
వఝ్జా సాంబశివరావు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కాని బిట్స్ పిలానీ డైరెక్టర్ ‘వీఎస్ రావు’ అంటే మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలవారు కూడా సులువుగా గుర్తు పడతారు. ఎన్నో ఏళ్లు రాజస్థాన్‌లోని పిలానీ క్యాంపస్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ‘నువ్వు ఏ పనైనా చెయ్యగలవు’ అన్న స్ఫూర్తిని నింపిన సొంతూరు తుళ్లూరు గురించి ఆయన చెబుతున్న విశేషాలే ఈ వారం ‘మా ఊరు’
“మా ముత్తాత ప్రకాశం జిల్లాలోని ఏదో గ్రామం నుంచి గుంటూరు జిల్లాలోని తుళ్లూరుకు వచ్చారట. ఆమాట అలాఅలా విన్నదే. మా తాత కాలం నుంచి మాది తుళ్లూరే. మా నాన్న వెంకటపతిరావు సామాన్య రైతు. పది ఎకరాల పొలం ఉండేది. మా అమ్మ అనసూయమ్మదీ తుళ్లూరే. మా ఇంటికీ మా తాతగారింటికీ మధ్య దూరం – రెండు మూడిళ్లే. అంతేకాదు, ఊళ్లో సగం మంది ఏదో వరసన మాకు బంధువులే. మాకు దగ్గర్లోని పెదకాకానిలో భ్రమరాంబ స్వామి దేవాలయం ఉంది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అది ముఖ్యమైన గుడి. ఆ గుళ్లోని శివుడి వల్లే నాకు సాంబశివరావనే పేరు పెట్టారు.
బంధుప్రీతి అలవడింది
మా నాన్నకున్నది పదెకరాలే అయినా, మరో ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవారు. తర్వాత స్నేహితులతో కలిసి రైసు మిల్లు పెట్టారు, ఆ తర్వాత పొగాకు కంపెనీ పెట్టారు. చెప్పొచ్చేదేమంటే – మాకు ఏదీ లోటుండకూడదని, మేం దర్జాగా పెరగాలన్న ఉద్దేశంతో ఆయన చాలా శ్రమించేవారు. ఆయన పెద్దగా చదువుకోలేదు గాని తెలుగు చక్కగా రాయడం, చదవడం వచ్చిన మనిషి. రాత్రి పూట భోజనాలయ్యాక మా నాన్న గొంతెత్తి భాగవత పద్యాలు పాడితే వింటూ నిద్రలోకి జారుకోవడం నాకొక అద్భుతమైన జ్ఞాపకం. బంధుప్రీతి ఆయనలో చెప్పుకోదగ్గ మరో లక్షణం. దాంతో మా ఇల్లు నిత్యం బంధువులతో కళకళలాడుతూ ఉండేది. వాళ్లకు స్నానాలకు వేణ్నీళ్లు పెట్టడం, భోజనంలోకి ప్రత్యేకంగా ఏదోకటి చేయించడం – ఇలాంటి మర్యాదలన్నీ మాకు నేర్పించారాయన. బహుశా ఆ ప్రభావం వల్లనే నేను బిట్స్ పిలానీ డైరక్టర్ అయ్యాక కూడా మా క్యాంపస్‌లో చదవడానికి వచ్చే ప్రతి విద్యార్థి గురించి, లెక్చర్లకు, సెమినార్లకు వచ్చే అతిథుల గురించి బాగా చూసుకోవడం అలవాటైంది. విద్యాసంబంధ విషయాలే కాకుండా, క్యాంపస్‌లో ఉన్నంతసేపూ వాళ్లకు కావలసినవన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది జాగ్రత్తగా పట్టించుకుంటాను.
వానాకాలం కష్టాలు
మా ఊరి చుట్టూ చాలా వాగులుండేవి. వానాకాలంలో అవన్నీ పొంగి ప్రవహిస్తూ ఉండేవి. దాంతో ఆ కాలంలో మా ఊరొక ద్వీపాన్ని తలపించేది. రాకపోకలు పూర్తిగా బంద్. వచ్చే ఒక్క బస్సు కూడా వచ్చేది కాదు. విజయవాడ వెళ్లాలన్నా, గుంటూరు వెళ్లాలన్నా కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి మరీ అత్యవసరమైతే కృష్ణానది వరకూ నడిచి వెళ్లి అక్కడ పడవెక్కి విజయవాడ వెళ్లేవాళ్లం. అలాంటి వానాకాలంలో ఒకసారి మా నాన్న నన్ను భుజాల మీద ఎక్కించుకుని వాగు దాటడం నాకు లీలగా గుర్తుంది. మా ఊళ్లో టూరింగ్ టాకీస్ ఒకటి ఉండేది. అది కూడా వానాకాలం వస్తే ఎత్తేసేవారు. అందులో ఎన్టీఆర్ సినిమాలను చూడటం గొప్ప సరదాగా ఉండేది. ఎన్టీఆర్ అంటే నాకెంత ఇష్టమో చెప్పలేను. ఇప్పటికీ నేను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ నాలోకి ఆవహించినట్టు ఫీలవుతుంటాను.
చెరువులో బడి
ఊరికి దగ్గరగా ఒకటే పెద్ద మంచినీటి చెరువుండేది. దాన్ని మూడు భాగాలుగా విభజించారు. ఒక కట్ట కట్టి చాకలి రేవును విడదీశారు. మరో భాగంలో స్కూలు కట్టారు. అందుకని మా బడి చెరువులో ఉన్నట్టుండేది. పెద్ద వానలు పడితే మునిగిపోయేది. వానలు తగ్గిన చాలా రోజుల వరకూ చుట్టూ బురదబురదగా ఉండి క్లాసుకు వెళ్లలేకపోయేవాళ్లం. అందుకే మావి వానాకాలం చదువులని స్నేహితులంతా కలిసినప్పుడు నవ్వుకుంటుంటాం. చిన్న తరగతులు పూరిపాకల్లో నడిస్తే, పెద్ద క్లాసులు భవనపు గదుల్లో నడిచేవి. ఒక్కో తరగతీ పాసయి పైకి వెళుతుంటే ఆ గదుల్లో కూర్చుని చదువుకోవచ్చని ఎంతో సంతోషంగా ఉండేది. మాకు చదువు అనేది రోజువారీ చేసే రకరకాల యాక్టివిటీల్లో ఒకటి. అదే పూర్తిస్థాయి యాక్టివిటీ కాదు. అందువల్ల ఒత్తిడి అంటే ఏమిటో తెలియకుండా, ఆడుతూపాడుతూ చదువుకునేవాళ్లం. మా ఊరికి కృష్ణా నది నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సెలవులొస్తే చాలు నది ఒడ్డుకు వెళ్లి హాయిగా ఆటలాడుకునేవాళ్లం.
‘యూ కెన్ డూ ఇట్’ అంటుంది…
మా ఊరికి పచ్చని చీర సింగారించినట్టుగా చుట్టూ నిమ్మ, అరటి, జామ తోటలు ఉండేవి. ఖాళీ దొరికితే చాలు, ఆ తోటల్లోకి వెళ్లిపోవడం, కావలసినన్ని పళ్లు తినడం, ఆడుకోవడం. ఇదే మా పని. దాగుడుమూతలు, నేలాబండా, డౌన్చార్ – పప్పుచార్లాంటి ఆటలెన్నో. మరీ పసిపిల్లలు మా ఆటల్ని చూస్తూ ఉండేవాళ్లు. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. బోలెడంత మంది పిల్లలం కలిసి పరుగులు పెడుతూ ఆడుకునేవాళ్లం. కాబట్టి పదిమందిలో మెలగడం, అక్కడ వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం – ఇవన్నీ అలవడేవి. కాని ఇప్పటి పిల్లలు ఒంటరిగా కూర్చుని వీడియో గేములు ఆడుకుంటున్నారు. మరి పైన చెప్పిన లక్షణాలన్నీ బాలలకెలా వస్తాయని ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. మా చిన్నప్పుడు ఊరికి విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. సాయంత్రం ఆరవుతూనే అన్నాలు తినేసి ట్యూషన్ మాస్టారింటికి వెళ్లి చదువుకునేవాళ్లం. అందరం కలిసి చదవడం గొప్ప సంతోషంగా ఉండేది. ఆటపాటలైనా, పాఠాలు చదవడమైనా అందరూ కలిసి చెయ్యడం వల్ల ఒత్తిడి ఉండేది కాదు. ఎదుగుతున్నకొద్దీ మాట, నడక వచ్చినట్టుగా టీమ్ స్పిరిట్ కూడా సహజంగా వచ్చేసేది. ఊళ్లో పెళ్లో ఇతర శుభాశుభ కార్యాలో జరిగితే ఇప్పట్లాగా గదిలోకి పోయి తలుపులు బిడాయించుకుని చదువుకోమని చెప్పేవారు కాదు పెద్దవాళ్లు. ఆ కార్యక్రమాల్లో ఎవరి వయసుకు తగినట్టు వాళ్లకు ఏదో ఒక పని చెప్పేవారు. అందువల్ల ఆ వయసు నుంచే కార్యభారాన్ని శక్తి కొద్దీ పంచుకోవడం, నిర్వహించడం కూడా వచ్చేది పిల్లలకు. ఇప్పుడు ఆలోచిస్తే ‘యూ కెన్ డూ ఇట్’ అన్న స్ఫూర్తిని అంత చిన్నతనంలోనే నింపడం అన్నమాట అది. ఇదీ పల్లెటూరు చేసే మేలు.
ప్రసాదాల కోసం ఎదురుచూపులు
గుంటూరు జిల్లా అంటేమండే ఎండలకు ప్రసిద్ధి. కాని నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో మా ఊళ్లో వాతావరణం చాలా బాగుండేది. సంక్రాంతి ముందు గొబ్బెమ్మల కోసం ఆవు పేడ సేకరించడానికి నానా పాట్లూ పడేవాళ్లం. మేం ఊరంతా తిరిగి ఆవు పేడ సేకరిస్తే, ఆడపిల్లలు వాటితో గొబ్బెమ్మలు పెట్టి మురిసిపోయేవారు. అది ధనుర్మాస సమయం కూడా కావడంతో మా ఊళ్లోని రామాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల్లో వేకువ జాము నుంచే పూజల హడావుడి మొదలయ్యేది. ఆ వాతావరణాన్ని తల్చుకుంటే మనసులో ఎంత ప్రశాంతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు భక్తిభావమంటూ ఏముంటుంది, ప్రసాదాల మీద ధ్యాస తప్ప? ధనుర్మాసంలో దేవుళ్లకు పులిహోర, దద్దోజనం, చక్రపొంగలి అంటూ రకరకాల పదార్థాలు నైవేద్యం పెట్టేవారు, తర్వాత వాటిని అందరికీ పంచిపెట్టేవారు. ఆ ప్రసాదాల కోసం గుళ్ల చుట్టూ తిరిగేవాళ్లం. వాటి రుచి ఇప్పుడు తల్చుకున్నా నోట్లో నీళ్లూరుతాయి. సాయంత్రం చీకటి పడ్డాక చిరు చలిలో దేవుళ్ల ఊరేగింపులు జరిగేవి. ఊరుఊరంతా వాటిలో తప్పకుండా పాల్గొనేవారు. తర్వాత చెరువులో తెప్పోత్సవం చేసేవారు. దాన్ని చూడటం భలే బాగుండేది. సంక్రాంతికి ఊళ్లో కోడి పందేలుండేవిగాని ఇతర ప్రాంతాల్లోలాగా ఎక్కువ డబ్బు పందేలు కాయడం, లేదంటే పరువు కోసం హోరాహోరీ పోట్లాడటాలు ఉండేవి కాదు. అదొక వినోదంగా నడిచేది అంతే.
మట్టితోనే మహా ప్రీతి
మా ఊళ్లో సంక్రాంతి తర్వాత గొప్పగా చేసుకునే పండగ వినాయక చవితి. బడి పిల్లలు ఊరంతా తిరిగి గ్రామస్థుల దగ్గర్నుంచి చందాలు వసూలు చేసేవాళ్లం. ఊరి చెరువు ఒడ్డున ఒక సత్రం ఉండేది. అక్కడ పిల్లాపెద్దా అందరూ కలిసి మట్టితో పెద్ద గణపతిని తయారుచేసేవాళ్లం. ఊరంతటికీ అదొక్కటే గణపతి ప్రతిమ. ఇళ్లలో పూజలు అయిపోయాక సాయంత్రం నుంచి ఊరి వాళ్లంతా వచ్చి గణపతిని దర్శించుకునేవారు. మూడో రోజున ఎడ్లబండిని అలంకరించి గణపతిని దానిమీదికి ఎక్కించి ఊరేగించేవాళ్లం. ఇప్పట్లాగా మైకులు, సినిమా పాటల హోరు ఏమీ లేకుండా ఆ ఊరేగింపులో భజనలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ నడిచేవాళ్లు అందరూ. తర్వాత చెరువులో నిమజ్జనం చేసి ఎవరిళ్లకు వాళ్లు చేరుకునేవాళ్లం. వినాయకచవితి రోజు సాయంత్రం అప్పుడప్పుడు ఏదైనా నాటకం వేసేవాళ్లం. నేనొకసారి రామాయణంలో సీతగా వేశానని గుర్తు. శ్రీరామనవమి వస్తే మా ఊళ్లోని రామాలయం దగ్గర పెద్ద జాతర జరిగేది. రకరకాల తినుబండారాల దుకాణాలు, రంగులరాట్నం వంటి వినోదాలు, ఆటలు – ఆ కోలాహలమే వేరు.
గొడవల్లేని ఊరు
నాకు ఊహ తెలిసే నాటికి మా ఊళ్లో ఐదు వేల జనాభా ఉండేది. అన్ని కులాలవాళ్లూ ఉండేవారు. పాతతరం పద్ధతిలో మా ఊళ్లోనూ అందరూ వరసలు పెట్టి పిలుచుకునేవారు. పేర్లు పెట్టి మాట్లాడుకోవడం అప్పట్లో ఎవరూ చేసేవారు కాదు. మా ఊరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఏ రకమైన గొడవలూ లేని ఊరు. సాధారణంగా రాజకీయాలో, కులమతాలో, పేదాగొప్పా తేడాలో, ఏదో ఒక రకమైన గొడవలు, మాటపట్టింపులు ఉండకమానవు. కాని మా ఊరు వాటన్నిటికీ అతీత ం. అప్పటికీ ఇప్పటికీ మా ఊరిది అదే తీరు. మా ఊరిప్పుడు మండల కేంద్రం అయింది. పల్లెటూరి రూపురేఖలు మారిపోయి చిన్నపాటి టౌన్లాగా అనిపిస్తోంది. అయినా తన ప్రత్యేకతను నిలుపుకుంటూనే ఉంది, అక్కడ పుట్టినవాళ్లను పెద్దవాళ్లుగా మలుస్తూనే ఉంది.
విద్యార్థుల కోసం…
మా అక్క, బావగార్లతో పాటు మా అమ్మ ఊళ్లోనే ఉంటోంది. మేం రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్నన్ని ఏళ్లూ, ప్రతి వేసవి సెలవులకూ మా ముగ్గురమ్మాయిలూ తుళ్లూరొచ్చి నెల రోజులుండి నాన్నమ్మ, మేనత్తలతో గడిపి వెళ్లేవారు. అన్ని రకాలుగా బాగున్న మా ఊరు విద్యా రంగంలో కాస్త వెనుకబడిందన్న బాధ నాలో ఉంది. ఆ లోటు లేకుండా నా తర పు నుంచి ఏదైనా చెయ్యాలని ఆలోచిస్తున్నాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలతో మొదటి అడుగు వేద్దామనుకుంటున్నాను.
అవి రావు…
నేను రైతుబిడ్డనే అయినా నాకు సీరియస్ వ్యవసాయం తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా సరదాగా పొలానికి వెళ్లివచ్చేవాణ్ని తప్ప, అవసరం కొద్దీ కాదు. అందువల్ల నాకు దున్నడం, నాట్లు వంటి పనులు రావు. వేరుశెనగకాయలు పీకడం, ఎండబెట్టిన కాయలను బస్తాలకెత్తడం చూడడం మాత్రం భలే సంతోషంగా ఉండేది.
-అరుణ పప్పు
ఫోటోలు : ప్రశాంత్ ఇంటూరి, ఉమా(గుంటూరు)