ఊపిరున్నంత వరకూ ఊళ్లోనే అంటున్న సోమి రెడ్డి చంద్ర శేఖర రెడ్డి -ఆంద్ర జ్యోతి

 

‘మా ఊరు ఎంత అందమైనదో, ఊరివాళ్లు చూపించే ఆత్మీయత అంతకన్నా గొప్పది. నేనింతవాణ్నయ్యానంటే అది మా ఊరి చలవే. అందుకే నేను మా ఊళ్లో తప్ప మరెక్కడా ఇల్లు కట్టుకోలేదు…’ అని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. నెల్లూరుకు సమీపంలో ఉండే అల్లీపురం ఆయన సొంతూరు. సోమిరెడ్డి చెబుతున్న సొంతూరు విశేషాలే నేటి ‘మా ఊరు’

“మా నాన్న వాళ్లు నలుగురు అన్నదమ్ములు. మా పెద్ద పెద్దనాన్న ఆదినారాయణరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. స్వాతంత్య్రం రాకముందే రెండుసార్లు జిల్లా బోర్డు సభ్యుడిగా పనిచేశారు. అప్పట్లోనే ఎస్.ఎస్.ఎల్.సి పూర్తి చేశారాయన. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడేవారు. ప్రభుత్వం అయిదెకరాల భూమి ఇస్తే పేదలకిచ్చేశారు. రెండో పెద్దనాన్న చంద్రశేఖర్ రెడ్డి పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయ పనులు, ఇంటి వ్యవహారాలన్నీ ఆయనే చూసేవారు. మా నాన్న డిగ్రీ వరకు చదువుకున్నారు. ఇరవై అయిదేళ్లపాటు మా ఊరి సర్పంచ్‌గా పనిచేశారు. కొన్నాళ్లు జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మా బాబాయి రాధాకృష్ణారెడ్డి కూడా డిగ్రీ పూర్తిచేశారు. మా ఊరికి సమీపంలోని వరిగొండ మేజర్ పంచాయతీకి పద్దెనిమిదేళ్లు సర్పంచ్‌గా ఉన్నారు. అలా అల్లీపురం, వ రిగొండ.. రెండు మేజర్ పంచాయతీల బాధ్యత మా కుటుంబానిదే. నాకు ఇద్దరు అక్కలు, ఓ తమ్ముడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో ఎప్పుడూ బోలెడుమంది ఉండేవాళ్లం.

సందడే సందడి
అల్లీపురం చుట్టుపక్కల గ్రామాల్లో నూటయాభై ఎకరాలకు పైగా భూములుండేవి మాకు. అవన్నీ నెల్లూరు చెరువు కింది భూములు. చెరువు నుంచి నె ల్లూరు నడిమధ్యగా కాలువ లుండేవి. నెల్లూరులో ఇళ్ల డ్రైనేజీ మొత్తం కాలువల్లోకి వదిలేవారు. ఆ నీరు మా పొలాలకి వస్తుండేది. అదంతా సత్తువగా ఉండేది. మేమసలు ఎరువులు వేసే పనే ఉండేది కాదు. ఏడాదికి మూడు పంటలు వరి పండించేవారు. ఒక్క పంట వెయ్యకపోయినా సత్తువ ఎక్కువయి ఇబ్బందిగా మారేది. కొన్ని భూముల్లో మామిడి, నిమ్మ తోటలు పెంచేవారు. పొలాల గట్లపై కొబ్బరిచెట్లు ఉండేవి. మా ఇంట్లో తెల్లవారుజాము నుంచి ఒకటే సందడి. ఇల్లు చాలా పెద్దది. బయట ఓ వైపు గేదెలు, మరోవైపు ఎద్దులు, పెద్ద గడ్డివాములు, ఎద్దుల బండ్లు, నాగ ళ్లు ఉండేవి. ఇంటి నిండా మనుషులున్నా, ఎవరి పనుల్లో వారుండేవారు. వంటలు, మనుషుల రాకపోకలు అంతా కోలాహలంగా ఉండేది. ఏ రోజయినా నిద్ర లేచేసరికి ఇదే దృశ్యం. ఖాళీ దొరికితే చాలు, మా ఇంటి ముందుండే అరుగుల మీదకి జనం చేరేవారు. తాపీగా కూర్చొని ఊరి విషయాలు మొదలు దేశ రాజకీయాల వరకూ అన్నీ చర్చిస్తుండేవారు. ఇక ఊళ్లో ఏ తగువైనా దానికి పరిష్కారం మా కుటుంబమే చెప్పాలి. అంత గౌరవం. మొత్తానికి మా ఇల్లంతా ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది.

రోజూ చేపలకూరే
నా చదువంతా నెల్లూరులోనే సాగింది. నేనే కాదు, మా ఇంట్లో పిల్లలమంతా ఆర్.ఎస్.ఆర్ కాలేజీలోనే చదువుకున్నాం. నిద్రలేచిన వెంటనే పోటాపోటీగా సిద్ధమయ్యేవాళ్లం. ఇరవై మందికి పైగా ఉన్న మా అందరికీ ఒకేసారి భోజనాలు వడ్డించేవారు. బడికి వెళ్లడానికి ఒక ఒంటెద్దు బండి, మరో ఎడ్ల బండిని మాకు కేటాయించేవారు. మధ్యాహ్నం అందరికీ భోజనాలు వచ్చేవి. సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్. మాకోసం ఒక ఉపాధ్యాయుణ్ని ప్రత్యేకంగా నియమించారు. ఆయనకి మా ఇంటి పక్కనే ఓ గది కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వరకు చదువుకునేవాళ్లం. మా ఊళ్లో కాలువలు, నీటిగుంతలు ఎక్కువ.

సమీపంలోనే పెన్నానది ఉంది. దగ్గర్లోనే సముద్రతీర ప్రాంతం. దాంతో చేపలు ఎక్కువగా దొరికేవి. ఊళ్లోకి చేపల బుట్ట వచ్చిందంటే, ముందుగా మా ఇంట్లోనే దింపేవారు. అందుకే మా ఆహారంలో చేపలు, రొయ్యలకు ప్రత్యేక స్థానం ఉండేది. చింతచిగురు వేసి చేసే చేపల కూర అమోఘం. ఇక పెరట్లో, తోటల్లో ఎక్కడ చూసినా కోళ్లే. ఎప్పడంటే అప్పుడే వాటిని కోసి వండేసేవారు. పంటలు చేతికొచ్చే సమయంలో కౌజు పిట్టలు ఎక్కువ దొరికేవి. మా ఊరివాళ్లు కౌజు మాంసం బాగా తినేవారు. మా ఇంటిలో మాత్రం వండేవారు కాదు. శనివారం మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.

అల్లరే అల్లరి
ఇంట్లోని పిల్లలంతా ఎంతో ప్రేమగా ఉండేవాళ్లం. ఎవరికి చిన్నగాయమైనా అందరం బాధపడేవాళ్లం. మా అల్లరికి హద్దే ఉండేది కాదు. మా రెండో పెదనాన్న అంటే మాకందరికీ భయం. ఓసారి వేసవి సెలవుల్లో పిల్లలమంతా జాఫర్ సాహె బ్ కాలవ వద్దకి వెళ్లాం. తాటిమాను మీద నడుస్తూ కాలవ దాటడం చూసినవాళ్లు పెదనాన్నకు చెప్పారు. అంతే – మా అందర్నీ ఆయన గంట పాటు గోడకుర్చీ వేయించారు. నాకు మంత్రి పదవి వచ్చిన తరువాత అక్కడ వంతెన నిర్మించేలా చేశా. చిన్నప్పుడు మేం బయటకెళ్లి ఏం చేసినా, నిమిషాలోన్లే ఇంట్లోవాళ్లకి తెలిసిపోయేది. గోడకుర్చీ, గుంజీలు వంటి శిక్షలు తప్పేవి కావు. అయినా మా అల్లరి మాత్రం ఆగేది కాదు. మా పెదనాన్న సిగరెట్లు, చుట్టలు ఒక గూట్లో పెట్టేవారు. ఒకసారి పిల్లలంతా కలిసి సిగరెట్లు తాగుదామని ప్రయత్నించాం. పొగతో ఉక్కిరిబిక్కిరైపోయిన నేను తర్వాతెప్పుడూ పొగ జోలికి పోలేదు.

మా సేద్యగాళ్లు కల్లు తెచ్చిస్తే మగపిల్లలంతా తాగేవాళ్లం. మా ఆటలన్నీ ఇంటి ఖాళీ స్థలంలోనే. అప్పుడప్పుడు ఇంటి వెనక్కు వెళ్లి మూడు ముక్కల పేకాట కూడా ఆడేవాళ్లంగాని కాస్త పెద్దయ్యాక మానేశాం. హైస్కూలు, కాలేజీ రోజుల్లో క్రికెట్ అంటే అభిమానం ఎక్కువ. పండుగ, వేసవి సెలవుల్లో మా ఇద్దరు మేనత్తల పిల్లలు కూడా వచ్చేవాళ్లు. అప్పుడు మా అల్లరి రెట్టింపయ్యేది. మా అమ్మమ్మ వాళ్ల ఊరు కోట. కొన్నిసార్లు మేం అక్కడకకు వెళ్లేవాళ్లం. నాకు నలుగురు మేనమామలు. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేవారు. మేమెంత అల్లరి చేసినా ఏమీ అనేవారు కాదు. మా తమ్ముడు హర్షవర్థన్ రెడ్డి అందరిలోకి బాగా అల్లరిచేసేవాడు.

ముక్కోటికి జాగారమే…
శ్రీ వెంకటేశ్వరస్వామి మా కుటుంబానికి ఆరాధ్య దైవం. ఇప్పుడు సాయిబాబాని కూడా పూజిస్తున్నాం. ఊళ్లో అన్ని పండుగలు బాగా చేసేవాళ్లు. ఇప్పుడూ చేస్తున్నారు. మా ఊళ్లోని పురాతన రామాలయం వద్ద ముక్కోటి ఏకాదశి అంగరంగ వైభవ ంగా నిర్వహించేవారు. మాకు ఉభయం ఉంది. దేవుడికి ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహించేవారు. గ్రామమంతా భక్తి తన్మయత్వంలో మునిగితేలేది. ఒక్క మాటలో చెప్పాలంటే భూలోకంలో వైకుంఠంలా అనిపించేది మా ఊరు. రాత్రంతా జాగారం చేసేందుకు, అప్పట్లోనే రాజమండ్రి నుంచి కళాకారులని పిలిపించి డ్యాన్సులు వేయించేవారు. డ్రామాలు ప్రదర్శించేవారు. సంగీత కచ్చేరీలు జరిగేవి. ఒక్క నిమిషం కూడా ఎవరూ నిద్రపోయేవారు కాదు. ఇప్పటికీ ముక్కోటి ఏకాదశి వస్తే చాలు.. ఎక్కడెక్కడో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ గ్రామానికి వస్తారు. పండుగ చేసుకుని తిరిగి వెళుతుంటారు. అలాగే పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం చూడటానికి రెండు కళ్లూ చాలేవి కావు.

పెద్దరికం అలవడింది..
మా కుటుంబం మొద టి నుంచి రాజకీయాలపరంగా ఆనం కుటుంబానికి వ్యతిరేకం. నెల్లూరు నడిబొడ్డున మాకు శ్రీనివాసమహల్ ఉండేది. సాయంత్రమైతే చాలు, ఆనం వ్యతిరేకులంతా అక్కడికి వచ్చేవారు. పెద్దపెద్ద నాయకుల రాకపోకలు, రాజకీయ చర్చలు దగ్గరగా చూసిన నాకు అప్పట్లోనే అలా పెద్దరికంగా వ్యవహరించాలనిపించేది. నెల్లూరు కె.ఎ.సి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడే కళాశాల ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యా. అయినా వెనుకడుగు వేయలేదు. అప్పట్లోనే నా వెంట ఎప్పుడూ ఇరవై, ముప్పై మంది ఉండేవారు. మా తమ్ముడు ఓ బృందానికి నాయకత్వం వహిస్తుండేవాడు. ఒక్కోసారి శ్రీనివాసమహల్ లో మాకోసం వచ్చినవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అక్కడి కాలేజీల్లో రాజకీయాలు ఎక్కువ. తరచూ గొడవలు జరుగుతుండేవి. కళాశాలల ఎన్నికలప్పుడు అభ్యర్థుల కిడ్నాప్‌లూ జరుగుతుండేవి. మా తమ్ముడు గొడవలకు వెళుతుండేవాడు. నేను మాత్రం వాటిని సర్దుతూ ఉండేవాణ్ని. అలా, రాజకీయాల కారణంగా నా డిగ్రీ చదువు మధ్యలోనే ఆగిపోయిందిగాని, మంచి నాయకత్వ లక్షణాలు మాత్రం అలవడ్డాయి.

అంతులేని అభిమానం
మా ఊరివాళ్లంతా అప్పటికీ, ఇప్పటికీ మావాళ్లే. వారితో అనుబంధం మాటల్లో చెప్పలేను. నన్ను మొదటిసారి సింగిల్ విండో అధ్యక్షుడిని చేసింది వారే. ఆ పదవితోనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష పదవిని పొందగలిగా. 1960 నుంచి ఇప్పటి వరకు మా పంచాయతీ, సొసైటీ పదవులన్నీ మా కుటుంబసభ్యులకు లేదా మేము ఆమోదం తెలిపినవారికే కట్టబెడుతున్నారు. మా నాన్న పాతికేళ్లు, మా తమ్ముడు ఆరేళ్లు మా ఊరికి సర్పంచులుగా వ్యవహరించారు. ఇప్పటికీ మా కుటుంబమంటే ఊరి వాళ్లందరికీ అంతులేని అభిమానం. ఏ చిన్న సమస్య వచ్చినా మాకే చెబుతారు. నేను ఇక్కడున్నా, హైదరాబాదు, ఢిల్లీల్లో ఉన్నా సరే, నేరుగా ఫోన్ చేస్తారు. వెంటనే వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నిస్తుంటాను. విద్య, ఉపాధి, వైద్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తాను. మా ఊరు కులమతవర్గ విభేదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటుంది. ఇప్పటికీ ఒకరినొకరు వరసలతో పిలుచుకుంటారు. నేను కనిపిస్తే ‘అబ్బయ్యా…’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. ఇంకెక్కడైనా వాళ్లకెవరైనా ఇబ్బంది కలిగిస్తే… ‘మా రెడ్డికి చెబుతాం’ అంటారు. మమ్మల్ని కొండంత అండగా భావిస్తారు. నేను రాజకీయంగా ఇంతగా ఎదగడానికి, మంత్రి పదవులు పొందడానికి కారణం వాళ్లే. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలే ను.

ఎంత చేసినా తక్కువే
మా కుటుంబం తరపున నవలాకులతోటలో పాఠశాలకు స్థలాన్ని ఇచ్చాం. అల్లీపురంలో పాఠశాలకురెండున్నర ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి అర ఎకరా భూమిని నా సొంత డబ్బుతో కొనుగోలు చేసి వాటి ఏర్పాటుకు సహకరించాను. ప్రస్తుతం ఆ బడిలో ఆరొందల మంది పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. ఇప్పుడా భూముల విలువ కోట్ల రూపాయలకు చేరింది. ఓవర్ హెడ్ ట్యాంకు, పశువుల ఆసుపత్రి నిర్మించేలా చేశాను. గ్రామం నడిమధ్యన చెన్నకేశవ స్వామి ఆలయం, మా ఇంటికి సమీపంలో సాయిబాబా ఆలయం, ఉద్యానవనం నిర్మించా. గ్రామంలో రోడ్లు, మురుగునీటి పారుదల కాలువలు, విద్యుత్తు దీపాలు వంటి కనీస వసతులన్నీ కల్పించా. మా ఊరికి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇంకాఇంకా ఏదోఏదో చెయ్యాలనే అనిపిస్తుంది. నేనీ ఊళ్లో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఊపిరి ఉన్నంత వరకూ ఊళ్లోనే ఉంటాను. రాకపోకలకు, నివాసానికి సదుపాయమని ఎంతమంది చెప్పినా నెల్లూరులోనూ, హైదరాబాద్‌లోనూ నేను ఇళ్లు కట్టుకోలేదు. వేరే ఎక్కడా నివసించడం నాకిష్టం ఉండదు. ఎక్కడకెళ్లినా మా ఊరే గుర్తొస్త్తుంది. మరే ప్రాంతంలోనూ ఎక్కువ రోజులు ఉండబుద్ధి కాదు. ఇక్కడ ఉండే ప్రశాంతత మరెక్కడా లేదు.”
– కంచర్ల మహేశ్ బాబు, ఏబీఎన్ ప్రతినిధి, నెల్లూరు.
ఫొటోలు : పి. కృష్ణప్రసాద్

—————————————-

ఎన్.టి.ఆర్ మెచ్చిన ఊరు
ఎటుచూసినా పచ్చని పొలాలు.. ఉదయం, సాయంత్రం వేళల్లో పక్షుల కిలకిలరావాలు.. గట్ల మీద కొబ్బరిచెట్లు.. కాలువలు, నీటిగుంతలు… ఇలా మా ఊరొక ప్రకృతి సోయగంలా కనిపిస్తుంది. 1994లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు మా ఇంటికి వచ్చారు. ఒకరోజంతా ఇక్కడే ఉన్నారు. మేడమీది గదిలో బస చేశారు. మా ఊరి వాళ్లంతా వచ్చి ఆయన్ను చూశారు. ఎన్టీఆర్ తిరిగి వెళ్లేప్పుడు మా ఊరిని, మా వాళ్లను తెగ మెచ్చుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టి.డి.పి నేతలు, దివంగత ఎర్రంనాయుడు, లాల్‌జాన్ బాషాలాంటి ప్రముఖులు కూడా వచ్చారు. అందరూ ఊరి ప్రశాంతతని, అందాలను బాగా పొగిడారు.

పెద్ద బాధ అదే..
తాగుడు అలవాటు వల్ల కుటుంబాలు ఆర్థికంగా నాశనమైపోవడం, కల్తీ సారా వ ల్ల మరణాలు సంభవించడం ఇవన్నీ మా ఊళ్లో నేను చిన్నతనంలోనే చూశాను. దాన్ని తల్చుకుంటేనే బాధగా ఉంటుంది. మానెయ్యమని ఎంత చెప్పినా వినేవారు కాదు. ఆ ప్రభావం వల్లనే సారా ఉద్యమం మా నెల్లూరు జిల్లాలో ప్రారంభమయినప్పుడు నేను దానికి మద్దతునిస్తూ, మహిళలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించాను.

అది మన బాధ్యత

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.