నాదారి తీరు -47 మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు

నాదారి తీరు -47

మరి కొన్ని స్పాట్ ముచ్చట్లు

బందరు స్పాట్ సాధారణం గా మార్చి చివర్లో జరిగేది ఆ రోజుల్లో పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పది నుండి ప్రారంభమై ఇరవై రెండు దాకా జరిగేవి ఆ తర్వాత రెండు మూడు రోజుల విశ్రాంతి ఈ లోపు స్పాట్ అప్పాయింట్ మెంట్లు .మార్చి ఇరవయ్యైదు నొ ఆరునొ స్పాట్ మొదలయ్యేది .ఆ తర్వాత పధ్ధతి మారింది .పరీక్షలు  కొంచెం ఆలస్యం గా ప్రారంభమవటంవల్ల స్పాట్ కూడా మారింది .ఏప్రిల్ ఒకటి నుంచి స్పాట్ ప్రారంభమయ్యేది .

ఒక్కో సారి ఉగాది స్పాట్ వాల్యుయేషన్ సమయం లోనే వచ్చేది .శలవు ఉండేదికాదు. పెందరాలే ఇంట్లో పూజచేసి  ఉగాది పచ్చడి  తిని భోజనం కూడా కానిచ్చి తోమ్మిదికే బస్ ఎక్కి బందరు వెళ్ళాల్సి వచ్చేది .అలాగే శ్రీ రామ నవమి కూడా అంతే..మా అమ్మ తద్దినం మార్చి మధ్య లేక చివర్లో వచ్చేది దానికీ సెలవు ఉండేది కాదు. పర్మిషన్ తీసుకొని ఉదయం తోమ్మిదికే కూర్చుని తద్దినం కానిచ్చి భోజనం చేసి, స్పాట్ కు

వెళ్ళాల్సి వచ్చేది .అప్పుడు మా చిలుకూరి వెంకటేశ్వర్లు గారుఉండే వారు కనుక ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి వచ్చి మంత్రంచెప్పి , భోక్త గా ఉండి ఇంకో బ్రాహ్మణుడిని తన తో తెచ్చుకొని నా కంటే స్పీడ్ గా లాగించే వారు .నాకు ఇబ్బంది ఉండేది కాదు ఇలా అరుదుగా మాత్రమె జరిగేది .అక్టోబర్ లో జరిగే సప్లి మెంటరి పరీక్షలకు స్పాట్ కు వెళ్ళాసి వస్తే నవంబర్ లో మా నాన్న గారి ఆబ్దికం కార్తీక శుద్ధ ఏకాదశి కనుక స్పాట్ సమయం లో వచ్చేది .అప్పుడూ అంటే ఉరుకులు ,పరుగులు .ఇన్ని ఇబ్బందులు పడినా ,పండుగలు వచ్చినా స్పాట్ లో సరదాగానే ఉండేది .అంతా ఏంతోకలివిడిగా ఉండి నిర్వహించుకొనే వాళ్ళం .

మార్చి ,ఏప్రిల్ స్పాట్ సమయం లో వర్షాలు బాగా కురిసేవి .వర్షం పడితే బందరు పరిస్తితి చెప్పక్కర్లేదు బురదమయం కంపూ .దేవేంద్ర రావు నేను కొడాలికి చెందిన పి.వి.కృష్ణా రావు గారు స్పాట్ లో ఏదైనా సమస్య వస్తే డి.ఇ వొ .గారి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం సాధించే వాళ్ళం .స్పాట్ సమయం లో టీచర్స్ గిల్డ్ ఎక్సి క్యూటివ్ మీటింగ్ జరిగేది .వెళ్లి సలహాల నిచ్చే వాడినినా  సలహా కోసం అందరూ ఎదురు చూడటం

ఉండేది .నిష్కర్ష గా మాట్లాడుతానని నన్ను అభిమానించే వారు నాయకులూ కార్య కర్తలూ కూడా .

వీలైనప్పుడు కొల్లూరి ని వెళ్లి చూసే వాళ్ళం ఆయన మాతో బాగా మాట్లాడే వాడు .సంస్థా గత విషయాలు వ్యక్తిగత విషయాలు ఉద్యోగ విషయాలు తెలుగు విద్యార్ధి పత్రికా విశేషాలు కాంతారావు నేను ఆంజనేయ శాస్త్రి, జ్ఞాన సుందరం మాట్లాడే వాళ్ళం. ఆయన దగ్గర మాకు చనువు ఎక్కువ .మాకూ ఆయన విలవ నిచ్చే వాడు .అనేక సార్లు ఆయన అనారోగ్యం పాలైతే హాస్పిటల్ లో ఉంటె ఇంటెన్సివ్ కేర్ లో ఉంటె మేము తప్పక వెళ్లి చూసి వచ్చే వాళ్ళం .ఆయన ఆరోగ్యం బాగుపడి ఇంటికి చేరిన తర్వాత మళ్ళీ వెళ్లి పలకరించే వాళ్ళం అందుకే ఆయనకు మేమంటే అభిమానం .మా మాటకు విలువ కూడా .అలా సాగింది కొల్లూరితో మా స్నేహం .ఆయన ఏం ఎల్ సి అని మేము భావించే వాళ్ళం కాదు .మా ఆప్తుడు, మిత్రుడు గా భావించే వాళ్ళం .ఆయన దగ్గర ‘’పొట్టి శర్మ’’  శర్మ గారు అనే గవర్నమెంట్ స్కూల్ సోషల్ మేస్తారుండే వారు బందరు గిల్డ్ హోం పనులాయనే చూసే వాడు . నిక్కచ్చయిన మనిషి మాతో బాగా ఉండే వాడు  అలాగే రామ కృష్ణ అనే పెడన హైస్కూల్ సైన్స్ మేష్టారు కొల్లూరికి సన్నిహితం గా ఉండేవాడు .కొల్లూరిని బావ గారు అనే వాడు మేము అతన్ని ‘’రాజు గారి బామ్మరిది ‘’అనే వాళ్ళం సరదాగా తీసుకొనే వాడు డబ్బు ఖర్చు పెట్టి అందరికీ సాయమూ చేసేవాడు .అతని భార్య ఎల్ ఐ.సి లో ఉద్యోగి .అద్దేపల్లి రామ మోహన రావు గారి తండ్రి జానకి రామయ్య గారు కూడా కొల్లూరి గారి దగ్గర పని చేసే వారు అయన నాకు నేను హిందూ కాలేజి లో ఫిజిక్స్ డిమాన్ స్త్రేటార్ గా పని చేసినప్పటి నుంచీ అంటే సుమారుగా1960 నుంచి తెలుసు అప్పుడాయన హిందూ కాలేజి లో గుమాస్తా గా ఉండే వారు .

ఒక సారి స్పాట్ జరుగుతుండగా టౌన్ హాల్ లో రాత్రి ఏడింటికి నారాయణ రెడ్డి, ఏం .వి.ఎల్ నరసింహా రావు ల సాహిత్య సభ ఉంటె ఉండి పోయి విన్నాను .నారాయణ రెడ్డి మాట్లాడిన తర్వాత ఏం .వి.ఎల్ మాట్లాడాడు .ఆ సాహిత్య ఉపన్యాసం జన్మ లో మారవ లేనిది యెంత బాగా మాట్లాడాడో మాటల్లో వర్ణించ రానిది .నారాయణ రెడ్డి ఉపన్యాసం దీని ముందు చలా పేలవం గా ఉందని నేనే కాదు నాతొ పాటు అందరూ అనుకొన్నారు .అంత గొప్ప స్పీకర్ ఏం వి.ఎల్..ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత గా ,నూజి వీడు కాలేజి తెలుగు లెక్చరర్ గా ఆయన సుప్రసిద్ధుడు .నూజివీడులో ప్రతి నెలా సాహిత్య కార్య క్రమం నిర్వహించి ,విద్యార్ధులను ప్రోత్సహించేవాడు .వారితో రాయించే వాడు .రేడియో నాటకాల్లో అతని గొంతు వింటే పరవశం కలిగేది .ఇన్ని ఉండి కూడా తాగుడు వల్లతొందర గా చని పోవటం బాధాకరం .సినీ మాయలో పడి జీవితాన్ని అర్ర్దాంతరం గా ముగించుకొన్న అభాగ్యుడు ఏం వి.ఎల్.ఒక సారి నూజి వీడు నుంచి బెజ వాడ కు నేను వస్తుంటే  నాపక్క సీటు లో కూర్చున్నాడు . బెజవాడ వచ్చే దాకా ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ సాహితీ సుగతుడిని నేనెప్పుడూ మరచి పోలేను .

ఒక సారి బందరు లైబ్రరీలో రాత్రి పూటా ఆవంత్స సోమ సుందరం గారి ఉపన్యాసం దానికోసం నేనూ కాంతా రావు శాస్త్రి అక్కడే ఉంది విన్నాం అదే మొదటి సారి ఆయన్ను చూడటం లైబ్రరీలో ఇలాంటి వి నిర్వహించటం లో లైబ్రేరియన్  అయిన చంద్ర శేఖర రావు గారునిష్ణాతులు .ఆయన ఆతర్వాత సేక్రేఅతరి కూడా అయ్యారు అప్పుడు దొండ పాటి దేవదాసు అటెండర్ గా ఉండేవారు అప్పటికే మంచి కధకుడిగా ప్రసిద్ధి పొందాడు ఆయన్నీఅప్పుడే చూడటం అప్పటి నుంచి అయన చని పోయే దాకా మా సాహితీ స్నేహం కోన సాగింది

చెరుకు  రైతు యాత్ర

ఉయ్యూరు కే.సి.పి.వారు ప్రతి ఏడాది చెరుకు రైతుల్ని బస్ ల మీద తీస్కోని వెళ్లి రాష్ట్రం లో లేక ఇతర రాష్ట్రాలలో చెరుకు సాగు చెరుకు ఫాక్టరీ లను చూపించటం ఒక సంప్రదాయం గా ఉండేది .అది నాకు తెలియ లేదు చాలా కాలం నేనూ చెరుకు రైతునే .1971లో వాళ్ళు మహా రాష్ట్ర కు టూర్ ప్లాన్ చేశారు .ఈ విషయం మా మామయ్య గారి అబ్బాయి పద్మ నాభానికి తెలిసి ఈ సారి నన్ను వెళ్ళమన్నాడు దానికి కావలసిన

ఏర్పాట్లన్నీ తానూ చేస్తానన్నాడు అప్పుడు నేను ఉయ్యూరు హైస్కూల్ లో పని చేస్తున్నాను సరే అన్నాను .రెండు బస్సులలో రైతులను తీసుకు వెళ్ళారు .నేనెక్కిన బస్ లో మా డ్రిల్ మేష్టారు సుబ్బారావు గారు కూడా ఉన్నారు అలాగే తెలిసిన కుందేరు రైతులున్నారు టూర్ నిర్వహణ చేసే మీసాల రెడ్డి గారు , ,ఇంకో షుగర్ కెన్ ఆఫీసర్ గారూ ఉన్నారు

బస్ రాత్రి పూట బయల్దేరి ఉదయానికి హైదరా బాద్ చేరింది .అక్కడ కాకాని వెంకట రత్నం గారు మాకు ద్వారాకా హోటల్ లో బస ఏర్పాటు చేశారు ఆయన అప్పుడు వ్యవసాయ మంత్రి .మొహాలు కడిగి కాఫీ టిఫిన్ అయిన తర్వాత బస్సులు రెండు కాకాని గారి ఇంటికి వెళ్ళాయి .ఆయన మమ్మల్ని ఆప్యాయం గా సాదరం గా ఆహ్వానించారు .కాఫీ లిప్పించారు కోడలి చేత .అన్నీ చూసి జాగ్రత్త గా రండి అని హితవు చెప్పారు .బస్సులు బయల్దేరాయి .

మహా రాష్ట్ర లో షిర్డీ దగ్గర బోలేగాం అదేదో పేరున్న చోటికి చేరాయి అక్కడ ఫాక్టరీలో బస .వాళ్ళే టిఫిన్ భోజనం ఏర్పాటు చేశారు మర్నాడు చెరుకు తోటలకు తీసుకొని వెళ్ళారు మనకు పన్నెండు నెలల పంట చెరకు .వాళ్లకు పద్దెనిమిది నెలల పంట .మనలాగా ఎత్తుగా అక్కడ

చచెరుకు  పెరగదు .ఎత్తు తక్కువ ,లావు ఎక్కువ .మన చేరుక్కు ఆకుల తో ‘’జడ అల్లటం ‘’ఉంది .అది వాళ్లకు తెలీదు .మన రైతులు జడ అల్లి చూపిస్తే అక్కడి రైతులు ఆశ్చర్య పోయారు .జడ అల్లటం వల్ల చెరుకు గాలికి, వర్షాలకు పడి పోదు .అక్కడ రైతులకు ఎన్నో రాయితీలిస్తారు అధిక దిగుబడి నిచ్చే విత్తనం సప్ప్లై చేస్తారు .చెరుకు వేయటం దగ్గర్నుంచి ఫాక్టరికి తోలేదాకా వారు రైతులకు అండగా ఉండి అన్నీ ఉచితం గా సేవ లాండ జేస్తారు .ల మనకు ఇలా లేదు.ఏదో విత్తనం సబ్సిడీ ,ఎరువులు కొద్దిగా ఇవ్వటం తప్ప మిగిలిన ఉచిత సదుపాయాలూ మనకు లేవు .అక్కడున్నవి సహకార చక్కర కర్మా గారాలు .కనుక రైతులు అందులో భాగ స్వామ్యులు .అప్పటికి వై బి   చవాన్ ,శరద్ పవార్ సహకార పరిశ్రమలకు తిరుగు లేని నాయకులు .ఇలా రెండు మూడు వ్యవసాయ క్షేత్రాలు సందర్శిమ్చాము .

అక్కడి నుండి షిర్డీ వెళ్లాం .అప్పుడు జనం లేరు నీటి సదుపాయమూ లేదు ఆలయం దగ్గర పంపు నీళ్ళలో స్నానం చేసి హాయిగా దర్శనం చేసుకోన్నాం  భోజనం కూడా తక్కువ రేట్ కే పెట్టారు. భోజనం అంటే పూరీ కూర .అప్పుడు ద్వారకా మాయి కి హడావిడి లేదు. అంతా నిర్జన

ప్రదేశం గా ఉండి ఇదే నేను షిర్డీ సాయి బాబా ను మొదటి సారిగా చూడటం .ఆ తర్వాత అజంతా కు తీసుకు వెళ్ళారు బాగానే చూపించారు లైట్లు వేసి గుహలలో ఉన్న చిత్రాలను చూపించారు. అబ్బురం గా ఉన్నాయి .ఆ రంగుల మేళ వింపు .అక్కడి నుంచి బొంబాయి వెళ్లాం అక్కడ మన డ్రైవర్ బదులు మహా రాష్ట్ర డ్రైవర్ ను ఏర్పాటు చేసుకోవాలి అలానే చేశారు .అక్కడ గెట్ వే ఆఫ్ ఇండియా చూశాం అద్భుతమని పిస్తుంది సాయంత్రం తాజ్ మహల్ హోటల్ కు వెళ్లాం ఆ రోజుల్లో అక్కడ టీ పది రూపాయలు. పాంట్ షార్ట్ ఉంటేనే లోపలి అనుమతి. మా రైతులు పంచా లుంగీలతో వెళ్ళే ప్రయత్నం చేస్తే రానీయ లేదు .నేనూ సుబ్బా రావు ఆరు వెళ్లి టీ తాగాం .అక్కడ మహా రాష్ట్ర ప్రభుత్వా స్టోర్స్ లో మఫ్లర్ స్వెట్టర్ రగ్గులు పాతిక రూపాయలకు ఒకటి చొప్పున కొన్నాం చాలా ఏళ్ళు మన్నాయి .

ఈ టూరు సంగతి మా తమ్ముడికి ముందే రాశాను. కనుక వాడు బొంబాయి వచ్చి నన్ను తనాతో  పూనా  తీసుకొని వెళ్ళాడు .అప్పుడు వాడు అక్కడ ఆర్డినెన్స్  ఫాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు .వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మర్నాడు నన్ను పండరీ పురం జ్ఞాన దేవుడి గ్రామం అలండి కి స్కూటర్ మీద తీసుకొని వెళ్లి చూపించి ఇంటికి తెసుకోచ్చాడు .అప్పుడు వాడు, మా మరదలు ఒక అపార్ట్ మెంట్ లో చిన్న రెండుగదుల ఫ్లాట్ లో ఉన్నాడు .నన్ను మళ్ళీ మా బృందానికి పూనా లో అప్పగించాడు .అక్కడి నుండి సరాసరి హైదరాబాద్ ఉయ్యూరు కు చేరుకొన్నాము .ఇలా చెరుకు రైతు యాత్రలో పాల్గొన్న అనుభూతి దక్కింది .ఖర్చులన్నీ కే.సి.పి వాళ్ళవే .ఇంటికి రాగానే నాకు ముప్పాళ ట్రాన్స్ ఫర్ అయినట్లు తెలిసింది .ఆ వివరాలన్నీ ఇది వరకే రాశాను .

సశేషం

మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –10-12-13-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.