నా దారి తీరు -61
రెండో సారి బెంగాల్ ప్రయాణం
జం తారా వెళ్ళిన రెండేళ్లకు మళ్ళీ మా బావ మా మేనల్లుడు అశోక్ ను ,మా అన్నయ్య గారి అమ్మాయి వేదవల్లిని తీసుకొని వేసవి సెలవల్లో మా బావ వాళ్ళు ఉంటున్న బెంగాల్ లోని కాల్నాకు రమ్మని జాబు రాశాడు .మా అక్కయ్య చిన్నమేనల్లుడు ,మేనకోడలు పద్మ కాల్నా లోనే ఉన్నారు .,కనుక బావ మేము వెడితే ‘’చెయ్యి కాల్చు కోవాల్సిన అవసరం లేదు ‘’అనిపించింది .సరేనని ఏర్పాట్లు చేసుకోన్నాం మా శ్రీమతి మా రమణ నుకడుపుతో ఉంది .ఆవిడను మా రెండో తోడల్లుడు శ్రీరామ మూర్తి గారింట్లో భట్టిప్రోలుకు పంపి మేము ప్రయాణమయ్యాం .
ప్రయాణం లో అపశ్రుతి
నేను, అశోక్, వేదవల్లి సామానులతో రిక్షా ఎక్కి సెంటర్ కు బస్సు యెక్క టానికి బయల్దేరాం .శివాలయం దగ్గర కు వచ్చేసరికి గోతుల రోడ్డు అవటం వల్ల రిక్షా ఒరిగి పాపాయి అని మేము పిలుచుకొనే వేదవల్లి రిక్షా నుంచి కింద పడింది .కుడి మణి కట్టు వద్ద దెబ్బ తగిలి వెంటనే వాచింది ..కంగారు పడ్డాం .వెంటనే డాక్టర్ ను సంప్రదించి మందులు అడిగి కొని వేశాను .ఆ నాడు వాపులకు ‘’టెన్డరిల్ ‘’టాబ్లెట్లు డాక్టర్ రాసేవారు. అదే వాడాం .తడిగుడ్డ చేతికి కట్టాం .ప్రయాణం ఆప లేదు .బయల్దేరాం దేవుడికి దణ్ణం పెట్టుకొని ప్రయాణం సుఖం గా సాగాలని ప్రార్ధించాను .బస్ ఎక్కి ట్రెయిన్ ఎక్కి హౌరా చేరాం .అక్కడికి బావ వివేకానందం గారు వచ్చారు అక్కడి నుంచి ఇంకేదో జంక్షన్ కు ట్రెయిన్ లో వెళ్లి అక్కడి నుంచి బస్ లో కాల్నాఅనే పల్లె టూరికి చేరుకొన్నాం. బస్ టాప్ సర్వీస్ కూడా చూశానిక్కడ .రోడ్లేమీ బాగా లేవు .గతుకులు కంకర రోడ్లే .బీదతనం ప్రతి చోటా కనీ పించింది .. గ్రామాల్లో చేపలు పెంచటానికి ప్రతి ఇంటా చిన్న చెరువులు ఉన్నాయి .ఇది బెంగాల్ జీవిత విధానమే .ఇంటికి చేరుకొన్నాం అక్కయ్యా వాళ్ళు బాగా సంతోషించారువచ్చినందుకు .’
పాపాయి ని వాళ్ళ ఫామిలి డాక్టర్ కు చూపించారిక్కడ .కంగారేమీ లేదని వాపు క్రమంగా తగ్గి పోతుందని టేన్దరిల్ తో బాటు పై పూతకు ఆయింట్ మెంట్ రాసి వాడించాడు .క్రమంగా వాపు తగ్గింది .కోలుకోంది .ఇల్లు చిన్నది .అన్ని సౌకర్యాలు ఉన్నాయి .పని మనిషి ,నౌకర్లు ఉన్నారు .మమ్మల్ని ఆదరం గా అందరూ చూశారు .రోజూ ఏదో స్పెషల్ చేసి పెట్టేది మా అక్కయ్య దుర్గ .పిల్లలు కలిసి ఆడుకొనే వారు .వేసవి లో వాళ్లకు మంచి కాలక్షేపం. బయటి వారితో మాట్లాడటానికి వీళ్ళకు బెంగాలీ భాష రాదు కనుక ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపే వారు .పెద్దగా బయటి
ప్రదేశాలకు వెళ్లి చూసిన గుర్తు లేదు .శాంతి నికేతన్ కు మళ్ళీ వెళ్ళామేమో ?ఇంత మంది కలిసి సైట్ సీయింగ్ అంటే కష్టం కూడా కదా .
వేసవి అవటం లో దుర్గా దేవి ఆరాధన ను జనం బాగా చేస్తున్నారు ప్రతి చోటా పందిళ్ళు విగ్రహాలు పూజలు భజనలు ,ప్రసాదాలు భక్తులతో ప్రతి చోటా కోలాహలం గా ఉంది అలంకరణలు బాగా ఉన్నాయి .ముచ్చటేసింది .భక్తీ ప్రవహిస్తోందని పించింది రాత్రి వేళ ఇదే మాకు కాల క్షేపం అందరం కలిసి వెళ్లి తిరిగి చూసే వాళ్ళం .మా అక్కయ్య రాత్రిపూట పూరీ కాని చపాతి కాని చేసి కూర లేక సాంబారు తో మాకు పెట్టేది .రక రకాలకూరల తో ,పచ్చళ్ళ తో రసం గడ్డ పెరుగు తో మహా రుచికరం గా చేసేది. బంగాళా దుంప వేపుడు అదిరేది .సాంబారు రుచి చూస్తె వదల లేము .రసమూ అంతే.రక రకాల పిండి వంటలు చేసి పెట్టేది మొత్తం మీద రోజులు గడిచి పోతున్నాయి .అంత హుషారు గా అని పించలేదు ఈ ట్రిప్ ఎందుకో .
బావ ఇల్లు మారాడు అది పెద్ద ఇల్లు .చిన్నిల్లు నుంచి పెద్ద్దిల్లు అన్న మాట .సామాను సర్దటం తో అయిదారు రోజులు గడిచి పోయాయి .ఆ తర్వాత మళ్ళీ మేము ముగ్గురం ఉయ్యూరుకు బయల్దేరాం బావ హౌరాలో ట్రెయిన్ ఎక్కించాడు బేజ వాడ కు .అక్కడ దిగి బస్ లో ఉయ్యూరు చేరుకొన్నాం
తుఫాను భీభత్సం
మేము వచ్చే సరికి ఆంద్ర దేశాన్ని తుఫాను దులిపేసి భీభత్సం సృష్టించింది ఎన్నో మరణాలు ,పంట నష్టం .నేను అశోక్ పాపాయిలను ఇంట్లో దింపి మర్నాడు భట్టి ప్రోలు వెళ్లాను .అక్కడా చాలా నస్టమే చేసింది తుఫాను .మా తోడల్లుడు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో పని చేస్తున్నాడు మంచి సౌకర్యం ఉన్న ఇల్లు .భట్టిప్రోలు బౌద్ధ మతానికి కేంద్రం గా ఉండేది .ఇక్కడ అనేక శాసనాలున్నాయని చదివా .కాని ఎక్కడికీ పెద్దగా వెళ్ళల్లేదు ..రేపల్లె ఇక్కడికి దగ్గరే .అందుకని ఒక రోజు నేను రేపల్లె వెళ్లాను అక్కడ మా శివ రామ దీక్షితులు బాబాయి వాళ్ళు ఉన్నారు .రైల్ స్టేషన్ కు దగ్గరే వారికి స్వంత డాబా ఇల్లు ఉంది .నేను వచ్చినందుకు బాబాయి లక్ష్మీ కాంతం పిన్ని ఏంతో సంతోషించారు .ప్రభావతిని తానూ చూడలేదని తీసుకొస్తే బాగుండేదని పిన్ని అన్నది .విషయం చెప్పాను నేను జిల్లా పరిషత్ లో పని చేస్తున్నందుకు బాబాయి సంతోషించి నా జీతం ఏంతో అడిగి తెలుసుకొనినేను చెప్పగా ‘’మేస్టార్ల కు కూడా ఇంత జీతమా ?’’అని ఆశ్చర్య పోయాడు బాబాయి ..మళ్ళీ భట్టిప్రోలు చేరాను ప్రభావతిని నన్ను పిల్లల్ని మా తోడల్లుడు శ్రీరామ మూర్తి భార్య జానకి ఏంతో ఆదరం గా చూసుకొన్నారు నేను బెంగాల్ వెళ్లి వచ్చేదాకా .అందరం కలిసి ఉయ్యూరు చేరుకొన్నాం .ఇంట్లో అందర్నీ వదిలి నేను భట్టిప్రోలు వెళ్లి నందుకు మా అమ్మ సూటీ పోటీ మాటలు అని ప్రభావతి మనసు గాయ పరిచింది .ఉమ్మడి సంసారం లో ఇవి మామూలే అని నేను సర్దుకు పోతాను అప్పుడు ఏమీ అనలేక మా ఆవిడ సమయం దొరికి నప్పుడల్లా అలాంటి వాటిని గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు నన్ను దులిపెస్తోంది ఇదీ ఓ తీయటి బాదే నని నవ్వి ఊరుకొంతున్నాను పడ్డ వాళ్లకు తెలుస్తాయి కాని ఒడ్డునున్న వాల్లకేం తెలుస్తాయి ?
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-13-ఉయ్యూరు