కృష్ణరావు చెప్పారు. ప్రారంభంలో త్రిపురనేని రామస్వామి చౌదరి వల్ల హేతువాద దృక్పథం అలవడింది.
డిగ్రీ తర్వాత కాశీహిందూ విశ్వవిద్యాలయంలో ఎమ్ఏ ఇంగ్లీషు లిటరేచర్‌లో చేరారు. పరీక్షలు రాయకుండానే 1941లో తిరిగివచ్చారు. బెనారస్ నుండి వచ్చిన తర్వాత కృష్ణరావు పత్రికారంగంలో అడుగుపెట్టారు. పత్రికా రంగానికి స్వస్తి చెప్పిన తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డిలో చేరారు. కళాపూర్ణోదయంపై Studies in Kala purnodayam అనే ప్రామాణిక పరిశోధనా గ్రంథాన్ని ఆంగ్లంలో రాసి 1955 లో డాక్టరేట్ పట్టా పొందారు. ఈ పరిశోధనా గ్రంథంలో కళ ఎలా పూర్ణోదయం చెందిందో వివరించారు. అంతేకాక పింగళి సూరనని ప్రపంచ కవుల సరసన నిలబెట్టారు.

తెనాలిలోని విఎస్ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా చేరి 1962లో అధ్యాపక వృత్తికి రాజీనామా చేశారు. తర్వాత పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా చేరారు. పిదప 1963లో ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రంలో ‘స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్’గా చేరారు. 1973 వరకు అంటే పదవీ విరమణ చేసేవరకు ఉద్యోగం చేశారు.

కృష్ణరావు కాలేజీ చదువుతున్న రోజుల్లో ‘వరూధిని’ (1935) అనే భాండ కావ్యాన్ని రాశారు. ఆకాశవాణిలో ఉద్యోగం చేసేటప్పుడు భాసుడు రాసిన ‘ప్రతిమ’ నాటకాన్ని తెలుగులోకి అనువదించారు. వీరు కొన్ని కవితలు, కథలు, సాహిత్య వ్యాసాలు కలిపి ‘ఉదబిందువులు’ అనే సంపుటి ప్రచురించారు. అధ్యాపక వృత్తిలో వుంటూ ఆచార్య నాగార్జున గ్రంథంలోని కొన్ని భాగాల్ని పద్యాలుగా అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ తరఫున ప్లేటోరి పబ్లిక్ గ్రంథాన్ని ‘ఆదర్శ రాజ్యం’ పేరుతో తెలుగులో అనువదించారు.
కాశీలో ఎమ్.ఏ.విద్యార్థిగా ‘కావ్య జగత్తు’ అనే ప్రామాణికమైన విమర్శ గ్రంథం రాశారు. భరతుడు నుంచి పండిత రాయల వరకూ, ప్లేటో నుంచి మార్క్సు వరకు వున్న మహనీయుల సూక్తుల్ని ఉదహరిస్తూ ‘కావ్య వస్తువు’ సామాజిక వ్యవస్థని బట్టి ఎలా మార్పు చెందుతుందో నిరూపించిన ఉత్తమ విమర్శ గ్రంథమిది. దేశ కాలపరిస్థితుల్ని అనుసరించి కావ్యాల్లో వస్తురూపంలో ఎలా మార్పు చెందుతుందో ఇందులో మార్క్సిస్టు దృక్పథంతో విపులీకరించారు.
జి.వి.కష్ణరావుపై కవిరాజు హేతువాద ప్రభావమే కాక అటు యమ్.యన్ రాయ్ మానవవాద ప్రభావం కూడా వుంది. అలాగే మార్క్సిస్టు ప్రభావం వీరి రచనల్లో కన్పిస్తుంది. రావు తాను రాసిన ‘కావ్య జగత్తు’లో ‘నా సిద్ధాంతం క్రొత్తదీ కాదు, పాతదీ కాదు. ఇలా అనటం వలన ప్రాత కొత్తల కలయిక అని చెప్పడానికి అంత కన్నా వీలులేదు. ఎందుకంటే భారతాది లాక్షణికులు చెపుతూ వచ్చిన రసవాదాన్నే స్వీకరించి, ఆది భౌతిక సిద్ధాంతాన్ని అన్వయించాను. ఈ రెండు సిద్ధాంతాలూ పాతకే. మొదటిది ప్రాచీన మతం, రెండోది పద్దెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో ప్రబలమైన ఈ రోజుల్లో ప్రసరిస్తూ వుంది’ అని అన్నారు.

వీరు ‘కీలు బొమ్మలు’ 1951లో రాశారు. ‘కీలు బొమ్మలు’లోని పాత్రలు కీలుబొమ్మలుగా మారుతాయి. అంటే వారంతా స్వేచ్ఛని ఏదో రకంగా కోల్పోతారు. గ్రామీణ వాతావరణానికీ, వారి జీవన విధానానికి ప్రతిబింబం కీలు బొమ్మలు గ్రామాల్లో జరిగిన సంఘటనల్ని యథాతథంగా తీసుకొని వారి మానసిక ప్రవృత్తిని తాత్వికంగా వర్ణించిన అద్భుతమైన నవల యిది. ఈ నవల్లో రచయితకు ప్రతినిధి డాక్టర్ వాసుదేవశాస్త్రి. అతని ద్వారా రచయిత తాను చెప్పదలచుకున్న మాటల్ని చెప్పించారు. ‘కీలుబొమ్మలు నవల చదువరులను ఆనందపరిచే నవలగా మాత్రమేకాక, వారి ఆలోచనల్ని రేకెత్తించే ఒక కళాత్మకమైన తత్వచరిత్రగా మనకు గోచరిస్తుంది’ అని మొదలి నాగభూషణ శర్మ పేర్కొన్నారు. ‘ఆధునిక యుగంలో వ్యక్తిగత సమస్యల స్వరూపాన్ని ధరించే వైనం చిత్రించిన తర్వాత, రాజకీయాల స్వైరవిహారం ఎట్లా ఉంటుందో రచయిత చక్కగా చిత్రించారు. రాజకీయాల్లో యువకులూ, విద్యార్థులూ ఆదర్శవాదులే. కాని వాళ్లు కూడా కీలుబొమ్మలే అన్న సత్యాన్ని ఆవిష్కరించారు’ అని ప్రముఖ విమర్శకులు ఆర్‌యస్ సుదర్శనం తెలియ జేశారు.

1977లో ‘పాపికొండలు’ రాశారు. ఈ నవల ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చింది. అధికారం మనుషుల్ని ఎలా దిగదార్చుతుందో ఈ నవలలో వ్యంగ్యంగా కృష్ణరావు చెప్పారు. పాపికొండలు నవల ‘ఒక రసగంగ’ అని హితశ్రీ ప్రశంసించారు. మానవత్వపు విలువుల్ని కాపాడుకోవాలి. నైతిక ఆదర్శాల్ని అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనైతిక సాధన ద్వారా సాధించవచ్చుననే దృక్పథం తప్పు అని చెప్పారు. ఈ ప్రయోజనం కోసమే కృష్ణరావు పాపికొండలు నవల రాశారు. బౌద్ధం అంటే కృష్ణరావుకు అభిమానం. ఆ కారణంగా బౌద్ధ మత ప్రభావంతో ‘రాగరేఖలు’ నవల రాశారు. ఈ నవల్లో తీయతీయని తెలుగు సామెతలు, తెలుగు పలుకుబడులు చోటుచేసుకున్నాయి. వీరు ‘జఘన సుందరి’ అనే నవలిక కూడా రాశారు. ఈ నవల పలు విమర్శలకు గురి అయింది.
కృష్ణరావు మానవుని మూల తత్వాన్ని గూర్చి అన్వేషణ చేసిన ప్లేటో, అరిస్టాటిల్, లాక్, రూసో, కాంటో, జెఎస్ మిల్, డ్లూలూ, రస్సెల్, రాయ్ మొదలైన తత్వవేత్తల సిద్ధాంతాల్ని అధ్యయనం చేశారు. తాత్వికుడైన రచయిత చేసిన రచనలు మామూలు రచయితల రచనల కంటే భిన్నంగా వుంటాయి అనే వారికి కృష్ణరావు రచనలే ప్రబల తార్కాణం. ప్రాచ్య పాశ్చాత్య వైజ్ఞానిక సంప్రదాయాల్ని ఆకళింపు చేసుకొన్న మహనీయుడు డాక్టర్ కృష్ణరావు.

వీరు భిక్షాపాత్ర (1938), ధమ్మిల్లం (1951), దానధార (1952), యాదవ ప్రళయం (1952) మొదలైన భావ విప్లవానికి సంబంధించిన నాటికల్ని రాశారు. వీరి నాటకాలపై హేతువాదం, మానవవాదం, మార్క్సిస్టు వాదాల దృక్పథాలు చాలా స్పష్టంగా కన్పిస్తాయి. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని అందులోని అహేతుక అంశాల్ని ఖండిస్తూ నూతన వ్యాఖ్యానాలతో కొన్ని రచనల్ని చేశారు. సమాజంలో నెలకొన్ని వున్న అనేక ఆచార సంప్రదాయాలపై మతమౌఢ్యంపైన ధ్వజమెత్తిన కృష్ణరావు రచనలు ముఖ్యంగా పౌరాణిక రూపకాలు భావవిప్లవాన్ని రేకెత్తించేవిగా వున్నాయి.
తెలుగు సాహిత్యంలో నవల, నాటకం, కథ, కవిత, అనువాదం మొదలైన ప్రక్రియల్ని తనదైన శైలిలో రాసి మహామహా పండితుల, విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న సాహితీమూర్తి డాక్టర్ జి.వి. కృష్ణరావు.
-ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న
(నవంబర్ 15న జి.వి.కృష్ణరావు శతజయంతి సంవత్సరం ప్రారంభం)

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.