విజ్ఞులైన అలనాటి మన శాస్త్రజ్ఞులు -26
శాస్త్రజ్ఞులైన అలనాటి రాజులు
విహంగ శాస్త్ర వేత్త –జహంగీర్
అక్బర్ కొడుకు జహంగీర్ మొగల్ చక్ర వర్తి మాత్రమె కాదు గొప్ప ప్రక్రుతి శాస్త్ర పరిశోధకుడు ,విహంగ శాస్త్ర వేత్త కూడా . 1605-27మధ్య కాలం లో పక్షులను మొక్కలను జంతువులను బాగా పరిశీలించి వివరాలను చెప్పే వాడు .కళా సాహిత్యాలకే కాక భవన నిర్మాణానికి ,ప్రక్రుతి విజ్ఞానానికి ఏంతో సేవచేశాడు .
జహంగీర్ కు పక్షులంటే పిచ్చ ప్రేమ .వాటి ప్రవర్తన ,జీవన విధానాల గురించి ఒక గ్రంధమే రాశాడు .వృక్ష ,జంతు జాలం పై సాధికారిక రచన చేశాడు తన జ్ఞాపకాలు(తుజు –క-జహంగిరి ) అనే పుస్తకం లో .సమకాలీన శాస్త్ర వేత్తల జీవిత చరిత్రలనూ రాశాడు .ఖగోళ ,సాంకేతిక శాస్త్ర గ్రంధాలను సంస్కృతం లో వెలువరించాడు .యుద్ధాలు తిరుగు బాట్లు ,రాజకీయ కల్లోలాల మధ్య కూడా జహంగీర్ తన పరిశోధనలను కోన సాగించటం విశేషం .తన సమాచార గ్రంధం లో
36రకాల జాతుల జంతువుల్ని ,37వర్గాల వృక్షాలను గుర్తించి అమూల్య సమాచారాన్ని పొందు పరచాడు .వీటి లక్షణాలు వీటిపై పర్యావరణ ప్రభావం శరీర నిర్మాణ విషయాలు బరువు ,పేర్లు ,కొలతలు అన్నీ నిక్షిప్తం చేశాడు .ఆస్థాన చిత్రకారుడు ఉస్తాద్ మన్సూర్ చేత ఆ జంతువుల వృక్షాల పై పెయింటింగులు కూడా వేయించి ప్రదర్శింప జేశాడు .స్వయం గా జహంగీర్ జంతు ప్రదర్శన శాల ను నిర్వహించాడు .సూర్య ,చంద్ర గ్రహణాలు ,తోక చుక్కల గురించి కూడా జహంగీర గ్రంధస్తం చేశాడు .కొత్త పక్షి కనపడగానే ఆస్థాన చిత్రకారుడి తో బొమ్మ వేయించి భద్ర పరచే వాడు .ఈ చిత్రాల ఆల్బం పక్షుల పరిశోధనా శాస్త్రానికి (ఆర్నిదాలజి )కి ఏంతో తోడ్పడింది .
ఆధునిక కాలం లో మన’’ సలీం ఆలీ’’ ‘’పక్షి ప్రేమికుడు’’ గా గుర్తింపు పొందిన విషయం మనకు తెలిసిందే .
ఆధునిక రాకెట్ రూప శిల్పి టిప్పు సుల్తాన్
. 1232లో చైనా వారు మంగోలులతోయుద్ధం చేసినప్పుడు మొదటి సారిగా రాకెట్లను ప్రయోగించారు .ఆ తర్వాత రాకెట్ స్వరూపం చాలా మారింది .ఫిరంగులు వాడకం వచ్చిన తర్వాత రాకెట్లు వెనక పడ్డాయి .1560తర్వాత రాకెట్ వాడకం నిలిపేశారు 18శతాబ్దం చివర్లో మైసూరు ను పాలించిన టిప్పు సుల్తాన్ రాకెట్. లకు పునర్జీవనం కల్పించాడు.ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఎదురు తిరిగి ఆధునిక టెక్నాలజీ తో మళ్ళీ రాకెట్ లను నిర్మించి వారిపై ప్రయోగించిన ఘనత హైదరాలీ కుమారుడు టిప్పు సుల్తాన్ దే .
1799 మే నెలలో జనరల్ హరిన్ నాయకత్వం లో బ్రిటిష్ సైన్యాలు శ్రీ రంగ పట్నం మీద దాడి చేశాయి .టిప్పు సుల్తాన్ వారిపై ప్రయోగించిన రాకెట్ వర్షానికి బ్రిటిష్ సైన్యం భారీగా నష్ట పోయింది .తన రాకెట్ దళాన్ని అయిదు వేల కు పెంచి టిప్పు బ్రిటిష్ సైన్యానికి చుక్కలు చూపించాడనిబ్రిటిష్ సైన్యాధికారి ‘’కల్నల్ గెరాల్డ్ ‘’తన పుస్తకం లో రాశాడు .సంచలనం కలిగించిన ఈ వార్త అందర్నీ ఆలోచన లోకి నెట్టి మళ్ళీ రాకెట్ వైభవానికి దారి తీసింది. అనేక పరిశోధనలు రూపుదాల్చటానికి కారణమైంది .టిప్పు స్వయం గా దగ్గరుండి రాకెట్ల ను ప్రయోగింప జేసే వాడు .ఈ విషయాలన్నీ ‘’ది ఆరిజన్స్ అండ్ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ‘’అనే గ్రంధం లో బ్రిటిష్ శాస్త్ర వేత్త సర్’’ బర్నాల్ రావెల్ ‘’రాశాడు .
టిప్పు సుల్తాన్ తయారు చేసిన తుపాకి
టిప్పు ప్రయోగించిన రాకెట్ ను ఒక దాన్ని ఇంగ్లాండ్ కు తీసుకొని వెళ్లి ‘’కోన్ గ్రేవ్ ‘’‘’అనే పరిశోధకుడు పరీక్షించాడు ఆ టెక్నాలజీకి నీరాజనాలన్దించాడు అప్పటి బ్రిటిష్ ప్రధాని’’విలియం పిట్ ‘’,డిఫెన్స్ కార్య దర్శి ‘’క్రేసర్ వీద్’’కూడా క్షున్నం గా పరిశీలించి అబ్బుర పడ్డారు .1805లో బ్రిటిష్ సైన్యానికి అధునాతన రాకెట్ ను తయారు చేసే పనిలో నిమగ్న మయ్యారు .వాటి ఫలితం గానే నెపోలియన్ తో బోలాంగ్ హార్బర్ దగ్గర జరిగిన యుద్ధం లోను ,కోపెన్ హాగ్ పై జరిగిన దాడి లోను బ్రిటిష్ సైన్యం ఈ రాకెట్ల ను ప్రయోగించి విజయాలను సాధించింది .ఈ విషయాలను మన మాజీ రాష్ట్ర పతి కలాం గారు ప్రస్తావించారు .ఆయన సుప్రసిద్ధ రోదసీ శాస్త్ర వేత్త అని మనకు తెలుసు కదా .
టిప్పు సుల్తాన్ పాలన కాలం లో శస్త్ర చికిత్సా విధానం కూడా పాశ్చాత్యుల మెప్పు పొందింది .1792యుద్ధం లో టిప్పు సైన్యం లో నలుగురికి చేతులు ముక్కు తెగి పోయాయి .ఒక కుమ్మరి వైద్యుడు శాస్త్ర చికిత్స చేసి కొత్త ముక్కు ను అతికించాడు ఈ విషయాన్ని బ్రిటిష్ వైద్యులు డాక్టర్ ధామస్ క్రాస్ ,డాక్టర్ జేమ్స్ ఫింద్లే’’ స్వయం గా ఫోటోలు తీసి ,ఒక సమగ్ర నివేదిక తయారు చేసి బ్రిటిష్ గెజెట్ లో ప్రచురింప జేశారు .ఈ నివేదికనే 1794అక్టోబర్ ‘’జంటిల్ మాన్ ‘’అనే లండన్ నుంచి వెలువడే మాస పత్రిక లోప్రచురించారు .శస్త్ర చికిత్స జరిగిన విధానం అంతా పూస గుచ్చి నట్లు అందులో రాశారు .దీనిపై ఆ పత్రిక సంపాదకుడు ‘’ఇలాంటి ఆపరేషన్లు అనేకం విజయ వంతం గా నిర్వహించటం భారతీయులకే చెల్లింది .కొత్త ముక్కు చక్కగా అతుకుతుంది .అంతకు ముందు ఎలా ఉండేదో అచ్చం అలానే ఉండటం ఆశ్చర్య కరం .నుదురు మీది చర్మ పు పోర తీసిన ప్రాంతం లో ఉన్న మచ్చ కాలక్రమం లో మాయమై పోతుంది ‘’అని భారతీయ శస్త్ర చికిత్సా నైపుణ్యాన్ని బహుదా ప్రసంసించాడు . .
మధ్య యుగ నవాబులలో ‘’మహమ్మద్ బీన్ తుఘ్లక్’’ అనే పిచ్చి తుఘ్లక్ గణితం ,ఖగోళం ,వైద్యం ,తర్కం ,శాస్త్ర విజ్ఞానాలలో అమోఘమైన పాండిత్యం ఉన్న వాడని పించుకొన్నాడు .మహా మేధావి .యుద్ధ విద్యలో ఆరి తేరిన వాడు .ధిల్లీ సుల్తానులలో మత మౌధ్యం లేని ఏకైక సుల్తాన్ తుఘ్లక్ .నిర్మాణ సామర్ధ్యం రాచకీయ చతురత ప్రసంశ నీయం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-12-13-ఉయ్యూరు