
అపోలోను తన ఇంటి పేరుగా మార్చుకున్న డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పరిచయం అవసరం లేదు. మన దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన జీవితం చిత్తూరు జిల్లాలోని అరకొండ అనే చిన్న గ్రామంలో ప్రారంభమయింది, అపోలోతో ప్రపంచమంతా విస్తరించింది. ప్రతాప్ సి.రెడ్డి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని పార్శ్వాలతో కూడిన ఆయన జీవితకథ-” హీలర్”ను మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తొలి ప్రతిని అందించారు. ఆ పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు..
“తను స్టాన్లీ కాలేజీ విద్యార్థి సంఘానికి నేతృత్వం వహిస్తున్నానని కూడా చెప్పారు. ఈ విషయం చెప్పిన వెంటనే నెహ్రూ చిరాకుపడ్డారు. “యూనియనేమిటి..? అలాంటి పనులతో మీ జీవితాలను ఎందుకు పాడుచేసుకుంటారు? చదువుపైనే శ్రద్ధ పెట్టాలి..” అన్నారు నెహ్రూ. సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రేమించే నెహ్రూకు విద్యార్థి సంఘాలపై అలాంటి అభిప్రాయం ఉండటం ప్రతాప్‌కు ఆశ్చర్యం కలిగించింది.
మలుపు తిప్పిన లేఖ..
( ప్రతాప్ సి. రెడ్డి 1963లో అమెరికాకు వైద్యవిద్య చదువుకోవటానికి వెళ్లారు. 69 నాటికి స్ప్రింగ్ ఫీల్డ్‌లోని మిస్సోరి స్టేట్ చెస్ట్ ఆసుపత్రిలో హృద్రోగనిపుణుడిగా స్థిరపడ్డారు..)
ప్రతాప్ తండ్రి రాఘవరెడ్డి ప్రతి ఏడాది ఆరేడు ఉత్తరాలు రాసేవారు. ప్రతాప్ పుట్టిన రోజుకు (ఫిబ్రవరి 5వతేదీ) అందేటట్లు ఒక ఉత్తరం తప్పనిసరిగా వచ్చేది. కాని 1969 ఫిబ్రవరి 5వ తేదీన ఉత్తరం రాలేదు. రాఘవరెడ్డి చిత్తూరు జిల్లాలోని అరకొండకు గ్రామపెద్ద. అక్కడ ఆయన చెప్పిందే వేదం. తండ్రి నుంచి ఉత్తరం రాకపోయేసరికి ప్రతాప్‌కు ఏదో వెలితిగా అనిపించింది. కాని అప్పట్లో భారత్ నుంచి అమెరికాకు ఉత్తరం రావాలంటే చాలా కాలం పట్టేది. కొన్ని సార్లు అసలే వచ్చేవి కూడా కాదు. మొత్తానికి ఉత్తరం ఫిబ్రవరి 15వ తేదీకి వచ్చింది. ప్రతాప్ కవర్ చింపి చూశాడు. అందులో రాఘవరెడ్డి తెలుగులో రాసిన లేఖ ఉంది. సాధారణంగా ఆయన స్వయంగా ఎప్పుడూ రాయరు. కరణం చేత రాయిస్తారు. అలాంటిది తండ్రే స్వయంగా ఉత్తరం రాసేసరికి ప్రతాప్‌కు ఆదుర్దా పెరిగింది. సాధారణంగా ఉత్తరం మొదట్లోనే పుట్టిన రోజు గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ ఆ ఉత్తరంలో ఆ ప్రస్తావనే లేదు. దీనితో ప్రతాప్‌కు ఆదుర్దా మరింతగా పెరిగింది.. ఆ ఉత్తరంలో-“నువ్వు, నీ కుటుంబం అమెరికాలో ఆనందంగా ఉన్నారని తెలిసి నేను, అమ్మ చాలా సంతోషపడుతున్నాం. నువ్వు చేస్తున్న పనుల గురించి నువ్వు ఉత్తరాలు రాస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంటోంది. కాని నీకు నీ దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తుంచుకో.. నువ్వు భారత్‌కు తిరిగి వస్తే- విదేశాలలో నువ్వు పొందిన శిక్షణ వల్ల ఎంత మందికి ప్రయోజనం కలుగుతుందో ఒక్క సారి ఆలోచించు.. ఎంత మంది ఆరోగ్యవంతులవుతారో ఆలోచించు..” అని ఉంది. ఆ ఉత్తరం చదివిన వెంటనే ప్రతాప్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. భార్య సుచరిత వైపు తిరిగి- “ఏం చేయాలి” అని అడిగే లోపే – “మనం ఇంటికి వెళ్లిపోదాం..” అన్నారామె. ఆ ఒక్క ఉత్తరం ప్రతాప్ జీవితాన్ని మలుపు తిప్పింది. కాని ప్రతాప్ జీవితంలో సాధించిన విజయాలను ఆయన తండ్రి మాత్రం ఎప్పుడూ చూడలేకపోయారు. “ఈ రోజుకూ నేనేదైనా ఫంక్షన్‌లో మాట్లాడుతున్నా, అపోలోలో నా సహచరులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నా, మా నాన్న మొదటి వరసలో కూర్చున్నట్లే అనిపిస్తుంది. ఆయన మొహంలో సన్నటి చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. నన్ను దీవించటానికి ఆయన అక్కడ ఉంటారని నాకు తెలుసు. నేను ఒక మంచి కొడుకు కావాలని ప్రయత్నించా. ఆ విషయం వాళ్లకు కూడా తెలుసు..” అంటారు ప్రతాప్.
బంగారు బాల్యం..
ప్రతాప్ తాత మునిస్వామి రెడ్డి కూడా అరకొండకు గ్రామపెద్దగా వ్యవహరించేవారు. గ్రామప్రజలను తన బిడ్డల్లా చూసుకొనేవారు. ప్రతాప్ చిన్నతనమంతా ఆ ఊళ్లోనే సాగింది. ఆ సమయంలో వాళ్లింట్లో 50 మంది దాకా ఉండేవారు. ఆరుగురు వంటవాళ్లు ఎప్పుడూ వంటలు వండుతూ ఉండేవారు. మునిస్వామిరెడ్డి చనిపోయిన తర్వాత రాఘవరెడ్డి గ్రామ పెద్ద అయ్యారు. “నాన్న, అమ్మ మేడ మీద ఉండేవారు. మిగిలినవాళ్లందరం కిందే పడుకొనేవాళ్లం. రాత్రి టాయిలెట్‌కు వెళ్లాలన్నా- ఇంటి వెనక ఉన్న పొలాల్లోకి వెళ్లేవాళ్లం..” అని ప్రతాప్ తన చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు వెంకోబారావు అనే ఉపాధ్యాయుడు వచ్చి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇంగ్లీషు గ్రామర్, లెక్కలు చెప్పేవారు. ఏ చిన్న తప్పు చేసినా కర్రతో మోకాళ్ల మీద కొట్టేవారు. వెంకోబారావు చేతిలో ఎక్కువ దెబ్బలు తిన్నది విమల (ప్రతాప్ కజిన్). ఆ తర్వాతి స్థానం ప్రతాప్‌దే. ఇప్పటికీ ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతాప్ తన మోకాళ్లవైపు చూసుకుంటూ ఉంటారు. మొత్తం పిల్లలందరిలోను ప్రతాప్ చాలా అల్లరిగా ఉండేవాడు. తండ్రి గదిలో నుంచి మూచ్ సిగరెట్లు తీసుకువచ్చి రహస్యంగా కాల్చేవాడు. ఆయన జీపును తీసుకొని ఎవరితో చెప్పకుండా బయటకు వెళ్లిపోయేవాడు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కోప్పడితే- “ఈ రోజు నేను దెబ్బలు తినేశాను. కావాలంటే నా చేతులు, కాళ్లు చూసుకో..” అని చూపించేవాడు. అలాంటి సమయాల్లో ప్రతాప్ వాళ్ళ అమ్మ పిల్లలందరికీ పూరీలు చేసి పెట్టేది. ఆ సమయంలో ప్రతాప్‌కి తిండి పుష్టి చాలా ఉండేది. పది, పదకొండు పూరీలు ఒకేసారి తినేవాడు.
ఎన్టీఆర్ స్నేహం!
దేశంలో పురాతనమైన కాలేజీలలో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ ఒకటి. బ్రిటిష్ పాలకులు- ప్రెసిడెన్సీ పేరిట రెండు కాలేజీలు స్థాపించారు. ఒకటి కలకత్తాలో ఉంటే మరొకటి మద్రాసులో ఉండేది. ఈ కాలేజీలో చదివినంత కాలం ప్రతాప్‌కు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కాని స్టాన్లీ మెడికల్ కాలేజీకి మారేసరికి రకరకాల ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సమయంలో ప్రతాప్‌కు కోదండరామయ్య అనే రూమ్మేట్ ఉండేవాడు. అన్ని కోర్సుల్లో ఫెయిల్ అయి, మళ్లీ మళ్లీ చదువుతూ ఉండేవాడు. కోదండరామయ్యకు ఎన్టీఆర్, కాంతారావులు స్నేహితులు. వీరిద్దరూ స్టాన్లీ మెడికల్ కాలేజీ స్టూడెంట్లు కాదు. అయినా కాలేజీలో వేసే షేక్‌స్పియర్ నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు. వీరిద్దరికి తిండిపుష్టి చాలా ఉండేది. వీరిద్దరి కోసం ప్రతాప్ బిర్యానీని ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. ఎన్టీఆర్‌కు ఆవకాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకసారి మూడు బాటిళ్ల బ్రాందీని దొంగతనంగా హాస్టల్‌లోకి తరలించారు కూడా! ఎన్టీఆర్ ఆ సమయంలో-” వద్దంటే డబ్బు” సినిమాలో హీరోగా నటించాడు. దీనికి సంబంధించిన పార్టీకి ప్రతాప్‌ను కూడా ఆహ్వానించారు. ఈ విషయం అరకొండ గ్రామస్థుల ద్వారా రాఘవరెడ్డికి తెలిసిపోయింది. ఆయనకు చాలా కోపం వచ్చింది. దీంతో ప్రతాప్ తల్లి శకుంతల- “కొద్ది కాలం మీ నాన్నకు దూరంగా ఉండు. ఆయనకు నువ్వంటే చాలా కోపంగా ఉంది” అని ఉత్తరం రాసింది. ఆ సమయంలో ప్రతాప్ చూడటానికి అందంగా ఉండేవాడు. అంతే కాకుండా ఎన్టీఆర్, కాంతారావులు స్నేహితులు కూడా. కావాలంటే సినిమాల్లో ప్రయత్నించి ఉండచ్చు కూడా. కానీ ఆ ఆలోచన తనకెప్పుడు రాలేదంటారు ప్రతాప్. “బయటకు వెళ్లాలి. సరదాగా గడపాలి. అంతే తప్ప.. సినిమాల్లో చేరే ఆలోచనే లేదు..” అంటారు.
నెహ్రూ అపాయింట్‌మెంట్..
స్టాన్లీ కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి రాజకీయాలలో ప్రతాప్ చురుకుగా ఉండేవారు. ఆ సమయంలో నెహ్రూ మద్రాసుకు వచ్చారు. ఆ విషయం తెలిసి నెహ్రూ కలిసి, తమ కళాశాలకు ఆహ్వానించటానికి ప్రతాప్- రాష్ట్ర గవర్నర్ శ్రీప్రకాష్ ఆఫీసుకు వెళ్లారు. కొద్ది సేపు బయట కూర్చున్న తర్వాత ప్రతాప్‌ను లోపలికి పిలిచారు. పిలిచిన వెంటనే నెహ్రూ- “నీకేం కావాలి?” అని అడిగారు. “సర్.. మద్రాసులో 21 కాలేజీల విద్యార్థులు మీ స్పీచ్ వినాలనుకుంటున్నారు..” అన్నారు ప్రతాప్. తను స్టాన్లీ కాలేజీ విద్యార్థి సంఘానికి నేతృత్వం వహిస్తున్నానని కూడా చెప్పారు. ఈ విషయం చెప్పిన వెంటనే నెహ్రూ చిరాకుపడ్డారు. “యూనియనేమిటి..? అలాంటి పనులతో మీ జీవితాలను ఎందుకు పాడుచేసుకుంటారు? చదువుపైనే శ్రద్ధ పెట్టాలి..” అన్నారు నెహ్రూ. సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రేమించే నెహ్రూకు విద్యార్థి సంఘాలపై అలాంటి అభిప్రాయం ఉండటం ప్రతాప్‌కు ఆశ్చర్యం కలిగించింది. “సర్.. ఒకరికొకరు ఎలా సాయం చేసుకోవచ్చనే విషయాన్ని తెలుసుకోవటానికే సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం.. ఆందోళనలు చేయటానికి కాదు..” అని నెహ్రూకు సమాధానం చెప్పటానికి ప్రయత్నించారు. “సరే.. రావటానికి ప్రయత్నిస్తా. నాతో టచ్‌లో ఉండు. సంఘాలు పెట్టి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు” అన్నారు నెహ్రూ. ఆ తర్వాత నెహ్రూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటానికి ప్రెసిడెన్సీ కాలేజీకి వచ్చారు. నెహ్రూ ప్రసంగాన్ని వినటానికి ఐదు వేల మంది విద్యార్థులు వచ్చారు. ప్రతాప్ స్వాగతం చెప్పిన వెంటనే, మరొక వ్యక్తి మాట్లాడబోయాడు. నెహ్రూ అసహనంతో అతని దగ్గర నుంచి మైక్రోఫోన్ తీసుకుని ప్రసంగించటం ప్రారంభించారు. 45 నిమిషాలు అనర్గళంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
హీలర్
రచయిత: ప్రణయ్ గుప్తే
ప్రచురణ: పెంగ్విన్