నేనూ, నాన్నా, తెలుగుకథ -ఎ.ఎన్.జగన్నాథశ

 

కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు: 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2.ఇంపుగా ఉండాలి. 3.మనసును దోచుకోవాలి. 4.విలక్షణంగా ఉండాలి. 5.కరుణాది భావాలను పలికించాలి. 6.వైవిధ్యభావాలను రూపుకట్టాలి. 7.ప్రయోజనం కలిగించాలి. 8.కొత్తదై ఉండాలి. 9.చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10.పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11.మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12.వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం చేసుకోవాలి.13. నైతికవిలువలు నేర్పాలి. 14.అనుకున్న భావాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆలోచనల్ని రేకెత్తించాలి. 15.ఆకట్టుకోవాలి. 16.అర్థచిత్రణ ఉండాలి. 17.అమాయకత్వాన్ని కూడా అక్షరీకరించవచ్చు.

లేగదూడని భుజాలకెత్తుకుని నాన్నా, పనసకాయని గుండెలకద్దుకుని నేనూ ఇద్దరం కొండెక్కాం. నాన్న ఆయాసపడుతూ నిల్చున్నారు. నేను కూడా ఆయాసపడుతూ నాన్న పక్కనే నిల్చున్నాను. కొండ మీద నుంచి కిందికి చూశాను. అదిగదిగో… అక్కడ ఉంది అగ్రహారం. వ ంద గడప ఉన్న అంత పెద్ద అగ్రహారం కూడా కాగితం మీద వేసిన బొమ్మలా చిన్నదిగా కనిపించింది. కొండ దిగి, చేరుకోవాలక్కడకి. మా దేవిడీ అక్కడే ఉంది.
అటు అగ్రహారానికీ ఇటు దొరవారిపల్లెకీ మధ్యలో పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీదే ఇప్పుడు నేనూ మా నాన్నా నిల్చుని ఉన్నాం. దొరవారి పల్లెలో మా నల్లావు ఈనింది. అదే నాన్న భుజాల మీది లేగదూడ. అక్కడి పల్లె కాయే నా చేతిలోని పనసకాయ.
“పనసకాయ ఆవపెట్టి వండితే ఉంటుందిరా, బలే రుచి” అన్నారు నాన్న.

“పట్టుకుని పద” అన్నారు. ఇద్దరం బయల్దేరాం.
చూస్తూండగానే కొండ మీద మబ్బులు కమ్మాయి. టప టపమంటూ ఇంతకో చినుకు పడి, తర్వాత వానగా పుంజుకుంది. తల దాచుకునేందుకు ఎక్కడా ఎలాంటి చోటూ కనిపించలేదు. దాంతో తడిసిపోయాం. దూడని పట్టుకుని నాన్న బలే చిందులేశారు. పనసకాయని పట్టుకుని నేనూ చిందులేశాను కాని, నాన్నంత బాగా వెయ్యలేకపోయాను. తడిసిన బనియనూ, పంచె నాన్న ఒంటిని అంటుకుని కనిపించాయి. నా నిక్కరూ, చొక్కా కూడా నన్నంటుకుని, నీరోడ సాగాయి.
పట్టుమని పావుగంట కూడా కురవలేదు, ఆగిపోయింది వర్షం. కొండ మీద నుంచి నీరు ధారలు కట్టి కిందికి ప్రవహిస్తోంది. గులుక్ గులుకంటూ శబ్దిస్తోంది.
“జాగ్రత్తగా దిగు” అన్నారు నాన్న. వర్షానికి తడిసిన కొండ మీంచి దిగడం చాలా కష్టం. దిగనారంభించాం.

“కథ చెప్పు నాన్నా” అడిగాను.
“హరికథ చెప్పమంటావా? గిరికథ చెప్పమంటావా?” అడిగారు.
“అదేదీ వద్దు. తెలుగుకథ చెప్పండి” అన్నాను.
“తెలుగుకథ కాదు, తెలుగుకథ గురించి చెబుతాను, విను” అన్నారు నాన్న. చెప్పసాగారిలా.
“తెలుగుకథ ఎప్పుడు పుట్టిందో తెలుసా? మన విజయనగరం గురజాడ అప్పారావుగారు రాశారే కన్యాశుల్కం, అది పుట్టక ముందే తెలుగకథ పుట్టిందిరా. కన్యాశుల్కం నాటకంలో రామప్పంతులు ‘అది వేరే కథ’ అంటాడు. అలాగే ఆ నాటకం చివర్లో ‘డామిట్! కథ అడ్డంగా తిరిగింది’ అంటాడు గిరీశం. ఈ రెండు మాటలతో కథే ముందు పుట్టి, తర్వాత నాటకం పుట్టిందని గురజాడ చెప్పక చెప్పాడు”
“అమ్మ ఏమో భారత రామాయణాలప్పుడే కథ పుట్టిందంది.”

“దాని బొంద. పాత చింతకాయపచ్చడి కబుర్లూ అదీను. అప్పుడు పుట్టింది కథ, తెలుగుకథ కాదు. అలాగయితే నిజం చెప్పాలంటే ‘ఏడు చేపలకథ’తోనే తెలుగుకథ పుట్టింది.
అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులూ వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు…కథ ఉంది చూశావూ, దాన్నే మొదటి తెలుగుకథ అంటాన్నేను. కాదన్నవాణ్ణి చూపించు, కాలూ చెయ్యీ తీసేస్తాను” కోపగించుకున్నారు నాన్న.
“ఉన్నాయిరా, పేదరాశి పెద్దమ్మ కథల దగ్గర్నుంచి, పంచతంత్రం కథల దాకా అన్నీ కథలే! కాని, అసలు సిసలు తెలుగుకథ మాత్రం పందొమ్మిది వందల పదకొండులోనే పుట్టింది. కాదన్న గాడిద కొడుకుని చూపించు” అన్నారు మళ్ళీ. ఆ కోపంలో కాలు జారి పడబోయారు. నిలదొక్కుకున్నారంతలోనే!
“బరువుగా ఉందా?” అడిగారు.
“లేదు, చెప్పండి” అన్నాను.

“నేను అడుగుతోంది పనసకాయ గురించి, తెలుగుకథ గురించి కాదు” అన్నారు నాన్న. నేను ఎలాంటి జవాబూ ఈయలేదు.
“ముందో రెండు కథలు రాశాడు గురజాడ. దిద్దుబాటు, దేవుడు చేసిన మనుషుల్లారా…అని. మొదటికథ కథేగాని, అంత బరువేమీ లేదందులో. రెండో కథ దేవుడు చేసిన మనుషుల్లారా లేదూ, అది గొప్పకథ. లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుందది” అన్నారు నాన్న.
పల్లెకి వెళ్తూ, కొండెక్కుతూ నాయుడు కనిపించాడు. నాన్నని పలకరించాడు.

“ఏం పంతులుగారూ, ఎక్కణ్ణుంచి?” అడిగాడు.
“ఇంకెక్కణ్ణుంచి, మీ పల్లె నుంచే. మా కర్రావు ఈనింది, ఇదిగో దూడ పుట్టింది. ఇంటికి తీసుకుని వెళ్తున్నాను.”
“మరి ఆవు ఏది?”
“వస్తోంది, వెనక వస్తోంది” అన్నారు నాన్న.
“ఓ దమ్ము లాగుతారా?” అడిగాడు నాయుడు.

“అడిగిన తర్వాత కాదంటానా?” అన్నారు నాన్న. నాయుడు జేబులోంచి చుట్టల కట్ట తీశాడు. అందులోంచి నాన్నకి ఒకటిచ్చి, తనొకటి తీసుకున్నాడు. ఇద్దరూ చుట్టలు ముట్టించారు. కాళ్ళ మధ్య దూడను ఉంచుకుని, రాయికి నడుం వాల్చారు నాన్న. అతనికెదురుగా నాయుడు నిల్చున్నాడు. పనసకాయను కింద ఉంచి, అది దొర్లిపోకుండా దాని కాలుంచి నిలబడ్డాన్నేను.

“పంతులుగారూ, కథంటే ఏమిటి? కథానిక అంటే ఏమిటి? రెండూ ఒకటేనా? లేకపోతే తేడా పాడాలున్నాయా?” అడిగాడు నాయుడు. హఠాత్తుగా నాయుడు అలా అడిగేసరికి నాన్న ఆశ్చర్యపోయారు.
“నీకెందుకివన్నీ?” నాయుణ్ణడిగారు.
“ఎందుకంటే, మా అబ్బాయి విజయనగరం సంస్కృత కాలేజీలో భాషాప్రవీణ చదువుతున్నాడు కదా, వాడంటాడు, ఇప్పుడు పత్రికల్లో వస్తున్నవాటిని కథలన కూడదు. కథానికలనాలంటాడు. ఆ మాట మీద బొబ్బిలిలో డిగ్రీ చదువుతున్న మా పెద్దమ్మాయికీ, వాడికీ పెద్ద గొడవయిపోయింది” అన్నాడు నాయుడు.

నాన్న కళ్ళు మూసుకున్నారు. ఏదో గుర్తు చేసుకుంటున్నారనిపించింది. కాస్సేపటికి కళ్ళు తెరిచారు. చెప్పారిలా.
“మొన్నామధ్య ఇంద్రగంటివారు ఓ వ్యాసం రాశారులే! అది మీ వాడు చదివినట్టున్నాడు. నిజమే, మీ వాడన్నది కరక్టే! ఇప్పుడు పత్రికల్లో వస్తున్న వాటిని ‘కథానిక’లనే అనాలి. అగ్నిపురాణం సాహిత్య మీమాంస చేసింది. అందులో గద్య కావ్య విభాగం గురించి ఏమని ఉందంటే…
ఆఖ్యాయికా కథా ఖండకథా పరికథా తథా
కథానికేతి మన్యంతే గద్యకావ్యం చ పంచధా!!”

“అంటే అర్థం ఏమిటి పంతులు గారు?” అడిగాడు నాయుడు. నాన్న శ్లోకానికి గాబరాపడి పొగను మింగేశాడేమో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు నాయుడు. కన్నీళ్ళతో నాన్నని చూశాడు.
“ఆఖ్యాయిక, కథ, ఖండకథ, పరికథ, కథానిక అని గద్య కావ్యాలు అయిదు రకాలు. ఇందులో ‘కథానికే’ ఇప్పుడు పత్రికల్లో వస్తున్న కథలు” అన్నారు నాన్న.
“మరి నాకు శలవు” అన్నాడు నాయుడు. నాలుగు అడుగులు గబగబా వేసి కొండెక్కసాగాడు.
చుట్టని నేల మీద గట్టిగా రాసి, ఆర్పేశాడు నాన్న. ముందటి లాగానే దూడని భుజాల మీదికెత్తుకున్నాడు. ‘పద’మన్నట్టుగా నన్ను చూశాడు. కాలి కింద ఉన్న పనసకాయను భుజమ్మీదకు ఎత్తుకుని నాన్నని అనుసరించాన్నేను.
“మనం ఎక్కడున్నాం రా?” అడిగారు నాన్న. సమాధానంగా కిందికీ మీదికీ చూశాన్నేను.

“కొండ మీద మనం ఎక్కడున్నామని నేను అడగటం లేదు. కథ మీద మనం ఎక్కడున్నామని అడుగుతున్నాను. చెప్పు, ఎక్కడున్నాం మనం?”
“గురజాడ దగ్గర ఉన్నాం కాని, కథ తర్వాత సంగతి, ముందు ఇందాక నాయుడుకి చెప్పారే కథానిక గురించి, దాని లక్షణాలు చెప్పండి నాన్నా” అడిగాను.
మరో శ్లోకం అందుకున్నారాయన.

“భయానకం సుఖపరం గర్భే చ కరుణో రసః
అద్భుతోం2తే సుక్లపార్థా నోదాత్తా సా కథానికా!!” అన్నారు. కథానికకి రెండు బాహ్య లక్షణాలున్నాయిట! అవి, ఒకటి: కథని ఓ అని తెగ లాగకుండా ‘భేష్’ అన్నట్టుగా పొందిగ్గా చెప్పాలి. రెండు: పెద్ద పెద్ద సమాసాలు, వర్ణనలతోనూ కథ బిగిసిపోకూడదు. అలాగే ఆభ్యంతర లక్షణాలు మూడున్నాయి. ఒకటి: పాఠకుణ్ణి భయ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా కథలో విచిత్ర సంఘటనలు ఉండాలి. రెండు: హృదయాన్ని కరిగించే కరుణరస సన్నివేశం ఉండాలి. మూడు: కథాంతం పాఠకుని ఊహకి అందకూడదు. ఇవి కథానిక లక్షణాలు” అన్నారు నాన్న.
పొదచాటుగా నిలబడి కుక్క ఒకటి చూస్తోంది మమ్మల్ని.
“నాన్నా కుక ్క” అన్నాను. దాన్ని చూపించాయనకి. నవ్వారు నాన్న.

“అది కుక్క కాదు, నక్క” అన్నారు.
“తెలియని వాళ్ళు కథా, కథానిక రెండూ ఒకటే అంటారు. జాగ్రత్తగా రెంటికీ తేడాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మంచిది” అన్నారు.
“ఇదంతా కాదు, ఎంత టైంలో చదవగలిగితే కథానిక అంటారు. అది చెప్పండి” అడిగాను.
“ఒక్కసారి కూర్చుని చదవడం మొదలుపెడితే పావు గంట నుంచి ముప్పావు గంటలోపు కథానిక అయిపోవాలి”
“కథానిక దేన్ని చిత్రించాలి?”
“ఒక అద్భుత సౌందర్యాన్ని, లేదంటే ఓ భయంకర దృశ్యాన్ని, కాదంటే ఓ కరుణాద్భుత సన్నివేశాన్ని చిత్రీకరించాలి. ఇదంతా ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది” అన్నారు నాన్న.
“భయానకరసంతో ప్రారంభించి, కరుణరసాన్ని పోషిస్తూ అద్భుతరసంతో క్లుప్తంగా ముగిస్తే కథానిక కాదా?” అడిగాను నేను.

“ఎందుకు కాదు, భేషుగ్గా అవుతుంది” అన్నారు.
“కథ దగ్గరకి వస్తే కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు. అవి 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2. ఇంపుగా ఉండాలి. 3. మనసును దోచుకోవాలి. 4. విలక్షణంగా ఉండాలి. 5. కరుణాది భావాలను పలికించాలి. 6. వైవిధ్యభావాలను రూపుకట్టాలి.7. ప్రయోజనం కలిగించాలి. 8. కొత్తదై ఉండాలి. 9. చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10. పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11. మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12. వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం చేసుకోవాలి. 13. నైతికవిలువలు నేర్పాలి. 14. అనుకున్న భావాన్ని ఆవిష్కరించడంతో పాటు ఆలోచనల్ని రేకెత్తించాలి. 15. ఆకట్టుకోవాలి. 16. అర్థచిత్రణ ఉండాలి. 17. అమాయకత్వాన్ని కూడా అక్షరీకరించవచ్చు” అన్నారు నాన్న.
“ఇవన్నీ ఇప్పుడు రాస్తున్న కథలకు కూడా వర్తిస్తాయా?” అడిగాను.
“ఎందుకు వర్తించవు. ఎంచక్కా వర్తిస్తాయి. అయితే వర్తింపచెయ్యాలి” అని, ఆయాసంగా ఉందేమో ఆగారు నాన్న. నేనూ ఆగిపోయాను.

నాన్న ఓ శ్లోకం చదివారు.
“అశ్వం శస్త్రం శాస్త్రం వీణా, వాణీ నరశ్చ నారీచ, పురుష విశేషం ప్రాప్య హి, భవంతి యోగ్యా అయోగ్యాశ్చ” -అంటే అర్థం ఏమిటో తెలుసా?
గుర్రం, ఆయుధం, శాస్త్రం, వీణ, శబ్దాలు, పురుషులు, స్త్రీలు…అంతా తాము ఆశ్రయం పొందిన వారి సామర్థ్యాలకు అనుగుణంగానే యోగ్యమయినవీ, అయోగ్యమయినవిగా ప్రచారమవుతాయి. వాటిలో ఇప్పుడు కథ-కథానికను కూడా మనం చేర్చుకోవచ్చు” అని నవ్వారు నాన్న. తర్వాత మామూలు కథల గురించీ, మంచి కథల గురించీ, గొప్ప కథల గురించీ చాలా విషయాలు చెప్పారు. నాన్న చెబుతూంటే నేను వింటూ ఇద్దరం కొండ దిగిపోయాం. అగ్రహారానికి చేరుకున్నాం. దేవిడీలోనికి ప్రవే శించాం. నా చేతిలో పనసకాయను అమ్మ అందుకుంది. నాన్న భుజాల మీది దూడను అన్నయ్య అందుకున్నాడు. ఇద్దరం తేలికపడ్డాం.

ఆనాడు పనసకాయను అమ్మకు అందించి తేలికపడ్డానేమోగాని, నాన్న చెప్పిన కథను భుజాలకెత్తుకుని, నేటికీ తేలికపడలేకపోతున్నాను. ఆ బరువును దించుకునే క్రమంలోనే రచయితనయ్యాను. సంపాదకుణ్ణయ్యాను. సంపాదకునిగా నాకు తెలిసింది కొంత. తెలుసుకోవాల్సింది కొండంత ఉండడంతో గొప్ప కథ లూ, గొప్ప కథకుల గురించి నేను తెలుసుకోవడమే కాదు, పాఠకులకు కూడా తెలియజేస్తే బాగుంటుందనిపించింది. అనిపించి, ‘నవ్య నీరాజనం’ ప్రారంభించాను. రెండు వందల వారాల పాటు నిరాటంకంగా ఈ శీర్షికను కొనసాగించాను. విశేషాదరణ లభించింది. ఎందరో మెచ్చుకున్నారు దీన్ని. వారు మెచ్చుకున్న యాభైమంది కథకుల ఇంటర్వ్యూలనూ, యాభై కథలనూ తొలి విడతగా ఎంపిక చేసి ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దాను. అభిమానించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
-ఎ.ఎన్.జగన్నాథశర్మ
నవ్య వారపత్రిక సంపాదకులు

‘నవ్య నీరాజనం’ రెండు వందల వారాల పాటు నిరాటంకంగా కొనసాగిన శీర్షిక. ఎందరో మెచ్చుకున్న యాభైమంది కథకుల ఇంటర్వ్యూలనూ, యాభై కథలనూ తొలి విడతగా ఎంపిక చేసి తీర్చిదిద్దిన పుస్తకమిది..

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.