జీవితం ఏడిపించాకే నవ్వించడం మొదలు పెట్టాను (శ్రీలక్ష్మి ఓపెన్ హార్ట్ విత్ aandhra jyoti 18-11-13

 

శ్రీలక్ష్మి నటించక్కర్లేదు. తెరమీద కనిపిస్తే చాలు. మన ప్రమేయం లేకుండానే టక్కున నవ్వొస్తుంది. ఇక, ఆవిడ నటించడం మొదలెడితే.. నవ్వులు ఆపడం మనతరం కాదు. థియేటర్‌లో నుంచి బయటికి వచ్చాక హీరో హీరోయిన్లను సైతం మరిచిపోతామేమో కానీ శ్రీలక్ష్మి కామెడీని మాత్రం మరిచిపోలేము. సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్లతో పోటీపడి, విలక్షణమైన లేడీ కమెడియన్‌గా ఐదొందల సినిమాల్లో నటించిన ఆమెతో సంభాషించారు ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ. ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ప్రసారమైన ఈ ఇంటర్వ్యూ సమాహారం మీ కోసం…

ఆర్కే : తెలుగు ప్రేక్షకులకు మీరు నవ్వులు పూయించి చాలా రోజులు అయింది. మీకుగా మీరు తీసుకున్న విరామమా ? లేక అవకాశాలు రాకనా?
శ్రీలక్ష్మి : లేదండీ! నాకు నేనుగా తీసుకున్న గ్యాపే ఇది. జీవితాంతం సినిమాలే జీవితం కాదు కదా. నాకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉండటంతో నటించడం లేదు. అప్పట్లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అవ్వడం ఎందుకు అని మద్రాసులోనే ఉండిపోయాను. ప్రస్తుతం కమిట్‌మెంట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. కొన్ని సీరియల్స్, మరికొన్ని సినిమాల్లో చేస్తున్నానిప్పుడు. ఆ కళామతల్లి నన్ను అంటిపెట్టుకుని ఉన్నంత కాలం మేకప్ వేసుకుంటూనే ఉంటాను.
ఆర్కే : ఇరవై ఏళ్లపాటు మరమనిషిలా చేస్తూ పోయారు కదా! ఎన్ని సినిమాలు చేశారో, ఎంత వచ్చిందో ఇవేవీ తెలియకుండా చేసుకుంటూ పోయారా..?
శ్రీలక్ష్మి : అప్పట్లో సినిమాకు అయిదువేలు, పదివేలు..అదీ మూడుదఫాలుగా ఇచ్చేవారు. రోజుకు మూడు సినిమాల చొప్పున చేసేదాన్ని కాబట్టి.. చేతికి కొంత మొత్తంగా వచ్చేది. అదంతా ఫ్యామిలీకే సరిపోయేది. స్థలాలు కొనడం, దాచుకోవడం వంటివేవీ చేయలేదు నేను.

ఆర్కే : మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి..?
శ్రీలక్ష్మి : మా నాన్నగారు అమరనాథ్ అప్పట్లో పెద్ద హీరో. ఎన్‌టిఆర్, ఎఎన్ఆర్‌లకు సమకాలికుడు. ‘బైజుబావరా’ అనే హిందీ సినిమాను తెలుగులో ‘అమరసందేశం’ పేరుతో ఆయన్నే ్ట హీరోగా పెట్టి తీశారు. ఎంజిఆర్ తమిళ సినిమా ‘ఎన్‌తంగె’ౖను తెలుగులో ‘నా చెల్లెలు’ పేరుతో చేశారు నాన్నగారు. ఇలా వందకు పైగా సినిమాలు చేసిన నటుడు ఆయన. మాకు ఊహ వచ్చే నాటికే రిటైర్ అయ్యారు. మేము చిన్నపిల్లలప్పుడే హైదరాబాద్ వచ్చేశారు. వచ్చాక సినిమాలు లేవు. లేవని ఎవర్నీ అడగరు. ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు. అప్పుడు మా అమ్మగారు “ఏవండీ ఇప్పుడు అందరూ అన్ని వేషాలూ వేస్తున్నారు. మీరు తండ్రి పాత్రలులాంటివి వేయొచ్చు కదా” అనేవారు. కాని ఆయన “లేదు లేదు నేను హీరోగానే చేశాను. హీరోగానే చచ్చిపోతాను తప్ప చిన్న చిన్న వేషాలు వేయను గాక వేయను” అనేవారు. ఆ రోజుల్లో ఒకసారి హీరోగా వేషం వేసిన వారు ఆ తర్వాత చిన్న పాత్రలు చేసేవారు కాదు. ఇప్పుడైతే అలాంటి నామోషీలేవీ లేవు. అందరూ అన్నీ చేస్తున్నారు. నాన్నగారు చేతిలో ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనే ‘మగవారి మాయలు’ అనే సినిమా తీశారు. కృష్ణకుమారి, రాజశ్రీ, గీతాంజలి, చలం అందులో నటులు. ఆ పిక్చరు ఎలా పోయిందో తెలియదు. అదే సినిమాలో కృష్ణకుమారికి బిడ్డగా నేనొక చిన్న పాత్ర చేశాను.

ఆర్కే : ఆ తర్వాత ఏం చేశారు?
శ్రీలక్ష్మి : అలా సినిమాలు తీయడం, పోవడం జరుగుతుండేవి. నాన్నగారు ‘అమరజ్యోతి’ అనే సినిమా తీస్తున్నప్పుడు చెన్నైకి వెళ్లాం. అమరజ్యోతిలో నాన్న హీరో, విజయనిర్మల హీరోయిన్. ఎస్వీ రంగారావు, ఛాయాదేవి ప్రధానపాత్రధారులు. ‘ఫైనాన్సర్లు అక్కర్లేదని సొంతంగానే తీస్తున్నారు’ అని కొందరు పుకార్లు పుట్టించారు. షూటింగ్ పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయిందది. ఆ తర్వాత కలర్ సినిమాల ట్రెండు వచ్చింది. సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న బాధతో నాన్నగారు మానసికంగా కుంగిపోయారు. చెప్పుకుంటూపోతే అదొక పెద్ద స్టోరీ. పిల్లల్లో ఇద్దరం పెళ్లీడు కొచ్చాం. మాకు ఎలా పెళ్లి చేయాలోనన్న ఆందోళన కూడా ఆయనను పట్టుకుంది. ఇంతలో జాండీస్ వచ్చి చనిపోయారు.

ఆర్కే : మరి, మీరే ఆ తర్వాత కుటుంబ బాధ్యతను తీసుకున్నారా?
శ్రీలక్ష్మి : అవునండీ. మా పెద్దక్క తీసుకోలేదు. నేనే బాధ్యత తీసుకున్నాను. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు. కొన్ని అడ్డంకులు ఎదురైనాయి. మేము ఎనిమిది మంది పిల్లలం అయితే చిన్నప్పుడే ఇద్దరు చనిపోయారు. నేను హైదరాబాద్‌లో ఐదు నుంచి ఏడవ తరగతి వరకు మాడపాటి హనుమంతరావు పాఠశాలలో చదివాను. మళ్లీ ప్రైవేటుగా ప్లస్‌టూ పూర్తి చేశాను. మావేమీ పెద్ద చదువులు కాదు. వానాకాలం చదువులు. అదీ తెలుగుమీడియంలో చదువుకున్నాను.

ఆర్కే : సినిమాల్లో అవకాశాలు ఎవరిచ్చారు..?
శ్రీలక్ష్మి : పూలు అమ్ముకునే చోట కట్టెలు అమ్ముకోకూడదు అనే ఇక్కడికి వచ్చాము. మళ్లీ చెన్నయికి వెళ్లాము. భవిష్యత్తు ఏంటి అనుకునే టైమ్‌కు – మా ఇంట్లో కొద్దోగొప్పో ఒడ్డూపొడుగూ కనిపించే మనిషిని నేనొక్కదాన్నే. ఒక రోజు అమ్మ- “నువ్వొక్కదానివి చేస్తే మన కుటుంబం బతుకుతుంది. లేకపోతే నాన్నగారు పోయినట్లే మనమంతా పోతాం” అంది. “ఆయనంటే అనారోగ్యంతో మరణించారు. మనమంతా ఆరోగ్యంగా ఉన్నాం కదా. అమ్మ ఇలా అంటుందేమిటి?” అనుకుని భయపడ్డాను.
అప్పుడు నేను “సరేలే అమ్మా నేను డేర్ చేస్తాను..” అని రంగంలోకి దిగాను. మా నాన్న బతికుండగానే విశ్వనాథ్‌గారు ఏదో సినిమా తీస్తున్నారు ఫోటోలు పంపించమని ఎవరో చెబితే అప్పటికప్పుడు పిచ్చి పిచ్చి ఫోటోలు పంపించాను. విశ్వనాథ్‌గారు వాటిని చూసి అమ్మాయిని పిలిపించమన్నారు. మద్రాసు వెళ్లాం. ఆ టైమ్‌లో మా నాన్నకు ఎంత కోపమంటే అంత కోపం. నేను సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థికసంక్షోభం, వాటికితోడు పిల్లలకు ఏదైనా చెబితే వినడం లేదన్న బాధ.. అన్నీ మనసులో పెట్టుకునేవాడు. “అమ్మా వద్దమ్మా, ఇండస్ట్రీ లోటుపాట్లు మీకు తెలీదు. నాకన్నీ తెలుసు. మీరు ఆడపిల్లలు. అక్కడ బతకడం కష్టం. నాకు చాతకావడం లేదనే కదా మీరు నా మాట వినకుండా వెళుతున్నారు” అన్నారు. “నాన్నా ఏదో ఒక రాయి వేద్దామని వెళుతున్నాను. వద్దనకండి” అని నేను అన్నాను. ఆయన కోపంగా “సరే పో” అని వదిలేశారు.

ఆర్కే : అది తొలి ప్రయత్నం. ఆ తర్వాత..?
శ్రీలక్ష్మి : అక్కడ ‘శంకరాభరణం’ కోసం స్క్రీన్‌టెస్ట్ చేస్తున్నారు. అది లాస్ట్ సీన్. మంజుభార్గవి రైలులో నుంచి దిగే సీన్. నన్ను విశ్వనా«థ్‌గారి వద్దకు తీసుకెళ్లాక.. మేకప్ టెస్ట్ చేశారు. రైలు ఎక్కమ్మా అన్నారు. రైల్లో నుంచి దిగుతున్నట్లు, మనల్ని రిసీవ్ చేసుకునేందుకు ఎవరైనా వచ్చారేమో చూస్తున్నట్లు చేయాలి. వాళ్లు చెప్పినట్లే అన్నీ చేశాను. ఓకే అన్నారు.
ఆ తర్వాత ‘శుభోదయం’లో నాకు హీరోయిన్ అవకాశం వచ్చింది. చంద్రమోహన్ హీరో. సినిమా మొదలు పెట్టేందుకు కొబ్బరికాయ కూడా కొట్టాము. అయితే అదే టైమ్‌లో నాన్నగారు చనిపోయారన్న వార్త వచ్చింది. ఆదరాబాదరా హైదరాబాద్ వచ్చేశాను నేను. అలా హీరోయిన్ ఛాన్స్ పోయింది.
బాపుగారు ‘వంశవృక్షం’ సినిమా తీస్తున్నారప్పుడు. అందులో కూడా హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. మళ్లీ చెన్నయి వెళ్లిపోయాను. చిన్న చిన్న వేషాలు వేయడం మొదలుపెట్టాను.
‘బావామరదళ్లు’, ‘నివురుగప్పిన నిప్పు’సినిమాలలో చేశాను. ఆ టైమ్‌లో నటించడానికి నేను భయపడుతుంటే బాపు గారు ఏం చెప్పారంటే – “ఇది కామెడీ వేషం. భయపడొద్దు. ఆర్టిస్టు అంటే అన్ని పాత్రలు చేయగలగాలి. ధైర్యంగా చేయండి” అన్నారు. నాది నగేష్ సరసన నటించే పాత్ర. గిరిజ, అల్ల్లురామలింగయ్యల కూతురుగా నటించాలి. ఆ సినిమాలో నగేష్ నాకు లైన్ వేస్తుంటాడు. ఆ సినిమాకు నేను తీసుకున్న పారితోషికం రెండువేలు.

ఆర్కే : కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసినట్లున్నారు?
శ్రీలక్ష్మి : మలయాళంలో ‘జంబులింగ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా చేశానండీ. అందులో ప్రేమ్‌నజీర్ పెద్ద హీరో. దేవదాసు కనకాల తీసిన ‘పుణ్యభూమి కళ్లు తెరచింది’లో గుమ్మడిగారి అబ్బాయి హీరోగా, నేను హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అయిదు తమిళ సినిమాలు కూడా చేశాను. ‘జిగుజిగురైలు’, ‘స్పరిశం’ అనే సినిమాలు చేశాను. అయినా ఫలితం లేదు. హీరోయిన్‌గా ఫిట్ అవ్వలేదు.

ఆర్కే : ఏ సినిమాతో బ్రేక్ వచ్చింది మీకు..?
శ్రీలక్ష్మి : మా తమ్ముడు రాజేష్, నేను, మా అమ్మ తొలినాళ్లలో భానుచందర్ వాళ్ల ఇంట్లో ఉండేవాళ్లం. మా నాన్నగారికి జాండీస్ వచ్చినప్పుడు భానుచందర్ వాళ్ల అమ్మగారు మందు ఇచ్చేవారు. ఆమె అలా పరిచయం. మా నుంచి కొంత అడ్వాన్సు తీసుకుని ఇంటిమీద గుడిసెలోనే కొన్ని నెలలపాటు ఉంచింది ఆమె. అప్పట్లో రూ.250 అద్దె. మేము ముందస్తుగా 5 వేలు ఇచ్చాం. రెండు నెలలైనా అదే గుడిసెలో పెట్టింది. భానుచందర్, సుమన్ జాగింగ్‌కు వెళ్లేవారు. అప్పట్లో వాళ్లు పెద్ద హీరోలు. రాత్రిళ్లు హాల్లోనే పడుకునేవాళ్లం. వంటంతా ఆవిడే చేసిపెట్టేది. కొన్ని రోజులకు ఇల్లు ఇచ్చింది. అదే సమయంలో – జంధ్యాల గారి వద్ద కెమెరామాన్‌గా చేస్తున్న గోపాల్‌రెడ్డి గారు భానుచందర్ వాళ్ల అమ్మ దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవారు. “వీళ్లు బాగా బతికిచెడినోళ్లురా. రాజేష్‌కు ఏదైనా అవకాశం ఉంటే చూడరాదూ” అని గోపాల్‌రెడ్డితో చేప్పేది ఆమె. అలా మా తమ్ముడికి ‘నెలవంక’ అనే సినిమాలో హీరోగా నటించేందుకు అవకాశం చిక్కింది. ‘రెండుజళ్ల సీత’ కోసం జయకృష్టగారు మా తమ్ముడిని బుక్ చేశారు. అందులో నాక్కూడా ఒక అవకాశం వచ్చింది. అందులో తమాషా పాత్ర నాది. సుత్తివేలు, నేను ఒక అద్దె ఇంట్లో దిగుతాము. ఆ ఇంట్లోకి మరో అందమైన అమ్మాయి వస్తే లైను వేయడానికి బాగుంటుందని హీరోతోపాటు మరో నలుగురు కుర్రాళ్లు ప్రయత్నిస్తుంటారు. మమ్మల్ని ఖాళీ చేయించడమే వారి ప్రధాన కర్తవ్యం.

మొదట్లో చాలా చిన్న దృశ్యంగా తీయాలనుకున్న జంధ్యాల.. నా నటన చూసి సీన్లను పొడిగించారు. ఆయనకు దేవుడు పూనాడేమో అనిపిస్తుంది. లేకపోతే నాకు అంత అదృష్టం దక్కేది కాదు. విషయం తెలుసుకున్న నా తమ్ముడు “నువ్వు వచ్చింది ఒక రోజు వేషానికి. నేను ఇందులో హీరో. నువ్విక వెళ్లిపో”అన్నాడు. “అదేంట్రా.. అందరం కష్టపడితేనే కదా కుటుంబం నడిచేది” అన్నాను నేను. “నీకు ఇష్టముంటే ఉండు లేకపోతే నువ్వే పో” అని వాడితో దెబ్బలాడాను. ఆ సినిమా బాగా ఆడింది. కమెడియన్‌గా నా జీవితం మొదలైంది. ఆ తర్వాత జంధ్యాలగారి అన్ని సినిమాల్లో నాకు అవకాశాలు వచ్చాయి.

ఆర్కే : ఆ హిట్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదన్న మాట?
శ్రీలక్ష్మి : లేదండీ. దేవుడి దయవల్ల ‘రెండు జళ్ల సీత’కు కళాసాగర్ అవార్డు వచ్చింది. అప్పటికి అవార్డు అంటే ఏమిటో నాకు తెలీదు. ఇండస్ట్రీలో నేను బ్రిలియంట్‌ను కాదు. సినిమాల్లో వేసిన అమాయక పాత్రల వంటిదే నా మనస్తత్వం. అందుకే నేనెక్కడా నటించలేదు. నా అసలు స్వభావమే నా పాత్రలకు అతికినట్లు సరిపోయింది.
ఆర్కే : మీరింత అమాయకురాలు. మరి, ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదా? ఎలా నెట్టుకొచ్చారు?
శ్రీలక్ష్మి : మా అమ్మ అమరనాథ్‌గారి భార్య కాబట్టి.. ఆమెకు అన్నీ తెలుసు. మెడలో గంటలు కట్టడం, అగ్రిమెంట్లు రాయించుకోవడం వంటి వాటికి అమ్మ ఒప్పుకునేది కాదు. అమ్మ వల్లే అన్నింటినీ ఈదుకుని ఒడ్డుకు చేరాము.

ఆర్కే : ఐదొందల సినిమాల్లో నటించారు. ఏమైనా వెనకేసుకున్నారా?
శ్రీలక్ష్మి : వెనకేసుకున్నది ఏమీ లేదు. ప్రేక్షకుల అభిమానం, ప్రేమ తప్ప. చెన్నయిలో ఒక ఇల్లు ఉంది. మొన్ననే కోవైసరళను కలిసినప్పుడు “ఇండస్ట్రీకి వచ్చి ఏమీ దాచుకోలేదా ఛీపో” అని విసుక్కుంది. సంపాదనంతా ఫ్యామిలీకే సరిపోయేది.
ఆర్కే : ఈ బాధలు చుట్టుముట్టినప్పుడు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయా?
శ్రీలక్ష్మి : ఏడవనోళ్లు ఎవరుంటారు. నేను కూడా ఏడ్చాను. ఇంటికొచ్చి మా అమ్మతో ఒక ఆర్టిస్టు ఇలా అంటున్నాడు అని కన్నీళ్లు పెట్టేదాన్ని. అప్పుడు అమ్మ “అన్నీ మంచికే, అవన్నీ ఎదుర్కోవాలి” అని ధైర్యం నూరిపోసేది.
సిల్క్‌స్మితలాంటి డ్యాన్సులు చేయవచ్చు కదా. బోలెడంత డబ్బు వస్తుంది అన్నారు కొందరు. ఇప్పుడు చేస్తున్న పాత్రలు చేస్తే చాలు. అలాంటి పాత్రలు మా అమ్మాయికి వద్దు.. అంటూ అమ్మ ఒప్పుకోలేదు.

ఆర్కే : కమెడియన్‌గా మంచి సంతృప్తి నిచ్చిన సినిమా ఏది?
శ్రీలక్ష్మి : ఆ రోజుల్లో సిల్క్‌స్మిత ఉంటే సినిమా హిట్ అయినట్లు.. అలాగే నేను కమెడియన్‌గా చేస్తే ఆ సినిమా కూడా హిట్ అవుతుందన్నంత క్రేజ్ వచ్చింది నాకు. ‘స్వర్ణకమలం’, ‘శుభోదయం’, ‘సూత్రధారులు’.. ఇలా ఏ సినిమా అని చెప్పేది. అన్ని సినిమాల్లో నాకు మంచి పాత్రలే వచ్చాయి. వ్యక్తిగతంగా అయితే ‘శ్రీవారికి ప్రేమలేఖలు’ నచ్చింది. అందులో సినిమా కథలు చెప్పే పాత్ర నాది. ‘చంటబ్బాయి’లో పొట్టిప్రసాద్‌తో కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. రచయితను కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా అనే డైలాగులు మంచి పేరు తెచ్చాయి. ఇక, ‘జంబలకిడిపంబ’లో బ్రహ్మానందానికి తాళి కట్టే సీను నచ్చింది.
ఆర్కే : ఇప్పటివరకు ఆర్థికంగా మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేదా?
శ్రీలక్ష్మి : నేను మోసపోయేంత సంపాదించలేదు. కాని మరొక రకం మోసం జరిగేది. ఇస్తామని చెప్పినంత రెమ్యునరేషన్ ఇచ్చేవారు కాదు. చెల్లని చెక్కులు ఎక్కువగా ఇచ్చేవారు.

ఆర్కే : కొందరికి చిట్టీలకు హామీలిచ్చి మోసపోయారట కదా?
శ్రీలక్ష్మి : అవును. అలా చేసి.. చాలా దెబ్బతిన్నాను. మంచికి పోతే చెడు ఎదురవుతుంది అంటారే అలా. అందుకే దేవుడు “నువ్వు ఉన్నదంతా దానం చేస్తావు. కాబట్టి నీకు కావాలనుకున్నప్పుడే ఇస్తాను” అని అవసరమైనప్పుడే ఇస్తున్నాడు.
ఆర్కే: చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఏదైనా ఉందా?
శ్రీలక్ష్మి : ‘ఓ సీత కథ’లో రమాప్రభ చేసిన పాత్రలాంటిది చేయాలన్న కోరిక ఉండేది. రేలంగి నరసింహరావు దర్శకత్వంలో వచ్చిన ‘పూలరంగడు’లో నూతన్‌ప్రసాద్ భార్యగా చేశాను. అది ఇన్నోసెంట్ పాత్ర.

ఆర్కే : ఇప్పుడేమైనా మళ్లీ సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తున్నారా?
శ్రీలక్ష్మి : ప్రయత్నించడం లేదు. నాకు పిల్లలు లేరు. బాదరబందీలేవీ లేవు. హైదరాబాద్ వచ్చాక.. ఉగాది ఉత్సవాలకు తెలుగువాళ్లు పిలిస్తే.. అమెరికాకు వెళ్లొచ్చాను. గతంలో ‘చిన్నికృష్ణుడు’ అనే సినిమా షూటింగ్ కోసం వెళ్లానంతే. స్టార్‌నైట్‌లకు పిలిచినా వెళ్లలేదు.
ఆర్కే : మీ తమ్ముడు అలాగే రైజ్ అయ్యుంటే బాగుండేది కదా!
శ్రీలక్ష్మి : వాడు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తాగుడుకు అలవాటు పడి చనిపోయాడు. ఆర్టిస్టు అంటే వాడే. నాకంటే వాడే మంచి నటుడు. నేను పరిస్థితుల వల్ల నటి అయ్యాను. చిన్న వయసుకే పెళ్లి చేసుకున్నాడు. నలుగురు పిల్లలు పుట్టారు. వాళ్లలో ఒకబ్బాయి ప్రేమించిన అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకడు తన స్నేహితుడితో కలిసి మితిమీరిన వేగంతో కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై మరణించాడు. మరొకడు ప్రస్తుతం కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకో అమ్మాయి ఐశ్వర్య తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.
మా తమ్ముడి జీవితం 38 ఏళ్లకే పూర్తయింది. సరిదిద్దుకోరా అని ఎంత బతిమాలినా వినలేదు. “లేదు లేదు నేను చేయరాని తప్పు చేశాను. ఇది నా ఖర్మ” అని వాడు బాధపడేవాడు. సలీం మాస్టర్ అసిస్టెంట్, డ్యాన్సర్ అయిన నాగమణిని పెళ్లి చేసుకున్నాడు మా తమ్ముడు. అది అమ్మకు ఇష్టం లేదు.

ఆర్కే : ఈ జనరేషన్‌ను చూసి నేర్చుకోవాల్సినవి ఏమీ లేవా?
శ్రీలక్ష్మి : వాళ్ల ట్రెండ్‌కు తగ్గట్టు మనం పోవాలి. అందరితో స్పోర్టివ్‌గా మాట్లాడటం నేర్చుకోవాలి. “ఇలా చేయడం మంచిపద్దతి కాదు..” అనకూడదు. అలా అంటే “వాట్ నాన్సెన్స్”, “యు నో దట్” అంటారు వాళ్లు. ఎందుకొచ్చిన గొడవ. మనం వాళ్లతో ఎక్కువ వాదోపవాదాలు చేయకూడదు.

ఆర్కే : మీ కాలంలో సినిమారంగంలో గౌరవమర్యాదలు ఎలా ఉండేవి?
శ్రీలక్ష్మి : రామారావు, నాగేశ్వరరావుగారు వస్తున్నారంటే లేచి నిల్చునేవారం. ఇప్పుడు అలాంటి పెద్దలు వస్తున్నారంటే “వస్తే ఏంటి? ఎందుకు లేవాలి?” అంటున్నారు. ఆ జనరేషన్‌లో సీనియారిటీకి గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి గౌరవాలేవీ లేవు.

ఆర్కే : ఎంతోమంది హాస్య నటుల సరసన చేశారు కదా..? ఎవరితో మీకు బాగా కంఫర్టబుల్‌గా అనిపించేది..?
శ్రీలక్ష్మి : నేను యాభైమంది నటుల కాంబినేషన్‌తో చేశాను. అందరికంటే సాక్షి రంగారావు, సుత్తివేలు, మల్లికార్జునరావు, బ్రహ్మానందంలతో కాంబినేషన్ బాగా కుదిరేది. సన్నివేశాలు సహజంగా పండేవి. సత్యనారాయణగారంటేనేమో కాస్త భయం. ఎందుకంటే ఆయన పెద్దనటుడు, సీనియర్ కాబట్టి. ఆయనతో ‘బృందావనం’, ‘ఆడవాళ్లా మజాకా’ అనే సినిమాలు చేశాను. రాఘవేంద్రరావుగారితో సినిమా చేస్తున్నప్పుడు మాత్రం.. చాలా స్వేచ్ఛ దొరికేది. ‘పెళ్లిసందడి’, ‘చాణక్య శపథం’, ‘పట్టాభిషేకం’ మరిచిపోలేని సినిమాలు.

ఆర్కే : ‘అబ్బ, దబ్బ, జబ్బ’ అనే మూడు మాటలతో ఒక సినిమాలో బాగా నవ్వించారు కదా..!
శ్రీలక్ష్మి : అది ‘శుభలగ్నం’. అందులో నాది మాటలు లేని పాత్ర. శోభనం రోజున కూడా ఓ పాట పాడమంటే ‘అబ్బబ్బా దబ్బబ్బా జబ్బ’ అనే పాడతాను. అది అప్పట్లో బాగా పేలింది.

ఆర్కే : ఒక సినిమాలో ఈల వేసి నవ్వించారు..
శ్రీలక్ష్మి : ‘ఆనందభైరవి’లో వేశాను. ఆ సినిమా కోసం ఈల ప్రాక్టీస్ చేశాను. థియేటర్లకు వెళ్లినప్పుడు ఈల వేయమని ప్రేక్షకులంతా గోల చేసేవారు. ఎంత ప్రయత్నించినా ఈల వేయడం వచ్చేది కాదు.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.