
చరిత్ర పరిశోధన, చరిత్ర గ్రం«థ రచనే జీవిత లక్ష్యంగా సాగిపోతున్న వారు ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రకారుల సంఘం వ్యవస్థాపకుడిగా ఎన్నో గురుతరమైన బాధ్యతల్ని నిర్వహించిన వారాయన. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమగ్ర చరిత్ర గ్రంథాలేవీ లేవని ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా ఆ పనిమీదే ఉండిపోయారాయన. 200 మంది చరిత్రకారులను సమాయత్త పరిచి తాను ప్రధాన సంపాదకుడుగా ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి’ పేరుతో 8 సంపుటాలు ముద్రించే పనిలో ఉన్నారు ఆయన. ఇప్పటికే 5 సంపుటాలు విడుదలయ్యాయి. 75 ఏళ్ల జీవన ప్రస్థానంలో ఆయనకు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
ఎంఏ విద్యార్థులకు పాఠం చెప్పే అవకాశం రావడమే కాకుండా, ఎన్నో విశ్వవిద్యాలయాలతో అనుబంధం ఏర్పరుచుకునే అవకాశం కలిగింది. నా దృష్టి పదునెక్కింది. నా దృక్పథం విస్తరించింది. మనల్ని ఎదగకుండా చేసే బంధాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, వాటిని అధిగమిస్తే గానీ, ఆకాశం మన చేతికి రాదని ఆ పరిణామాలు నాకో పాఠం నేర్పాయి.
మా ఊరు పాకల. అప్పట్లో అది నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకాలో ఉండేది. ఇప్పుడది ప్రకాశం జిల్లాలో ఉంది. మా ఊరికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది. చాలా ప్రశాంతమైన ఊరు. కందుకూరు తాలూకాలోని మిగతా గ్రామాలతో పోలిస్తే ఎక్కువ మంది చదువుకున్నది మా ఊరు వాళ్లే. అందుకే మా ఊరిని కొందరు సరస్వతీ గ్రామం అని పిలిచేవారు. నా మనసు చదువు మీదికి వెళ్లడానికి ఈ వాతావరణం ఎంతగానో దోహదం చేసింది.
మా కుటుంబం విషయానికి కొస్తే, జాతీయోద్యమంలో మా నాన్న ప్రత్యక్షంగా ఏమీ పాల్గొనలేదు గానీ, మా చిన్నాన్న పాల్గొన్నాడు. హరిద్వార్ కాంగ్రెస్ మహాసభకు వెళ్లి, గాంధీ మీద తిరుగుబాటు చేసిన సుభాష్ చంద్రబోసుకు ఓటు వేశాడు. నాకు 16 ఏళ్లు వచ్చేసరికి ఈ జాతీయోద్యమ భావజాల స్ఫూర్తి క్రమేపీ వామపక్ష భావజాలంగా మారిపోయింది. నాకు ఊహ తెలిసిన 50 వ దశకం, నా చదువు ఒక స్థాయికి చేరుకున్న 60 వ దశకం ఈ రెండు దశకాలు మన దేశ చరిత్రలో ఎంతో గొప్పవి. 1947 లో స్వాతంత్య్రం సాధించిన ఆ జాతీయోద్యమ స్పూర్తి, ఆ త్యాగనిరతి, నిబద్ధత మా పసిమనసులను అమితంగా ప్రభావితం చేశాయి. మా ఆలోచనల మీద ఒక బలమైన ముద్ర వేశాయి.
అయినా ప్రేమిస్తారు
కావలిలో బీఏ(చరిత్ర)చేస్తున్న నేను కొన్ని ఆర్థిక కారణాల వల్ల విజయవాడలోని సి.ఆర్.ఆర్, సి.వి.ఆర్ కాలేజ్‌లో చేరాను. అక్కడ విశ్వనాథ సత్యనారాయణగారు మాకు తెలుగు బోధించేవారు. ఆయనంతటి అద్భుతమైన టీచర్‌ను నా జీవితంలో ఎక్కడా చూడలేదు. తెలిసీ తెలియని వామపక్ష భావాలు అప్పటికే నాలో ఉండేవి. అప్పుడప్పుడు క్లాసులో ఆయన అడిగే ప్రశ్నలకు నేనిచ్చే సమాధానాల ద్వారా విశ్వనాథవారు ఆ విషయాన్ని పసిగట్టేశారు. ఒకరోజు క్లాసులో ఆయన నాకేదో ప్రశ్న వేశారు. నేను జవాబు చెప్పలేకపోయాను. వెంటనే ఆయన “ప్రజాశక్తి పాస్…పెద్ద బాలశిక్ష ఫెయిల్” అన్నారు. నాకు ఆ మాటల్లోని భావం వెంటనే స్ఫురించకపోయినా ఆ తర్వాత బోధపడింది. “కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాడివి కనుక ప్రజాశక్తి విషయాలు చెప్పగలవు గానీ, దానికి సంబంధం లేని పెద్ద బాలశిక్ష విషయాలు నువ్వు చెప్పలేకపోతున్నావు” అన్న అర్థం ఆ మాటల్లో నాకు వినిపించింది.
అప్పుడే కాదు ఆయన నోట ఎప్పుడూ కూడా అలాంటి భావగర్భితమైన మాటలే వచ్చేవి. నిజానికి తెలుగు భాష పట్ల నాలో ఒక మమకారం ఏర్పడటానికి, భాష పట్ల ఒక అభినివేశం పెంచుకోవాలన్న సంకల్పం నాలో నాటుకోవడానికి ఆయనే కారణం. కాకపోతే కావలిలో టీచర్లకు, స్టూడెంట్లకూ మధ్య ఉన్న ఆత్మీయ బంధం ఇక్కడ కనిపించేది కాదు. ఈ కాలేజీ వాతావరణం నాకు నచ్చలేదు. పైగా మొదట్నించి నా దృష్టి చదువు మీద తక్కువ, ఇతర విద్యార్థి కార్యక్రమాలపై ఎక్కువ. ఈ కాలేజీ ఎందుకో నాకు అంత అనువైనదిగా అనిపించలేదు. ఏమైనా అక్కడ చేరిన 5 మాసాలకే నేను టీ సీ తీసుకుని తిరిగి కావలి కాలేజీలో చేరడానికి బయల్దేరాను. ఆ విషయం తెలిసిన విశ్వనా«థ వారు “ఏరా వెళ్లి పోతున్నావా? ఇక్కడే చదువుకోరా!” అన్నారు ఎంతో ఆ్రర్దంగా. నేనంటే ఆయనకు కోపం ఉంటుందనుకున్నానే గానీ, నా పట్ల ఆయనకు అంతటి ఆత్మీయ భావన ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. అప్పటికి ఇంకా జ్ఞానపీఠ అవార్డు రాలేదు కానీ, కవి సామ్రాట్టుగా ఆయన ఎంతో ప్రసిద్ధులే. అంతటి వ్యక్తి ఒక మామూలు విద్యార్థినైన నా మీద అంతటి మమకారం చూపడం నన్ను ఎంతో పులకింప చేసింది. నిజానికి విశ్వనాథ వారి భావజాలానికి పూర్తిగా భిన్నమైన భావజాలం నాది. అయినా ఆయన నన్ను ప్రేమించారు. మహానుభావులు వ్యక్తిగత భావజాలాలకు అతీతంగా ఉంటారేమోనని ఆ సంఘటన ద్వారా నాకు తెలిసొచ్చింది.
చరిత్ర అడుగులెంట….
వాల్తేరులో ఎం.ఏ పూర్తి కాగానే నేను డిగ్రీ చదువుకున్న కావలి కాలేజీలోనే నాకు నా 21వ ఏట లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. ఈలోగా పెళ్లయ్యింది. ముగ్గురు పిల్లలు పుట్టారు. అలా 10 ఏళ్లు గడిచాయి. కానీ, పాఠాలు చెప్పడానికే పరిమితమైపోయిన నా జీవితం ఎక్కడో కుదించుకుపోతున్న భావన కలిగింది. చరిత్రకు సంబంధించిన ఏదైనా ఒక లోతైన అంశం మీద పరిశోధన చేయాలనిపించింది. అప్పుడు నాకు 33 ఏళ్లు ఉంటాయి. ఎం. ఫిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఢిల్లీలోని జెఎన్టీయూలో సీటు వచ్చింది. ఆ తరువాత పి.హెచ్.డిలో చేరాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి కుమారుడు సర్వేపల్లి గోపాల్ నాకు గైడ్‌గా ఉన్నారు. చారిత్రక సంఘటనల మధ్య ఉండే అంతస్సంబంధం ఏమిటి? చరిత్రలో ఏ చోదక శ క్తులు ఉన్నాయి? చరిత్ర ఎలా ఏర్పడుతుంది? ఎలా ముందుకు నడుస్తుంది?
సమాజంలోని అనేక వర్గాల ప్రజల మధ్య ఉండే సంబంధాలు ఎలా ఏర్పడుతున్నాయి? ఇవి భావజాల ప్రాతిపదికన ఏర్పడుతున్నాయా? ఆర్థిక ప్రాతిపదికన ఏర్పడుతున్నాయా? సామాజిక విషయాల ప్రాతిపదికన ఏర్పడుతున్నాయా? వీటిలో ఏది ముఖ్యమైన చోదక శక్తి? అనే విషయాల్ని తెలుసుకోవడానికి, చరిత్రకు సంబంధించిన నిజమైన జ్ఞాన స్పృహ కలగడానికి, నా కళ్లు తెరుచుకోవడానికి జెఎన్టీయూ ఎంతగానో దోహదం చేసింది. అదే ఆధునిక కాలంలో ఆంధ్రదేశ సామాజిక చరిత్ర మీద పరిశోధన చేయడానికి ప్రేరణ అయ్యింది. ఆ సిద్ధాంత గ్రంథమే “ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమాలు” అనే పేరుతో తెలుగులోకి అనువాదమై ఇప్పటికి నాలుగు ముద్రణలు అయ్యింది. అది నాకు బాగా పేరు తెచ్చింది. చదువుకునే రోజుల్లో విద్యార్థి కార్యకలాపాలకే ఎక్కువ సమయం కేటాయించిన నాకు జెఎన్టీయూలో చేరాక నిజమైన విద్యార్థి భావన కలిగింది. గాలివాటంగా సాగిపోయే జీవితాలకు కూడా ఎప్పడో ఒకప్పుడు తనను తాను నిరూపించుకునే అద్భుతమైన అవకాశాలు వస్తాయి. వాటిని అర్థం చేసుకుంటే గానీ, జీవితం సార్థకం కాదని నాకనిపిస్తుంది.
సందిగ్ధంలోంచి విముక్తమై….
పీహెచ్డీ పూర్తి కాగానే మళ్లీ కావలికి వెళ్లి పాతికేళ్లు అక్కడే పనిచేశాను. అందులో నాలుగేళ్లు ప్రిన్సిపాల్‌గా చేశాను. అయితే ప్రిన్సిపాల్‌గా చేస్తున్న కాలంలో నాలో ఒక తీవ్రమైన అంతర్మ«థనం మొదలయ్యింది. పరిపాలనా వ్యవహారాలు చూడటం మన పని కాదనిపించింది. అల్పమైన కారణాలకే జరిగే అతి పెద్ద గొడవలు, సమ్మెలు, ధర్నాలు, ఆత్యహత్యలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, ప్రభుత్వం నుంచి సకాలంలో స్కాలర్షిప్లు అందకపోతే అప్పుతెచ్చి ఆ హాస్టల్ బాకీలు చెల్లించడం ఇవ న్నీ నాకు చిరాకు కలిగించాయి. అంతకన్నా ఉన్నతమైన పని చేసే అవకాశం ఉండి కూడా వీటిలో పడి ఉండడం ఎంత మాత్రం ఉచితం కాదనిపించింది. ఏదైనా యూనివర్సిటీకి వెళ్లాలనిపించింది. ఆ మాటే కొందరితో అన్నాను కూడా. కానీ, ఆ ప్రాంతీయులంతా “అలా ఎలా వెళతారు? మీరు చదువుకున్న కాలేజీ కదా! ఇది మీ మాతృ సంస్థ. దీన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లే బాధ్యత మీకు లేదా?” అంటూ దాదాపు ఆరు మాసాల పాటు నా మీద ఒత్తిడి తెచ్చారు. నాలో కూడా ఒక సందిగ్ధావస్థ మొదలయ్యింది.
నిజంగానే నా మాతృసంస్థకు ద్రోహం చేస్తున్నానా? అంటూ ఒక డోలాయమానంలో పడిపోయాను. ఆ పరిణామాలు నన్ను తీవ్రమైన ఆత్మసంఘర్షణకు గురిచేశాయి. కానీ, అవతల పరిపాలనా విషయాల పట్ల ఆసక్తి ఉన్న ఎందరో ఉన్నారు. వారికి ఆసక్తి ఉన్న బాధ్యతల్ని వారికి అప్పగించకుండా నాకున్న వేరే ఆసక్తుల్ని చంపుకుని ఇక్కడ పడి ఉండడం ఎందుకు? అనిపించింది. చివరికి ఒకరి సహకారంతో కాలేజీ వ్యవస్థాపకుడ్ని ఒప్పించి యూనివర్సిటీ జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాను. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాబ్ రావడంతో నేను వెళ్లిపోయాను. ఎంఏ విద్యార్థులకు పాఠం చెప్పే అవకాశం రావడమే కాకుండా, ఎన్నో విశ్వవిద్యాలయాలతో అనుబంధం ఏర్పరుచుకునే అవకాశం కలిగింది. నా దృష్టి పదునెక్కింది. నా దృక్పథం విస్తరించింది. మనల్ని ఎదగకుండా చేసే బంధాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ, వాటిని అధిగమిస్తే గానీ, ఆకాశం మన చేతికి రాదని ఆ పరిణామాలు నాకో పాఠం నేర్పాయి.
నిర్ణయాలు వేళ్లూనుకుని
జెన్టీయూలో పిహెచ్డీ చేస్తున్న కాలంలోనే బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. అప్పుడు మేము మత భావజాలానికి వ్యతిరేకంగా అక్కడ చాలా కార్యక్రమాలు చేశాం. అన్ని మతాలూ, అన్ని కులాలూ ఉన్న దేశం మనది. ఈ దేశానికి సంకీర్ణ సంస్కృతి ఒక్కటే మార్గం. అది పోగొట్టుకున్న నాడు ఈ దే శానికి ఒక వ్యక్తిత్వమే లేకుండా పోతుందని నేను బలంగా నమ్ముతాను. అయితే ఈ భావజాలానికి, నా వ్యక్తిగత నిర్ణయాలకూ మధ్య ఒకసారి ఘర్షణ వచ్చింది. నా కూతురు, ఆమె భర్త ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న రోజులవి. నా కూతురు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు రంజాన్ రోజున అబ్బాయి పుట్టాడు. వాడికి ఏదైనా ఒక ముస్లిం పేరు పెట్టాలన్న ఆలోచన నాకు కలిగింది. ఈ విషయాన్నే నా కూతురు, అల్లుడి ముందు ప్రస్తావించాను. అయితే ఇది నా భావజాలాన్ని ఆ పిల్లాడి మీద రుద్దినట్టు అవుతుందేమో అని కూడా ఒకసారి ఆలోచించమని చెప్పాను. “అది చాలా గొప్ప ఆలోచన. మీ భావజాలాన్ని రుద్దినట్లు కాద”ని ఇద్దరూ అన్నారు. నేను కొంతమంది ముస్లిం సోదరుల సలహాతో వాడికి ఇర్ఫాన్ (వివేకవంతుడు) అనే పేరు పెట్టాను. ఆ తర్వాత ఒకసారి కొడుకుతో సహా ఢిల్లీ వెళుతున్న నా కూతురును హైదరాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఏపి ఎక్స్‌ప్రెస్ ఎక్కించి ఇంటికి వచ్చాను.
అయితే, రైల్లో బాంబు పెట్టారన్న వదంతి కారణంగా మార్గ మధ్యంలో ఎక్కడో రైలు ఆపేశారని నా కూతురు ఫోన్ చేసింది. ప్యాసెంజర్ల లిస్టులో నా మనవడి పేరు చూసిన పోలీసులు నా కూతురు వద్దకు వచ్చి ఆ బాంబులు పెట్టింది ముస్లింలే అన్న భావనతో ‘ఇర్ఫాన్’ ఎవర ని అడిగారట. విషయం తెలిసిన మా అమ్మాయి “మేము హిందువులమే. నా పేరు విద్య” అని చెప్పింది. “మీరు హిందువులే అయితే మీ అబ్బాయికి ఇర్ఫాన్ అని ఎందుకు పెట్టారు?” అంటూ పోలీసులు నిలదీశారట. మా అమ్మాయి గట్టిగా సమాధానం చెప్పాక పోలీసులు వెళ్లిపోయారట. ఆ తర్వాత ఒకరోజు మా అల్లుడు, కూతురు సమక్షంలో మళ్లీ ఆ ప్రస్తావన తెచ్చాను. ఇలాంటి సమస్యలు మునుముందు కూడా ఎన్నో రావచ్చు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అబ్బాయి పేరు మార్చుకోవచ్చు అన్నాను. సమస్యలు వచ్చినా సరే! ఆ పేరు మార్చే ప్రసక్తే లేదంటూ వారిద్దరూ కరాఖండిగా చెప్పేశారు. నా మనమడు ఇప్పటికీ ఆ పేరుతోనే కొనసాగుతున్నాడు. నిర్ణయాలంటూ తీసుకున్నాక వాటి తాలూకు కష్టనష్టాలకు సిద్ధం కాకపోతే ఏ నిర్ణయమైనా అమలు కావడం కష్టమే కదా అనిపిస్తుంది.
బమ్మెర
ఫోటోలు: ఎం. శివకుమార్