
‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో… కనిపించని కుట్రల’ అని పల్లెటూళ్ల మీద జరుగుతున్న దుర్మార్గాలను పదేళ్లనాడే హెచ్చరించిన ప్రజాకవి గోరటి వెంకన్న. ‘మా ఊరి జీవితమే నా పాటల్లో కనిపిస్తుంది’ అని మురిసిపోతూ తన సొంతూరు గౌరారం గురించి ఆయన చెబుతున్న ముచ్చట్లే ఈ వారం ‘మా ఊరు’
మాది మహబూబ్నగర్ జిల్లా అని చెప్పగానే, పొట్ట చేతబట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస పోయే కూలినాలి జనాల దృశ్యమే కళ్ల ముందు మెదులుతుంది అందరికీ. కాని మా ఊరి చిత్రం దానికి భిన్నంగా ఉంటుంది. ఊరి చుట్టూ తోటలు, పచ్చని పంట పొలాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. ఊరి ప్రజలందరూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఎందుకంటే మా ఊళ్లో దళితులు మొదలుకొని అగ్రహారీకుల వరకూ అందరికీ తక్కువలో తక్కువ ఐదెకరాల భూమి ఉంది. అందరూ మధ్యతరగతి రైతులే. మిగిలిన ఊళ్లలో పశుసంపద తగ్గిపోతోందని వింటాంగానీ, మా ఊళ్లో ఇప్పటికీ పశువులు ఎక్కువే. వీటన్నిటితో స్వయంపోషకంగా ఉండే మా ఊరికి నేనే కాదు, ఎవరూ ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు.
ఎంత గొప్పో
మా మండల కేంద్రం తెలకపల్లి ‘తెలకడు’ అనే దళిత శివయోగి పేరు మీద ఏర్పడింది. ఇక మా ఊరు శ్రీశైలానికి వతన్. అంటే పంట నుంచి కొంత భాగం ఆ దేవాలయానికి పంపుతామన్న మాట. ఊరికి పడమరగా ‘ప్రమీలార్జునీయం’ రాసిన రాఘవశర్మ పూర్వీకులు ఉంటారు. తూర్పున ఒక వేదపాఠశాల ఉండేదని పరిశోధనల్లో తేలింది. మా ఊళ్లో నర్సింహావధాని అని దేశంలోనే గొప్ప తర్క పండితుడు ఉండేవారట. ఈశాన్యాన మేలబాయి, తూర్పున ఏనుగోళ్ల కంచెం, వాయవ్యానికి జైన గుట్ట (దీన్ని ఇప్పుడు అందరూ జన్నాయిగుట్ట అంటున్నారు) ఉత్తరానికి రామగిరిగుట్ట, దుందుభి నది ఉన్నాయి. తాపీ ధర్మారావు రాసిన ‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు’ పుస్తకం మీద శిల్పం బొమ్మ ఉంటుంది కదా, అది మాకు సమీపంలోని మామిళ్లపల్లిలోని దేవాలయం మీద ఉండే శిల్పమే. మాది చాలా విశిష్టమైన ఊరు. కలహం అనేది మా ఊళ్లో ‘ఏక్ దిన్కా సుల్తాన్’. అంటే ఇలా వచ్చి అలా పోయేదే తప్ప, కర్రలెత్తి మా ఊరివాళ్లు కొట్టుకోవడం మాకు తెలియనే తెలియదు.
కాసుల్లేకున్నా కష్టం తెలియదు
తెలంగాణలోని చాలా గ్రామాల్లో దొరల పెత్తనం ఉండేది కాని మా ఊళ్లో అలాంటివేం లేవు. మా ఊరిపెద్ద బాల్రెడ్డి గాంధేయవాది. మద్యమాంసాలకు దూరం. గ్రామస్థులు మద్యపానం జోలికి పోకూడదని, పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకోవాలని ప్రోత్సహించేవారాయన. మా నాన్న పేరు నర్సింహ. శుచి, శుభ్రత, శ్రమ, సత్యసంధత వంటి ఎన్నో మంచి లక్షణాలతో శ్రీరామచంద్రుడికి మారుపేరుగా ఉండేవారు. అవే మాకూ నేర్పించారు. మా అమ్మ ఈరమ్మదీ మా ఊరే. నేను పుట్టేనాటికి మా నాన్నకు రెండెకరాల భూమి ఉండేదట. మా తల్లిదండ్రులిద్దరూ శ్రమించి దాన్ని ఎనిమిది ఎకరాలు చేశారు. మా ఇంట్లో కుండల్లో జొన్నలు, రాగులు.. గింజలన్నీ ఉండేవి. మా పొలంలోనే కూరగాయలు పండేవి. ఇంటి వెనక పెరట్లో చిక్కుడులాంటి తీగ జాతి, పాడి ఉండేది. దాంతో మేం అన్నవస్త్రాలకు లోటు లేకుండా జీవించేవాళ్లం. కడుపు నిండా తినడానికి కటకటపడేంత పేద కుటుంబమేం కాదు. అలాగని చేతిలో కాసులాడేవి కాదుగాని, మమ్మల్ని కష్టం తెలియకుండా పెంచాలని తపన పడేవారు మా అమ్మానాన్నా. నాకొక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు.
ఇల్లే గుడి
చెన్నదాసు అనే యోగి మా ప్రాంతంలో తిరుగుతూ మా నాన్న తరంలో సాలె, మాల, మాదిగలందరికీ అష్టాక్షరి మంత్రోపదేశం చేశారట. దానివల్ల ఎక్కువమందికి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, ఉదయాన్నే స్నానం చేసి పూజ చెయ్యడం అన్నీ అలవడ్డాయి. ఎవరి ఇల్లే వారికి ఆలయమయ్యింది గనక ఊళ్లోని ఇతర దేవాలయాలకు వెళ్లే అవసరం పడలేదు మాకు. చేతి నిండా ఎవరి పని వారికున్నప్పుడు కులంతో పనేముంది? కులం పేరుతో ఎక్కువతక్కువలు మా ఊళ్లో ఎప్పుడూ లేవు. ‘ఏం రెడ్డీ..’ ‘ఏం వెంకన్నా’ అనుకోవడమే తప్ప, ఎవరూ ఎవర్నీ ‘అరే, ఒరే’ అనడం లేదు. పైగా అందరూ వరసలతో పిలుచుకునేవారు.
ఆ వారసత్వమే
కొంత ఎర్రనేల, మరికొంత రేగడి భూమి – వీటితో వైవిధ్యంగా ఉండే నేల మాది. తెలంగాణలో ఆంధ్రా ప్రాంతంలాగా పంటలు పండే ఊరు గౌరారం. అందువల్ల చిన్నప్పట్నుంచీ నేను పెద్దయ్యాక మంచి వ్యవసాయదారుణ్ని అవాలనుకునేవాణ్ని. భవిష్యత్తు అంటే పంచె కట్టి, ములుగర్ర చేత పట్టి ఎడ్లబండిని అదిలించుకుంటూ పొలానికెళ్లే దృశ్యమే నా కళ్లముందు మెదిలేది. మా నాన్న మాత్రం మేం బాగా చదువుకోవాలనుకునేవాడు. అందుకే నాకు పొలం పనులేవీ చెప్పేవాడు కాదు. నిజానికి జీతగాడిగా పెట్టేస్తే రోజుకు కుండెడు వడ్లు వచ్చేవి. కాని అలా చెయ్యకుండా, ఎదురు ఖర్చు పెట్టి బిడ్డలను చదివించాడు. అప్పుడప్పుడు మేకలు కాయడం తప్పితే నేనేమీ చేసేవాణ్ని కాదు. మా నాన్నకు పది యక్షగానాలు, కనీసం ఐదు శతకాలు, ఇతరత్రా పద్యాలు, వందకు పైగా జానపద గేయాలు – అవన్నీ నోటికి వచ్చు. ఏదైనా ఒకసారి వింటే చాలు, ఆయనకు నోటికి వచ్చేసేది. మా అమ్మానాన్నలు ఏ మాట చెప్పాలన్నా దాన్ని ఒక సామెతగానో, పద్యంగానో… చాలా కవితాత్మకంగా చెప్పేవారు. రోజువారీ మామూలు సంభాషణల్లో సైతం ఎంతో సంస్కృతి, కవిత్వం ఉట్టిపడుతూ ఉండేవి. వాళ్ల నుంచే పాట నాకు వారసత్వంగా వచ్చింది.
ఊరంటే బెంగ
మా ఊరి దగ్గరున్న దుందుభి వాగు అపర గోదావరి. వానాకాలం మొదలవక ముందే, ఆశ్లేష కార్తె నుంచే అవతలి ఇవతలి ఒడ్డులను ఒరిసి పారేది. అటూఇటూ మనుషుల రాకపోకలకు వీలయ్యేదే కాదు. అందువల్ల నన్ను మూడో తరగతి తర్వాత అవతలి ఒడ్డున ఉన్న రఘురాంపల్లి గ్రామంలో హాస్టల్లో వేశారు. మా ఊళ్లో స్వేచ్ఛగా, ఆరోగ్యంగా పెరిగిన నేను అక్కడ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండలేకపోయేవాణ్ని. గోడలు, పక్కబట్టల నుంచి వచ్చే ముక్కవాసనకు భరించలేక పోయేవాణ్ని. దానికి తోడు కొట్టితిట్టి పని చేయించే మాస్టర్ల వల్ల చదువంటే విరక్తి కలిగింది. గడ్డివాముల్లో దాక్కునేవాణ్ని. దెయ్యం పట్టిందని ఊగిపోతూ బడికెళ్లడాన్ని తప్పించుకునేవాణ్ని. హాస్టల్లో ఉన్నప్పుడు వానాకాలంలో పొంగే వాగును చూస్తే మా ఊరికి వెళ్లలేమనే బెంగ కలిగేది. ముఖ్యంగా సాయంత్రం పూట వాన కురుస్తున్నప్పుడు ఊరి మీద బెంగ ఇంకా ఎక్కువయి ఏడ్చేసేవాణ్ని. కొట్టితిట్టినవాళ్లే కాదు, నా జీవితాన్ని ప్రభావితం చేసి, చదువు పట్ల ఆసక్తిని కలిగించిన మాస్టార్లూ మా పల్లెలోనే ఎదురయ్యారు నాకు. వెంకటరెడ్డి, గోవర్థనరెడ్డి వంటి ఉపాధ్యాయులు గ్రామీణ విద్యార్థుల పట్ల పెట్టిన శ్రద్ధను మాటల్లో చెప్పలే ను.
ఎన్ని స్వరాలో…
ఇంకా తెల్లవారక ముందు, మూడున్నర గంటల సమయానికే మోట కొట్టే శబ్దాలు వినిపించేవి. వాటితో పాటు పాటలు, జారే నీళ్ల చప్పుడు, ఎద్దుల గిట్టల సవ్వడి – ఇవన్నీ చెవుల్లో దూరి గిలి పెట్టేవి. తెలవారుతూనే యోగి కీర్తనలు, భజనలు వినిపించేవి. తర్వాత రోజంతా బాలసంతులు, వీధి భాగవతులు, బుడబుడక్కలవాళ్లు – ఇలా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు. వాళ్లందరి నుంచీ పాటలు వినిపిస్తూనే ఉండేవి. ఇక సాయంత్రం మళ్లీ భజనలు, మేళాలు జరుగుతూ ఉండేవి. ఆలోచిస్తే, మా ఊరివాళ్లు అన్నం తినికాదు, ఆటపాటలతో బతికారు అనిపిస్తుంది. ఆత్మానందాన్ని శారీరక బలంగా మార్చుకుని జీవించారు వాళ్లు. ఆ పల్లెటూరి జీవనశైలి రాగమై నా పాటల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నా పాటల్లో కనిపించేది నేను అనుభవించిన జీవితం కాదు. మా ఊళ్లో నేను చూసిన జీవితం. సాంస్కృతికంగా ఇంత బలమైన ప్రభావాలు ఉండటం వల్ల చిన్నప్పుడు సినిమాల ప్రభావం తక్కువ మాపైన. దగ్గర్లో ఉన్న కల్వకుర్తి, నాగర్కర్నూల్ వంటి పట్టణాల్లో కొత్త సినిమాలు విడుదలైన విషయాన్ని ఇక్కడ బళ్ల మీద తిరుగుతూ చెప్పేవారు. నాకు తెలియక ఆ బండిలోనే సినిమా చూపిస్తారని అనుకునేవాణ్ని చాలారోజులు. నేను చూసిన తొలి సినిమా ‘వీరాంజనేయ యుద్ధం’ అని గుర్తు.
పొలాలు అమ్మనివ్వరు
ప్రస్తుతం మా ఊళ్లో రెండువేల జనాభా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ పొలం అమ్మడానికి ఒప్పుకోరు ఎవ్వరూ. ఎవరైనా పొలం అమ్ముతున్నారని, లేదా కొంటున్నారని తెలిస్తే దాన్ని ఆపడానికి పోటీలు పడి రేటు అమాంతం పెంచేస్తారు! ఇప్పటికీ మాది ఉమ్మడి కుటుంబమే. పండుగపబ్బాలన్నీ కలిసే చేసుకుంటాం. మా ఊళ్లో మొట్టమొదటి పీజీ నేనే. నేను చదవడం చూసి స్ఫూర్తి పొంది తర్వాత మా ఊరి నుంచి చాలామంది పిల్లలు చదువుకున్నారు. పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అదే నేను మా ఊరికి చేసిన మేలు.
తోటలు, పండగలు
మా ఊరి చుట్టూ తోటలే. జామ, మామిడి… వంటి పళ్ల తోటల్లో పడి తిరగడమే మా పని. ఆ పళ్లన్నీ తినడం కాకుండా, ఊరి సమీపంలో ఉన్న గుట్టలన్నీ ఎక్కి అక్కడ దొరికే రేగు, కలిమి, బలుసు పళ్లు కూడా ఏరుకుని తినేవాళ్లం. వాగులో చేపలు పట్టి కాల్చుకుని తినేవాళ్లం. పండగల్లో సంక్రాంతి అంటే ఇష్టంగా ఉండేది. ఆ సమయంలో ఎడ్ల బళ్లకు రంగులద్ది, అలంకరించి ఊరేగించేవారు. దసరా వచ్చినప్పుడు జమ్మిచెట్టును చూడటానికి ఊరు బయటకు వెళ్లటం… అదంతా సరదాగా అనిపించేది. ఇక మృగశిర కార్తెల్లో, ఉగాదినాడు ‘ఆగిది’ చేసేవారు. అంటే వ్యవసాయప్పనులకు అది ప్రారంభం అన్నమాట. మా చిన్నప్పుడు వినాయకచవితి మరీ అంత గొప్పగా చేసేవాళ్లం కాదు.
అలా చూసి ఏడ్చాను..
ఒకరి ముందు చెయ్యి చాపకుండా, ఇచ్చినా తీసుకోకుండా గౌరవంగా బతికిన మా నాన్న ఒకసారి కరువును తట్టుకోలేక హైదరాబాద్లో పనికి వెళ్లాడు. అక్కడ బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి, తలెత్తకుండా పనిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోయి ఏడ్చేశాను.
– అరుణ పప్పు
ఫోటోలు : లవకుమార్, ఎండి యూసఫ్