నా దారి తీరు -56 మేనల్లుడి తో బీహార్ ప్రయాణం

         నా దారి తీరు -56

మేనల్లుడి తో బీహార్ ప్రయాణం

మా పెద్ద మేనల్లుడు అశోక్ ఉయ్యూరులో మా ఇంట్లో ఉండి పడవ తరగతి వరకు చదువుకోన్నాడని చెప్పాను .ఒక సారి వేసవి సెలవల్లో మా చిన్నక్కయ్యా ,చిన్న మేనల్లుడు శాస్త్రి, ,మేనకోడలు పద్మ ఉయ్యూరు లో ఉండగా నన్ను మా బావ వివేకానందం గారు నాతొ అశోక్ ను తీసుకొని తాను  పని చేస్తున్న బీహార్ లోని జం తారా కు రమ్మని .ఉత్తరం రాశాడు .బహుశా 1966వేసవి అనుకొంటాను   .అప్పుడు హౌరా కు జనతా ఎక్స్ప్రెస్ కొత్తగా వచ్చింది మా అక్కయ్య ను మొదటి సారి దానిలో పంపాము .అది తెల్ల వారుఝామున ఉండేది .అందుకని రాత్రికే వచ్చి స్టేషన్ లో పడుకొనినేను మా అమ్మ మోహన్  ఆ బండీ ఎక్కించిన జ్ఞాపకం .మేము ఈ జనతాకే బయల్దేరాం ఇప్పుడది సాయంత్రం బయలు దేరినట్లు గుర్తు .కంపార్ట్ మెంట్ లన్నీ తమాషా కలర్ లో ఉండేవి .మా బావ మా పెళ్ళికి బహుమతి గా ఇచ్చిన కోడాక్ డబ్బా కెమెరా నే మాకు కెమెరా .ఆ రోజుల్లో కెమెరా ఉన్న కొద్ది మందిలో నేనొకడిని. మా ఊర్లో దానితో ఎన్నో ఫోటోలు తీశాను నేను అప్పటిదాకా పని చేసిన స్కూల్ లలో  ఫోటోలు దీనితోనే తీసే వాడిని .నేనూ అశోక్ రైల్ ఎక్కగానే ఫోటోలు తీసుకొన్నాం .దారిలో తినటానికి కావాల్సినవన్నీ అంటే అన్నం పూరీ కూర మధ్యలో నంజుడుకి పచ్చళ్ళు ,పెరుగు సమస్తం మా ఆవిడపాక్ చేసి ఇచ్చింది .అప్పుడు సూట్ కేసులు లేవు .రేకు డబ్బా పెట్టేలే .అవే తీసుకొని వెళ్లామని జ్ఞాపకం .

బహుశా రోజు పైనే ప్రయాణం .హౌరా స్టేషన్ లో దిగాం అక్కడికి బావ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొన్నాడు అక్కడి నుంచి ఢిల్లీ రైల్ ఎక్కి మొగల సరాయ్ స్టేషన్ లో దిగాం.ఇది పెద్ద జంక్షన్ . అక్కడి నుండి ‘’నేరో గేజ్ ‘’పై నడిచే ట్రెయిన్ ఎక్కి జమ్తారా స్టేషన్ లో దిగి ఇంటికి వెళ్లాం .మీటర్ గేజ్ కంటే తక్కువ వెడల్పున్న దే నేరోగేజ్ .దీన్ని మా వాళ్ళు ‘’డకలా డకిలీ ‘’అనే వాళ్ళు అందులో కూర్చుంటే ఉయ్యాల ఊగి నట్లుండేది అందుకా పేరు .ఇది గంగా నది ఒడ్డునే ఉన్న ఊరు.బావ   సెంట్రల్ వాటర్ వర్క్స్ లో సూపర్ వైసర్ .ఆ తర్వాత జూనియర్ ఇంజినీర్ ,సీనియర్ ఇంజినీర్ గా రిటైర్ అయ్యాడు .చాలా స్ట్రిక్ట్ మనిషి .ఎక్కడ ఎవరు సక్రమంగా పని చేయక పోయినా ‘’కాగితాలు తగిలించే వాడు ‘’ఇది పై అధికారులకు మంటగా ఉండేది .అందుకని ప్రమోషన్ చాలా ఏళ్ళు తొక్కి పట్టారు . అంతమాత్రం చేత నిరుత్సాహ పడలేదు .పోరాడి సాధిస్తూనే ఉనాడు .చీఫ్ ఇంజినీర్ ను ఆఖరికి కేంద్ర మంత్రి దృష్టికి కూడా తెచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి తనకు అనుకూలం గా అన్నీ సాధించుకొన్న ‘’పట్టు వదలని విక్రమార్కుడు ‘’మా బావ వివేకా నందం .పనిలో దైవాన్ని చూసే వాడు ఇలా ఉండే వారు చాలా అరుదు అందుకే ఆయన మాటకు ,రాతకు విలువ ఉండేది .కాదని అనలేక పోయే వారు కాని ఆలస్యం గా స్పందించే వాళ్ళు.రోజూ గంగానది లోకి పడవ మీద వెళ్లి

నిర్ణీత సమయాలలో నీటి ప్రవాహం యెంత ఉంది యెంత నీరు ప్రవహిస్తోంది మొదలైన లెక్కలన్నీ అసిస్టంట్ సహాయం తో  .తీసి పై ఆఫీసర్ కు పంపే వాడు .దీనికి కావలసిన తెల్ల కాగితాలు కూడా ప్రభుత్వం సరిగ్గా ఇచ్చేది కాదు తానె కొని పంపిస్తూ బిల్ చేసే వాడు ఆలస్యం గా సాంక్షన్ అయ్యేవి దీనిప కూడా రోజూ పై అధికారులకు కంప్లైంట్ చేసేవాడు .ఒక రకం గా ఆయన నిత్యం పై అధికారులతో యుద్ధమే చేసేవాడు .కింద అధికారులను చాలా బాగా చూసే వాడు వాళ్లకు ఈయన అంటే దేవుడే .నౌకర్లు చాలా భయం తో పని చేసే వారు .వారిని ఏంతో ఆదరించేవాడు .వాళ్లకి జరిగిన అన్యాయాన్నీ పై వాళ్లకు తెలియ జేసి న్యాయం చేకూర్చే వాడు అందుకే ఆయన అంటే అంతఅభిమానం .జంతారా లో ఆయన దగ్గర ‘’ఓజా ‘’అనే ఒక బీహారీ బ్రాహ్మణుడు నౌకరు గా పని చేసే వాడు అతనికి మా బావ అంటే దేవుడి తో సమానం అతన్ని అంత బాగా చూసుకొనే వాడు బావ .ఇంట్లో అన్ని పనుల్లో సాయం చేసేవాడు అతని మాటలు నాకేమీ అర్ధంయ్యేవికావు బావకు హిందీ బాగా వచ్చు వాళ్లతో జమాయించి మాట్లాడే వాడు

జంతారా లో మా నిత్య కృత్యం .మా అంటే మా బావ నిత్య కృత్యం .పొద్దున్నే మాకు చిక్కని ఫిల్టర్ కాఫీ తయారు చేసిఇచ్చేవాడు .ఇడ్లీ వేసి పెట్టేవాడు లేక పొతే ఉప్మా చేసి పెట్టేవాడు అట్టు ఒక సారి .ఇలా వెరైటీ గా టిఫిన్లు చేసి మాతో తిని పించేవాడు .తర్వాత ఆఫీసు పని చూసుకొనే వాడు .ఇంటి నుంచే  పని కనుక హాయిగా ఉండేది వాటర్ సాంపిల్స్ కలెక్ట్ చేసి పైకి పంపే వాడు . .రివర్ సైట్ కు వెళ్లి పడవలో గంగా నది లో నీటి కొలతలు తీసేవాడు ఇవన్నీ రికార్డ్ చేసి ఇంటికి వచ్చి రిపోర్ట్ తయారు చేసి పంపేవాడు .అప్పుడు మధ్యాహ్న భోజనం వండే వాడు పప్పు కూరా పచ్చడి సాంబారు లేక చారు ,గడ్డ పెరుగు తో భోజనం .మేము తీసుకొని వెళ్ళిన ఊరగాయలు పనికొచ్చేవి అన్నీ మహా రుచికరం గా చేసే వాడు కడుపు నిండా తినే వాళ్ళం .ఆయనది లిమిటెడ్ భోజనమే .అప్పుడు కాలక్షేపానికి ఏమీ ఉండేవి కాదు .రేడియో మాత్రమె .అదీ బెంగాలీ బీహారీ ప్రోగ్రాములే .లేక పొతే శ్రీ లంక నుండి షార్ట్ వేవ్ లో వచ్చే బినాకా గీత మాలిక లే.

జంతారా రోడ్లు ఇరుకు మురికి .బియ్యం అంటే ఇక్కడ ఉప్పుడు బియ్యమే. అవి ఉడుకుతుంటే కడుపులో దేవి నట్లుండేది బావ సన్న బియ్యం మంచి వెరైటీ వి కొనే వాడు .అందుకని అన్నం పువ్వులాగా బాగా ఉండేది .బావ ఏది చేసినా స్పెషలే .అన్నిట్లోనూ ప్రత్యేకతే చూపే వాడు .మార్కెట్లోకి ఏ కొత్త వెరైటీ వచ్చినా కొనే వాడు డబ్బు చేతిలో లేక పొతే అప్పు చేసి దాన్ని కొని ఇంటికి తెవాల్సిందే లేక పొతే నిద్ర పట్టేది కాదాయనకు .జీతం రాగానే తీర్చక పోతెకూడా నిద్ర పట్టక పోవటం మా బావ ప్రత్యేకత .ఎక్కువ డబ్బు అయితే నెల సరి వాయిదాలలో తీర్చే వాడు .ఎవరూ ఆయన్ని డబ్బుకోసం ఒత్తిడి పెట్టె వారు కాదు అంత నమ్మకం ఆయన మీద ఉండేది దుకాణ దార్లకు ఈ నమ్మకాన్ని ఏంతో బాగా కాపాడు కొంటూ వచ్చేవాడు .

నేను మా మేనల్లుడు రోజు ఉదయమే  గంగా నది కి వెళ్లి స్నానం చేసివచ్చేవాళ్ళం .హాయిగా ఉండేది .సాయంత్రం మమ్మల్నిద్దర్నీ తీసుకొని ఏదైనా హిందీ  సినిమాకు తీసుకొని వెళ్ళే వాడు ‘’దస్ లాఖ్ ‘’సినిమా చూసిన జ్ఞాపకం .ఓం ప్రకాష్ నటించి దర్శకత్వం చేసిన సినిమా .బలే నవ్వు పుట్టించేది .ఎక్కడికీ వెళ్ళక పొతే బజారు లు తిప్పి చూపించేవాడు .స్నేహితుల ఇళ్ళకు తీసుకొని వెళ్ళేవాడు అక్కడ ఉద్యోగులందరూ బీహారీ లేక బెంగాలీలే .బ్రాహ్మణులు కూడా ‘’జల పుష్పాలు ‘’తినే వారు .ప్రతి ఇంటికి ఒక చిన్న చెరువు అందులో భక్ష్యాలనికి మత్సాలను పెంచటం జరిగేది .స్వీట్లు బాగా తినే వారు .బర్ఫీ ఇష్టం .రసగులా అంటే బెంగాల్ బీహార్ లలో మహా ప్రీతి ..వంట నూనె గా ఆవనూనె వాడే వారు .మా బావ మాత్రం వేరు సెనగ నూనె నే తెప్పించి వాడే వాడు పాలు చిక్కగా కాచి తోడూ పెట్టి చిలికి వెన్న తీసేవాడు నెయ్యి కాచేవాడు నెయ్యి భలే గా ఉండేది దాదాపు అందరూ ఆవుపాలే వాడేవారు గేదెలు అసలు లేవని అనలేం కాని చాలా తక్కువ .గోధుమ బాగా పండేదిక్కడ .వంకాయి లాంటివి అరుదుగా కనీ పించేవి బంగాళా దుంప పంట ఎక్కువ .బావ ఉయ్యూరు వస్తూంటే ఒకటో రెండో బంగాళా దుంప బస్తాలు తెచ్చే వాడు మనకు దొరికే దుంప కంటే అక్కడివి మహా టేస్టీ .నిలవ కూడా చాలా రోజులున్దేవి .

రాత్రి కి బావ పూరీ కాని చపాతీ కాని చేసే వాడు .దానిలో ఉల్లిపాయ తో బంగాళా దుంప కూర చేసే వాడు .రుచి అదుర్స్ గా ఉండేది .కూరతో కడుపు నిండా తినే వాళ్ళం మేనమామా మేనల్లుడులం .సాంబారు తో కొద్దిగా అన్నం తిని పెరుగు అన్నం తినే వాళ్ళం .కాలక్షేపం ఏమీ లేదుకనుక పెంద్రాలే నిద్ర పోయే వాళ్ళం .బహుశా ఇరవై రోజులు మేము జం తారా లో ఉన్నామనుకొంటా.బావ వంటా బామ్మర్ది కొడుకు తినటం బలే గా నే గడిచి పోయాయి రోజులు .మా బావ వివేకానందం ఏపని చేసినా పధ్ధతి ప్రకారమే చేస్తాడు మా ఇద్దర్ని చట్టు పక్కల ప్రదేశాలను చూపించటానికి పకడ్బందీ గా ప్లాన్ తయారు చేశాడు ఆ ప్లాన్ ప్రకారం ఏమీ తేడా లేకుండా గవర్నర్ ప్రోగ్రాం మాదిరిగా ఆయా ప్రదేశాలను మాకు వివరిస్తూ చూపించాడు బావ ఆ విశేషాలు ఈ సారి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-12-13-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.