అరుణా చాల మహిమ శ్రీ శైలం శక్తి పీఠం -చాగంటి

 

 
 
 

అన్ని శివలింగాలూ ఒకటి కాదు. ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు.

శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణ గిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు.

అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరు బట్టి ఆలోచిస్తే- అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎదుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవ కోటి యాత్రలో ఒక చోట అడ్డంగా గీత ఉంటుంది అని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవయాత్ర. అరుణాచలంలో అంతరాలయంలోని శివ లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమయిపోతున్నట్టుగా అనిపిస్తుంది.

ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి”. చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం. ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా! అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ”. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది.

ఆ పేరెలా వచ్చింది?
అచలం అంటే కొండ. ఆ కొండకు ప్రదక్షిణం చెయ్యాలంటే పధ్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కింద ఉన్నభాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే- కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. భగవాన్ రమణులను చూడ్డానికి ఎవరయినా అరుణాచలం వెళ్తే ఆయన మొదటగా ‘గిరి ప్రదక్షిణం చేశారా?’ అని అడిగేవారు. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణంలో మొదటి అక్షరం ‘ప్ర’ అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయటం. ‘నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను..’ అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే, పాపరాశి ధ్వంసమవుతుంది.

రెండో అక్షరం ‘ద’ అంటే కోరికలు తీర్చటం. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు. గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అరుణ పర్వతానికి మీరు ఎన్నిమార్లు ప్రదక్షిణము చేసినా, ఒక్క పర్వతానికే చేయకూడదు. పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి. గిరి ప్రదక్షిణానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం.

దక్షిణ దిక్కు యమధర్మరాజు ఉంటాడు. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అన్రుగహంతో ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైఋతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైఋతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. రోడ్డుకి కాస్త లోపలికి ఉంటుంది. నైఋతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో, ఒక శ్లోకమో, పద్యమో, శివ సందర్భమో చెప్పుకోవాలి. ఇక ఉత్తర దిశగా ఉన్నది కుబేర లింగము. ఇక్కడ ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.
 

మోక్షసాధనకు వరం 

 

 
 
 

విశిష్టమైన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికీ ప్రాశస్త్యం ఉంది. అయితే మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం. మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. ఈ విషయాన్నే తేటతెల్లం చే సేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు. అర్జునునితో కృష్ణపరమాత్మ తాను ‘వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః’అంటే ‘ ఇంద్రుడు’ అని చెబుతూనే తాను ‘ మాసానాం మార్గశీర్షోహం’ అని ప్రకటించాడు. వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకాలైన పర్వదినాలెన్నో ఉన్నాయి.

మార్గశిర ప్రారంభంలోనే శివ పుత్రుడైన కుమారస్వామిని అర్చించే ‘సుబ్రహ్మణ్య షష్టి’ పర్వదినం వస్తుంది. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా ఘనంగా జరుపుకుంటారు. షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్రదాయం తమిళనాట ఉంది. యోగసాధకులు స్కంధుని ఆరు ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యరూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే ఆర్ష సంప్రదాయమూ దేశంలో అనూచానంగా వస్తోంది. సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగబలాన్నీ, ఆరోగ్య ఫలాన్నీ ప్రసాదిస్తుంది.

‘మిత్రసప్తమి’ గా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు, లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులూ ఆరాధిస్తారు. ఈ శుభ తిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ని పూజిస్తే దివ్యమైన ఆరోగ్యమూ, మహాభాగ్యమూ ఒనగూడుతాయని భ క్తుల విశ్వాసం. హైందవ సంస్కృతిలో అంతర్భాగమై దివా కరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భాను సప్తమి, రథసప్తమి, మార్తాండ సప్తమి, అచల సప్తమి, దళ చ ట్పూజ పర్వదినాలలాగా ‘మిత్రసప్తమి’ కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినం.

మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని ‘గీతాజయంతి’గా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.
ఇక మహామహిమాన్వితమైన శుక్లద్వాదశీ వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. ఆ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణ కారకుడైన నారదుడికి సనక మహర్షి తేటతెల్లం చేసినట్లు నారద మహా పురాణ ం చెబుతోంది. మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమద్‌వ్రతాన్ని ఆచరిస్తారు. శరణాగత వజప్రంజరుడైన అంజనీసుతుని ఆరాధన దుష్టపీడను భంజించి జీవితాన సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుంది.

మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అది మొదలుకుని సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన మాసమే ‘ధనుర్మాసం’. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం. ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తన హృదయ నందనంలో పూచిన భక్తి భావ సుమాలనే ప్రేమతో శ్రీరంగనాధునికి సమర్పించి, ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి, ఆ స్వామి కృపకు పాత్రురాలై శ్రీరంగనాధుని సాయుజ్యాన్ని పొందిన ఘన చరిత గోదాదేవిది. ఈమెనే వైష్ణవ సాంప్రదాయంలో అండాళ్ అనీ, చూడి కుడుత నాంచారి అనీ వ్యవహరిస్తారు. గోదాదేవి రచించిన ‘ తిరుప్పావై’లోని భక్తి భావస్పోరకమైన 30 పాశురాలను ఈ మాసం రోజూలూ విష్ణాలయాలన్నింటా ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటే శ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులూ సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ పర్వదినాన్నే ‘ముక్కోటి ఏకాదశి’ గా జరుపుకుంటారు. ఈ పర్వదినాన దేవాదుందుభులు మోగుతుండగా శ్రీమహాలక్షీ సమేతుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠం ఉత్తర ద్వారానికి జేరి ముక్కోటి దేవతలకు తన దివ్యద ర్శన భాగ్యాన్ని కలుగచేస్తాడని పురాణవచనం. దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింటా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ పవిత్ర పర్వదినాన నారాయణుని అర్చిస్తే, ఆయతో బాటు ముక్కోటి దేవతలనూ ఆరా«ధించిన ఫలం వస్తుంది కాబట్టి ఏ ఏకాదశిని ‘ ముక్కోటి’గా పేర్కొనడం జరిగింది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారనే ఐతిహ్యమూ ఉంది. ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మధనంలో హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు.

ఇవేగాక దత్త జయంతి, కృష్ణాంగారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువై మార్గశిరానికి కమనీయతను సంతరించి పెట్టాయి. ఈ విధంగా మార్గశిరం అనుదినం ప్రత్యేకమై, పవిత్రమైన పర్వదినాలకు ఆలవాలమై విలసిల్లుతోంది. నిరతమూ ఆ భగవానుని స్మరిస్తూ, ఆయన సేవలో తరిస్తూ, సన్మార్గంలో చరిస్తూ మార్గశిరం ఇచ్చే పుణ్యఫలాన్నీ, ముక్తి బలాన్నీ సొంతం చేసుకుందాం.
ం’వ్యాఖ్యాన విశారద’ వెంకట్ గరికపాటి

శ్రీ శైలం శక్తి పీఠం 

 

 
 
 

దేశంలోని అష్టాదశ పీఠాలలో శ్రీశైలం కూడా ఒకటి. ఆ క్షేత్ర మహిమ గురించి చాగంటి కోటేశ్వరరావు చెబుతున్న విశేషాలు తెలుసుకుందాం..సాధారణంగా శంకరాచార్యుల వారు క్షేత్రముల గురించి ఎక్కువగా ప్రస్తావించరు. కాని ఆయన కూడా శివానందలహరిలో శ్రీశైలాన్ని ప్రస్తుతిస్తారు. ఇక్కడ పరమేశ్వరుడు వెలసినటువంటి కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శ్రీకారం వేసినట్లయితే వారిని గౌరవించి పిలిచినట్టు లెక్క. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలము అయింది. ఇలా తిరుమలకొండ పేరుకు శ్రీ చేర్చబడింది. అందుకే వరాహపురాణంలో ‘శ్రీశైలే పూరయిష్యామి కించిత్కాలాదనంతరయే’ అంటారు. శ్రీశైలములు రెండు. ఒక శ్రీశైలము తిరుమల. ‘తిరు’ అంటే ద్రవిడభాషలో గౌరవవాచకమయిన శ్రీకారము. ‘మలై’ అంటే కొండ. తిరు + మలై = శ్రీ + శైలము (కొండ) = శ్రీశైలము. తిరుమలకొండ అయిన శ్రీశైలము మీద స్వామి కరచరణాదులతో ఉన్నాడు. ఇక్కడ శ్రీశైలములో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. ఈ పర్వతానికి శ్రీగిరి అన్నపేరు రావడానికి సంబంధించిఒక స్థలపురాణం ఉంది.

ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకుంది. ఆమె శైలముగా మారింది అని చెబుతారు. కాని తాత్త్వికమయిన రహస్యం వేరు. కొన్ని పరమపవిత్రమయిన కొండలు ఉంటాయి. అక్కడ ఈశ్వరుడు స్వయంభువుగా వెలుస్తాడు. అలా వెలియాలంటే అది ప్రాకృతమయిన కొండకాదు. దానియందు ఏదో శక్తి ఉండాలి. అందుకే పెద్దలు- శిలాభోగం, స్థలాభోగం అని చెబుతూ ఉంటారు. ప్రపంచములో ఎన్నో శిలలు ఉంటాయి. ఏదో ఒక శిలను పట్టుకు వచ్చి, దానిని చెక్కి దేవాలయములో పెడతారు. అది దేవతామూర్తి అవుతుంది. దానికి ఎన్నో అభిషేకములు పూజలు చేయబడుతుంటాయి. దానినే శిలాభోగం అంటాము. కొన్ని కొన్ని స్థలములలోవున్న నిర్మాణములలో ఎప్పడూ శుభం జరుగుతూ ఉంటుంది. దానినే మనం స్థలాభోగం అంటాము. ఒక స్థలానికి ఉన్న శక్తిని మనం కనిపెట్టలేం. పెద్దలకు మాత్రమే తెలుస్తుంది.

శక్తి కోణం..
శ్రీగిరి అన్నప్పుడు అందులో ‘శ్రీ’ ఉన్నది. లలితాసహస్రనామము ‘శ్రీమాతా’ అని ప్రారంభమయింది. ‘శ్రీ’లో ‘శ’కార ‘ర’కార ‘ఈ’కారములు ఉన్నాయి. ఆ మూడక్షరములు బ్రహ్మశక్తి ,రుద్రశక్తి ,విష్ణుశక్తిలను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్నటు వంటి కొండ శ్రీశైలము. ఈ మూడు శక్తులు మమేకమయిన శక్తిరూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలము ఒక శక్తిపీఠము. ఆ కొండ మీద అడుగుపెట్టినవాడు సరస్వతీకటాక్షమునుకాని, లక్ష్మీకటాక్షమునుకాని జ్ఞానమునుకాని నోరువిప్పి అడగనక్కర్లేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అది అంత శక్తివంతమయిన స్థలము. అక్కడకి వెళ్తే మనస్సు లయమయిపోతుందని పెద్దలు చెబుతారు. మనస్సు లయం అయిపోతే బాహ్యప్రపంచంతో సంబంధం ఉండదు. శ్రీశైలపర్వతము ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలమునకు దగ్గరలో సిద్ధేశ్వరం అనే క్షేత్రం ఉన్నది. అక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. అక్కడి అమ్మవారికి భక్తులు స్వయంగా బొట్టు పెట్టవచ్చు. అమ్మవారికి కంకుమబొట్టుపెట్టడానికి ఆవిడ నుదరు మీద వేలుపెడితే- ఆ నుదురు శిలామూర్తిగా ఉండదు. వేలికి ఆమె నుదురు మెత్తగా తగులుతుంది. ఇక శ్రీశైలమల్లికార్జునుడిది ధూళి దర్శనం. మనం ఉన్న ప్రదేశం నుంచి శ్రీశైలంవెళ్ళే లోపల శరీరం ఎంతో అశౌచమునకు లోనవుతుంది. అప్పుడు శుభ్రపడటం కోసం స్నానం చేసి దర్శనానికి వెళ్తే ఆయన చిన్నబుచ్చుకుంటాడని పెద్దలు చెబుతారు. శ్రీశైలంలో ధూళిదర్శనం చేయాలి.

శ్రీశైలంలో శిఖరేశ్వరము అని ఒకదానిని పెట్టారు. శిఖరేశ్వరంలో నువ్వులుపట్టుకెళ్ళి నంది యొక్క వ్రిగహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో ‘చరనంది’ అని ఒక నంది ఉండేది. సాధారణంగా శివాలయములలో స్థిరనంది అని ఒకటి ఉంటుంది. అది కదలదు. కొన్ని దేవాలయాలలో చరనందులు కూడా ఉండేవి. ఇవి కదులుతాయి. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్యసదుపాయం ఉండేదికాదు. కానీ ప్రతి గ్రామంలో శివాలయం విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీ అయినస్త్రీకి అనుకోకుండా నొప్పులు వస్తే, పట్నానికి తీసుకువెళ్ళడానికి అవకాశంలేకపోతే, అంతర ఆలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ,ఆలయ ప్రధానద్వారపు తలుపు తీసేవారు. బాధపడుతున్నటు వంటి గర్భిణీస్త్రీ ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు దేవాలయంలోని ఈ చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే సుఖప్రసవములు జరుగుతాయని నమ్మేవారు. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులువేసి తిప్పుతారు. తిప్పి శ్రీశైలశిఖరము చూడాలి. కాని యథార్థమునకు ఆ శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. కానీ శిఖరాన్ని ఊహించుకోవాలి.
(ఎమెస్కో ప్రచురించిన శివపురాణం నుంచి)
 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.