మరపు రాణి మనీషి -తిరుమల రామ చంద్ర -శతజయంతి -ఆంద్ర జ్యోతి

 

ఇరవయ్యో శతాబ్దిలో తెలుగు పత్రికా రచనకు విద్వత్ సౌరభాలు సమకూర్చిన పాత్రికేయులలో తిరుమల రామచంద్ర అగ్రగణ్యులు. జీవనయాత్రలో ‘హంపి నుంచి హరప్పాదాకా’ సాగిన రామచంద్ర తెలుగు ‘నుడి-నానుడి’ని సుబోధకం చేసిన విద్వన్మణి.

తెలుగు సాహిత్యం, పత్రికా రంగాల్లో ప్రాతఃస్మరణీయుడు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. స్వాతంత్య్ర సమరయోధునిగా మద్రాసు కుట్ర కేసులో ముద్దాయిగా స్వాతంత్య్ర సమరంలో పాలుపంచుకున్నారు. తిరుమల రామచంద్ర తన 84 ఏళ్ళ జీవితంలో అర్ధ శతాబ్ది పత్రికా రచనకే అంకితమైనారు. తెలుగు నాట, భారతావనిలో ప్రసిద్ధులైన కవిపండితులు, కళాకారులు, భాషావేత్తలు, తత్వ్త చింతకులు అయిన ప్రతిభాశాలురు అనేక మందిని ఆయన ఇంటర్వ్యూ చేశారు. సుమారు 50 పుస్తకాల దాకా ఆయనవి అచ్చైనాయి. ఆయన చూసినంత దేశమూ, ఆయనకు లభించినన్ని జీవితానుభవాలు, దేశమంతటా ఆయనకు లభించిన విశిష్ట వ్యక్తుల పరిచయాలూ మరెవరి విషయంలోనూ ప్రస్తావించలేము.

వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకున్న తిరుమల రామచంద్ర విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశారు. ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్తాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. అనంతరం ఢిల్లీ వచ్చి ‘డెయిలీ టెలిగ్రాఫ్’ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. 1944లో పత్రికా రంగంలో చేరారు. తొలుత తెలంగాణ పత్రికలో పనిచేశారు. తర్వాత ‘మీజాన్’లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలారు. ఆ రోజుల్లో సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల దంపతులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో సోషలిస్టు భావజాలానికి దగ్గరయ్యారు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. ‘భారతి’ మాస పత్రిక ఇన్‌చార్జ్ ఎడిటర్‌గా పనిచేసిన కాలంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ వ్యాసం ప్రచురించిన కారణంగా తలెత్తిన బేధాభిప్రాయాలలో రాజీనామా చేశారు. నార్లతో విభేదించి ఆంధ్రప్రభలో ఉద్యోగం వదులుకున్నారు.

‘డైలీ టెలిగ్రాఫ్’లో చేరిన వెంటనే దాని సంపాదకులు వెంకట్రామన్, రామచంద్ర గారికి ఇచ్చిన మొట్టమొదటి అవకాశం ప్రక్యాత పరిశోధకుడు, బహుభాషావేత్త అయిన రాహుల్ సాంకృత్యాయన్ ఉపన్యాసాన్ని కవర్ చేయడం. తర్వాత హైదరాబాద్‌లో సంగెం లక్ష్మీబాయిని కలిసి తెలుగు పత్రికా జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి పత్రికా రంగంలోనే స్థిరంగా వున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ కాన్పూర్‌లో ఒక సాహితీ సమావేశంలో ప్రసంగించగా ఆయన ప్రసంగ పాఠాన్ని కాన్పూర్ నుంచే అప్పుడే ప్రారంభమైన డెయిలీ టెలిగ్రాఫ్ పత్రికకు విలేఖత్వం వహించి వృత్తాంత కథనం రూపొందించారు. రాహుల్ సాంకృత్యాయన్‌ను స్వయంగా కలుసుకున్నారు. లక్ష్మణ్ స్వరూప్, కె.పి. జయస్వాల్ వంటి గొప్ప సాహితీ వేత్తలను కలుసుకున్నారు. బహుభాషా కోవిదుడైన రఘువీర తన ప్రపంచ భాషా నిఘంటు నిర్మాణంలో తనతో కలిసి పనిచేయవలసిందిగా సహాయ సహకారాలు అర్థించగా, జీవనోపాధికి ఆ పని కలిసిరాదని ఉత్సుకత చూపలేకపోయానని, అటువంటి గొప్ప అవకాశం వదులుకోవలసినది కాదనీ పశ్చాత్తాపం చెందినట్లు స్వీయ చరిత్రలో చెప్పుకున్నారు.

ఆత్మకథ ‘హంపి నుంచి హరప్పా దాకా’లో ‘ఇవి నా జీవితంలో మూడోవంతు సంఘటనలు, నేను సామాన్య మానవుడ్ని, కానీ నాలో వైచిత్రం, వైవిధ్యం తప్పదు’ అని తిరుమల రామచంద్ర రాసుకున్నారు. పదమూడవ యేట ఒక శృంగార రచన చేసినా మానవల్లి రామకృష్ణ కవి మందలింపుతో దేశభక్తి గీతాలవైపు మళ్ళారు రామచంద్ర. కొన్ని వందల వ్యాసాలు సమీక్షలు రాశారు. ‘హైదరాబాద్ నోట్‌బుక్’ వంటి 15 శీర్షికలు నిర్వహించారు. ‘సత్యాగ్రహ విజయం’ నాటకం, రణన్నినాదం గీతాన్ని సంస్కృతంలో రాశారు. ‘మన లిపి – పుట్టు పూర్వోత్తరాలు’ అన్న రామచంద్ర రచన భాషా చరిత్రకే తలమానికమంటూ ఇతర భాషలలో కూడా ఇలాంటి రచన లేదన్న విశ్వాసాన్ని ‘ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు’ ప్రకటించడం రామచంద్ర అలుపెరుగని పరిశోధకుడు అనడానికి నిదర్శనం. ప్రచారానికి ఆయన ఏనాడు అంగలార్చిన వాడు కాదు. నిరాడంబరత, నిండు మనసు, ఓరిమి వారి వ్యక్తిత్వంలో ఇమిడిపోయాయి.

తిరుమల రామచంద్ర లాహోర్‌లో మూడేళ్ళున్నారు. ఇక్కడ పంజాబీ విశ్వవిద్యాలయం అనుబంధ విద్యాసంస్థ అయిన ప్రాచ్య లిఖిత తాళపత్ర గ్రంథాలయంలో వివరణాత్మక సూచీ కర్త (డిస్క్రిప్టివ్ కేటలాగర్)గా పనిచేశారు. లాహోర్ విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత తాళ పత్ర గ్రంథ సంచయంలో తెలుగు లిపిలో ఉన్న గ్రంథాలెన్నో ఉన్నాయని, తంత్ర శాస్త్రం, వేదాంతం, సాహిత్య గ్రంథాలకు తను వివరణాత్మక సూచిక తయారు చేశానని చెప్పారు. అక్కడ పనిచేస్తున్నపుడు ఇప్పటి పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతాన్ని పర్యటించారు. హరప్పా, మొహంజదారో శిథిలావశేష చారిత్రక ప్రాముఖ్య ప్రాంతాలను దర్శించారు. వీటిని గూర్చి స్వీయ చరిత్రలో వివరించారు.

ఆ తర్వాత లక్నోలో కొద్ది కాలం హిందీ ఉపాధ్యాయత్వం నెరిపారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో సైన్యాంలో హవల్దార్ క్లర్క్‌గా పనిచేసినప్పుడు, సైనిక విన్యాస గౌరవాభినందనలు అందుకోవటానికి వచ్చిన విన్‌స్టన్ చర్చిల్‌ను దగ్గరగా చూశారు. ఇరాన్ సరిహద్దు అయిన చమన్‌లో సైనిక విధులు నిర్వహించారు. దేశ విభజన జరిగి లాహోర్ పాకిస్థాన్‌కు దక్కినప్పుడు, ఒక గూఢ ప్రణాళిక బద్ధంగా దానిని పాకిస్థాన్‌లో సంలీనం చేసినందుకు పైతృకమైన ఆస్తి అన్యాక్రాంతం దురాక్రాంతమైనంత దుఃఖం అనుభవించానని చెప్పుకున్నారు. లాహోర్‌లో దక్షిణాది కుటుంబాలు ఒకప్పుడు గణనీయంగా ఉండేవని, అక్కడ పాఠశాలల్లో భారతీయ భాషల పఠన పాఠనాలు ఉండేవని ప్రస్తావించి ఎంతో ఖేదం చెందారు. ఇదీ రామచంద్రగారి విశిష్ట వ్యక్తిత్వం. ఆరోజుల్లో పత్రికా రంగంలో పనిచేయడం గొప్ప దేశభక్తికి తార్కాణంగా ఉండేదనీ, తాను పత్రికా రంగాన్నే తన జీవిత ధ్యేయంగావించుకున్నాననీ, అందువల్లనే కాన్పూర్‌లో స్వాతంత్య్రోద్యమ ప్రచార సాధనంగా కొత్తగా స్థాపితమైన దినపత్రికలో చేరానని, అనంతపురంలోని తన తండ్రిగారికి రాయగా, అట్లా అయితే తెలుగు పత్రికలో పనిచేయవచ్చు కదా అని తండ్రిగారు ఉద్బోధించారనీ, ఆ ప్రోత్సాహంతో తెలుగునాడుకు తరలివచ్చాననీ ఆయన స్వీయ చరిత్రోదంతం.

తిరుమల రామచంద్ర జీవితంలో వైవిధ్యాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సనాతన వైష్ణవ కుటుంబంలో పుట్టి పెరిగిన వీరు సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆయుర్వేదం చదువుకున్నారు. తాత తండ్రుల ప్రభావంతో కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమంలో పనిచేశారు. గాంధీని దర్శించారు. వారితో హరిజనోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు దుస్తులు కట్టేవారు.

బ్రిటిష్ శాసనోల్లంఘనానికి పాల్పడి రాయవెల్లూరు, తిరిచిరాపల్లి జైళ్ళల్లో శిక్ష అనుభవించారు. కానీ తర్వాత విప్లవోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. మద్రాసు కుట్రకేసులో ముద్దాయిగా ఇరుక్కున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరే తరువాత భుక్తి కోసం మిలటరీలో హవల్దార్ క్లర్క్‌గా బలూచిస్తాన్, క్వెట్టా, యెమెన్ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు, అచ్చర్ సింఘ్ అనే మిత్రునికి సహాయం చేయబోయి కోర్టు మార్షల్‌కు గురి అయ్యారు. ఓరియెంటల్ మ్యానుస్క్రిప్టు లైబ్రరీలో కాపీయిస్టుగా, తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీలో పండితునిగా, లాహోర్ విశ్వవిద్యాలయంలో తాళపత్రాల సూచీకర్తగా, హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయునిగా, కాన్పూర్ డెయిరీ టెలీగ్రాఫ్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేసిన రామచంద్ర మద్రాసు మింటు స్ట్రీటులోని గుజరాతీ హోటల్లోను, రామవిలాస్ అనే హోటల్లోను పనిచేశారు. లాహోర్‌లో ఒక రోల్డుగోల్డు కంపెనీ గుమస్తాగా, కాన్పూర్‌లో మరికొన్ని చిల్లర మల్లర పనులు కూడా చేశారు. నాస్తికునిగా, హేతువాదిగా ప్రకటించుకున్న వీరే దేవాలయంలో పూజ చేయడం, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి వద్ద సహాయకునిగా పౌరోహిత్యం చేయడం వంటివి చేశారు.

మూడు ‘వాజ్మయ శిఖరాలు’ అనే గొప్ప-సాహితీవేత్తల-జీవిత చరిత్రలు కూర్చారు. అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రాఘవపల్లెలో జన్మించిన రామచంద్ర తెలుగు, సంస్కృతాలలో విద్వాన్ హిందీలో ప్రభాకర పట్టాలు పొందారు. తిరుపతిలో చదువుతున్నపుడు వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది జైలు శిక్ష అనుభవించారు. సహాయ నిరాకరణ సభల కోసం మార్చింగ్ సాంగ్స్ రాశారు. ఆయన నిత్య పాత్రికేయుడు, రచయిత, అధ్యయన శీలి, విద్యార్థి కూడా…
– నందిరాజు రాధాకృష్ణ
సీనియర్ జర్నలిస్టు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.