నేత్ర చికిత్స లో రెండవ సర్ఫోజి ‘’రాజే’’
చత్ర పతి శివాజీ వంశస్తుడు రెండవ సెర్ఫోజి మహా రాజు యుద్ధాలలో ఆరితేరిన వాడు .వైద్యం లో అవిశ్రాంత కృషి సల్పిన వాడు .తమిళ నాడు లో తంజావూర్ లో 1777లో జన్మించాడు .బ్రిటిష్ ప్రభుత్వం సెర్ఫోజి అధికారాన్ని1799 లో స్వాధీనం చేసుకొని పదవీ భ్రస్టూడిని చేసింది..
పదవి పోవటం ఒక రకం గా మంచే చేసింది .ప్రాచీన భారతీయ సంప్రదాయ వైద్య గ్రంధాలను సంహితలను కూలం కషం గా అధ్యయనం చేశాడు .నేత్ర వ్యాధి చికిత్స ను ప్రత్యేకం గా ఎన్నుకొని తన వైదుష్యాన్ని అందులో చూపించాడు .ప్రత్యామ్నాయ వైద్యాలైన సిద్ధ వైద్యం ,ఆయుర్వేదాలకు పరిశోధనా కేంద్రాలను ‘’ధన్వంతరి మహల్ ‘’పేరిట నెలకొల్పాడు .దక్షిణ భారత దేశం లో దీనిని ముఖ్య కేంద్రం గా నిర్వహించాడు .వైద్య శాస్త్ర పరిశోధకులను ఏర్పరచి వారితో అనేక పరిశోధనలు చేయించి వైద్యాన్ని అందు బాటులోకి తెచ్చాడు ..తయారైన
ఔషధాలను గోడౌన్ లో నింపి అవసరమైన వారికి సరఫరా చేశాడు .ఔషధ మొక్కలను వన మూలికలను సేకరించి భద్ర పరచాడు .సిద్ధ వైద్యం లో అనేక ప్రయోగాలు చేయించాడు .
సెర్ఫోజి తాను మాత్రం నేత్ర వైద్యం పై నే ద్రుష్టి పెట్టాడు .నేత్రవైద్య గ్రంధాలను క్షున్నం గా అధ్యయనం చేసి చికిత్సా విధానాన్ని సులభ తరం చేశాడు .నేత్ర చికిత్సా సాధనాలు ఆయన వెంట ఎప్పుడూ ఉండేవని చరిత్రకారుల కధనం .కాశి,ప్రయాగ మొదలైన పవిత్ర క్షేత్రాలకు వెళ్లి అక్కడి యాత్రికులకు సేవలందించే వాడు సెర్ఫోజి ..కంటి పొరను అతి తేలిక గా తొలగించే నైపుణ్యం ఆయన కుండేది ..18శతాబ్దం లో ఇదొక అద్భుత విజయం అని బ్రిటిషర్లు ,అందరూ మెచ్చుకొన్నారు
.
సెర్ఫోజి చిత్రకారుల చేత నేత్ర రోగుల కళ్ళను చిత్రాలు గా గీయించి భద్ర పరచాడు .సెర్ఫోజి నేత్ర వైద్య వివరాలన్నీ తంజావూర్ సరస్వతి మహలో లో మనం చూడ వచ్చు .నేత్ర వైద్యం లో శాస్త్ర చికిత్స లో ఇంతటి వైభవాన్ని ప్రపంచం మొత్తం మీద సాధించిన ఘనత సెర్ఫోజి రాజుదే .ఆయన వైద్య రంగానికి చేసిన సేవల లిఖిత పత్రాలు లభిస్తున్నాయి
.50దాకా చార్టులు ,రాత ప్రతులు ఉన్నాయి .సెర్ఫోజి నేత్ర చికిత్స కు ‘’కేస్ హిస్టరీ ‘’కూడా రాసి పెట్టుకొన్నాడు .వ్యాధి నిర్ధారణ తో బాటు అతి సూక్ష్మ విషయాలనూ అందులో రాశాడు .ఆధునిక నేత్ర శాస్త్ర పారి భాషిక పదాలు ‘’కార్నియా ,కంజుక్తివా ,కాప్యూల్ ,ఆఫ్ దిలెన్స్ ,పోస్తీరిఅల్ చేంబర్ ‘’మొదలైనవి ఈ చార్టులలో ఉండటం ఆశ్చర్యమేస్తుంది .5-60 ఏళ్ళ వయసున్న రోగులలో కేటరాక్ట్, గ్లకోమా లక్షణాలు ఉండటం సర్వ సాధారణం అని చెప్పి ,వారి ద్రుష్టి స్థాయి ,,ఆపరేషన్ తర్వాతా వారి చూపు విషయం అన్నీ జాగ్రత్తగా ఈ చార్టులలో నిక్షిప్తం చేశాడు .
రోగులకు వాడిన మందుల వివరాలు కూడా చార్టులలో రాశాడు .మనదేశానికి చెందినవే కాక యూరోపియన్ మందులను కూడా వాడి నట్లు చార్టుల ద్వారా మనకు తెలుస్తుంది .’’సిల్వర్ నైట్రేట్ ,బెల్లడోనా,చాక్ పౌడర్ ,పిప్పర మెంట్ వాటర్ ‘’లను ఎక్కువగా సేర్ఫోజి వాడాడు .సెర్ఫోజి తన వైద్య అధ్యయనానికి చరక సుశ్రుత సంహితలనే కాక సమకాలిక బ్రిటిష్ గ్రంధాలను అవలోడనం చేశాడు .వీటిని తన స్వంత అనుభవాలతో జోడించి ప్రజలకు ఉచితం గా వైద్య సేవ లందించాడు
రాజా సెర్ఫోజి . 1832లో నేత్ర వైద్య శిఖామణి సెర్ఫోజి రాజా మరణించాడు .భారతీయ నేత్ర వైద్య రంగానికి రా రాజు సెర్ఫోజి రాజు ఆధునిక నేత్ర వైద్యానికి గొప్ప స్పూర్తి ప్రదాత సెర్ఫోజి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-12-13-ఉయ్యూరు