అలుపెరుగనిదే అసలైన జీవితం

కఠోరమైన సత్యాల్లోంచే హాస్యం పుడుతుందంటారు. అలాంటి ఎన్నో కఠోర సత్యాల్ని కార్టూన్లుగా మలిచిన వారే కార్టూనిస్టు ‘సరసి’. మూడున్నర దశాబ్దాలకు పైగా కార్టూన్ల సేద్యం చేస్తున్న సరస్వతుల రామ నరసింహం అదే ‘సరసి’ హాస్య బాణాలు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ కనపడుతూనే ఉంటాయి. ఆరు జాతీయ, ఆంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న గీతకారుడాయన. రాష్ట్ర శాసన సభలో అసిస్టెంట్ సెక్రెటరీగా పని చేసి ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన ఆయన జీవన ప్రస్థానంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
ఆవిష్కరణ అయిపోగానే రామారావు నన్ను ఉద్దేశించి ‘సరసి గారూ! మీరు వేసిన ఈ చిత్రం శాశ్వతం. మీరూ, నేనూ అశాశ్వతం’ అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురు మంటున్నాయి. ఎన్‌టి రామారావు గారు వెళ్లిపోయారు. ఆ పెయింటింగ్ మాత్రం ఇంకా అక్కడ నిలబడి ఉంది. వెనకో ముందో నేనూ వె ళ్లిపోతాను. అయినా ఆ పెయింటింగ్ అక్కడే ఉంటుంది. కళారూపాలకు ఉండే ఆ శాశ్వతత్వమే కళాసృష్టిలో ఉండే ఎంతటి కష్టాన్నయినా భరించే శక్తినిస్తుంది.
ఆనందంగా ఉన్నప్పుడు ఎవరికైనా జీవితం అందంగానే కనిపిస్తుంది. కానీ, పరిస్థితులు కాస్త వికటించినప్పుడు ప్రతిదీ వికటాట్టహాసం చేస్తున్నట్లే అనిపిస్తుంది. కాకపోతే ఆ వికటత్వంలోని పేర డీని అర్థం చేసుకుంటే ఆ వికారం నుంచి బయటపడి హాయిగా నవ్వుకోవచ్చు. అన్నీ సవ్యంగానే సాగిపోతున్నప్పుడే కాదు జీవితపు ఒడుదుడుకుల మధ్య కూడా హాయిగా నవ్వుకోవడానికి కార్టూన్లు ఎంతో కొంత ఉపకరిస్తాయని నేన నుకుంటాను. అందుకే కొన్ని దశాబ్దాలుగా ఈ దారిన పడి నడుస్తున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా బోడపాడు మా సొంతూరు. రహదారులు కూడా లేని ఒక చిన్న పల్లెటూరు. చదువుకోసం పొరుగూరు వెళ్లాల్సిన పరిస్థితి. మా ఇంట్లో ఎప్పుడూ ఒక హాస్యభరితమైన వాతావరణం ఉండేది. మా అమ్మ స్కూలుకు వెళ్లి ఏమీ చదువుకోకపోయినా మేము హైస్కూలులో నేర్చుకున్న చంధస్సుతో పద్యాలు రాసి మాకే వినిపించేది. మా నాన్నగారు ఎంతో చమత్కారంగా మాట్లాడేవారు. భోజన సమయంలో మా అమ్మతో “వంట బాగానే చేశావు కానీ, నువ్వు రాసే ఆ పద్యాల వాసనకే వంట పాడైపోయింది.
” లాంటి మాటలు అంటూఉండే వారు. అంతటితో ఆగక ఆమె రాసిన పద్యాలమీద పేరడీలు చె ప్పేవారు. అది విని మేమంతా ఘుెల్లుమనే వాళ్లం. నేను కార్టూన్లు వేయడానికి ఆ వాతావరణమే బీజంగా పనిచేసిందేమో అనిపిస్తుంది. అయితే కార్టూన్ల పట్ల నాకు విపరీతమైన ఆసక్తి ఏర్పడటానికి, చివరికి నేను కార్టూనిస్టుగా స్థిరపడటానికి మాత్రం పరోక్షంగా బాపు గారి స్ఫూర్తే కారణం. బొమ్మలు వేయడం మాత్రం నాకు తమ్మా సత్యనారాయణ గారు నేర్పారు. నేను వేసిన అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, కాసు బ్రహ్మానందరెడ్డి గార్ల తైల వర్ణచిత్రాలు రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో నిలిచే యోగ్యతను పొందడానికి ఆయనే కారణం.
ఎప్పటికీ నిలుస్తాయనే
నేను అసెంబ్లీ రిపోర్టర్‌గా ఉన్న రోజుల్లో అంటే 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు గారు అసెంబ్లీ కమిటీ హాల్లో అంబేద్కర్ తైలవర్ణ చిత్రాన్ని పెట్టాలని సంకల్పించి నాకు చె బితే నేను వేశాను. అసెంబ్లీ జరుగుతున్న రోజుల్లోనే ఒక ఖాళీ సమయాన ఎన్‌టి రామారావు గారి చేతుల మీదుగా ఆ చిత్ర ఆవిష్కరణకు ఏర్పాట్లు జరిగాయి. ఎంఎల్ఏలు, మంత్రులతో ఆ స్థలమంతా నిండిపోయింది. రామారావు గారు పెయింటింగ్ వద్దకు వస్తూండగానే అప్పటిదాకా ఆ పెయింటింగ్ వద్దనే ఉన్న నన్ను భద్రతా సిబ్బంది వచ్చి దూరంగా వెళ్లిపొమ్మన్నారు. నేను ఆశ్చర్యపోయి “అయ్యా ఆ పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్‌ను నేనే. పైగా నేను అసెంబ్లీ స్టాఫ్ మెంబర్‌ను. ఆ పెయింటింగ్‌ను ఆవిష్కరిస్తున్న సమయంలో నన్ను వెళ్లిపొమ్మంటారేమిటి?” అన్నాను. అయినా వాళ్లు నా మాట వినిపించుకోకుండా బయటికి నెట్టేశారు.
చివరికి పెయింటింగ్ వద్దకు రామారావు గారు వచ్చారు. చిత్రపట ఆవిష్కరణకు కొద్ది క్షణాల ముందు రామారావు గారు “ఇంతకీ ఆ చిత్రకారుడేడీ?” అన్నారట. అప్పటికి గానీ నా అవసరం భద్రతా సిబ్బందికి తెలిసి రాలేదు. వెంటనే ఆవిష్కరణ చోటికి వచ్చేయాలంటూ పిలిచారు. ఎక్కడో వెనక ఒక మూలన నిలుచున్న నేను ఎలాగోలా స్టేజ్ మీదికి వచ్చాను. ఆవిష్కరణ అయిపోగానే రామారావు నన్ను ఉద్దేశించి ‘సరసి గారూ! మీరు వేసిన ఈ చిత్రం శాశ్వతం. మీరూ, నేనూ అశాశ్వతం’ అన్నారు. ఆ మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురు మంటున్నాయి. ఎన్‌టి రామారావు గారు వెళ్లిపోయారు. ఆ పెయింటింగ్ మాత్రం ఇంకా అక్కడ నిలబడి ఉంది. వెనకో ముందో నేనూ వె ళ్లిపోతాను. అయినా ఆ పెయింటింగ్ అక్కడే ఉంటుంది. కళారూపాలకు ఉండే ఆ శాశ్వతత్వమే కళాసృష్టిలో ఉండే ఎంతటి కష్టాన్నయినా భరించే శక్తినిస్తుందన్న సత్యం రామారావు గారి గొంతులో నాలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంటుంది.
అన్నం పెట్టిన చేయి కదా!
నాకు అప్పుడు పదేళ్లు ఉంటాయేమో. అప్పటికే బాగా పొద్దెక్కింది. మా ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డు అవతల రెండెడ్ల బండి తొట్లో ఒకతను పడుకుని ఉన్నాడు. మాది చిన్న పల్లెటూరే కాబట్టి అతడు మా ఊరి వాడు కాదని తెలుస్తోంది. చాలా సేపటినుంచి అలా ఎండలో పడుకున్నాడేమిటనుకుని మా నాన్నగారు ఆయన వద్దకు వెళ్లి ఏ ఊరని అడిగితే ఫలానా ఊరని చెప్పి “ధాన్యం వేయడానికి రాత్రే వచ్చానండి, పడుకునే సరికి బాగా రాత్రయ్యింది. అందుకే ఇప్పటిదాకా మెలుకువ రాలేదు” అని చెప్పాడు. “సరే కానీ, చద్ది అన్నం ఉంది. తింటావా?” అన్నారు నాన్న. అందుకాయన ” తింటానండీ” అన్నాడు వెంటనే. అమ్మ అతనికి అన్నం పెట్టి ఆవకాయ పచ్చడి వేసింది. అన్నం ఎర్రబడిపోయేంతగా పచ్చడి కలిపి పెట్టిన అన్నమంతా తినేశాడు. రెండవసారి అన్నం పెట్టి మళ్లీ ఆవకాయ వేసింది. అలా అమ్మ పెడుతూనే ఉంది. అన్నం రక్తం ముద్ద అయ్యేలా పచ్చడి కలుపుకుని తింటూనే ఉన్నాడు. కాసేపటికి అతని కళ్లెంట ధారగా నీళ్లు వస్తున్నాయి. పచ్చడిలో కారం ఎక్కువ అవ డం వల్లేమో అనుకుంది అమ్మ. కానీ, గమనిస్తే అతను ఏడుస్తున్నాడనే విషయం అర్థమైపోయింది. ఆ మాటే అమ్మ నాన్నకు చెప్పింది.
అతను అన్నం తినేసి చెయ్యి కడుక్కున్నాక, నాన్న అతనితో “ఎందుకు బాబూ ఏడుస్తున్నావు?” అన్నాడు. అందుకు అతను “అయ్యా! మీరు నన్ను పిలిచి అన్నం పెట్టారు. మీకు సంబంధించి ఒక నిజం తెలిసి కూడా నేను మీకు చెప్పక పోతే నేను మీకు ద్రోహం చేసినవాడినవుతాను.” అన్నాడు. నాన్నగారు ఆశ్చర్యంగా చూశారు. ” ఏమిటో చెప్పు” అన్నారు. వెంటనే అతను “అయ్యా! నెల రోజుల క్రితం మీ పొలాన్ని కౌలుకు చేసే మీ రైతు మీ పొలంలోని ధాన్య రాశిలోంచి ఒక బండి ధాన్యాన్ని అతి రహస్యంగా రాత్రికి రాత్రే తాడేపల్లిగూడెం మిల్లుకు చేరవేశాడండి. ఆ బండి కట్టింది నేనే అయ్యా!. మీ అన్నం తిన్నాక ఆ నిజాన్ని దాచిపెట్టలేకపోతున్నానండి” అంటూ తలవంచి దండం పెట్టాడు. ఐదెకరాల పంట ధాన్యంలోంచి ఎవరైనా ఒక బండి ధాన్యం తీసేస్తే గుర్తు పట్టడం కష్టమే. అందుకే అప్పటి దాకా మాకా విషయం తెలియనేలేదు. పట్టెడు అన్నం తిన్నదానికి అతడు చూపిన కృతజ్ఞత ఈ రోజు వరకూ నా మనసులో ఒక అనిర్వచనీయమైన విషయంగానే మిగిలిపోయింది.
నిష్కామ యోగి
మా ఊరు బోడపాడుకూ చింతపల్లికీ మధ్యన వెంకయ్య కాలువ అని ఒకటుంది. దాన్ని దాటే వెళ్లాలి ఎవరైనా. అలా వెళ్లాలంటే దోనెలో వె ళ్లడం ఒక్కటే మార్గం. గోదావరి నుంచి వచ్చే ఆ కాలువ చాలా వడిగా పయనిస్తుంది. ఎంతో బలంగా గడకర్ర వేస్తే తప్ప కాలువ దాటడం సాధ్యం కాదు.సహదేవుడు అనే ఒకే ఒక వ్యక్తి ఆ దోనె నడుపుతాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అతని పని అదే. అతనికిప్పుడు దాదాపు 80 ఏళ్లు. ఆ రోజునుంచి ఈ రోజు వరకు ఆ పని అతనొక్కడే చేస్తున్నాడు. వేరెవరూ ఆ పనికి రారు. కొత్త బాటసారులెవరైనా వస్తే కొంత డబ్బు ఇస్తారు కానీ, తెలిసిన గ్రామస్తులు మాత్రం పంట మీద కొంత ధాన్యం ఇస్తారు. కాలవకు ఆవల అతనికో గుడిసె ఉంటుంది. ఎప్పుడు వండుకు తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో ఏమో కానీ, ఉదయం నుంచి అర్థరాత్రి దాకా ఎప్పుడు చూసినా దోనె మీదే కనిపిస్తాడు.
అర్థరాత్రి దాటాక పిలిచినా దోనె తోసుకుని వస్తాడే తప్ప రానని అనడు.ఆ మధ్య ఎవరో ఒక పాపను పెంచుకుంటున్నాడన్న వార్త ఏదో వచ్చింది. దోనె నడపడం అతని జీవితంలో భాగమైపోయిందే తప్ప అది అతని జీవనాధారమని కూడా కాదు. పరిసర గ్రామ ప్రజలంతా ఎప్పటికైనా వంతెన పడుతుంది, అతనికి ఆ కష్టం తీరుతుందని అనుకుంటారు గానీ, అదొక కలగానే ఉండిపోయింది.. ఇప్పటికి రెండు సార్లు ఆ వంతెన కోసం నిధులు మంజూరు అయ్యాయి. మంత్రులు వచ్చి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇంత వరకు ఆ పని జరగలేదు. అతనింకా ఆ దోనె నడుపుతూనే ఉన్నాడు. అందరినీ ప్రవాహాన్ని దాటించి గమ్యానికి చేరుస్తున్నాడు గానీ, అతను మాత్రం ఆ ప్రవాహాన్ని దాటడం లేదు. ఆ ప్రవాహమే అతని జీవన గ మనం అనుకోవాలేమో! నాకైతే నిష్కామ కర్మకు అతనో నిలువెత్తు నిదర్శనంగా అనిపిస్తాడు.
బమ్మెర
ఫోటోలు: సాల్మన్ రాజు