
సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి సంవత్సరాన్ని వైభవోపేతంగా జరపాల్సిన ప్రభుత్వం ఆయనను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సాహితీ రత్నాన్ని ముందు తరాల వారికి అందించడానికి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సి ఉందని అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగు సారస్వతానికి కళాత్మక సొబగులద్దిన సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి ఉత్సవాలు సందడి లేకుండా చప్పచప్పగా జరుగుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదినంతా ్తెలుగు భాష, సాంస్కృతిక సంవత్సరం*గా ప్రకటించిన రోజుల్లోనే వచ్చిన ్రాయలసీమ సాహితీరత్నం* సంస్మరణ కూడా ఆ ప్రాంతాల పరిధికి కుంచించుకుపోతోంది. తెలుగుగడ్డ హద్దులు దాటి దిగంతాలకు విస్తరించిన పుట్టపర్తి సృజనా సౌరభాలు శతజయంతి సంవత్సరంలో ప్రభుత్వం తలపెట్టినవన్నీ నత్తలకన్నా మందగమనంలో మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అన్న చందంగా సాగుతున్నాయి.
ప్రొద్దుటూరులో ఆ ఊరి పెద్దలు, అభిమానులు కలిసి చేసిన పనులు, విగ్రహం పెట్టి నోరారా పుట్టపర్తి సెంటర్‌గా నిత్యం పిలుచుకునే స్ఫూర్తి ఈ ఏడాది ఉత్సవాలలో ఎక్కడా కలికానికి కూడా కనిపించడం లేదు. విశ్వవ్యాప్తంగా ఉన్న వేల వేల మంది అభిమానులను కూడగడితే ఒనగూడే మేలుపై బాధ్యతగలవారు స్పందించకుండానే మూడొంతుల ఉత్సవ కాలం కరిగిపోయింది. 1914 మార్చి 28న జన్మించి 1990 సెప్టెంబర్ 1న కన్నుమూసిన నారాయణాచార్యులు శత జయంతికి ఈ ఏడాది జూన్ నెలాఖరులో 10 లక్షల నిధుల మంజూరుతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. 1914-2014 ఏడాదిని శత జయంతి సంవత్సరంగా వైభవంగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సరస్వతీపుత్రుడి అముద్రిత రచనలన్నిటినీ సేకరించి ఆధునిక పరిజ్ఙానంతో వాటిని నిక్షిప్తం చేసి, వాటిని భావితరాల కోసం పరిరక్షించడానికి అన్ని చర్యలూ చేపట్టాలని సాంస్కృతిక శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అనేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా భావించింది. గతంలో తెలుగు సాహితీవేత్తల శత జయంతులు, సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించిన సాంస్కృతిక శాఖలో పుట్టపర్తి వారి వ్యవహారాలన్నీ ఆయన కుమార్తె నాగపద్మిని చొరవతోనే ఆచరణలోకి వస్తున్నాయి.
ప్రతిభను వరించి వచ్చిన పద్మశ్రీతో పొంగిపోని పుట్టపర్తి నారాయణాచార్యులు ఢిల్లీలో కొందరి అడ్డుపుల్లలతో మాత్రం కుంగిపోయారు. సారస్వతంలో వ్యక్తుల పైరవీలు, రకరకాల ఒత్తిడులు ప్రభుత్వ పురస్కారాలు ప్రతిష్టాత్మక వేదికలపై సన్మానాలకు ప్రాతిపదిక కావటం, ప్రబలం కావటంపై ఆయన తీవ్రంగా కలత చెందేవారు. ఆయన గతించిన తరువాత కూడా ఆ ఛాయలు శతజయంతి వేడుకలపై తమ నీలి నీడల్ని ప్రసరింపజేస్తున్నాయి. సుమారుగా 45 రోజులపాటు మాత్రమే విధులు, భాధ్యతలు నిర్వహించిన ఒక అధికారిణి వల్లనే సరికొత్త కృతుల పెన్నిధి అందుబాటులోకి రాబోతోంది. మన రాష్ట్ర ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో సంచాలక పదవిని 1997 నవంబర్‌లో చేపట్టి అదే ఏడాది డిసెంబర్ 31 నాటికి ఒప్పగించి వెడలిపోయిన సరళారాణి చొరవతో సేకరించినవి 2013 నవంబరులో వెలుగు చూశాయి.
ఇక అధికార భాషా సంఘం అద్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఈ ఏడాది అక్టోబర్‌లో యా«థాలాపంగా ఆ గ్రంథాలయంలోని అముద్రిత గ్రంథాల జాబితాను పరిశీలిస్తుంటే పుట్టపర్తి నారాయణాచార్యులవారి చేతిరాతతో వందలాది కృతులు కట్టలు కట్టలుగా ఉన్నాయని తెలిసింది. వెంటనే ఆయన దీన్ని ఇప్పటి సంచాలకుడు ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం దృష్టికి తేగా ఆయన చిన్న చిన్న నోట్ బుక్‌లలో పడి ఉన్న లయతాళ బద్ధమైన వేలాది కృతులను ఒక క్రమంలో అమరికలోకి తెచ్చారు. విశ్రాంత రాష్ట్ర రెవిన్యూ ఉద్యోగిగా పని చేస్తున్న పుట్టపర్తివారి కుమారుడు అరవింద్ కుమార్ తన ఇంట్లో ట్రంకుపెట్టిలో పదిలపరుచుకున్న సుమారు 3000 పాటలను సేకరించి, వాటి నుంచి 1001 కృతులను ఆలాపనకు అనువుగా స్వరరాగయుక్తంగా ప్రచురించే సన్నాహాలు మొదలుపెట్టారు. సంగీత రంగం ఉదండులు ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కొమండూరి శేషాద్రి వంటివారు వాటిని అందరి ఆలాపనకు అనువైన బాణీలలో అందించటానికి సహకరిస్తున్నారు. వీలయినంత త్వరలో వాటిని పుస్తక రూపంతో తమ గ్రంథాలయ ముద్రణల పరంపరలో విడుదల అయ్యేలా చేస్తున్నామని శ్రీపాద సుబ్రహ్మణ్యం ప్రకటించారు.
కాగితాలకే పరిమితం
పలువురు పెద్దలు, అభిమానులు కోరుకున్న రీతిలో పుట్టపర్తి నారాయణచార్యుల శత జయంతి సంబరాల కోసం 15 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తే కాగితాలన్నీ కదిలి సచివాలయం స్థాయిలో 10 లక్షల మంజూరుతో ముక్తాయింపుకు వచ్చింది. అందులో భాగంగా అధికారులందరి ఆమోదంతో కడప పట్టణంలో పుట్టపర్తివారి విగ్రహం నెలకొల్పటానికి చర్యలు మొదలయ్యాయి. అలా అనుకున్న తరువాత ఏడు నెలలు గడిచినా విగ్రహం నెలకొల్పటానికి మాత్రం స్థలం గుర్తింపు, అందుకు అవసరమైన చర్యలు ఇంతవరకు అమలుకు దగ్గరగా కూడా లేవు. 1972లో పుట్టపర్తి వారికి పద్మశ్రీ పురస్కారం అందివచ్చిన సందర్బంలో రాయలసీమ వికాసం కోసం కృషిచేసిన నేత పైడి లక్ష్మయ్య కుమారుడు ఐఎఎస్ అధికారి పి.ఎల్. సంజీవరెడ్డి కృషితో 200 గజాల స్థలం కేటాయించారు.
విజయవాడలో జ్ఙానపీఠ్తో తెలుగువారి సారస్వత తేజాన్ని దేశానికి చాటిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నివాసాన్ని ఆయన సంతానం స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించటాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. విజయనగరంలో గురజాడ నివాసం, పర్లాకిమిడిలో గిడుగు సీతాపతి గృహం వంటివాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం కూడా చాలా మంది సాహితీప్రియుల మనసుల్లో కలవరం కలిగిస్తోంది. ప్రొద్దుటూరుకు సంబంధించిన పలువురు సాహితీ అభిమానులు నెలకొల్పిన పుట్టపర్తి నారాయణచార్యుల పీఠంవారి వినతుల మేరకుతో జూన్ నెలలో సాంస్కృతిక శాఖ వారు 4 లక్షలు కేటాయించి కాంస్య విగ్రహం నెలకొల్పటానికి సిద్ధమై, ఆ మేరకు లేఖలు కూడా రాసినా జిల్లా అధికారుల నుంచి స్పందన లేదు. అభిమానులు కొందరు కడప జిల్లా అధికారులను సంప్రదిస్తే నిధులు చాలవని చెప్పడమే కాక, విగ్రహాలు ప్రతిష్టించవద్దని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పిందని వాదిస్తున్నారని చెబుతున్నారు.
పుట్టపర్తి ఆవేదన
కడప పట్టణంలోని అభిమానులు, నేతలు కలిసి విరాళాలు సేకరించి విగ్రహం నెలకొల్పుతామని చెప్పినా అధికారులు లెక్క చేయడం లేదనే ఆరోపణలు వినవ స్తున్నాయి. ప్రొద్దుటూరులో కేవలం అయ్యవారి అభిమానుల వల్లనే పుట్టపర్తి సర్కిల్ పుట్టుకొచ్చిందన్న విషయాన్ని అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 1990 సెప్టెంబర్ 1న మరణించిన ఆ అయ్యవారిని నిత్యం స్మరించుకునేలా ఆ ఊరు మధ్యలో మొదటి వర్ధంతి నాటికే ఒక రాతి విగ్రహాన్ని అభిమానులు నెలకొల్పారు. అదే ఏడాది జనవరిలో అనంతపురంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో 74 ఏళ్ల పుట్టపర్తి వారు, ‘మనం బతికి ఉన్నప్పుడే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక మనం పోయిన తరువాత తలచుకునేవాడుంటారా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అది విన్న రాజన్న కవి, జింకా సుబ్రహ్మణ్యం వంటివారు వెంటనే నడుం బిగించి, పలు సంస్మరణ కార్యక్రమాలు తలపెట్టారు. ప్రొద్దుటూరులో జరిగిన మొట్టమెదటి సంతాప సభలో 60 మంది అభిమానులు ఆత్మీయమైన అనుభూతుల్ని నెమరుకు తెచ్చుకుంటూ పరస్పరం పంచుకున్నారు. అయ్యగారి మనసు మాటలు గుర్తుకు తెచ్చుకున్న వారి జ్ఙాపకాలతో స్పందిస్తూ కామిశెట్టి సుబ్బారావు, అంబటి గంగయ్య , సదాశివశర్మలు అవసరమైన మొత్తాలు సమకూర్చి ఊరి మధ్యలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆయన గతించి సరిగ్గా ఏడాది తిరిగొచ్చే నాటికి అన్నీ సమకూరేలా చేసి 1991 సెప్టెంబరు 20 నాడు మాజీ గవర్నర్ పెండేకంటి వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా ప్రతిష్టించారు. రాయలసీమలో కక్షలు కార్పణ్యాలతో హత్యలు రక్తపాతం ఉంటుందనే జనాభిప్రాయానికి భిన్నంగా అభిమానంతో గుండెలకు హత్తుకుని ఎంతకైనా ఉద్యమిస్తారని చేసి చూపించారు. 2006లో పుట్టపర్తి అయ్యవారి విగ్రహాన్ని పెళ్లగించి ఇందిరమ్మ విగ్రహం పెడదామని తలపెట్టిన కాంగ్రెసు నేతలను ఆగ్రహావేశాలతో వెనక్కినెట్టి ఆ ప్రయత్నాన్ని విరమించేలా చేశారు. పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా అందరూ కలసి ధర్నాలు, శవయాత్రలు చేసి రాజకీయ నాయకులను సిగ్గుతో తలదించుకునేలా చేశారు. ముఖ్యమంత్రి కూడా తప్పయిందని ఒప్పుకునేదాకా ఉద్యమ ప్రకంపనలు సృష్టించారు. కడకు కాంగ్రెసు నేతలే అవసరమైనంత సొమ్మును సమకూర్చి ఏడున్నర అడుగుల కాంస్య విగ్రహాన్ని నాటి గవర్నర్ ఎన్.డి. తివారి వచ్చి ప్రతిష్టించేలా చేశారు. ఒక కవి పండితుడి విగ్రహాన్ని ఇద్దరు గవర్నర్లు తమ ఊరికి తరలి వచ్చి ప్రతిష్టించేలా ప్రొద్దుటూరు వాసులు చరిత్ర సృష్టిించారు.
నిధులు సరే, విధులేవీ?
సరస్వతీపుత్రుని శత జయంతిని తెలుగువారందరమూ కలిసి చేద్దామంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పగా చెప్పారు కానీ, వారి మాటలు వాగాడంబరాలేనని తేలిపోయింది. ఆయన రచనలు అన్నీ మళ్లీ కొత్త సంకలనాలుగా విరివిగా అందుబాటులోకి తేవాలన్న యోచన కాగితాలు ప్రింటింగ్ప్రెస్ల మాటు నుంచి వెలుగు చూడనేలేదు. పునర్ముద్రితాల వ్యవహారాలు తెమిలినా అముద్రితాల జాబితాలు మాత్రం ఖరారు కాలేదు. గురజాడ, బోయి భీమన్న, గుర్రం జాషువాల కార్యక్రమాలపై ప్రభుత్వం వెచ్చించిన ధనంతో పోలిస్తే అయ్యవారి జమాఖర్చులు తేలిపోతున్నాయి. అనుకున్న పనులు ఎక్కడివక్కడే నలుగుతున్నాయి. అయిదు విశ్వవిద్యాలయాలలో సదస్సులు పెడదామని తీర్మానిస్తే 21 చోట్ల నిర్వహిద్దామని మరొకరు సూచించారు. తీరా ఒక్క చోట కూడా జరుపలేక పోయారు.
పెద్దాయన గళంలో వినవస్తూ కళ్ల ముందు మెదిలే ్శివతాండవం* రచన కూడా కొద్దిమందికే పరిమితమై పోయింది. శత జయంతుల సంవత్సరంగా తిరుమల రామచంద్ర, పుట్టపర్తి, కాళోజీల త్రయంలో చేయాలనుకున్నవి చేసినవి కూడా పొంతన లేకుండా ఉన్నాయి. సుమారు 14 భాషలలో పాండిత్యంతో 7 భాషలలో రచనలు చేసిన అయ్యవారి జీవితంలో, వ్యక్తిత్వంలో చెప్పుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి చక్కని పండిత వంశ వృక్షంతో, సంపదలతో తులతూగిన పెద్దలున ్న కుటుంబంలో పుట్టి, తుంటరి పనులు, బీడీ పొగ రింగులతో సరదా తిరుగుళ్లతో పేదరికంతో గడిపిన బాల్యం నుంచి సరస్వతీపుత్రుడుగా ఎదిగే వరకు ఆయన జీవనగమనం ఎత్తు పల్లాలమయంగా, స్ఫూర్తి, ఉత్తేజం పెంచేలా సాగింది. సంప్రదాయ సాహిత్యాన్ని, కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రణాళిక, ప్రాకృత భాషలను ఆకళింపు చేసుకున్న ఆయనను ఈ తరానికి, ముందుతరాల వారికి తెలిసేలా చేయటం పాలకుల కనీస కర్తవ్యం. వారిని కూడగట్టి పదిలమైన సాంస్కృతిక వారసత్వాన్ని అందించటం ప్రభుత్వం పని. సంగీతం, సాహిత్యం, నృత్యం సమ్మిళితమైన ్శివతాండవం* వంటి ఆయన రచన ప్రదర్శనలను విస్తృతంగా వేదికల పైనా, డీవీడీల ద్వారా ప్రాచుర్యంలోకి తేవటం కనీస చర్య. తపాలా బిళ్ల, శివుడి సుప్రభాతం, పెనుగొండ లక్ష్మి, మేఘదూతం వంటివి ప్రతి తెలుగువారికి తెలిసేలా చేయటం నిజమైన సంస్మరణ, నివాళి. 2014 మార్చి 28న జరిగే శతజయంతి నాటికి అన్నీ ఒనగూడేలా చేసి, అయ్యవారితో పాటు ఆయన సహచరి కనకవల్లి రచనలను, సాహితీ సేవను కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేయాలని అభిమానుల ఆకాంక్ష.