హాస్య బ్రహ్మ లో పద్య నాటక బ్రహ్మ
త్యాగయ్య ఆత్మ విచారాన్ని సవివరం గా అందించిన హాస్య బ్రహ్మ భమిడి పాటి కామేశ్వర రావు తెలుగు పద్య నాటకాల్లో పద్యం పాడటం పై తన అభిప్రాయాల్ని నిర్మోహ మాటం గా వివరిస్తూ ఒక గ్రంధమే రాశారు .తనకున్న పద్య పాటవాన్ని వ్యక్తీకరించారు .ఈ విషయాలపై రాసిన పుస్తకం ఒక సిద్ధాంత గ్రంధమే అయింది .అందర్నీ ఆలోచింప జేసింది .నూట నలభై పేజీల గ్రంధం ఇది .నాటకం లో పద్యం పాడటం పై ఎన్నో ఏళ్ళుగా ఆయనకు ప్రత్యెక భావనలున్నా ఈ పుస్తకం 1957 లోనే వెలువడింది .1924 లో ప్రారంభించి, దీక్షగా పదమూడేళ్ళు కృషి చేసి 1957లో వెలువరించారు .ఆ తపనకు జేజేలు . దానికి ‘’ఆంద్రనాటక పద్య పఠనం ‘’అని పేరు పెట్టారు .పుస్తకాన్ని కూల్డ్రే దొరకు అంకిత మిచ్చారు .ఇది హాస్య బ్రహ్మ లో ప్రవేశించిన పద్య నాటక బ్రహ్మ అయింది ఆ విషయాలన్నీ తల్లా వఝల పతంజలి శాస్త్రి గారు మేస్టారి పై రాసిన పుస్తకం లో పొందు పరచారు .ఆ విషయాలే మీ కోసం అందిస్తున్నాను
ఈ పుస్తకానికి ఒక నేపధ్యం ఉంది .ఒక సారి కూల్డ్రే గారు పాఠంబోధిస్తూ ,మాటల సందర్భం లో ‘’మీ ఆంద్ర కవిత్వం ఒక ప్రత్యెక కళ కాదు ‘’అన్నారట .వెంటనే మన మేష్టారు లేచి ‘’ఎందుకని ?’’అని అడిగారట .’’మీ సంగీతం రాగాన్నించి విడి వడి ప్రత్యేకత్వం సంపాదిన్చుకోలేదు కనుక ‘.రాగ మిళితం అయినప్పుడు తప్ప ,దానికి జన్మ ఉన్నట్లు మీరు ఒప్పుకోరు కనుక ‘’.అన్నారు .దానిపై ఆ తర్వాత తరచి తరచి అడిగి కూల్డ్రే గారి అభిప్రాయాలను తెలుసు కొన్నారు ఈయనకూ మనసులో మధనం ప్రారంభ మైంది .కొంతవిషయం మనసుకి చేరింది .అప్పుడు మేష్టారు దొర తో ‘’మా కవులు రాగాలు ముందు నేర్చు కోరు .అసలు చాలా మంది కవులకు రాగాలే రావు తెలియవు ..కూల్డ్రే ఆశ్చర్య పోయి తన పొరబాటు తెలుసుకొని ‘’అసలు అలా ఎందుకు పాడతారు ‘’అని అడిగారు .అంతే –ఆ క్షణం నుంచి సంగీతం గురించి,స్వర,రాగాల గురించి కవిత్వం గురించీ అధ్యయనం ప్రారంభించారు .
అదే ఏడాది బందర్లో ‘’నట సారస్వత సభలు ‘’జరిగాయి .సారస్వత సభ కు శ్రీ కాశీ కృష్ణాచార్యులు ,నట సభకు శ్రీ చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారు అధ్యక్షులు .పిలవక పోయినా మేష్టారు హాజరయ్యారు .కొందరు వక్తలు రాక పోవటం వల్ల ,మేస్టారికి ప్రసంగించే అవకాశం వచ్చింది .ఇలా ‘’నాటక పద్య గానం ‘’గురించి రెండు రోజులు మాట్లాడారు .ఆ ప్రసంగం అందర్నీ
ఆకర్షించింది .హరి నాగ భూషణం గారు ,కౌతా రామ శాస్త్రి గారు మేస్టారి వాదాన్ని గట్టిగా సమర్ధించారు .మేస్టారి ప్రసంగ పాఠం తమ ‘’శారద ‘’పత్రిక లో వేయ టానికి ఇవ్వమని ‘’రామ శాస్త్రి గారు అడిగారు .నూట యాభై రూపాయల పారి తోషికం ఇస్తామని కూడా చెప్పారు .తన అసంపూర్తి రచన ఇవ్వటానికి ఒప్పుకో లేదు .ఈ సభలో మేష్టారు ఒక చమత్కారం చేశారు .ముందుగా అయిదు నిమిషాలు ‘’భైరవి రాగం ‘’ఆలపించారు మేష్టారు .రాగం ఆపి ‘’విషయం అర్ధమయిందా ?’’అని అడిగారు జనాన్ని .అప్పుడు చెప్పారట .పద్యాన్ని చంపి ,రాగం తియ్యటం వల్ల అటు పద్యానికి ,ఇటు నాటకానికి అన్యాయం జరుగుతుందని .అప్పుడు మొదలెట్టి సోదాహరణం గా ఉపన్యాసం ప్రారంభించారట .మరి కాసేపాగి ‘’తోడి రాగం ‘’లో అర్జునుడి పద్యం ఎత్తుకొని రాగాలు తీయకుండా ను, తీస్తూనూ పద్యం చదివి విని పించి తను చెప్పదలచుకొన్నది సూటిగా మనస్సులకు ఎక్కించారు .అదీ మేస్టారి భణితి.
అలాగే ఒక పద్యం లో ‘’అనుగుం జేల్లెలివై ,ముకున్డునకు ,నా కర్ధాంగి వై ‘’అనే పద్యం చదువుతూ మాటలు కలిపి అర్ధం ధ్వంసం అయేట్లు
చదివినా ఆ తప్పు తెలుసుకోక నవ్వ లేక పోయారు శ్రోతలు .తిరుపతి శాస్త్రి గారు ‘’నవ్వరేం ?’’అని గద్దించినా ,అనౌచిత్యం వారికి తెలియ లేదు .మేస్టారి ఉపన్యాసం మాత్రం పట్టాభి ,చెరుకువాడ ,ముట్నూరి ,సూరి శాస్త్రి గార్లకు బాగా నచ్చింది .’’ఉమరాలీషా’’కవి గారికి మాత్రం ‘’పద్యాల్నీ రాగాల్నీ విడదీస్తే కవిత్వం దెబ్బతినటమే కాక తెలుగు ‘’నాటకప్పాకలు ‘’తగలడి పోతాయి .అని పించిందిట .
మేస్టారి ఆలోచనలో గేయం పాడుకొనేది .గద్యం చదువు కొనేది .పద్యం ఏకాంతం గా పాడుకున్నా తప్పు లేదు ‘’.19 వ శతాబ్దం లో సంగీత నాటకాలు లేక పద్య నాటకాలు పుట్టుకు రావడం తో పద్యానికి రాగం రూఢి అయి పోయింది ..ఏ దొడ్డి దార్నో సన్న సన్నగా వచ్చి చొర బడ్డ క్షుద్ర రాగం సంగతి’’ ఏకై వచ్చి ,మేకై కూర్చోవడం ‘’లా అయింది ‘’అని బాధ పడ్డారు .మనవాళ్ళకు ప్రత్యెక గమనాలున్తాయని తెలీదు .అందుకే పద్య కవిత్వాస్వాదన అనేది తెలుగు లో విరివిగా లేదు .కవిత్వం ఆలోచనా మృతం.అని ఒప్పుకొనే రసజ్ఞులు కూడా ‘’రాగం దూరం అయినపద్యం కూడా ‘’మ్రుతమే’’ ‘’అంటారు .అందుకే ముందు గా రాగం ,పద్యం అనే పదాలకు అర్ధం రూఢి చేసుకోవాలన్నారు మేష్టారు .
తెలుగు లో వాడే చందాల్ని మూడుగా విడదీశారు మేష్టారు .యదా తదం గా ఉన్న దాన్ని తాళం వెయ్యటానికి అనువుగా ఉన్నవి ,మాత్రల లెక్కన ఏదో ఒక తాళానికి సరి పుచ్చుకోవటానికి వీలైనవి ,ఏ తాళంకిందికీ రానివి .ఇవీ వారు చేసిన విభజన .అవసరం ఉన్నా లేక పోయినా అనేక విషయాల్ని పద్యాలలో పొందు పరచటం ఆయనకు రుచించ లేదు .ఇందులో ఆశీర్వచన పద్యాల్లాంటివి ఉన్నాయి .పద్యం కూడా సంస్కృత భూయిస్టమయిందని బాధ పడ్డారు .చెళ్ళ పిళ్ళ వారి షష్టిపూర్తిర సభ బందర్లో జరిగితే అందరూ పద్యాల్లో ఆయన్ను గూర్చి బాకా లూదిన వారే కాని ఆయన సాహిత్యం గురించి వినాలని ఎవరికీ అనిపించక పోవటం మేస్టారిని కలచి వేసింది .చివరికి శాస్త్రి గారికో నమస్కారం చేసి వెళ్లి పోయారు .
మేస్టారి ఆలోచనలో ‘’రాగం ,నాదం అనేవి ప్రాణాగ్నుల సంయోగం .ఘర్షణ వల్లనే నాదం జనిస్తుంది .రెండు రాగాల మధ్య రంగం లో ఏర్పడే మజిలీలే ప్రత్యెక నాదాలు .వాటినే శ్రుతులన్నారు .సరిగమ పదనిస లనే సప్త స్వరాల స్వర విహరణేరాగం .ఏడు స్వరాల్లో విహరించటానికి 72రాగాలు అమరుతాయి .ఇవే మేళ కర్తలు .వీటిలో జనక రాగాలు ,జన్య
రాగాలు ఉన్నాయి .వీటికి ఆరోహణ ,ఆవ రోహాణా ఉన్నాయి .రాగానికి కనీసం అయిదు స్వరాలున్డాలి .వీటి సంఖ్య 34,848 .మనకు మూడు వేల రాగాలున్నాయి .త్యాగ రాజు దాదాపు రెండొందల రాగాలలో కీర్తనలు రాశారు .కచేరీలలో 150 దాకా రాగాలు పాడుతారు .గాయకులూ తాము పాడే రాగాలను గూర్చి చెప్పరు .వినే వాళ్లకు ఎలాగూ తెలీదు .సంగీతం విన టానికి ప్రిపరేషన్ ఉండటం లేదు ‘’అని మేష్టారు విచారించారు .
పద్యం -శబ్దార్దాల సమ్మేళనం .కనుక పద్యం గురించి ఒకరికొకరు ముచ్చ టించు కో వచ్చు .రాగ స్వరాలు అర్ధానికి అతీతం కనుక అది అసాధ్యమవుతుంది .రాగం గాయకుడి ప్రతిభ మీదనే ఆధార పడుతుంది .రాగం ఒక స్వర ప్రవాహం కనుక అవిచ్చిన్నమైంది .’’అంటారు
‘’రసానికి అనుగుణం గా రాగాలున్నాయనడం పూర్తీ నిజం కాదు .కల్యాణి రాగం ఏడుపు లోను ,ముఖారి కోపం లోను ఒప్పించిన వారున్నారు .అందు చేత పద్య భావానికి చెందినా రసం ఆధారం గా ఏదో ఒక రాగం లో పద్యం పాడాలి అనడం సమంజసం కాదు .వెంకట ముఖి అనేరాజ మండ్రి సంగీత శాస్త్రజ్ఞుడు’’రస రాగ నిర్ణయం లో ఏ ఇద్దరి అభిప్రాయాలూ ఎకీభవించవు ‘’అన్నాడు ‘’అని గుర్తు చేశారు
‘’ఫలాని రాగం లో ఈ పద్యం పాడు ‘’అని ఏ కవీ రాయలేదంటారు మేష్టారు .సంగీత సాహిత్య ప్రవీణుడు రామ రాజ భూషణుడు కూడా తన కవిత్వాన్ని ఫలాని రాగం లో పాడాలని సూచించలేదు .ఏదో ఒక రాగం లో పాడుకోవటం దోషం కాదు .అది కేవలం వ్యక్తీ గతమైనది .దీన్ని జనం మీద రుద్దటం సహించ రానిది ‘’అన్నారు .
‘’కవనం యొక్క సూక్ష్మ ప్రమాణం శబ్దం .గానం యొక్క సూక్ష్మ ప్రమాణం స్వరం .అర్ధ వంతమైన శబ్దానికి ,రస వంతమైన స్వర సంపుటి చేసి నవ్య కళ సృస్టిం చేడు కీర్తన కర్త ‘’‘’మేష్టారు ఉవాచ .పద్యం లో గానం చొర బడితే కవిత్వం ఆవిరై పోతుంది ‘’అని మేస్టారి నిశ్చయ భావం .’’మన నాటకాలలో నటుడికి హార్మోని స్టూ నాటక కర్త కు మించిన దైవం ..’’అని ఎద్దేవా చేశారు .భరతుడి నాట్య శాస్త్ర ప్రమాణాలే మేష్టారికీ ప్రమాణాలు .భరతుడు స్పష్టం గా వాచికాభినయం లో ఛందో విధానం పాటించాలని చెప్పాడు .శ్లోకాలను ,చరణ పదాల మాత్రల గురించి ఎలా జాగ్రత్త పడుతూ ఎలా చదవాలో నిర్దేశించాడు ‘’అని గుర్తు చేశారు మేష్టారు .ప్రదర్శనల్లో శ్లోకాలు చదివే వారు .’’స్త్రీలు పలక వలసిన చోట ‘మహా రాష్ట్ర లో పాడటం ఉండేది .కాని పద్యాన్ని మాత్రం .సౌర సేని లో పఠించే వారు ‘’.అని ‘’సంస్కృత నాటకాల మీద అధ్యయనం చేసిన ‘’బెరిడేల్ కీత్ ‘’అన్నట్లు మాస్టారు గుర్తు చేశారు .19వ శతాబ్దిలో విజయనగరం ఆనంద గజ పతివారి ఆస్థానం లో నాటక ప్రదర్శనల్లో ముందు శ్లోకాలు చదివి తర్వాత పాడే వారు .వసు చరిత్ర కారుడు సంగీతానికి ,సాహిత్యానికి నాద విషయం లో ఉండిన మౌలిక భేదాన్ని ఒక పద్యం లో స్పష్టం చేశాడు .
‘’ఒకటి అక్షర విలసోల్లాసమున మించ –నొకటి తాళ ప్రౌఢిమ నుల్ల సిల్ల ‘’అంటాడు .ఆదికవి నన్నయ ఒక సందర్భం లో ‘’ఉచ్చారణ ‘’దక్షుడి ‘’వల్లనే ‘’శబ్దం ‘’ జీవిస్తుంది ‘’ఆన్నాడని జ్ఞాపకం చేశారు .’’ఆంద్ర నాటక పద్యాన్ని రాణించడం ,నాటకోద్దేశానికి ప్రతి బంధకం .’’అని బుర్ర పగిలేట్లు చెప్పారు భమిడి పాటిజీ .పద్యోచ్చారణ దక్షుడు చేయ వలసిన పని .గాయకుడిది కాదు .భావం గల పద్యాన్ని ప్రకటించ టానికి రాగం ఆటంకం .పద్య పఠనంలో ఛందో జ్ఞానం ఆశించాలి కాని రాగ జ్ఞానం కాదు .మంచి రాగాన్ని తీసుకొచ్చి పద్యానికి అమరిస్తే వినడానికి బాగుంటుంది .అంటే పద్యం పోయి రాగం మిగిలిందన్న మాట . పద్యం బాగా చదవటం లో ఉద్దేశ్యం పద్యం యొక్క అర్ధాన్ని ఎక్కువగా ప్రకటించడం .భావాన్ని
ప్రసారం చెయ్యటం తద్వారా ఒక సాహిత్యానందాన్ని కలగ జేయ్యటం చెవికి హాయిగా సుఖం గా ఉండటానికి కాదు ‘’అని నాటక పద్యం ఖూనీ అయిన తీరు పై మంది పడ్డారు .
ఈ గ్రంధం మొత్తాన్ని ప్రశ్న జవాబు రూపం లో రాశారు ..ఈ గ్రంధం పద్య నాటక కర్తలకూ ,నటులకూ ఒక పెద్ద బాల శిక్ష .ఔచిత్యం తెలిసినా కూడా చదువు కొన్న కొంత మంది పౌరాణిక నటులు కూడా ఈ గందర గోళం నుంచి బయట పడలేక పోయారని ఆవేదన చెందారు కామేశ్వరరావు మేష్టారు .1950కి ముందే హాస్య బ్రహ్మ గారు కొన్ని పద్యాలను చదివి రికార్డు చేశారట ఆ రికార్డు భద్రం గా ఉందొ లేదో తెలియదు ..ఆ నాటి పౌరాణిక నాటక నటులలో స్వర్గీయ అద్దంకి శ్రీరామ మూర్తి గారు పద్యాలను చదివి భావం అర్ధమయ్యేట్లు చేశారని మనందరికీ తెలిసిన విషయమే .ఇలా హాస్య బ్రహ్మ లో’’సంగీత సరస్వతి’’ తో బాటు, ‘’పౌరాణిక పద్య కవి బ్రహ్మ’’ కూడా కలిసి ఒక ‘’విశిష్ట స్వర సాహిత్య బ్రహ్మ ‘’అయ్యారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-13-ఉయ్యూరు
.