విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -18
మహా మేధావి ఆర్య చాణక్యుడు ( కౌటిల్యుడు )
చాణక్యుడు పేరు వినగానే మౌర్య సామ్రాజ్య స్తాపకుడు చంద్ర గుప్తుడిని మగధ రాజ సింహాసనం పై తన చాణక్య ప్రతిజ్నతో చక్ర వర్తి గా ప్రతిష్టించి ,క్రూర నంద వంశ సర్వ నిర్మూలనం చేసి ,తన ప్రత్యర్ధి ,నంద రాజ మహా మంత్రి ఆర్య రాక్షసామాత్యుడిని చంద్ర గుప్త మౌర్యునికి మహా మంత్రిగా నియమింప జేసి హాయిగా చరమ జీవితాన్ని సాగించి రాజ్య పాలన, శిక్షా ,సంస్క్రుతులకోసం నేర విచారణ నిమిత్తం ‘’కౌటిల్యం ‘’రాసిన మహా ప్రజ్ఞాని ,రాజకీయ శాస్త్రాజ్నుదు జ్ఞాపకం వచ్చి మనస్సు కై మోడ్పు లర్పిస్తుంది .చాణక్య చంద్ర గుప్తుల అను బంధం చిరస్మరణీయం .చాణక్యుడు 370 b.c.లో జన్మించి 280 b.c. లో మరణించాడు
వేదం సారాన్ని వంట బట్టించుకొన్న చాణక్యుడు’’అర్ధ శాస్త్రం ‘’పేర రాజ నీతి శాస్త్రాన్ని కరదీపికగా తీర్చి దిద్దాడు .గద్యలో రాసినా అందులో380శ్లోకాలున్నాయి .ధర్మార్ధ కామ మొక్షాలలో రెండవది అయిన అర్ధానికి విశేష ప్రాచుర్యం కల్పించాడు .జాతికి రాజు ,ప్రజలు
యెంత బాధ్యతలో ప్రవర్తించాలో తెలియ జెప్పిన శాస్త్రంఇది .చాణక్య అనుభవ, మేధో జనితం .
అర్ధ శాస్త్రం లో పది భాగాలున్నాయి . .సమస్త పరిపాలనామ్శాలను ఇందు పొందు పరచాడు .కఠినంగా అత్యత స్పష్టం గా ప్రతి విషయాన్నీ వివ రించాడు .చాణక్య ఉచ్చిస్టం కాని అంశం ఏదీ లేదని మహా రాజనీతి శాస్త్రజ్ఞుల చే పొగడ్త లందుకొన్న గ్రంధం . అందరికి అవసరమైన కొన్ని విషయాలను అతి సూక్ష్మంగా తెలుసు కొని ఆయన ప్రతిభ కు జోహారు లర్పిద్దాం .
స్వంత వారి పట్ల ఎలా మెలగాలి అనే దానిపై చెబుతూ –ఎప్పుడూ హద్దులు దాట రాదనీ క్రూరురాలైనా తల్లిని క్షమించాలి ,విషం తో ఇబ్బంది కలిగించిన వాడి ఒక చెయ్యి ఖండించాలి .
ఉత్సుకత గురించి వివరిస్తూ ఉత్సాహ వంతుడికి శత్రువు కూడా అభిమాని అవుతాడు .బద్ధకస్తుడికి ఈ లోకం లోను ,పరలోకం లోను స్తానం ఉండదు .శత్రువు కొట్టరాని చోట గాయం చేసినచొ వారిని దూరంగా పెట్టాలి .
కార్య సాధన విషయం లో –పని చేయని వాడి ఆశ్రితులను కూడా దూరం గా ఉంచాలి ప్రత్యక్ష ,పరోక్ష అనుమాన పరీక్షలు చేసి ఏదైనా నిర్ధారించాలి సుస్టుగా అన్నార్తులకు భోజనం పెట్టి శేషాన్ని తానూ తిని సంతృప్తి చెందాలి .
ప్రవర్తన విషయం లో బలహీనుడు బల వంతుడిని ఆశ్రయించాలి .రాజుకు వ్యతిరేకం గా ప్రవర్తించ రాదు .చతురంగ బలాలున్నా ఇంద్రియ నిగ్రహం లేని వాడు విజేత కాలేడు .
వ్యవహారం లో మనల్ని ఆపదలోను అంటి పెట్టుకొని ఉన్న వారిని నమ్మి ప్రోత్సహించాలి .మన అధీనం లో లేని దాని పై ఆశ -బద్దకస్తుల పనే .శక్తితో సాధించి మాత్రమె రాజ్య పాలన చేయాలి .
పునాదులు ఎలా ఉండాలో వివరిస్తూ అర్ధానికి ధర్మం ప్రాతి పదిక కావాలి .వృద్ధుల సేవ నీతులలో ముఖ్యమైనది .జ్ఞానం పొందిన వాడు ఆత్మను జయించిన వాడవుతాడు .
విధానాలు నాలు వ్యూహాల గురించి చెబుతూ –అన్ని పనులకు ఆలోచనే మూలం గా ఉండాలి .మంచి ఆలోచన లేని మంత్రాంగం వ్యర్ధమే అవుతుంది విజయం చేకూర్చదు
అవసరమైన ,అర్ధ వంతమైన ఆలోచనలు చెప్పి, కార్య శూరత కు ప్రోత్సహించే వారే నిజ మైన మంత్రులు .
సంబంధాలు ఎలా ఉండాలి ?శక్తి సామర్ధ్యాలే అవతలి వారితో మంత్రాన్గానికి అర్హతలు .బల వంతుడి తో యుద్ధం ఏనుగు మీద కూర్చున్న వాడితో పాద చారి చేసే యుద్ధం లాటిది .విపత్కర స్తితిలో కూడా ధైర్యం కోల్పోరాదు.
కార్య నిర్వహణాధికారి –పని చేయటం లో సామర్ధ్యం మెలకువ ఉన్న వారినే ఆ పనిలో నెల కోల్పాలి .సరైన ఇంగిత జ్ఞానం ఉన్న వాడు కష్ట సమయం లోను సమర్ధం గా పని చేసి కార్య సాధకుడవుతాడు .చేతకాని చవటకు ఏ బాధ్యతలూ ఇవ్వద్దు .
పని చేయటం లో –ఉపాయం తో చేసే ఏ పనీ వ్యర్ధం కాదు .కార్యాన్ని పురుష కార్యం తోనే సాధించాలి .ముందే ఆలోచించి పని ప్రారంభించాలి .
నైతికత –దుర్జన ,దురాశా పరులు రాజు లైతే ప్రజా పీడకులౌతారు .న్యాయ ధర్మాలతో పాలించే వాడిని ప్రజలు తమ తల్లి గా పూజ్య భావం తోపూజిస్తారు .అధర్మ బుద్ధి ఆత్మ వినాశకుడే అవుతాడు .
చాణక్యుడు ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న రావల్ పిండి దగ్గర ఉన్న తక్ష శిలా విశ్వ విద్యాలయం లో విద్యార్ధిగా చదివి అక్కడే ఆచార్య పదవి పొంది ,ఆర్య చాణ క్యుడని పించుకొన్నాడు .తరువాత కాశీ విశ్వ కళా పరిషత్ లో దేశం లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఉద్దండ పండితులను ఓడించి ,అఖండ మతి మంతుడిగా మన్ననలు పొందాడు …మాత్రుదేశమైన భారత దేశాన్ని సంరక్షించ టానికి గ్రీకు దండ యాత్రలను ఎదుర్కో వటానికి నంద రాజ వంశాన్ని సమూలం గా నాశనం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్తాపించి శిష్యుడైన చంద్ర గుప్తుని చక్ర వర్తిని చేశాడు .చివరికాలం పాటలీ పుత్రం లో గడిపాడు .ఈయన గోత్రం ‘’కుటిల ‘’అని అందుకే కౌటిల్యుడు అయ్యాడని కొందరు అన్నారు .తండ్రి పేరు చణకుడు కనుక చాణక్యుడు అయ్యాడని కొందరి వాదన .గ్రీకుల ఆకాంక్ష ను మొగ్గ లోనే తున్చేసిన ఘనత చాణ క్యుడిదే .
చాణక్యుడు ఆంధ్ర సామ్రాజ్యం లో శాతవాహనుల కాలం లో ఉన్నాడని అప్పుడే ‘’కామ సూత్రాలు ‘’రాశాడని ఆ గ్రంధం లో రాసుకొన్నాడు .శృంగారం పై ప్రపంచం మొత్తం మీద వచ్చిన గ్రంధం ఇదే .ఇవే
‘’వాత్సాయన కామ సూత్రాలు’’ అని పిలువ బడుతున్నాయి .అయితే దీన్ని మన చరిత్రకారులు అంగీకరించలేదు .
కౌటిల్యుని అర్ధ శాస్త్రం అనేక దేశ విదేశీ భాషల్లోకి అనువాదం పొందింది .1909లో ‘’శ్యామ శాస్త్రి’’ అనే పండితుడు అర్ధ శాస్త్రానికి వ్యాఖ్యానం రాసి వెలుగు లోకి తెచ్చే దాకా మన వాళ్లకు దీని గురించి పెద్దగా తెలియ లేదు .జర్మని విశ్వ విద్యాలయాలలో అర్ధ శాస్త్రం లోని ‘’విదేశీ సంబంధాలు ‘’బోధనాంశాలుగా బోధిస్తున్నారు .’’అర్ధ శాస్త్రం లోని సూత్రాలు అన్ని కాలాలలో మానవ జాతికి దైనందిన ఆచరణ లో ఆచరణ యోగ్య మైనవి ‘’అని జర్మనీ యూని వర్సిటి ప్రొఫెసర్లు ప్రస్తుతించారు .
ఎప్పుడో క్రీ.పూ.321-185నాటి మౌర్య సామ్రాజ్య పాలనా ,ఆ నాటి సామాజిక స్తితులు ప్రతి బిమ్బింప జేసే గ్రంధ రాజం కౌటిల్యం .అర్ధ న్యాయ ,నీతి,ధర్మ ,శిక్ష ,దండన ,పాలన వ్యూహాలా వంటి వివిధ అంశాలను కూలం కషం గా చర్చించి అందరికి మార్గ దర్శ కం గా ఈ నాటికీ ఉపయోగం లో ఉన్న రాజ నీతి శాస్త్రం చాణక్యుల వారి ‘’అర్ధ శాస్త్రం.’ ‘
mourya chandra gupta chaanakya shapadham
‘’మనుష్యుల జీవితాలకు మూలం అర్ధం అంటే ధనం లేదా మనుష్యులతో కూడిన భూమియే ‘’అర్ధం ‘’.అలాంటి భూమిని సంపాదించే ఉపాయాలు ,పరి పాలించే ఉపాయాలు కు సంబంధించిన శాస్త్రమే అర్ధ శాస్త్రం ‘’అని చాణక్యుడే వివరణ ఇచ్చాడు .’.ఇందులో 15అధికరణాలు 149,అధ్యాయాలు ,180 ప్రకరణాలు ఉన్నాయి .గ్రీకు తత్వ వేత్తలు రాజ నీతి ని అభి వృద్ధి చేస్తే ,మన అర్ధ శాస్త్రం రాజ నీతి శాస్త్ర ప్రాముఖ్యతను తెలియ జేసింది .దైనందిన పరిపాలన లో రాజు తీసుకోవలసిన జాగ్రత్తలను ఇంత వివరం గా తెలియ జేసినశాస్త్రం ప్రపంచం లో ఎక్కడా లేదు .గూఢ చార యంత్రాంగం, అవినీతి అంతం చేసే విధానాలు చాణక్యుడు వివరించాడు .ఉద్యోగుల నియామకం వారి అర్హతలు ,నాణాల పరీక్ష ధనా గార నిర్వహణ ,కింది ఉద్యోగుల పై పర్య వేక్షణ ,ప్రభుత్వ నిర్వహణ లో ఉన్న30 శాఖలు వాటి అధిపతులు వారి బాధ్యతలు అకౌంటెంట్ ల బాధ్యతలు ఒకటేమిటి సమస్తం చాణక్యుడు స్పృశించాడు .’’ఇన్ఫోసిస్ ‘’కు అధినేత నారాయణ మూర్తి ‘’అర్ధ శాస్త్రం ‘’లోని వివిధ అంశాలు ఈ నాటి ఆధునిక సాంకేతిక రంగం లో ఎలా తోడ్పడుతున్నాయో సవివరం గా ప్రతి ఆదివారం ఆంద్ర జ్యోతి లో సీరియల్ గా రాస్తున్నారు .అంటే కౌటిల్యుని అర్ధ శాస్త్రానికి కాల దోషం పట్టా లేదన్న మాట
ఆయన చెప్పిన రెండు హితోపదేశాలు సార్వ కాలిక మైనవి –అవి
1-‘’ప్రజా సుఖే సుఖం రాజః ప్రజానాం చ హితే సుఖం
నాత్మ ప్రియం హితం రాజః ప్రజానాం తు ప్రియం హితం ‘’
అంటే ప్రజల సుఖమే పాలకుడైన రాజు సుఖం .వారి సంక్షేమం లోనే ఆయన సంక్షేమం ఇమిడి ఉంటుంది .తనకు నచ్చింది చేసి, మంచి అనుకోరాదు .ప్రజలకు మేలు చేకూర్చేది, హితమైనది మాత్రమె రాజును తృప్తి పరచేదిగా ఉండాలి .
2—‘’కోహి భారః సమర్దానాం –కిం దూరం వ్యవ సాయినాం
కో విదేశః విద్యానాం కః –పరః ప్రియ వాదినాం’’
అంటే-సమర్ధులకు ఏదీ భారం గా అని పించదు.వర్తకులకు దూర దేశం అనేదే లేదు .చదువుకొనే వారికి విదేశం అంటూ ఏదీ ఉండదు .ప్రియమైన మాటలు చెప్పే వారికి పరాయి వారు ఉండరు .సమర్ధులు దేని నైనా సాధిస్తారు .వారికి అసాధ్యం అనేది ఉండదు ..
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-11-13- .ఉయ్యూరు