పాటల కోసమే నాట్లేయడం నేర్చుకున్నా

 

విమలక్క అంటే పాటను పరవళ్లు తొక్కించే అరుణోదయ కళాకారిణి మాత్రమే కాదు. ప్రజా ఉద్యమాలకే జీవితాన్ని అంకితం చేసిన పోరాట వనిత. ప్రగతిశీల విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పుడే జోగిని వ్యవస్థపై పోరాడిన «ధైర్యశీలి. చిన్న వయసులోనే ఉద్యమాల్లో తిరిగిన సాహసి. ఏ క్షణమైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఉద్యమానికి జై కొట్టడానికి ముందుండే పిడికిలి ఆమె. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమంలో ఆమె గొంతు కంచు కంఠమై మోగుతోంది. విమలక్క సొంతూరైన నల్లగొండ జిల్లాలోని ఆలేరు విశేషాలే ఈ వారం మా ఊరు.

నేను పుట్టేనాటికి(1964) మా వూరు ఆలేరుగా మారింది. అంతకుముందు దాని పేరు ఆవులేరట. ఆవులేరని ఎందుకన్నారో తెలియదు కానీ, అది వాగులు ఎక్కువగా ఉన్న ఊరని మాత్రం చెప్పాలి. మా ఊరికి రెండు వైపులా రెండు వాగులుంటాయి. ఒకటి రత్నాలవాగు, ఇంకోటి పెద్దవాగు…అదే ఆలేరువాగు. అది నిండుగా ప్రవహిస్తే ఆ ఏడాది ఫుల్లుగా వర్షాలు పడినట్టు లెక్క. అది ఉప్పొంగితే కరువు పోయినట్టు లెక్క. ఆ వాగుతో ఆలేరు బిడ్డగా నా అనుబంధం మాటల్లో చెప్పలేను. అసలది వాగులా భావించలేదు నేనెప్పుడూ. నాకో ఫ్రెండ్ అనుకునేదాన్ని. ఆదివారం వస్తే వాగులో ఇసుక ఆటలు ఆడుకునేవాళ్లం. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు (1978) ఆ ఏడాది పడిన వర్షాలకు పెద్దవాగు నిండటమే కాదు ఉప్పొంగింది. ఆ నీళ్లన్నీ చిక్కటి చాయ్‌లాగా రోడ్లమీద పరుగులు తీస్తుంటే ఊరి జనం తండోపతండాలుగా వచ్చి చూశారు. ఆ రోజు నేను జ్వరంతో ఉన్నా. అది వినాయక చవితి పండగ సమయం. సన్నగా వర్షం పడుతోంది. మా అమ్మ బయటికెళ్లొద్దని నాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది అప్పటికే. కానీ నా మనసంతా వాగు పరవళ్లను చూడాలని ఉవ్విళ్లూరుతోంది. దాంతో అమ్మకు తెలియకుండా వెళ్లి చూశాను. అది నీటి ఉ«ధృతే కావచ్చు కానీ, కంటికి ఇంపుగా కనిపించింది. అరగంట పాటు కళ్లనిండుగా చూస్తూ కూర్చున్నాను. నాకు అదొక అద్భుతమైన అనుభవం.

ఆ ఏడాది తరువాత చాన్నాళ్లు మా ఊరికి కరువు అన్నది తెలియలేదు. అప్పుడు నిండుగా ప్రవహించిన వాగు, ఆ తర్వాత 35ఏళ్ల వరకు కనీసం నిండలేదు. ఈ ఏడాది…అంటే మొన్న కురిసిన వర్షాలకు ఉప్పొంగలేదు కానీ, నిండుగా పారింది. మా అన్న ఫోన్ చేసి చెప్పాడు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఆరాటపడ్డాను. వెళ్లకపోతే ఏదో ఆత్మీయబంధాన్ని కోల్పోతామన్న ఫీలింగ్ కలిగింది. ఎంత ఆరాటపడినా ఇక్కడున్న బాధ్యతల వల్ల వెళ్లలేకపోయాను. మొదటిసారి అమ్మ వద్దని చెప్పినా వాగు చూడటానికి వెళ్లాను కానీ, ఈ రోజు నాకలా చెప్పడానికి అమ్మ లేదు. అయినా వెళ్లలేక పోయాను. అమ్మ గుర్తు రాగానే ఆ వాగు ఉప్పొంగినట్టే నా కన్నీళ్లూ ఉప్పొంగాయి. రెండేళ్ల క్రితం చనిపోయిన మా అమ్మను దహనం చేసింది కూడా ఆ వాగులోనే!

బాల్యమంతా…ఆటాపాటా
చిన్నప్పటి నుంచీ ఇంట్లోనైనా, ఊళ్లోనైనా నేను స్పెషలే. మేం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. మాకు ఇద్దరు అన్నలు. మొత్తం ఐదుగురికీ.. అమ్మే అన్నీ. కడుపులో పెట్టి సాదుకుంది. అమ్మ నర్సమ్మ కష్టజీవి. నాన్నెప్పుడూ ఉద్యమాలు అంటూ బిజీగా ఉండేవాడు.
నేను చిన్నదాన్ని కదా.. నచ్చినట్టు ఉండేదాన్ని. స్కూల్ అయిపోయిన వెంటనే ఎప్పుడూ నేరుగా ఇంటికి వెళ్లలేదు. గ్రౌండ్‌లో ఆడుకొని ఆడుకొని అలిసిపోయాక మెల్లగా ఇంటికి వెళ్లేదాన్ని. అన్ని ఆటలూ ఆడేదాన్ని. ఖోఖో, టెన్నికాయిట్, గోటీలు, చిర్రగోనె… బొంగరాలాట కూడా. మొన్నీమధ్య మా పిల్లాడికి బొంగరం కొనిచ్చి, ఎలా ఆడాలో చూపించాను. ‘భలే తిరుగుతుందమ్మా’ అని వాడెంత ఆశ్చర్యపోయాడో! నిజంగా అప్పటి నా ఆటపాటలు, అనుభవాలు తియ్యని అనుభూతులు. ఊళ్లో పీరీల పండక్కి దూల ఆడటం, తుమ్మకాయలు కాళ్లకు గజ్జెలుగా కట్టుకుని పరిగెత్తడం, ఇంటిముందున్న కాలువలో నీళ్లు లేనప్పుడు అంగడి ఆటలు ఆడుకోవడం…ఎన్నని చెప్పగలం? కోళ్లు, దూడపిల్లలు, దుడ్డెపిల్లలతో కూడా ఆటలే. అవి కంటున్నప్పడూ చూసేవాళ్లం. ఒకవేళ పుట్టిన బిడ్డ చనిపోతే ఆ పశువుల కంటి నుంచి కారే కన్నీటి ధార కూడా ఇంకా గుర్తుంది నాకు.

సంక్రాంతి పండగొస్తే పుట్టమట్టితో పెద్ద బొమ్మరిల్లు కట్టేదాన్ని. పుసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించేదాన్ని. దోస్తులను, మా అన్నయ్యలను పిలిచి భోజనం, పాశం(పాయసం) వండి పెట్టేదాన్ని. ఓ ఆడపిల్లగా, ఇంట్లో చిన్న పిల్లగా నాకెన్నో స్వీట్ మెమొరీస్! ఆంక్షలు లేని బాల్యం నాది. చదువులో నేను యావరేజి స్టూడెంట్‌నే కాబట్టి నా సమయమంతా ఆటపాటలకే. టెన్త్ వరకు ఆలేరులోనే చదివాను. ఇంటర్, డిగ్రీ భువనగిరిలో. ఆ ఐదేళ్లు కూడా ట్రెయిన్‌లో అప్ అండ్ డౌన్ చేశాను.

ఇంటినిండా జనమే ఉండేవారు
మాకు 14 ఎకరాల వరకు భూమి ఉండేది. వరి, గోధుముల, జొన్నలు, పొగాకు పండేది. వ్యవసాయం కోసం ఇద్దరు పనివాళ్లు ఉండేది. వండినప్పుడు తప్ప ఎప్పుడూ అన్నం కుండగా నిండుగా ఉండేది కాదు. ఎవరో ఒకరు వచ్చి తింటూ ఉండేవారు. అప్పట్లో ఎంతోమంది విప్లవకారులకు ఆశ్రయం ఇచ్చి, అన్నంపెట్టిన ఇల్లు మాది. సుందరయ్య, చండ్రపుల్లా రెడ్డి, పైలా వాసుదేవరావు, చంద్రన్న వంటిఎంతో మంది నాయకులకు ఆశ్రయమిచ్చింది. టాన్యా అక్క(చంద్రన్న భార్య) మా ఇంట్లోనే అరెస్టు అయ్యింది. వాళ్లది ఆంధ్ర కదా.. ఆమె భాష, యాస వల్లనే దొరికిపోయింది. నేను మా పెద్దమ్మ కూతురు అని చెప్పినా పోలీసులకు నమ్మకం కలగలేదు. నాన్న బండ్రు నర్సింహ్మయ్య రైతుకూలీ సంఘంలో పనిచేయడం వల్ల పోలీసులు ఏదో ఓ కారణం చేత మా ఇంటిమీదికి రైడింగ్ వచ్చేవారు. కొన్నిసార్లయితే మా అమ్మ నర్సమ్మ విసుగుతో పోలీసులను తిట్టిన సందర్భాలున్నాయి. నిజంగా ఆమె భయం తెలియని మనిషి. ఎప్పుడూ పోలీసులతో గొడవపడుతూ ఉండేది. నాన్న రైతుకూలీ సంఘం నాయకుడిగా జిల్లా బాధ్యతలు చూసుకునేవాడు. ఫస్ట్ మా ఇంట్లోనే రేట్లు పెంచి గిట్టుబాటు ధరల కోసం పోరాడేవాడు. మా ఇంటికి, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరమే కావడం వల్ల నాన్న జీవితం అండర్‌గ్రౌండ్, జైలు, రైతు కూలీసంఘం..ఇలా గడిచింది. మా అక్కలు, అన్నల పెళ్లిళ్ల్లకు కూడా నాన్న పెరోల్ మీద వచ్చి వెళ్లేవాడు.

గంప నింపుకోవాలనుకున్నా
పొలం పనులు పూర్తయి, కల్లం లేసిన తరువాత ఇంటి ఆడబిడ్డలు గంప నింపుకుంటారు. అంటే వడ్లను ఓ గంపలో నిండుగా నింపుకుని తీసుకుంటారు. అది వాళ్లకే ప్రత్యేకం. అయితే అది ఇంటికి పెద్దవాళ్లెవరో వాళ్లే తీసుకుంటారు. కానీ ఓసారి నాకూ కావాలని పట్టుబట్టాను. ‘నువ్ చిన్న పిల్లవు. నీకవసరం లేద’ని నాన్న చెప్పినా వినలేదు. దాంతో ‘గంప నింపుకో. కాని దానితో పాటు చిన్న దొయ్యలో నాటేసి పంట పండించుకో’ అన్నాడు. సరే అన్నా. నాటేసే టైమ్ వచ్చింది నా దొయ్యలో నేనే నాటువేస్తున్నా. గర్వంగా ఉంది నాకు. సగం అయిపోయిన తర్వాత ఆ బురదలో చేతికి రాయి తగిలి సగం గోరు లేచిపోయింది. వేలు తెగి రక్తం కారుతుంటే ఏడుస్తూ బయటకొచ్చాను. ‘కష్టం ఏమిటో అర్థమైందా? గంప నింపుకోవడం అంటే వడ్లు తీసుకోవడం కాదు బిడ్డా. కష్టాన్ని ఇష్టపడటం’ అని చెప్పాడు నాన్న. ఆయన ఉన్నతంగా ఆలోచించేవాడు. వస్తు వ్యామోహం ఉండొద్దని చెప్పేవాడు. అందుకే ఇంటర్మీడియెట్‌లో కూడా నేను రెండు జతల బట్టలతోనే సర్దుకోవాల్సి వచ్చింది.

పండగంటే బతుకమ్మే
మా ఇల్లు, వాకిలి, వరండా పెద్దగా ఉండేవి. వాకిట్లో సంక్రాంతికి ముగ్గులేయాలంటే నాలుగైదు గంటల సమయం పట్టేది. నేను చిన్నప్పుడు బాగా ఇష్టపడి చేసిన పనుల్లో ముగ్గులేయడం కూడా ఒకటి. పండగల విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సింది బతుకమ్మ గురించి. బతుకమ్మ కోసం ప్రతి పనినీ చాలా ఇష్టంగా చేసేదాన్ని. మా ఊరికి మూడు కి.మీ.దూరంలో మా చెలుక ఉండేది. పువ్వుల కోసం అక్కడిదాకా వెళ్లేదాన్ని. వారం ముందు నుంచే గునుగు పువ్వు, ముత్యాలపువ్వులు సేకరించేదాన్ని. ఇంట్లో దాచుకుని వాటిమీద తడిగుడ్డ వేసి కాపాడుకునేదాన్ని. నా చిన్నప్పుడు ఒకసారి నా ఎత్తు బతకమ్మను పేర్చింది అమ్మ. అందుకే మా ఊళ్లో అందరి కంటే పెద్ద బతుకమ్మ మాదే ఉండాలని నా కోరిక. అప్పుడు రంగులు కూడా సహజమైనవే. బ్రహ్మజెముడు కాయల గుజ్జును పిసికితే మెరూన్ కలర్ రంగు వచ్చేది. ఆ రంగునే వాడేవాళ్లం. తంగేడు పూవు, బ్రహ్మజెముడు కాయల కోసం తెగ తిరిగేవాళ్లం. అది ఆడపిల్లల పండుగ కదా. పెద్దక్క అరుణ, చిన్నక్క జయక్క ఇద్దరినీ వాళ్ల అత్తగారింటి నుంచి పండక్కి నేనే తీసుకొచ్చేదాన్ని. ఒక్కోసారి వాళ్లు రాకపోతే ఏడ్చుకుంటూ ఇంటికొచ్చేదాన్ని. ఏమైనా సరే బతుకమ్మ పండగకు మా అక్కలు మా ఇంట్లో ఉండాలనుకునేదాన్ని. మా కురుమ వాడలో ఆడే బతుకమ్మ ఆటే మా ఊరందరికీ హైలైట్. ఎగ్గిడి బీరమ్మ అని ఒక పెద్దావిడ చాలా బాగా పాటలు పాడేది. తర్వాత నేను పాడేదాన్ని.

పాట కోసం
చిన్నప్పుడు పొలం గట్లపై కూర్చుండి కూలీలు నాటేస్తూ పాటలు పాడుతుంటే వినేదాన్ని. మనసుకు ఎంతో హాయిగా ఉండేది. అయితే వాళ్లు నాటు వేస్తూ వేస్తూ గట్టుకు దూరమైపోతుంటే నాకు పాట సరిగా వినబడదనే ఆతృతతో నేను కూడా పొలంలోకి దిగి వాళ్లతో పాటు నాటువేస్తూ పాటలు వినేదాన్ని. అలా చాలాసార్లు చేయడం వల్ల నాటు వేయడం కూడా పూర్తిగా వచ్చేసింది. మా ఊరే నాకు మనోబలాన్ని, జన బలాన్ని ఇచ్చింది. ఈ నిర్బంధాలు, పోలీసు దాడులు, ఉద్యమాలు అన్నీ ఊళ్లో ఉన్నప్పటి నుంచే పరిచయం. నా ఫస్టు పాట మొదలైంది కూడా ఆలేరులోనే. ఇప్పుడు ఆ ఊరు నాకేమిచ్చింది అనే కంటే నా ఊరికి నేనేమి ఇవ్వగలను అని ఆలోచిస్తున్నా. నాకు ఏది సాధ్యమైతదో, నేనేం చేయగలనో వంద శాతం చేయడానికి ప్రయత్నం చేస్తా! ఈ మధ్య జరిగిన మా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 70 మందిమి కలిశాం. ఆ వేడుకకు నా జీవన సహచరుడు అమర్‌ను కూడా తీసుకెళ్లాను. మా ఊరు గురించి, అక్కడున్న విద్యావంతుల గురించి తెలిశాక అసలిది అలేరు కాదు…అ ఆ ల ఏరు అని ఉద్వేగంగా మాట్లాడాడు. అదే వేడుకలో మా ఊరు కోసం ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఆ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఊరుకు దూరంగా ఎవరు, ఎక్కడున్నా వాళ్లు సొంతూరు గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన పునాదులు, ఆటలు, పాటలు, జీవితం మొదలైంది అక్కడే కదా.

ఊరి విషాదం

ఆ కాలంలో తెలంగాణలో చాలా చోట్ల ఉన్నట్టే దొరల పెత్తనం, రెడ్డి దౌర్జన్యాలు మా ఊళ్లో కూడా ఉండేవి. ఓ టైమ్‌లో ఊళ్లో భూమి కోసం పోరాడుతున్న ఓ ముస్లిం ఫ్యామిలీ మొత్తం హత్యకు గురైంది. వాళ్లతో నాది మంచి అనుబంధం ఉండేది. అయితే ఆ శవాలను చూసే పరిస్థితి కూడా లేకుండే. అయినా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి చూసొచ్చాను. నాకు ఎన్నో తీపిగుర్తులు పంచిన మా ఊరు అలాంటి ఒక విషాదాన్ని కూడా ఇచ్చింది.

అందరూ చుట్టాలే

ఊరంతా వరసలతో పిలుచుకునేవాళ్లం. గౌడ్స్‌తో మాకు ఎక్కువ అనుబంధం. వాళ్లంతా తాతలు, మామలు మాకు. నన్ను ‘ఇమ్లవ్వా..’ అని ప్రేమగా పిలిచేవారు. ఇప్పటికీ నేను ఊరెళితే అదే ఆప్యాయత, అదే పలకరింపు. నేనూ అంతే దగ్గరకెళ్లి వాళ్లతో పాటు అరుగు మీద కూర్చుండి కాసేపు మాట్లాడి వస్తాను. నిజానికి మనం ఎలాంటి స్థాయిలో ఉన్నా సొంతూళ్లో, మనవాళ్ల మధ్య అరుగు మీద కూర్చుండి ముచ్చట్లు పెట్టుకోవడంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా దొరకదేమో!

మా ఇంటిముందున్న స్థూపం అమరుల గుర్తు..
1948 నవంబర్ 28న రజాకార్లకు వ్యతిరేకంగా రైతుకూలీలందరూ ఊరేగింపుగా రావాలని ఓ పిలుపు ఇచ్చారట. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో 13మంది అమరులయ్యారు. వాళ్ల జ్ఞాపకార్థం మా వాకిట్లో స్థూపం కట్టించాడు నాన్న. ఇప్పటికీ ఉందది.

-మయన్న

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.