నా దారి తీరు -53 వేసంగి సరదా

         నా దారి తీరు -53

                                      వేసంగి సరదా

    మా పెద్దక్కయ్య వాళ్లకి వేసవి కాలం వస్తే మద్రాస్ లో నీళ్ళకు చాలా కరువుగా ఉండేది .వాడే నీళ్ళకూ ఇబ్బందే .అందుకని మేము వాళ్ళను వేసవి లో ఉయ్యూరు కు రమ్మని ఉత్తరం ముందే రాసే వాళ్ళం .రావటానికి కొంత మోహ మాట పడేది అక్కయ్య ..కాని బాగా ఎన్నో సార్లు చెబితే కుటుంబం తో వచ్చేది. .మా చిన్నక్కయ్య పెద్దబ్బాయి అంటే మా మేనల్లుడు అశోక్ ఉయ్యూరులోనే మా ఇంట్లో ఉండి చదువు కొనే వాడు .టెన్త్ వరకూ ఇక్కడే చదివాడు .వాడికే లోపం రాకుండా మా బావ వివేకా నంద గారు అన్ని జాగ్రత్తలూ తీసుకొనే వారు .చిన్నఉషా  ఫాన్ కొనిచ్చారు వాడికో మంచం ఉండేది .వాడు ఇక్కడ ఉన్నాడే కాని మా బాధ్యత వాడికి రెండు పూటలా భోజనం కాఫీ పాలూ మాపిల్లల తో బాటుఅందివ్వటమే ..మిగిలిన వన్నీ వాళ్ళ నాన్న చూసే వారు .మాకు ఏ విధమైన బరువూ ఉంచే వారు కాదు బావ .మేనళ్ళుడూ అంతే .మంచి కుర్రాడు బాగా చదివే వాడు చదువులో ఫస్ట్ వచ్చే వాడు .బుద్ధి మంతుడు .మా ఇంటిల్లి పాదికి వాడంటే మహా ఇష్టం. మా పిల్లలు ‘’అశోక్ బావా ‘’అని ఏంతో ఆత్మీయం గా పిలిచే వారు .ఇంతకీ వాడు ఇక్కడ చదవటానికి కారణం మా బావ బెంగాల్ లో ,బీహార్ లో పని చేయటం వల్లనే .అందుకని ఎప్పుడో తప్ప వేసవిలో వాడు ఇక్కడే ఉండేవాడు .

      మా పిల్లలకూ వేసవి సెలవలంటే మజా గా ఉండేది .మా పెద్దక్కయ్య కుటుంబమూ మా చిన్నక్కయ్య కుటుంబమూ వేసవిలో ఇక్కడికి వచ్చేవారు. ఇక పిల్లలకు సందడే సందడి .గేదెలు ,పాడి ,పాలేరు ఉన్నారు కనుక ఏ ఇబ్బందీ లేదు .అప్పుడు వేసవిలో కూరలు దొరకటం కష్టం గా ఉండేవి అందుకని ముందే కందా,పెండలం మణుగులకు మణుగులు కొని భోషాణం మీద దాచే వాళ్ళం .అవి వేసవి లో వాడుకొనే అలవాటు గా ఉండేది .ముందే పెసలు మినుములు కంది -బస్తాలు కొని నిలవ చేసే వాళ్ళం  .మిర్చి కూడా ఒక బస్తా కొనే వాళ్ళం. .అందుకని యెంత మంది వచ్చి ఉన్నా ఏ ఇబ్బందీ ఉండేది కాదు .కాని కావలసింది కొంత సంయమనం, అవగాహనా ,సర్దుకు పోవటం ఉంటె ఏంతో మజా గా ఉంటుంది .లేక పొతే ఇబ్బందే .

            మా అమ్మ అందరికిమధ్యాహ్నం  వంట చేసేది .రాత్రికి మా ఆవిడ చేసేది .ఊరగాయలు జాడీల నిండా ఉండేవి .కంద కూర లేక పెండలం వేపుడు తప్పని సరి .ముద్దపప్పు అంటే అందరికి ఇష్టం .దానిలో ఆవకాయ దట్టించి లాగించటం అందరూ చేసే పని. రాత్రికి కంది పచ్చడి ఉండేది .చింతపండు వేయకుండా ఒక సారి .వేసి ఒక సారి పచ్చడి చేసే వాళ్ళు .కంది పొడి మామూలే .చింతకాయ పచ్చ్చడి , గోంగూర పచ్చడి తప్పని సరి .పెసర పప్పు తో పచ్చడి చేసే వాళ్ళు దీన్ని నేను ‘’సందడి పచ్చడి ‘’అనే వాడిని తిన్న వాళ్ళు ‘’డుర్రూ డుర్రూ’’వేసే వాళ్ళు. అందుకని ఆ పేరు .మా

 అమ్మ పులుసు కాస్తే అదిరి పోయేది .మేము హిందూ పూర్ లో ఉండివచ్చాం కనుక రసం బాగా చేసేది ‘’బేడల చారు ‘’కు అమ్మ స్పెషల్ . వేపుడు కూరలకు అమ్మ పెట్టింది పేరు .వంకాయ పులుసు పచ్చడి ,మజ్జిగ పులుసు ,పెసర పప్పు పులుసు భలే గా చేసేది అమ్మ మా అక్కయ్యలు సాంబారు అదర గొట్టేట్లు చేసే వారు .సాయంత్రం టిఫిన్ అంటే బజ్జీలు పకోడీలే ఎక్కువ .పులుసు చారులను ‘’పెద్ద రాతి చిప్పలలో కాచే వారు వాటిని సింపుల్ గా ‘’రాచిప్పలు ‘’అనే వారు .పెద్ద రాచ్చిప్ప తో దోసకాయ పప్పు కాని మామ్దికాయ పప్పు కాని టమేటా అప్పు కాని చేస్తే ‘’ఊష్  కాకి ‘’అయి పోయేది .అలాగే పులుసైనా సామ్బారైనా రసమైనా యిట్టె యెగిరి పోయేది .మా ఇంట్లో ఉల్లిపాయ వాడకం తక్కువే సంబారు లో వేసే వాళ్ళు .బంగాళా దుప ఉడికించి చేసే దాని లో వాడే వారు .వంకాయ పచ్చి పులుసు అయినా రాచిప్పాడు చేయాల్సిందే .అదీ ఇంట్లోనే అయి పోయేది .అందరూ ఏంతో సంతృప్తి గా  తినే వాళ్ళం .మా అమ్మ వంకాయ కూర అదుర్స్ గా చేసేది కారబ్బొంకాయ కూర అంటే చీల్చి అందులో కావలసినవన్నీ కూరి వేయించేది బాగా .మా ఇంట్లో స్వీటు అంటే ‘’హోళిగ’’అంటే దాదాపు బొబ్బట్టు .పూర్ణం బూరెలు .అరిసెలు .గారెలు ,పెరుగు ఆవడలు తెగ నచ్చేవి .

             కంది పప్పు ను వేయించి పప్పు వండటం మా ఇంట్లో అలవాటు వేయిస్తే ఆ వాసన భలేగా ఉండేది .వేయిస్తున్నప్పుడే అడిగి పెట్టించుకొని తినే వాళ్ళం .అలాగే పెసర పప్పు వేయించినా అదే కమ్మని వాసనా రుచి .మాగాయా ముక్కలు తరగటం అందరం చేసే వారం మాగాయి ని పెరుగు లో కలిపి పచ్చడి గా తినటం అప్పుడూ ఇప్పుడూ మా అందరికే ఇష్టం .చలిమిడి అప్పుడప్పుడు చేసే వాళ్ళు .అదీ పిల్లలు తెగ లాగించే వారు .చిమ్మిరి కూడా బాగా ఇష్టం గా తినే వారు నంది కేషుడి నోములని చేసే వాళ్ళు బ్రాహ్మణుల ఇళ్ళల్లో .ఊర్లో బ్రాహ్మను లందరినీ పిలిచి పెట్టె వారు .పిల్లలు వెళ్లి బాగా తినే వారు .ఏ మాత్రం ఒదిలి పెట్టకుండా తినాలి .అలానే చేసే వారు .

   ఆ రోజుల్లో పొద్దున్న టిఫిన్లు లేవు. చద్ది అన్నం ,ఆవకాయ తో తినటమే .మేమూ అంతే మా పిల్లలూ అంతే.స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరిన పిల్ల.లందరికీ బయట ఉన్న ఖాళీ ప్రదేశం లో ఏదో ఒకటి ఆడుకొనే వారు .పాలేరు గుండిగల నిండా గంగాళాల నిండా ,సిమెంట్  కుండు లో నీళ్ళు పుష్కలం గా తోడి ఉంచేవాడు .వేసవి కనుక వేడి నీళ్ళు ఎవరికీ అక్కర్లేదు .మా దొడ్డి పూర్తిగా నున్నగా గచ్చు చేసి ఉండేది .కాలు వేస్తె జారి పోయేట్లు వాలుగా కూడా ఉండేది అందుకని పిల్లలు సాయం స్నానాలు ఈ గచ్చు మీదే. అందరూ గోచీలు పెట్టుకొని ,నీళ్ళు చిమ్ముకుంటూ ఒకళ్ళ వీపు ఇంకొరు రుద్దు కొంటు మొహమంతా సబ్బు నురగలతో బలే సరదాగా ఆడుకొనే వారు .మా అన్నయ్య గారి అబ్బాయి రాం బాబు, మా అన్నయ్య కూతురు  వేదం వల్లీ కూడా ఇక్కడే పెరిగారు. కనుక మాలో ఒకరే .ఒక గంట ‘’ఈ గోచీ జలకాలాట’’లో గడిపి హాయిగా కాలక్షేపం చేసే వారు .ఆ తర్వాత అన్నాలు తినే వారు.గడ్డ పెరుగు అంటే ఈ పిల్లలందరికీ ఇష్టం .మా అమ్మ పాలు బాగా కాచి చక్కగా పాళం గా తోడూ పెట్టి గడ్డ పెరుగు తయారు చేసేది .మహా రుచిగా ఉండేది .కవ్వం తో మజ్జిగ చిలికి వెన్న తీసి నెయ్యి కాచేది .ఆ నెయ్యి రుచే రుచి .పిల్లలందరికీ కుండ అడుగు గోకుడు మహా ప్రేమ గా తినే వారు .ఆవు ఈనినా గేదె ఈనినా జున్ను పాలు కాచి అందరం ఇష్టం గా తినే వాళ్ళం జున్నుకాచటం లో కూడా మా అమ్మ ఎక్స్ పర్టే..ఉట్టి మీద వెన్న దుత్తలున్దేవి .అందులోంచి వెన్న తీసుకొని దొంగ తనం గా తినటం నాకు అలవాటు . భోజనాల తర్వాత  చదువు కొనేవారు .మా మేనల్లుడు అశోక్ మాత్రం పార్ధి మాస్టారి  ట్యూషన్ కు వెళ్ళే వాడు .మా పిల్లలకు నేనే చెప్పే వాడిని .ఇంట్లో ట్యూషన్ పిల్లలేలాగో ఉండేవారు .వారి సరసన వీరుకూడా .మా చిన్నక్కయ్య రెండో వాడు అంటే మా చిన్న మేనల్లుడు శాస్త్రి ఒక ఏడాది ఇక్కడే మా ఇంట్లో ఉండి చదివాడు .వాడుకూడా పార్ధి గారి దగ్గరే ‘’పైయేటు ‘’చదివే వాడు .ఒక ఏడాది మా పెద్ద మేన కోడలు కళ కూడాఇక్కడ  సి బి.ఏం స్కూల్ లో చదివింది .మా అన్నయ్యగారి అబ్బాయి రాం బాబు కూడా పార్ధి గారి స్టూడెంటే. .వేదవల్లి మాత్రం నా దగ్గరే చదువుకొన్నది .

            పిల్లలందరూ చాపలు వేసుకొని ,దుప్పట్ల మీద పడుకొనే వారు .మా సావిడి అందరికీ సరి పోయేది. అక్కడ కొద్దిగా గట్టు ఉండేది .అక్కడ బైట ఉన్న ఆడవాళ్ళు పడుకొనే వారు .మా అమ్మ ఒక చిన్న నవ్వారు మంచం మీద పడమటి ఇంట్లో పడుకోనేది .మేము గదిలో పాడుకొనే వాళ్ళం .ఉక్క పోత ఎక్కువగా ఉండేది .అందుకని దొడ్లో పడుకొనే వాళ్ళం నవ్వారు మంచాలు నులక మంచాలు, నేల మీద, చాపల మీద అందరం గుర్రు పెట్టి నిద్ర పోయే వాళ్ళం .ఒక్కో సారి వాకిట్లో పడుకొనే వాళ్ళం .ఆ రోజుల్లో దొంగ తనాలూ ఎక్కువే .అందుకని చాలా జాగ్రత్త గా ఉండే వాళ్ళం .ఇద్దరు దొంగలు ఒక సారి వచ్చారు ఒకడు ణా దగ్గర నిల బడ్డాడు .రెండో వాడు మా ఆవిడా మెడలో ఉన్న  గొలుసు ను కత్తిరించి పారి పోతుండగా నాకు మెలకువ వచ్చి అరిచాను. కాని నా గొంతు నాకు వినిపించనే లేదు .అంటే మాట్లాడుతున్నాను .కానీ బయటికి విని పించటం లేదు . మొత్తం మీద నగ ఖాళీ .మా ఆవిడ చాలా పెనగు లాడింది .కాని లాభం లేక పోయింది .పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కానీ దొరక లేదు .ఈ నగలకు ఒక ఫ్లాష్ బాక్ ఉంది నేను ట్యూషన్ మీద బానే సంపాదించాను .కాని ఉమ్మడి కుటుంబం కనుక మా శ్రీమతికి ఏ బంగారు నగా కొనలేక పోయాను .ఒక సారి పది వేలు జాగ్రత్త చేసి బంగారం నగలు చేయించాను .మా కుటుంబానికి సుబ్రహ్మణ్యం అనే నిక్కచ్చి నగలు చేసే ఆయన విశ్వ బ్రాహ్మణ బజారు లో ఉండేవాడు .ఆయన చని పోయాడు .అప్పుడు ‘’రామ భజన ‘’తో ఆ బజారు బజారు మోత మోగించే ఉమా పతి అనే ఆయన్ను పిలిచి బెజవాడలో కొనుక్కొచ్చిన అచ్చమైన బంగారం ఇచ్చి ఈవిడ కు కావాల్సిన నగలు చేయమని ఇచ్చాం .ఇచ్చిన దగ్గర నుంచీ తిరుగు తూనే ఉన్నాను .ఇదిగో రేపు ఎల్లుండి అంటూ కాలక్షేపం చేశాడు .ఒత్తిడి పెంచాను .ఎక్కడికో ఊరికి వెళ్ళాల్సి వచ్చి ఇంటికి వెళ్లి కూర్చున్నాను .ఊళ్ళో లేదన్నారు బెజవాడ వెళ్ళాడని వచ్చే టైం అయిందని .ఇంట్లో వాళ్ళు కూడా బొంకారు .చివరికి ఇంకో గంటకు ఊరికివెడతాం అనగా హడావిడి గా తీసుకొని వచ్చి ఇచ్చాడు .సరే నని ధరించి ఊరికి బయల్దేరింది .కాని అది చూడటానికి అసలు బంగారు లా అని పించనే లేదు. నెమ్మది మీద అర్ధమైంది .బంగారం నొక్కేసి కల్తీ నగలు బాగా ఎక్కువగా చేసి మోసం ఈ రామ భక్తుడు చేస్తున్నాడని తెలిసింది .మేమే కాదు చాలా మంది ‘’ఉమా పతి’’ కాటా దెబ్బ ‘’తిన్న వాళ్ళు. ఒకరొకరే బయట పడ్డారు .దొంగ బంగారం కేసులూ దొంగ నోట్ల సరఫరా కూడా బయట పడి జైలు పాలయ్యాడు .కాపురం బెజవాడకు ఎత్తేశాడు .ఆ నగలలో ఒకటి పోయిందన్న మాట .ఆ తర్వాత ఎప్పుడో మిగిలిన దాన్ని మద్రాస్ లో మా అక్కయ్య తో బాటు తంగ మాలిగ లో చూపిస్తే దానికి వచ్చిన డబ్బు అతి స్వల్పం .ఇదీ వేసవిలో ఒక విశేషం .

       దొంగ తనాలు ఎక్కువ అని ముందే చెప్పాను .రాత్రిళ్ళు అందరం వాకిళ్ళలో దత్తు గారి అరుగుల మీద చేరి కాపలాలు కాసే వాళ్ళం .చామల  లోకి వెళ్లి ఈత చెట్ల నీడ లో కూచుని దొంగలను పసి కట్టే వాళ్ళం బెల్లం కొండ వారింట్లో వరుసగా దొంగతనాలు జరిగాయి .ఏదీ  దొరక్క పొతే ఉన్న అన్నం ఆవకాయ తిని వెళ్ళే వాళ్ళు .ఒకటి రెండు సార్లు దొరికి నట్లే దొరికి పారి పోయే వారు .పగలల్లా ఎండలు, రాత్రి కంటికి నిద్ర లేని ఈ కాపలా తో బాగా అలసట గా ఉండేది .

    ఇక ఆడ పిల్లలు అంత్యాక్షరి ఆడుకొనే వాళ్ళు ..కళా, జయా ఇందులో ‘’ఫస్ట్ గా ఫాస్ట్ ‘’గా ఉండేవారు కళ. బాగా శ్రావ్యం గా పాడేది .ఆమె స్వరం అంటే అందరికి మహా ఇష్టం గా ఉండేది .జయ కొంచెం బిడియం తో ఉండేది .గవ్వలూ గచ్చకాయలు స్కిప్పింగ్ ,మొదలైన ఆటల్లో వాళ్ళు గడిపే వారు .వేసవి కనుక ముంజలు వచ్చే కాలం మా మామయ్యా గారి తోటలో తాడి చెట్లు బాగా ఉండేవి పాలేళ్ళు తాడి గెలలు దింపి బండీలో ఇంటికి తీసుకొచ్చే వారు సాయంత్రం ఇద్దరు పాలేళ్ళు కొడవలి తో కాయలు చెక్కి అందరికి ఇచ్చే వారు .తిన్న వాళ్లకు తిన్నన్ని .కడుపు నిండే దాకా పిల్లలూ

 పెద్దలూ తినే వారు .మా అమ్మ తినేది కాదు .ముంజలు అరగటానికి ఆవకాయ అన్నం బాగా పని చేసేది .సీమ చింతకాయలూ వచ్చే కాలం .అవీ అందరికి బాగా ఇష్టం .తమాషా రుచిగా ఉంటాయి .ఈతపళ్ళు వచ్చే కాలం అప్పుడు ఈత చెట్లు మా చేమల్లో విపరీతం .పండినప్పుడు వాటి వాసన భలేగా ఉండేది .గెలలు కోసి తినే వాళ్ళం. మంచి రుచికరం బియ్యం డబ్బాలో వేసి ఈత పళ్ళు పండించే వాళ్ళం ..గింజ మధ్యలో చీలి  తమాషా గా ఉండేది .తేగల కాలం లో పిల్లలు మహా ఇష్టం గా లాగించేవారు .

     వేసవి అంటే మామిడి పళ్ళు జ్ఞాపకం రాక మానదు .రసం మామిడి పళ్ళు అంటే మహా రుచిగా ఉంది అందరికి ఇష్టం .దజన్లకు డజన్లు కొనే వాళ్ళం .దగ్గర కావ వేస్తె వెళ్లి కొని తెచ్చే వాడిని .ఆరగా ఆరగా పిల్లలు తినే వారు .మజ్జిగా అన్నం లో రసం మామిడి పండుతినటం ఒక గొప్ప అనుభవం అను భూతి .మజ్జిగలో తింటే జబ్బు చేయదు అని నమ్మకం .తిన్న వాళ్లకు తిన్నానని పళ్ళు .కొసరి కొసరి తిని పించే వాళ్ళం .మా వేదవల్లి కొడుకు రవి హరి జనరేషన్

 కూడా వేసవి లో వచ్చి మామిడి పళ్ళు తినే వారు .కడుపు పట్టక హరి ‘’తాతయ్యా ఇంక నేను తినలేను తాతయ్యా ‘అనే వాడు .బంగిన పల్లి తక్కువ తినే వాళ్ళం .కాయ కోసి తినాలి దీని రుచి దీనిదే .వర్షం పడితే బంగిన పల్లి తినకూడదు .పురుగు వస్తుంది .కలెక్టర్ మామిడి అంటే తోతాపురి చివరికి వచ్చేవి ఇవీ కోసి తినాల్సినవే .పెద్దగా ఇష్టం ఎవరికీ ఉండేది కాదు .అందరికి ఊరగాయలు మా ఇంట్లోనే పెట్టె వాళ్ళం వెళ్ళేటప్పుడు మా అక్కయ్యలకు ఇచ్చి పంపే వాళ్ళం వీటికోసం భోశానాల్లాంటి జాడీలు కలపటానికి పెద్ద పెద్ద బేసిన్లు .కారాలు కొట్టించటం ఆవపిండి కొట్టించటం పెద్ద పనే .ఆఘాటు పడక పిల్లలు ఇబ్బంది పడే వాళ్ళు .

  జీడీలు ఆ రోజుల్లో అందరికి ఇష్టమైనవి .పిప్పరమెంటు బిళ్ళలూ అంతే .అల్లం మురబ్బా .తాటి బెల్లం రుచిగా పిల్లలు తినే వాళ్ళు .నిమ్మ తొనలు అనే బిళ్ళలు బాగుండేవి వాళ్లకు .మంగారం బిస్కెట్లు కిలోలకు కిలోలకు కొనే వాళ్ళం బాగా ఇష్టం గా అందరూ తినే వారు .రేగి పండ్లు వడ్లు పోసి కొనే వాళ్ళం అందరికీ ఇష్టం .రేగి పండ్ల తో వడియాలు కూడా పెట్టటం ఉండేది .వేసవిలో అందరూ కలిసి అప్పడాలు వత్తే వారు వడియాలు పెట్టె వారు .ఓడలు వేయించి అటుకులు కూడా ఇంట్లోనే కొట్టే వారు ఆ తర్వాత దమ్ములేక బయట పట్టించటం లేక కొనటం జరిగేది

   ఇదంతా ఒక ఎత్తు.వేసవి కనుక ఊరగాయలు పెట్టె టైం కూడా మా మామయ్యా గారి మామిడి తోటలో అనేక రకాల మామిడి చేట్లున్దేవి .పాలేల్లతో  చిక్కాలున్న కర్రలతో కోయించి  బండీ మీద ఇంటికి తెచ్చే వారు మంచి కాయలన్నీ మా మామయ్యా ఉంచుకొని ఒక మాదిరి కాయలు మా మొహాన పడేసే వాడు .ప్రత్యెక కత్తి పీటలు తీసుకొని కాయలు పచ్చాలు చేసే వారొక రైతే ముక్కలు తరిగే వారు మిగిలిన వారు .నీళ్ళలో నానేసిన కాయలు బయటికి తీయటం గుడ్డ తో తుడవటం జీడి తీయతం డొక్కులో ఉన్న పోరా ను డబ్బానాలతో తీయటం పిల్లల పని .భలే సరదాగా ఉండేది సీను. మా సావిడి లో ఇదొక పెద్ద ప్రదర్శన మా అక్కయ్యల్లో అమ్మా ఓదినా నేనూ కాయలు తరిగే వారం మా సీత పిన్ని వస్తే సాయం చేసేది మా కత్తి పీట కు మంచి పదునుండేది బెల్లం కొండ వారిదీ తెచ్చుకొనే వాళ్ళు .ఇల్లు అంతా ఊరగాయ సందడి తో మారు మోగేది .అవన్నీ తలుచుకొంటే ఏంతోఅను భూతి కలుగుతుంది అందరికి

   మా పిల్లలు ,మేన ల్లుళ్ళు’’గోఛీ స్నానం ‘’గురించి తెగ చెప్పుకొంటారు ఇప్పటికీ .మేనగోడళ్ళు ‘’పెద్ద మామయ్యా వాళ్ళింట్లో అన్నం తినాలంటే భలే సరదాగా ఉంటుంది ఎందుకంటె అదొక పెళ్లి ఇల్లు లాగా ఉండటమే .’’అంటారు ఎప్పుడు గుర్తుకొచ్చినా .కనుక నాకే కాదు వాళ్ళందరికీ ఒక మధురాను భూతి నిచ్చాయి వేసంగి సెలవులు .

    సశేషం

                  మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-13-ఉయ్యూరు

            

              

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.