తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో కన్నుమూత
సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
రేపు అద్దంకి సమీపంలో అంత్యక్రియలు
తెలుగు సినీ వినీలాకాశం నుంచి మరో నవ్వుల తార రాలిపోయింది.
మొన్నటికి మొన్న ఏవీఎస్ మృతి మిగిల్చిన బాధ, ఆవేదన నుంచి
పూర్తిగా కోలుకోకముందే, ఆ కన్నీటి చారలు ఆరకముందే…
మరో హాస్యనటుడు ధర్మవరపు సుబ్రమణ్యం (53) కన్నుమూశారు.
(హైదరాబాద్ – ఆంధ్రజ్యోతి) ధర్మవరపు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ చైతన్యపురిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 10.30 గంటలకు ఆస్పత్రిలోనే తుదిశ్వాస వదిలారు. ఆయన మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఆదివారం దిల్‌సుఖ్‌నగర్ పీఅండ్‌టీ కాలనీలోని స్వగృహంలో ఉంచుతారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని వారి కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తారు. ధర్మవరపు సుబ్రమణ్యానికి భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు (సందీప్, రవితేజ) ఉన్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం స్వగ్రామం ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం కొమ్మినేనివారిపాలెం. ఆయన 1960 ఆగస్టు 9న జన్మించారు.
ఆయన హఠాన్మరణంపట్ల సినీ, రాజకీయ, అధికార ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ధర్మవరపు’ సినిమాలో ఉన్నారంటే… ప్రేక్షకులకు నవ్వుల వరం ప్రకటించినట్లే. నటనలో, డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేకమైన శైలి (మేనరిజం). ఆయన ‘ఆనందోబ్రహ్మ’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రతి తెలుగు ఇంటికీ పరిచయమయ్యారు. సుత్తి వీరభద్రరావు మరణంతో ఆయనకు సినిమా అవకాశాలు లభించాయి. ఆయన… తొలిసారి వెండితెరపై కనిపించింది సుత్తి వీరభద్రరావు డూప్ పాత్రలో. ‘విచిత్ర ప్రేమ’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరభద్రరావు మరణించడంతో, ఆయనకు ధర్మవరపు డూప్‌లా నటించారు.
ఆయన తెలుగు తెరపై కనిపించిన తొలి చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ ఆ పాత్ర కూడా సుత్తి వీరభద్రరావు మరణంతో ధర్మవరపు సుబ్రమణ్యానికి లభించింది. ఆ తర్వాత ఆయనను దర్శకులు జంధ్యాల, బాపు బాగా ప్రోత్సహించారు. తేజతో సహా నవతరం దర్శకులు అనేకమంది ధర్మవరపుతో తమ చిత్రాల్లో నవ్వులు పండించారు. ధర్మవరపు 300లకుపైగా సినిమాల్లో నటించారు. ‘మిస్టర్ పెళ్లాం’లో ఏవీఎస్‌ను విపరీతంగా పొగిడే అసిస్టెంటుగా, ‘ఒక్కడు’లో సెల్‌ఫోన్ నెంబర్‌ను వింతైన మాడ్యులేషన్‌తో చెప్పే పాస్‌పోర్టు ఆఫీసర్‌గా, ‘అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి’లో నృత్య శిక్షకుడిగా, ‘మన్మథుడు’లో సీక్రెట్ మైకులు అమ్మే ఏజెంట్‌గా, ‘చిరుత’లో హీరోయిన్‌ను ‘పాపా… పాపా’ అంటూ ముద్దుచేసే సహాయకుడిగా… ఇలా ఒక్కటేమిటి! ధర్మవరపు సుబ్రమణ్యం పోషించిన ప్రతి పాత్రా నవ్వులకు చిరునామా! ‘నువ్వూ నేను’లో శోభన్‌బాబు జుట్టురింగుతో, గైడ్‌ను వాడుకునే లెక్చరర్‌గా ఆయన కడుపుబ్బ నవ్వించారు. ధర్మవరపు కేవలం నటుడు మాత్రమే కాదు. రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు కూడా. నరేశ్ హీరోగా నటించిన ‘తోకలేని పిట్ట’ అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. సంగీతం కూడా అందించారు. ఆయన కథానాయకుడిగా ‘ఒక తుపాకీ.. మూడు పిట్టలు’ అనే సినిమా ప్రారంభమైనప్పటికీ, పూర్తికాలేదు. ఆయన… చివరిసారిగా ‘కెవ్వు కేక’ అనే సినిమాలో వెండితెరపై కనిపించారు. చివరిసారిగా ‘ప్రేమ గీమా జాన్తానై’ అనే సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ సినిమా షూటింగ్ నడుస్తుండగానే, అస్వస్థతకు గురయ్యారు. ఆయన పాత్రను మరొకరికి అప్పగించారు.
నాటక రంగం నుంచి…
ధర్మవరపు సుబ్రమణ్యం చాలామందికి హాస్య నటుడిగానే తెలుసు. కానీ… ఆయనకు ప్రజానాట్య మండలితో నూ అనుబంధం ఉంది. నల్లూరి వెంకటేశ్వరరావు శిష్యుడిగా… ప్రజా సమస్యలపై కళాకారులతో కలిసి నాటకాలు వేసేవారు. పాఠశాలలో ఉండగానే నాటకాల ద్వారా ఉపాధ్యాయులను, స్నేహితులను అలరించారు. గ్రూప్-2కు ఎంపికై ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. సినిమా నటుడు కావాలన్న లక్ష్యంతో అడుగులు వేశారు. మొదట రేడియోకు పరిచయమయ్యారు. ఆ తర్వాతే దూరదర్శన్‌లో కనిపించారు. దూరదర్శన్‌లో ఆయన ప్రస్థానం రచయితగా, నటుడిగా సుదీర్ఘకాలం సాగింది. డీడీలో ప్రసారమైన మొట్టమొదటి సీరియల్ ‘అనగనగా ఒక శోభ’ రచయిత ధర్మవరపు సుబ్రమణ్యమే. దూరదర్శన్‌కు ఆయన ఐదు సీరియళ్లు అందించారు. ఇలా కళాకారుడిగా బిజీ అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. దూరదర్శన్‌ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న ధర్మవరపు సుబ్రమణ్యం దర్శకుడు జంధ్యాల దృష్టిలో పడ్డారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా!’ అంటూ వెండితెరపై వెనుదిరిగి చూడకుండా ముందుకు కదిలారు. ‘నువ్వు నేను’తో ధర్మవరపు సుబ్రమణ్యం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం చివరి క్షణంలో చేజారడం, అన్నగారితో నటించలేకపోవడం తన సినీ జీవితంలో లోటు అని చెప్పుకునేవారు.
రాజకీయ ప్రస్థానం…
ధర్మవరపు సుబ్రమణ్యం తండ్రికి కాంగ్రెస్‌తో అనుబంధం ఉండేది. ఆ తర్వాత ధర్మవరపు కూడా కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఆయనను రాష్ట్ర సాంస్కృతిక మండలి డైరెక్టర్‌గా వైఎస్ నియమించారు. ప్రస్తుతం ధర్మవరపు వైసీపీకి సన్నిహితంగా మెలుగుతున్నారు. ధర్మవరపు సుబ్రమణ్యం గతంలో రెండుసార్లు మృత్యువు ముఖందాకా వెళ్లారు. ఊటీలో జరిగిన ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మరోసారి… తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ రెండుసార్లూ ఆయన మృత్యుంజయుడిగా నిలిచారు. ఇప్పుడు మాత్రం… మృత్యువు చేతిలో ఓడిపోయారు.