‘జనం లో కలిస్తేనే జగతి లో మార్పు” అంటున్న ఉయ్యూరు వాసి కాజ పూర్ణ చంద్ర గాంధీ ఆంధ్ర జ్యోతి

 

అవినీతినీ, నేరాలనూ పట్టి ఇవ్వడం ద్వారా సమాజానికి అండగా నిలబడవచ్చున న్న భావన అతనిలో అంకురించి కొన్ని దశాబ్దాలు గడి చాయి. ఆ భావజాలమే అతన్ని ఫోరెన్సిక్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేలా చేసింది. అతని పేరే కాజా పూర్ణచంద్ర గాంధీ. ఉద్యోగ విరమణ తర్వాత తాను నిర్వహిస్తున్న ‘ట్రూత్ ల్యాబ్స్’ దేశంలోనే నంబర్-1 గా నిలిచింది. 66 ఏళ్ల వయసులోనూ మొక్కవోని చైతన్యంతో సాగుతున్నారు. కొత్తగా ప్రజా జీవనంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న గాంధీ జీవితంలోని కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

ఒకప్పుడు ఒకటి, రెండు కోట్లకే పరిమితమై ఉన్న అవినీతి ఇప్పుడు వేల కోట్లు దాటి లక్షల కోట్లదాకా వెళ్లిపోయింది. ఈ స్థితిలో ఏ నేర నిరూపణ అయినా ఏపాటిది? ఈ విషయమై గురువుల్లాంటి కొంత మంది పెద్దవాళ్లను నేను కలిశాను. వారంతా “నేరుగా ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తే తప్ప సమాజంలో నువ్వనుకునే ఆ గణనీయమైన మార్పు తీసుకు రావడం అసాధ్యం” అన్నారు.

కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు మా స్వగ్రామం. గాంధీ గారు చనిపోవడానికి ఆరు రోజుల ముందు నేను పుట్టానని అమ్మ నాకు ఆయన పేరు పెట్టిందట. పేరు పెట్టడమే కాదు, ” నువ్వు ఆ సమయంలో పుట్టావంటే నీ పుట్టుకకు ఒక కారణం ఉందిరా” అన్న మాటను ఆమె చాలా తరుచుగా అంటూ ఉంటుంది. ఆ కారణం ఉందో లేదో గానీ, ఆ మాటలు మాత్రం నా ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచాయి. నేను ఫోరెన్సిక్ ల్యాబ్‌ను నంబర్ -1 స్థానంలో నిలబెట్టడానికి వెనుక ఆ స్ఫూర్తే పనిచేసింది. నేను రిటైర్ అయ్యేనాటికి రాష్ట్రంలోనే కాదు అది దేశంలోనే నంబర్-1 గా నిలబడింది. ఆ తరువాత ప్రపంచంలోనే ఒక ఉత్తమ ఫోరెన్సిక్ ల్యాబ్‌గా పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించి ఐఎస్ఓ-9001 అనే ఒక కొత్త ప్రాజెక్టు చేపట్టాను. అమ్మ మరో మాట కూడా అనేది. ” కొత్త ప్రమాణాల్ని నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేయాలి. ఆ ప్రమాణాలు అత్యధిక మానవాళికి మంచి జరిగేందుకు తోడ్పడాలి” అని. ఎప్పటికప్పుడు నన్ను మరో ఎత్తుకు తీసుకు వెళ్లడానికి ఆమె మాటలు ఎంతగానో తోడ్పడుతూ వ చ్చాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కూడా యూనీ యాడ్స్, ఆపిల్ ల్యాబ్స్, ఆపిల్ అడ్వర్టయిజింగ్, మాస్టర్ గ్రాఫిక్స్ ఇలా కొన్ని వెంచర్లను స్నేహితుల కోసం ప్రారంభించడానికి అవే స్ఫూర్తిగా నిలిచాయి. ఏ తల్లిదండ్రులయినా తమ పిల్లలకు ఇలాంటి మాటలే చెప్పాలని మనసారా అనుకుంటాను.
అనుకోగానే కావుగా…
ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే సందర్భాల్లో కూడా ఎందులో అయితే, ప్రజలకు ఎక్కువ మంచి చే సే అవకాశం ఉంటుందా అని చూసే వాణ్ని. వేరే వేరే ఎన్ని వచ్చినా నేను పోలీస్ ఆఫీసర్ ఉద్యోగంలోనే చేరాను. ఎక్కువ మంది ప్రజలకు సేవచేయడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నేను ఇంటెలిజెన్స్ బ్యూరోలో సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరిపోయాను. నాకొచ్చిన మిగతా ఉద్యోగాల బేసిక్ వేతనంతో పోలిస్తే ఈ పోస్టులో వచ్చేది చాలా తక్కువ. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌నయ్యాను. కాని ఏ హోదాలోకి వెళ్లినా నేననుకున్నట్లు ఎక్కడా కొత్త ప్రమాణాలు సాధించే అవకాశం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రోత్సాహం గానీ, మద్దతు గానీ, గుర్తింపు గానీ ఏదీ రాలేదు. అందుకే నేను విదేశాలకు వె ళ్లిపోయాను. అక్కడ హ్యూమన్ జస్టిస్‌కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కోర్సులో ఫస్ట్ ర్యాంక్ రావడంతో న్యూయార్క్ సిటీ పోలీస్‌లో నాకు ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు గారు తాను స్థాపించిన పోలీసు అకాడమీలో పనిచేయడానికి నన్ను రమ్మన్నారు. అందులో నేననుకున్నట్లు విభిన్నంగా, కొత్త ప్రమాణాలు సాధించే దిశగా పనిచేసే అవకాశం లభించింది. నేను ఉద్యోగ విరమణ చేసే నాటికి కొన్ని ఉన్నత ప్రమాణాలు నిలబెట్టడానికి వీలయ్యింది. దేశంలో కెల్లా అత్యంత ప్రామాణికమైన ఫోరెన్సిక్ ల్యాబ్‌ను స్థాపించడం అలా సాధ్యమయ్యిందే. అన్నిసార్లూ మనం అనుకున్నంత వేగంగా ఆశించిన పరిస్థితులు రాకపోవచ్చు. ఆ అవకాశం ఎప్పుడు వచ్చినా ఆ భావజాలాన్ని అప్పటిదాకా మనసులో పదిలపరుచుకోవడం ఎంతో ముఖ్యమని భావిస్తాను. అదృష్టవశాత్తూ నేనలా నిలుపుకోగలిగాను.
భిన్నత్వాన్ని మన్నిస్తారు
నేను రిటైర్ అవడానికి అంటే 2007 కు కొద్ది రోజుల ముందే నేను ‘ట్రూత్ ల్యాబ్స్’ పేరిట ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ స్థాపనకు శ్రీకారం చుట్టాను. ట్రూత్స్ ల్యాబ్ అనే ఐడియా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కొత్తది. ఎక్కడా, ఎప్పుడూ ప్రభుత్వేతర వ్యక్తికి ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ పెట్టడానికి అనుమతి ఇవ్వదు. అయినా నేను అందుకు దరఖాస్తు పెట్టుకున్నాను. ప్రజలకు తాము నేరుగా వెళ్లడానికి ఒక అవకాశం ఉండాలని కోరాను. ఇప్పటిదాకా ప్రైవే టు వ్యవస్థలేవీ లేవు కాబట్టి చాలా కొద్ది మంది కోర్టు ద్వారా పోలీస్ వ్యవస్థ వద్దకు వెళ్లి ఫోరెన్సిక్ తీసుకోగలుగుతున్నారు గానీ, అలా వెళ్లలేని వర్గానికి ఆ అవకాశాలే లేవని, అలాంటిది స్థాపించడానికి నాకు అనుమతి కావాలని అడిగాను. నా ప్రతిపాదనను గవర్నర్లు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, డిజిపిలు, సిబిఐ డైరెక్టర్లు, అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం, అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అందరూ ఆమోదాన్ని తెలిపారు. ప్రభుత్వ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఉన్నప్పటికీ నేర విచారణ సంస్థలు ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ అవసరాన్ని గుర్తించాయి. వాళ్లు తమ వద్దకు వచ్చిన కేసుల్లో క్లిష్టమైన వాటిని మా వద్దకు పంపుతున్నారు. మన దేశానివే కాకుండా, మలేషియా, సింగపూర్, యూ ఎస్, దుబాయి లాంటి దేశాలనుంచి కూడా మాకు కేసులు వస్తున్నాయి. ఆ కారణంగానే ల్యాబ్ ప్రారంభమైన అతి స్వల్ప కాలంలోనే దేశంలోనే నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వం గానీ, మరో వ్యవస్థ గానీ తన చుట్టూ కొన్ని పరిధులు గీసుకోవచ్చు. అందులో భాగంగా కొన్ని నియమాలు విధించవచ్చు. అయితే అప్పటిదాకా లేని కొన్ని కొత్త ప్రమాణాలు సాధించేందుకు ఎవరైనా అసాధారణ మార్గాన్ని ఎంచుకుంటే ఆ వ్యవస్థలు పెద్దమనసుతో అందుకు అనుమతిస్తాయన్న సత్యాన్ని ఆ అనుభవం ద్వారా తెలుసుకున్నాను.
మంచికి మహాబీజాలు
విదేశాలకు వెళ్లిన ఒక సందర్భంలో నా వాలెట్( పర్స్) పోయింది. నేను వెళ్లాల్సిన విమానం టికెట్ కూడా అందులోనే ఉంది. కనీసం రిజర్వేషన్‌ను కేన్సల్ చెయ్యమని చెబుదామని ఎయిర్ పోర్టుకు వెళ్లాను. నేనింకా పెదవైనా విప్పకముదే.. బుకింగ్ ఆఫీసుకు సంబంధించిన అతను మీ వద్ద టికెట్ లేదనుకుంటాను? అన్నాడు. నేను తడబడుతూ “లేదు” అన్నాను. “మీ వద్ద మీ వాలెట్ కూడా లేదనుకుంటాను?” అన్నాడు. ” ఔను”అన్నాను. ” నిన్న మీరు బస్సులో వెళుతూ మీ వాలెట్ పోగొట్టుకున్నారు. మీ పక్క సీట్లో కూర్చున్న అతను దాన్ని తీసుకుని రాత్రంతా మీ ఆఫీసుకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆదివారం కావడం వల్ల ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ రోజు మీరు ప్రయాణం చెయ్యాల్సి ఉంది కాబట్టి ఇక్కడికి మీరు తప్పకుండా వస్తారనుకుని అతడు మీ వాలెట్‌ను ఇక్కడ డిపాజిట్ చే సి, మీరు రాగానే తనకోసారి ఫోన్ చేయమని చెప్పారు” అన్నారు. ఆశ్చర్యపోయాను. ఆనందపడ్డాను. మంచితనం మీద మరింత నమ్మకం పెంచుకున్నాను.
తెలియకుండానే….
అది 2011. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఒక అమ్మాయినీ, దానికి కారుణమని వాళ్లు అనుమానిస్తున్న ఒక అబ్బాయినీ వెంటతీసుకుని ఒక ఊరు ఊరంతా మా ల్యాబ్‌కు కదలి వచ్చింది ఒక రోజు. ఆ అమ్మాయి గర్భం దాల్చిన ఏడు మాసాల దాకా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినా ఆ తరువాత అందరికీ తెలిసిపోయింది. కుల పెద్దలు ఆమెను నిలదీస్తే, మరో కులానికి చెందిన ఒక అబ్బాయి పేరు చెప్పింది. వివిధ కారణాల వల్ల ఈ రెండు కులాల మధ్య ఎన్నో ఏళ్లుగా రగులుతున్న అగ్నిలో ఈ పరిణామం ఒక ఆజ్యం పోసినట్లయ్యింది. గర్భస్రావం చేయించే గడువు దాటిపోయినందువల్ల ప్రసవం తరువాతే సమస్య పరిష్కారం గురించి ఆలోచిద్దామనుకుని పెద్దలు అప్పుడు విషయాన్ని వాయిదా వేశారు. రెండు మాసాల తర్వాత ఆమెకు బాబు పుట్టాడు. పుట్టిన కొద్ది రోజులకే నిజనిర్థారణ పరీక్షల కోసం మా దగ్గరకు వచ్చారు. ఆ అమ్మాయి, అబ్బాయిల తల్లిదండ్రుల పరిస్థితి అయోమయంగా ఉంది. రెండు కులాల్లోని యువగణమంతా వీరావేశంతో రగిలిపోతుంటే, పెద్దవాళ్లు మాత్రం ఎన్ని ప్రాణాలు ఆహుతైపోతాయోనని తీవ్రమైన భయంతో వణికిపోతున్నారు. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆలోచించే వాళ్లు పెద్దగా కనిపించలేదు గానీ, ఆ అబ్బాయే కారణమని తేలితే, అదే అదనుగా ఆ వర్గం మీద పగ తీర్చుకోవచ్చని ఈ అమ్మాయి తాలూకు వర్గం ఎదురుచూస్తోంది. ఇరువర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠ. అయితే పుట్టిన బాబు డిఎన్ఏ పరీక్షల్లో ఆమె గర్భధారణకు అతడు కారణం కాదని తేలిపోయింది. అమ్మాయి వర్గం ఎప్పటి నుంచో పేర్చుకుంటూ వచ్చిన అగ్ని గుండం మీద కుండపోతగా వర్షం కురిసినట్లయింది. ఎన్నో హింసాత్మక ఘటనలకు తెరదీయబోయిన ఒక ఉదంతం అలా సుఖాంతమయ్యింది. శాస్త్రీయ పరీక్షలు లేని రోజుల్లో ఇలాంటి అపోహలతో ఎన్నెన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉంటాయో అనిపించింది. డిఎన్ఏ విషయమే అని కాదు, నిజాలేవీ తెలియకుండా ఎంతటి అభియోగానికైనా సిద్ధపడే కొన్ని మనస్తత్వాల్ని చూస్తుంటే, మానవాళికి ఎంత పెద్ద విపత్తో కదా అనిపిస్తుంది. తెలియని వాటి విషయంలో తెలియనట్టే ఉండగలిగే సంస్కారం ఎప్పటికైనా వస్తే అది ఎంతో మేలు కదా అని నేను పలుమార్లు అనుకుంటాను.
పరిధి విస్తరించాలి
మొత్తంగా చూస్తే సమాజంలో నానాటికీ నేర ప్రవృత్తి బాగా పెరిగిపోతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా కొంత మంది నేరస్తులు దొరికిపోతే మాత్రం ఏమవుతుంది? నిత్యం జరిగే నేరాల్లో పట్టుబడుతున్నవి పది లక్షల్లో ఒకటి కూడా కాదనుకుంటాను. అందుకే సమాజపరమైన మార్పు తేవడంలో వీటి పాత్ర చాలా స్వల్పమేనన్న అంతర్మ«థనం నాలో ఇటీవల పెరిగిపోతోంది. మోసాలు చేసే వాడు చేస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు ఒకటి రెండు కోట్లకే పరిమితమై ఉన్న అవినీతి ఇప్పుడు వేల కోట్లు దాటి లక్షల కోట్లదాకా వెళ్లిపోయింది. ఈ స్థితిలో ఏ నేర నిరూపణ అయినా ఏపాటిది? ఈ విషయమై గురువుల్లాంటి కొంత మంది పెద్దవాళ్లను నేను కలిశాను. వారంతా ” నేరుగా ప్రజా జీవితంలోకి ప్రవేశిస్తే తప్ప సమాజంలో నువ్వనుకునే ఆ గణనీయమైన మార్పు తీసుకు రావడం అసాధ్యం” అన్నారు. అందుకే కొద్దికాలం క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశాను. ఆ పార్టీ త్వరలోనే మన తెలుగు నేల మీదికి రాబోతోంది. విభిన్నంగా ఉండాలని , కొత్త ప్రమాణాలు సాధించాలని అప్పుడెప్పుడో బాల్యంలో అమ్మ చెప్పిన మాటలు నన్ను ఎటునుంచి ఎటు తీసుకు వెళుతున్నాయో కదా అనిపిస్తోంది.
– బమ్మెర

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.