ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో కాత్యాయని విద్మహేకున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది. సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడంలో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన పద్ధతి ప్రత్యేకంగానే ఉంది. ‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అన్న పితృస్వామిక భావజాలంను పరాస్తం చేస్తూ మహాభారతంలోని స్త్రీపర్వంను ఉదహరిస్తారు. స్త్రీల కోణం అసలు పట్టించుకోని మధ్యయుగం సాహిత్యం స్థితిగతి తేటతెల్లం చేశారు. అట్లాగే ‘మను చరిత్ర లైంగిక దృక్పథం’లోనూ పితృస్వామ్య భావజాలం ఎప్పుడూ స్త్రీ శరీరాన్ని సుఖం కోసమే వాడుకుంది తప్ప ఆమె హృదయాన్ని పట్టించుకోలేదని తెలిపారు.
తెలుగు సాహిత్య విమర్శ ప్రస్తావన వచ్చి నప్పుడు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహేను మినహాయించి మాట్లాడలేం. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆమె విమర్శారంగంలో చైతన్య వంతంగా కనిపిస్తూనే ఉన్నారు. నిరంతరం అధ్యయనం, బోధన, పరిశోధనలతో పాటు వివిధ సంస్థల ద్వారా సాహిత్య సంస్కారాన్ని పెంపొందిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే సాహిత్య అధ్యయనం-విమర్శ వారి శ్వాస, ధ్యాస.
సాహిత్యంతో అంతగా విద్మహే జీవితం ముడిపడడానికి కారణం కేవలం ఆచార్యులుగా విద్యను బోధించడం మాత్రమే కాదు. తాను పనిచేస్తున్న బోధనా రంగంపై మక్కువను పెంచుకోవడం వెనక కుటుంబ నేపథ్యమూ ఉంది. కీ.శే. కేతవరపు రామకోటిశాస్త్రి తెలుగు సాహిత్యం పాదం ముట్టిన పండితులు, విమర్శకులు, పరిశోధకులు. తల్లి ఇందిరాదేవి సాహిత్య సంస్కారులే. తల్లిదండ్రుల పాండిత్య పటిమ, సంస్కారం విద్మహేలో కొత్తపుంతలు తొక్కింది. 12 ఏళ్ల వయస్సు నుండే సాహిత్యాధ్యయనం మక్కువతో చేసారు. ఆ కాలంలోనే తల్లి సహాయంతో వేయి పడగలు లాంటి బృహద్ నవలను చదివారు. క్రమంగా ఎం.ఏ.లో ప్రత్యేక అధ్యయనంగా నవలను ఎన్నుకోడం, పిహెచ్.డి. పరిశోధన కోసం బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవలనే స్వీకరించడం వారి అధ్యయనాసక్తిని తెలుపుతుంది. నవల అనగానే ఇతివృత్తం, పాత్రలు, వాతావరణం, సంభాషణల్లాంటి రొటీన్ అంశాల జోలికి వెళ్లకుండా ‘చివరకు మిగిలేది మానసిక సామాజిక జీవన స్రవంతి నవలా విమర్శ’ అని అంశాన్ని నిర్ధారించుకొని లోతైన పరిశోధన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి పర్యవేక్షణలో చేసారు. అప్పటికే పరిశోధకులకు మార్గదర్శనం చేయాల్సింత సత్తా ఉన్న మార్క్సిస్టు దృక్పథ నైశిత్యం కలిగిన వరవరరావు పరిచయం కూడా కాత్యాయనీ విద్మహేకు నవలను సామాజిక, రాజకీయ, మానసిక కోణాల నుండి మరింత అధ్యయనం చేయడానికి దోహదపడింది.
కాత్యాయని విమర్శ అభ్యుదయ దృక్పథం, మార్క్సిస్టు భావజాలం నుండి రూపుదిద్దుకుంది. వారి వ్యాసాలలో ఈ ధోరణుల తాత్విక పరిమళమే ఉంటుంది. ఈ దృక్పథ నిబద్ధురాలు కనకనే తెలుగు సాహిత్యా విమర్శ వ్యక్తిగత స్థాయికి వెళ్లిన కాలంలోను వారు అకాడమిక్ విమర్శకే ప్రాధాన్యమిచ్చారు. ఇలాంటి ఆరోగ్యకరమైన విమర్శ చేశారు కనకనే నిరంతరం అధ్యయన, విమర్శ, పరిశోధక రంగాల్లో చైతన్యవంతంగా ఉండగలిగారు. కాలక్రమంలో సామాజిక పరిణామాలు, సాహిత్య పరిస్థితులూ మారుతూ వచ్చాయి. ఆ మార్పులను నిశితంగా గమనిస్తూ తన విమర్శా కోణాలను విస్తరించుకున్నారు.
1980 నుండి తెలుగునాట స్త్రీవాద సాహిత్యం స్పృహ పెరిగింది. రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, ఓల్గా లాంటి రచయితలు ఇందుకు దోహదపడ్డారు. రంగనాయకమ్మ స్వీట్ హోమ్ నవలాధ్యయనంతో కాత్యాయని స్త్రీవాద స్పృహను పెంచుకున్నారు. అట్లాగే వారు రాసిన ‘పెళ్లానికి ప్రేమలేఖ’ కథ విశ్లేషణతో స్త్రీవాద సాహిత్య విమర్శకు దారులు వేసుకున్నారు. రోజు రోజుకు అధ్యయనం, విమర్శ, పరిశోధనలో పరిణతి సాధించినా కొద్దీ తన కార్యరంగాన్ని సామాజిక కోణంలోకి మళ్లించారు. స్త్రీజనాభ్యుదయ సంస్థను ఏర్పాటు చేసి స్త్రీల సమస్యలను సామాజిక అవగాహనతో చూడడం ఎలాగో తాను గుర్తిస్తూ తోటి స్త్రీలకు చెప్పడం ప్రారంభించారు. అంటే రచయితగా వారెప్పుడూ దంతపు శిఖరాలపై కూర్చోలేదు. సామాన్య స్త్రీల స్థితిగతులను మధ్యతరగతిలోని డాంబికాన్ని అర్థం చేసికోవాలంటే తప్పకుండా సంస్థల నిర్మాణం జరగాలని గుర్తించారు.
అందుకోసం క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని తరగతుల స్త్రీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి మేధోపరమైన కృషి చేసారు. ఇందుకు వారి సహచర స్త్రీవాదులు దోహదపడ్డారు. కాత్యాయనీ గారిది అంతర్లీనమైన సాహిత్య కృషి కాదు. బహిర్ముఖీనమైనది. సామూహిక కృషి ఎప్పుడూ కొత్త అంచనాలకు అధ్యయనాలకు దారులు వేస్తుందని వారు బలంగా విశ్వసిస్తారు. తన సమాన స్థాయి వ్యక్తులతో ఎట్లా కార్యరంగంలోకి దూకుతారో, తన విద్యార్థులతోను అంతే ఉత్సాహంతో కలిసి పనిచేయడం ఆమెలోని మంచి లక్షణం. అంటే నేర్పడం, నేర్చుకోవడం ఎప్పుడూ ఇష్టపడతారు వారు. తన పరిశోధక విద్యార్థి మార్క యాదయ్యతో కలిసి ‘రావిశాస్త్రి సాహిత్య దృక్పథం’ గ్రంథం రాసారు. దృక్పథ సామ్యం కలిగిన కందాళ శోభ, తోట జ్యోతిరాణిలతో కలిసి మహిళా జీవన సమస్యలపై గ్రంథం రాసా రు. ‘ప్రపంచీకరణ ప్రతిఫలనాలు, ప్రభావాలు’ జ్యోతిరాణితో కలిసి రాసి ప్రచురించారు. అట్లాగే స్వాతంత్య్రానంతర భారతదేశం-స్త్రీల స్థితిగతులపై జ్యోతిరాణి, బుర్రా రాములుతో కలిసి రాసిన గ్రంథాల వల్ల వారు ఇతరులతో కలిసి పనిచేయడంలోని తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు.
ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో వారికున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది.
సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడం లో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన పద్ధతి ప్రత్యేకంగానే ఉంది. ‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అన్న పితృస్వామిక భావజాలంను పరాస్తం చేస్తూ మహాభారతంలోని స్త్రీపర్వంను ఉదహరిస్తారు. కురుక్షేత్ర యుద్ధం తరువాత భర్తలను కోల్పోయిన తన కోడళ్ల భవిష్యత్తును తల్చుకొన్న గాంధారి దుఃఖా న్ని ఉదాహరణగా తీసుకొని స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న ఉక్తి తప్పని కాత్యాయనీ స్త్రీవాద కోణం నుండి రుజువు చేసారు.
మహాభారతంలోని యాభై పెళ్ళిళ్ళను ఒక ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేసిన వీరు ఈ పెళ్ళిళ్ళ ప్రయోజనాలను బహిర్గతం చేశారు. ప్రేమ, స్నేహం కోసం పెళ్ళిళ్ళు, ధర్మం, దాంపత్యం కోసం, ఆస్తి, సంతానం కోసం పెళ్ళిళ్ళున్నాయని, వీటన్నింటినీ పితృస్వామిక, భూస్వామ్య భావజాలం నుండి చూడాలని నిర్ధారించారు. స్త్రీల కోణం అసలు పట్టించుకోని మధ్యయుగం సాహిత్యం స్థితిగతి తేటతెల్లం చేశారు. అట్లాగే ‘మను చరిత్ర లైంగిక దృక్పథం’లోనూ పితృస్వామ్య భావజాలం ఎప్పుడూ స్త్రీ శరీరాన్ని సుఖం కోసమే వాడుకుంది తప్ప ఆమె హృదయాన్ని పట్టించుకోలేదని తెలిపారు.
కాత్యాయనీ విద్మహే స్త్రీవాద సాహిత్య కృషి 1980లో స్పృహగా ప్రారంభమై, చైతన్యం పొంది క్రమంగా ఉద్యమ రూపంలోకి మారింది. నేడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందే శిఖరాగ్ర స్థాయికి చేరుకుంది. ‘సాహిత్యాకాశంలో సగం -స్త్రీల కవిత్వం-కథ-అస్తిత్వ చైతన్యం’ గ్రంథంకు పురస్కారం లభించడం ముదావహం. ఈ గ్రంథంలో స్త్రీవాద సాహిత్య విమర్శలో కాత్యాయని విమర్శా పరిణతి కన్పిస్తుంది. దీనికంటేముందే 2006లో ఆధునిక తెలుగు సాహిత్యం స్త్రీవాద భూమికను అచ్చువేసిన భావజాల వ్యాప్తికి ఈ గ్రంథం పనికొచ్చింది గాని, సాహిత్యాకాశంలో సగం మాత్రం అకడమిక్ విమర్శాస్థాయిలో అత్యున్నతంగా ఎదిగి ఉంది. స్త్రీవాద సాహిత్యాన్ని విలువ కట్టడానికి ఒక నమూనాగా నిలుస్తుంది. మూడు భాగాలుగా ఉన్న ఈ గ్రంథంలో, మొదటిది స్త్రీల సాహిత్య అధ్యయన పద్ధతి-పరిణామం, రెండోది స్త్రీల కవిత్వం, మూడోది స్త్రీల కథ. దీనిలోని 28 వ్యాసాలు వివిధ సందర్భాల్లో రాసినవే అయినా వీటికి ఏకసూత్రత ఉంది. స్త్రీవాద సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి కావలసిన పరికరాలను మొదటి భాగంలో ఇచ్చారు. అవి:
1. స్త్రీలు ఎంత సాహిత్యాన్ని సృష్టించారని కానీ, ఎంత సమర్థవంతంగా, శిల్పారామంగా వ్రాశారని కానీ నిర్ధారిత సంప్రదాయ సాహిత్య విలువలతో అంచనావేయడం కాక అంతకంటే ముఖ్యంగా అసలు వారేం రాశారో, ఎందుకు రాశారో, ఎందుకు రాయలేకపోయారో కూడా తెలుసు కోవాలి.
2. స్త్రీలు తక్కువగా రాయడాన్ని గానీ, రాసినదాని సాహిత్య స్థాయి తక్కువ ఉండడాన్ని గానీ సర్వస్వతంత్ర అంశాలుగా పరిగణించి తిరస్కరించడం కాక పితృస్వామిక అధికార సంబంధాలలో వివక్షకు, అణచివేతకు గురయిన సామాజిక వర్గం సృష్టించిన సాహిత్యంగా దాని ప్రత్యేకతను గుర్తించి నిరూపించాలి.
3. స్త్రీల సాహిత్యాన్ని విలువ కట్టడంలో ఆ సాహిత్యం వచ్చిన కాలం నాటి మొత్తం సమాజపు స్థితి అందులో స్త్రీలకున్న అవకాశాలు, ఆ అవకాశాల నుండి వాళ్లు పొందిన చైతన్య స్థాయి ప్రాతిపదికలు కావాలి. ఆ రచనలు ఏ సామాజిక భావ సంఘర్షణలో భాగమో ఆలోచించినప్పుడు స్త్రీలు ఏ ప్రయోజనాన్ని ఆశించి సాహిత్య సృజన చేసారో అర్థమవుతుంది.
-అంటూ స్త్రీల అధ్యయనాన్ని నిర్దిష్టత వైపుకు మళ్లించాల్సిన అవసరం ఉందని భావించారు. స్త్రీల సాహిత్యం అధ్యయనం చేయడానికి సిద్ధాంతం-పద్ధతిని సూచించారు. సిద్ధాంతమంటే దృక్పథమని, పద్ధతి అంటే నిర్దిష్టతకు సంబంధించిందని వివరించారు. వీరు మాత్రం మార్క్సిస్టు రాజకీయ ఆర్థిక శాస్త్ర దృక్పథం నుండి స్త్రీవాద సాహిత్యాన్ని అధ్యయనం చేసారు.
స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీల కవిత్వం, సావిత్రి సాహిత్య జీవితం, నిర్మల, భవానీదేవీ రేవతీదేవి, మహె జబీన్ కవిత్వాలను విశ్లేషించారు. రంగనాయకమ్మ కథలు, సత్యవతి కథలు, రుక్మిణి కథలు, ద్వివేదుల విశాలాక్షి కథలు, జలంధర కథలను కాత్యాయని ఈ గ్రంథంలో విశ్లేషించారు. విప్లవోద్యమ కథ- తెలంగాణ రచయిత్రుల కథలను కూడా వారిదైన మార్గంలో విమర్శించారు.
విమర్శలో ఒక పద్ధతిని, క్రమశిక్షణని, ప్రామాణికతను పాటించే కాత్యాయని విశ్వవిద్యాలయాల్లో స్త్రీవాద సాహి త్యం, మహిళా సాహిత్య అధ్యయనానికి కావలసిన పాఠ్యాంశాలను రూపొందించడంలోను నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ తరం సాహితీ పాఠకులకు సామాజిక అవగాహన, రాజకీయ దృక్పథం ఉంటే తప్ప సాహిత్యాన్ని అర్థం చేసుకోలేరని వారి విమర్శను చదివితే తెలుస్తుంది.
మొత్తానికి స్త్రీవాద సాహిత్య విమర్శకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సాధించి పెట్టిన ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహేకు శుభాకాంక్షలు.
-ప్రొ.బన్న అయిలయ్య
99491 06968