దీపం ఓ ఆధ్యాత్మిక మార్గం – కార్తీక దీపాలెందుకు?

 
 
 

దీపం యథార్థంగా పరమేశ్వర స్వరూపం. ఏ సహస్ర నామాన్ని చదివినా దానిలో అనేక నామాలుంటాయి. దానిలో పరంజ్యోతి అనే నామం కూడా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అలాంటి ఈశ్వరుడు స్త్రీయా, ఈశ్వరుడు పురుషుడా, నపుంసకుడా అని ఆలోచించండి. అసలు ఈశ్వరుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడూ కాడు. ఈశ్వరుడు కాంతి స్వరూపి. ఆయన ఎప్పుడూ మన వెనుక వెలుగుతూ ఉంటాడు. పోతనగారు భాగవత రచన చేస్తూ ఈశ్వరుడు, ” స్త్రీ, పురుష, నపుంసక ముక్తిలోకాక, క్రియ అక్రియ వరాహమూర్తియు కాక, .. వుండు తాను విభుతలంపు” అంటారు. మన వెనక ఉండి ప్రకాశిస్తూ మన శరీరాన్ని ఎంత కాలం నిలబడాలో అంత కాలం ఊపిరిని చిత్రంగా, గుప్తంగా నిలబెట్టి, ఆ ఊపిరి అయిపోగానే బయటికి వెళ్ళి శివాన్ని శవం చేసి పడగొట్టగలిగిన స్వరూపమే అది. అందుకే పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్రపుష్పంలో ” నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా” అని చెబుతారు.

అంటే, ఈశ్వరుడు అణువంత రూపంతో ఇక్కడ ప్రకాశిస్తుంటాడు. ఆ కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతోంది. దాన్ని ఏ పేరు పెట్టి పిలవాలి? ” సబ్రహ్మ సశివః సహరిః సేంద్రః సో¬క్షర పరమః స్వరాట్.” నువ్వు ఏ పేరు పెట్టి పిలిచినా ఈ కాంతి పలుకుతుంది. యథార్థానికి అది ఒక రూపం కాదు. అది ఒక కాంతి. అందుకే వెలుగుతోంది. భాస్కర అని దానికి పేరు. భా అంటే కాంతి. ఒక పెద్ద వెలుగు ముద్ద ఒకటి ఇక్కడ కూర్చుని ఉంది. ఆ వెలుగుల ముద్ద కాంతి కొడుతోంది. తిర్యగూర్ధమధశ్శాయా అని చెబుతున్నాం కదా…పైకి పక్కలకి, కిందకి కాంతి కొడుతోంది. ఆ కాంతే పరమేశ్వరుడు. నువ్వు సాకారం చేస్తే నువ్వు ఎలా కావాలంటే అలా కనబడతాడు. నిజానికి ఆయనకొక ఆకారమెక్కడుంది? ఆకారముండదు. అలాంటప్పుడు దేనిని పూజించాలనే సందిగ్ధత ఏర్పడుతుంది. దీనిని నివారించటానికే శంకరాచార్యులవారు వేదాంత డిండిమం చేస్తూ, “ఆకారంచ నిర్గుణంచ, సాకారంచ గుణంకరం తత్తం తత్తం…” అంటారు.

ఈ ప్రపంచంలో నిర్గుణం, సగుణం అని రెండు రకాలు ఉంటాయి. నిర్గుణంలోకి వెళ్ళాలన్నవాడు పరమ వైరాగ్యంలోకి వెళతాడు. సాధారణ ఉపాసన చేసేవాడు, బాహ్యప్రయోజనం కావాలనుకునేవాడు మనసు నిలబెట్టాలి కాబట్టి ఒక ఆకారాన్ని పూజ చేస్తాడు. యథార్థానికి అది ఒక కాంతిపుంజం. ఆ కాంతిపుంజమే దివ్వె. ఆ దీపమే పరమేశ్వర స్వరూపం. కానీ దానిని అర్థం చేసుకోవటం ఎలా? ఉపాసన చేసినప్పుడు మేఘంలో, ప్రవాహంలో, బురదలో, దుంగలో అంతటా ఈశ్వరుడే కనిపిస్తాడు. అంతటా పరమేశ్వర స్వరూపం చూడగలిగిన స్థితికి ఎదగగలిగితే దీపాన్ని అర్థం చేసుకున్నట్లు గుర్తు. ఈశ్వరుణ్ణి ఎక్కడ చూడాలి అంటే పూజా మందిరంలో కాదు. ఈ లోకమంతటా ఈశ్వరుడిని చూడగలగాలి. అందుకే రుద్రంలో, ” నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో” అంటారు.

కదలకుండా నిలబడి వింటున్నట్లు ఉంటే ఆకుపచ్చని చెట్టులో, ప్రతి ఆకులో పచ్చదనంలోను ఈశ్వరుడే కనబడాలి. ఆ దర్శనం పొందామనటానికి ప్రత్యక్ష ఉదాహరణ దీపం. ఎందుకంటే లోకంలో యథార్థం తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం. మనకు ఒక పొడవైన తాడు కనిపించింది. కాని అది తాడో, పామో మనకు తెలియదు. అలాంటప్పుడు దీపం పనికొస్తుంది. అది తాడు అని పాము కాదని తెలిస్తే భయం పోతుంది. అందుకే ఆ తేజోరూపమైన పరమా త్మను నేను ఆరాధన చేస్తున్నాననే ఆంతర సంస్కారాన్ని పొందడానికి పది మెట్లు పైకెక్కి నిలబడి అంతటా ఈశ్వర దర్శనం చెయ్యగలిగిన మహోత్కృష్టమైన స్థితికి చేరుకోవటానికి ప్రతీక కార్తీక దీపం. అందుకే కార్తీక దీపం అని ప్రత్యేకంగా పిలుస్తాం. దీపం, దీప వైభవం తెలుసుకొని దానిని వెలిగించటం ఒక ఎత్తు. తెలియకపోతే కార్తీక పౌర్ణమినా డు దీపం వెలిగిస్తున్నప్పుడు, “దామోదరమా వాహయామి” లేదా “త్య్రయంబకమావాహయామి” అనాలి.

దామోదరుడు అంటే విష్ణు సంబంధమైన విషయం. త్రయంబకం అంటే శివ సంబంధం. మూడు లోకాలకు కూడా తల్లీ, తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు. అటువంటి త్రయంబక స్వరూపమైన పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి. అక్షతలు వేసి. పువ్వో, పసుపో, కుంకుమో వెయ్యాలి దీపం మీద. దామోదరుణ్ణన్నా పిలవాలి, త్రయంబకుణ్ణి అయినా పిలవాలి. అలా ఆవాహన చేసిన తర్వాత ఆ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. లేదా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి. (ఎమెస్కో బుక్స్ ప్రచురించిన కార్తిక మాస వైభవం పుస్తకం నుంచి)

కార్తీక దీపాలెందుకు?

 

 

 
 
 

శంకరాచార్యులవారు దక్షిణామూర్తి స్తోత్రంలో, “నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాద్వీప ప్రభా భాస్వరం, జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే” అంటారు. “ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను అయిదు ఇంద్రియాలకూ నాయకురాలి లాంటిది. కన్ను లేకపోతే సుఖాలన్నీ చచ్చిపోయినట్లే. కన్నుంది కాబట్టే చాలా సుఖాలున్నాయి. అటువంటి కంటిని నాకిచ్చినందువల్ల నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, నా చెట్లని, పరమేశ్వరమూర్తిని, రామాయణాన్ని, ్రగంథాల్ని శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇవి చూసి ఎంత పొంగిపోతున్నానో ఈశ్వరా! ఈ కన్ను నాకిచ్చావు కాబట్టి ఇన్ని ఉన్నాయి, ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పటానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నాను” అనేది దీని అర్థం.

అందుకే మనం దీపం పెట్టి ఈశ్వరుడికి పూజను ప్రారంభిస్తాం. కానీ కాక్తీక మాసంలో పెట్టే దీపం అందుకోసం కాదు. ఈ మాసంలో పెట్టే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రాముఖ్యం ఉంది. కార్తిక సోమవారం పెట్టే దీపానికి ఒక ప్రాశ్తస్యం ఉంది. చంద్రుడు మొట్టమొదటి హోరలో ఉన్నటువంటి రోజున ప్రారంభమయ్యే రోజుకు సోమవారం అని పేరు. మనకి ఎప్పుడూ ఒక రోజులో ఎనిమిది హోరలు మూడు పర్యాయాలు తిరుగుతాయి. మూడు ఎనిమిదులు ఇరవై నాలుగు. మొట్టమొదటి హోర, అన్నిటికన్నా ప్రారంభంలో ఉండే హోర సూర్య హోర. తరువాత వచ్చేది శుక్ర హోర. తరువాత వచ్చేది బుధ హోర. తరువాత వచ్చేది చంద్ర హోర, తరువాత శని హోర, తరువాత గురు హోర, తరువాత కుజ హోర. ఎనిమిది హోరలు. అందుకే ఆ హోరలు మూడు ఎనిమిదుల ఇరవై నాలుగు పూర్తి, మళ్ళీ ఇరవై అయిదవ హోర వచ్చేటప్పటికి హోర ప్రారంభమవుతుంది కాబట్టి దానికా పేరు.

సోమవారం ఉందనుకోండి చంద్ర హోరతో మొదలవుతుంది. చంద్ర హోరతో మొదలవుతుంది కాబట్టి సోమవారం అని పిలుస్తాం దాన్ని. ఆదివారమనుకోండి సూర్య హోరతో ప్రారంభమవుతుంది. సూర్య హోరతో ప్రారంభమవుతుంది కాబట్టి ఆదివారం, భానువారం అని పిలుస్తాం. ఈ ఎనిమిదే ఇరవై నాలుగు గంటలలో పూర్తి అయిపోతాయి. అటువంటి రోజుల్లో సోమవారం నాడు చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని పిలుస్తుంటారు. మనకి వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు. హృదయ స్పందనే మనుష్యప్రాణి జీవనం. గుండె ఎంతసేపు కొట్టుకుంటుందో అంతసేపు బతికివున్నాడంటారు. గుండె ఆగిపోయిందనుకోండి ఆయన వెళ్ళిపోయాడండీ అంటారు. ఈ గుండె కొట్టుకోవటం అనే దానికి హృదయంలో హృదయ నాడి అనే నాడి ఉంటుంది.

నాడి మీకు భౌతికంగా కనబడేది కాదు. అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది. దానికి అధిదేవత యమధర్మరాజు అన్నారు. ఆయన అన్రుగహమయిపోగానే హృదయనాడి మూసుకుపోతుంది. యమదంష్ట్ర బయటకి వచ్చిన కారణం వల్ల ఆ కాలంలో హృదయనాడి మూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యమధర్మరాజు దేనికి ఎక్కువ ప్రీతి పొందుతాడంటే నువ్వుల నూనె వల్ల. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు వత్తి నుంచి వచ్చే పొగ వాసన చూస్తే హృదయనాడి బలిష్ఠమవుతుంది. యమధర్మరాజు పీల్చి వదులుతాడు. ఆయుఃకారకమవుతుంది. హృదయనాడి నిలబడుతుంది. అందుకని దీపాలు పెడతారు. అందరినీ దీపం పెట్టండి అంటారు. ప్రతివారినీ దీపం పెట్టండంటూ కార్తీక మాసం ఉదయం దీపం, సాయంకాలం దీపం ఎందుకు పెట్టిస్తారంటే సమస్త భూతకోటికి ఉపకారం చెయ్యమని. వాతావరణంలో ఆరోగ్యకరమైన వేడిని పెంచమని. బాహ్యంలో ప్రతిపాదన చేయడానికి ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో గానీ పెట్టిన దీపమే పెట్టమని చెప్పటానికి వెనక ఉన్న తార్కికమైన కారణమది.

కార్తీక మాసంలో దీపాలు వెలిగించాల్సిన అవసరం గురించి, ఆ దీపాలకు ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాధాన్యం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర రావు శర్మ ఈ వ్యాసంలో వివరిస్తున్నారు.
(ఎమెస్కో బుక్స్ ప్రచురించిన కార్తిక మాస వైభవం పుస్తకం నుంచి)

ఉపనిషత్తుల్లో దీపం
దీపం గురించి ” న సూర్యోభాతి న చంద్రతారకం నేమా ద్యుతోభాతి కుతో….. త్వమేవ భాంతి మనుభాత సర్వం ఇతి భాసా సర్వమితవ్య భాసం” అని ఉపనిషత్తులు చెబుతాయి. పరమేశ్వరుడు ఒక పెద్ద వెలుగు. ఆయన వెలుగు ముందు సూర్యచంద్రులు ప్రకాశించరు. ఎందుకంటే ఆ వెలుగు ముందు ఈ వెలుగు పనిచెయ్యదు. కాబట్టి ఆయన ఒక్కరే ప్రకాశిస్తూ ఉంటాడు. అందువల్ల ప్రకాశిస్తున్న ఆ కాంతి పుంజమున్నదే అదొక్కటే పరమేశ్వర స్వరూపం. దీనినే పోతనగారు-
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగుపెం
జీఁకటి కవ్వల నెవ్వం
డేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్ అని వర్ణిస్తారు. ఇది భాగవతం అష్టమ స్కంధంలో ఉంటుంది. అందరూ మహా ప్రళయంలో పడిపోతే, కటిక చీకటి ఆవరిస్తే, సూర్యచంద్రుల గమనమాగిపోతే, ఈ కటిక చీకటికావల ఒక్కడు వెలిగిపోతూ ఉంటాడు. ఆ వెలిగిపోతున్న వెలుగుకు వెలుగైనదొక్కటున్నదే అది పరమేశ్వర స్వరూపం. దాన్ని నేను పిలుస్తున్నానంటాడు గజేంద్రుడు.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.